కబుర్లు - వీక్షణం
వీక్షణం మూడవ వార్షికోత్సవం
- పెద్దు సుభాష్

మ. వీక్షణంబును ఈక్షణంబున వింత శోభల జూసితీ

కాంక్షలన్నియు ఆంధ్ర మాతను గౌరవించగ నిల్పితీ

ఆంక్షలేవియు లేని ధీమహు లాంధ్ర కైతను దెల్పిరీ

సాక్షిగానును ఈ కవీంద్రుల సాధు సాధని పల్కితీ

 

మ. వీరభద్రుని దక్ష ధ్వంసము వింతవింతగ వింటిమీ

ఆరబోసిన తేటతేనుగు అందమందగ కంటిమీ

సారమేర్పగ శంకరం కథ చేరజెప్పెను మంజులా

నేర్ప రాయల చిన్న కథలకు తీరుతెన్నులు వింటిమీ


మ. చక్కచిక్కటి పాతపాటలు చెవ్వుకింపుగ వింటిమీ

'పక్కవాడిని గౌరవించ 'ని పెద్దగాజెపె జూలురీ

చక్కగున్నది 'బొట్టు ' లోపలి చిక్కనౌనది పద్యమూ

అక్కిరాజుది సుందరోన్నత అందమైన సునాటకం!


మ. కోతలేమియు కోయకుండగ కైతలెందరొ జెప్పిరీ

పాతమాటలు గుర్తుతెచ్చెను బాపిరాజువి గున్పుడీ

వ్రాత శోభను ఎత్తిజెప్పె కుటుంబరావుది శ్రీనుడే

శ్రీత రుక్మిణి సందేశానిని చెప్పె చక్కగ ముంతజా


మ. రావి వారిది చిన్నవైన సులాభమైన కవితలూ!

భావగర్భిత ప్రశ్నలెన్నియొ భాసిచెప్పిరి యాంధ్రులూ!

చేవ ఉన్నవి ఇందురోజున చెప్పినన్నియు బాసలే

హావభావ సుదర్పితం కద హాయిదైన సువీక్షణం!

-- పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్


మన్మథ నామ సంవత్సరం, శ్రావణ మాసం, కృష్ణ పక్షం నవమి నాడు, అనగా సెప్టెంబరు 6, 2015న జరిగిన వీక్షణం మూడవ వార్షిక సమావేశం జరుగుతున్నప్పుడు పిల్లలమఱ్ఱి వారు ఆశువుగా వ్రాసిన మత్తకోకిలలివి. అసలు సమీక్ష అంటే ఇదే. తరువాత వ్రాయబడినది వివరణ మాత్రమే.

పోతన వీరభద్ర విజయం వంటి ప్రాచీన వాఙ్మయం నుంచి "కల్తీ యుగం" వంటి నవ్యాంధ్ర కవితా పఠనము వరకు, చింతామణి నాటకంలోని బిళ్వ మంగళుని పాత్ర వైశిష్ట్యము నుండి "ఆంగ్లంలో తెలుగు, తెలుగులో ఆంగ్లం" వంటి విభిన్న దృక్పధాల వరకు, అణగారిన వర్గాల చరిత్ర "అంటరాని వసంతం" గురించిన చింతనాత్మక చర్చలతో, వీక్షణం సమావేశం ముచ్చటగా మూడవ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ వేడుకలలో పాలుపంచుకున్న 60 మందికి పైకూడిన తెలుగు సాహిత్యాభిలాషులు, తమ వ్యాఖ్యలతో, చర్చలతో, ప్రశ్నలతో సమావేశాన్ని ఉత్సాహపరిచారు.

డా॥ కె. గీత గారు ప్రారంభ ఉపన్యాసములో వీక్షణం మొదలుపెట్టిన వైనము గురించి వివరించారు. మొదటి సమావేశం డా|| వేమూరి వెంకటేశ్వరరావుగారి ఇంటిలో జరిగిందని, ప్రతినెలా అత్యుత్సాహముతో సాగుతున్న వీక్షణం ఈనాడు మూడవ వార్షికోత్సవము జరుపుకుంటూందని, ఎప్పటికీ ఇదిలా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని" అన్నారు. ముందుగా ఉదయపు సభకు డా|| అక్కిరాజు సుందరరామకృష్ణగారిని అధ్యక్షత వహించ వలసినదిగా ఆహ్వానించారు. సభాధ్యక్షులు అక్కిరాజు వారు, తెలుగు కవులు, కవిత్వము ఎంత గొప్పదో వివరిస్తూ, అలనాటి కవి మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి గారి "పంచవటి" పద్య కావ్యము నుంచి అద్భుతమైన పద్యాలు వినిపించారు. ఈ పద్యాల వలన కవుల వైశిష్ట్యమేమిటో తెలుస్తున్నది. కవిత్వము పరమార్ధమేమిటో కూడా తెలుస్తున్నది.

ఉ|| నృత్య సరస్వతీ కటక నిక్వణమున్ ప్రకటించు కొంచు, సా
హిత్య సరస్వతీ హృదయ మిచ్చుచు, గాన సరస్వతిన్ బలెన్
సత్య పదార్ధ కీర్తనము సల్పెడి, మత్కవితా సరస్వతీ
నిత్యత చాలు, స్వర్గమును నీరస మీ రస సిద్ధి ముందరన్!

ఉ|| మోదము లోన మోదమై పోదురు, ఖేదము లోన ఖేదమై
పోదురు, సర్వమున్ కరగి పోవును వారల సృష్టి, వారి ఆ
హ్లాద వినోదముల్ కడు విలక్షణముల్, కవులన్న నిత్య సూ
ర్యోదయ కాల మానస సరోవర హంస లటుల్ రస ప్రియుల్!

ఈ రెండు పద్యముల వివరణ వలన కవులేమిటో కవితా ధ్యేయములేమిటో స్పష్టమౌతున్నది.
అక్కిరాజుగారు వారి అభీష్ట దైవమును ప్రార్ధిస్తూ, వారి స్వీయ రచనను అద్భుతముగా ఆలపించినారు.

ఆ పద్యము
మ|| అరవిందంబుల వంటి కన్ను గవతో, ఆస్యాన చిర్నవ్వుతో,
హరి నీలంబుల బోలు ముంగురులతో, అద్వైతమౌ శక్తివై,
కరుణా మూర్తిగ నిత్యనూత్నమగు శృంగారాన నా మోమునన్
చిరకాలమ్ము నటింపుమమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరీ!

విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వము గురించి కొంత వ్యాఖ్యానము చేస్తూ, ఆనాటి సభలలో జరిగే సందర్భోచిత వ్యాఖ్యల చతురతను ఉదహరించారు. "ఒకసారి గొప్ప పద్య ప్రసంగిస్తున్నప్పుడు, ఒక శ్రోత, తల ఊపటము మొదలు పెట్టాడు. అతని వెనుక ఉన్న ఇంకొక శ్రోత, వ్యంగ్యముగా "తల బాగా ఊపుతున్నావు, అసలు ఏమన్నా అర్ధమవుతున్నదా నీకు, అది ఏ రాగము?" అని అనగా, అక్కడ ముందు వరసలో కూర్చుని ఉన్నవిశ్వనాధ వారు "అరేయ్, మెడ మీద తలకాయ ఉంటే అర్ధమవ్వుతుంది లేరా" అని సరసోక్తి విసిరాడట". ఇలా చతురోక్తులతో, సరసోక్తులతో సభ ఆవిష్కరించ బడింది.

అధ్యక్షులు వారి ఆహ్వానముతో శ్రీ చరణ్ గారు పోతన “వీరభద్ర విజయము” మొదటి ప్రసంగం కావించారు.
ప్రసంగ విశేషములు: పోతన భాగవతము రచించిన తరువాత, సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి అడిగితే రచించానని చెప్పాడు. పోతన కూడా దక్ష యజ్ఞం గురించి వ్రాయలేకపోయానని కొంత చింత ఉన్నవాడు. ఆ విధముగా వీరభద్ర విజయము రచించటము జరిగింది. దధీచి తెలియకవచ్చి యాగకర్త లేని యాగాన్ని తిడుతాడు. ఆ విధముగా మొదలైన వీరభద్ర విజయములోని కొన్ని ఘట్టములలోని ముఖ్యమైన పద్యములని పఠించి, వివరణ ఇచ్చారు.

వారు చదివిన పద్యములు:

1. ఏ పుణ్య కథ చెప్పి
2. సమతంబులు ఆరును
3. కరకంఠ
4. నరదేవాసుర
5. పుండరీకాక్షుని
6. కల్లోల ధ్వని

కాళిదాసు కుమార సంభవము కంటే పోతన ఎక్కువ వివరణ ఇచ్చాడు. పార్వతి సౌందర్య వర్ణన కూడా కాళిదాసు వర్ణన కంటే ఎక్కువగా ఉంది.

రెండవ ప్రసంగం బుడుమగుంట మధు గారిది. వారి ప్రసంగ విశేషములు: తెలుగు భాష పుట్ట తేనె వంటిది. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా ఆంగ్ల పదములు వాడుతున్నారు. ఉదాహరణకుTV లోని వంటల కార్యక్రమములో water, sugar అంటారు కానీ, మంచి నీళ్లు, పంచదార అనరు. ఇంగువ దగ్గరకు వచ్చేసరికి ఇంగువ అనే అంటారు, ఎందుకంటే దానికి సరి అయిన ఆంగ్ల పదము వాళ్లకు దొరకదు కాబట్టి. ఇంటువంటి పరిస్థితులలో తెలుగు భాషను ప్రోత్సహించటానికి "సిరిమల్లె" అనే ఇంటర్నెట్ పత్రికను రమేష్, రమామణి, తన శ్రీమతి బుడుమగుంట ఉమ గారితో కలసి మొదలుపెట్టామని వివరించారు. ఈ పత్రిక మొదటి సంచిక ఈ నెలలోనే విడుదలవ్వుతున్నదని, పత్రికలోని అంశాలు మాతృ భాష మాధుర్యం, మన ఆచారాలు సంప్రదాయాలు, ఆలయాలు మొదలగునవి అని వివరించారు.

జొన్నలగడ్డ మంజుల గారిది మూడవ ప్రసంగం. వారి ప్రసంగ విశేషములు: నాకు సాహిత్యాభిలాష తల్లి తండ్రుల దగ్గరనుంచి వచ్చినది. శంకరమంచి సత్యం నా అభిమాన రచయితలు ఐదుగురిలో ఒకరు. అమరావతి కథలలో నది, గుడి, జలాలు, వాటిని నమ్ముకున్న ప్రజలు, వారి జీవితాలు, కష్ట నష్టాలు గురించిన చక్కటి వర్ణన. ఇంతకు ముందు వారిని పట్టించుకున్నవారు లేరు.

తరువాత పుస్తకావిష్కరణ కార్యక్రమము జరిగింది. రావి రంగారావు గారు అనిల్ రాయల్ గారి పుస్తకాలని ఆవిష్కరించారు, మొదటిది, కథ వ్రాయటం ఎలా అనే "కథాయణం", రెండవది వారి కథల సంకలనం" నాకరికథ". అనిల్ గారు, కథాయణం లోని కొన్ని అంశాలను చదివి వినిపించారు. "ఎక్కువ నిడివి, ఎక్కువ పాత్రలు ఉంటే నవల వ్రాసుకోవాలని, విషయం క్లుప్తంగా చెప్పాలంటే కథ. భాష, శైలి, భావ వ్యక్తీకరణ ముఖ్యమని, ఒక పాత్ర గురించి ఇచ్చే వివరణ, పాత్ర యొక్క ఆలోచనలు, ప్రవర్తనలో ఇమిడి ఉండాలని, అదే కవిత్వమైతే, అతిశయోక్తి లేకపోతే కవిత్వం లేదు" అని చెప్పారు.

రెండవ పుస్తకము, వీక్షణం వార్షిక సంచికలు . ఈ పుస్తకాల్ని కిరణ్ ప్రభ, కాంతి కిరణ్, గీత, ఇక్బాల్, అపర్ణ, రావు తల్లాప్రగడ గార్లు అక్కిరాజు సుందరరామకృష్ణ గారి అమృత హస్తముల మీదుగా ఆవిష్కరించమని కోరగా, అక్కిరాజుగారు ఆవిష్కరించటం జరిగినది.

అక్కిరాజుగారు, వీక్షణం సమావేశం నిర్వహించటం గురించి జరుపుతున్న కృషిని కొనియాడుతూ గీతగారిని అభినందించారు. గీతగారు, నిర్వహణ, సంకలనము మాత్రము తనదని, రాత్రికి రాత్రి పుస్తకముగా కూర్పు చేసినది, ముఖపత్రము సంధించినది కాంతి కిరణ్ గారని, వారికి కృతజ్ఞత తెలిపారు. ఇక్బాల్ గారు, రెండు సంవత్సరములనుండి, వీక్షణం సమావేశములలో పాలు పంచుకుంటున్నానని, ఇంకా పెద్ద సభలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.

తరువాత శ్రీ పాదన్న రేణుక గారి లలిత సంగీత గానము వీనుల విందుగా జరిగినది. ఈ విందుతో తన్మయులయిన శ్రోతలు, విందుభోజనం గురించి అంత పట్టించుకోలేదేమో!

రేణుక గారు పాడిన లలిత గీతములు:

1. ధగ ధగ మెరిసే కాంతులు చిందే కళ్లు నెమలికెవరు ఇచ్చారు -- అడవి బాపిరాజు

2. చక్కని చిన్నది చుక్కల రాణట పాటను వింటూ పడతి నిలచినది -- అడవి బాపిరాజు

3. మొక్క జొన్న తోటలో - కొనకళ్ల వెంకట రత్నం

భోజన విరామం తరువాత, మధ్యాహ్నపు కార్యక్రమానికి రావి రంగా రావు గారు అధ్యక్షత వహించారు.

నాల్గవ ప్రసంగం జూలూరి వంశీ గారిది. వారి ప్రసంగ విశేషములు: "నేను వృత్తి రీత్యా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో లో మీడియా స్టడీస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. నా ఉపన్యాసం "తెలుగులో ఆంగ్లం, ఆంగ్లంలో తెలుగు". మనం ఒప్పుకున్నా లేకపోయినా, "English is a global language, Indians are an incredibly voiceless community in world literature, especially Telugu writers. For example, in Jaipur Book Festival, there is very low representation of Telugu writers.The portrayal of Indians, especially Hindus is misrepresented in the West. An example is California School Text Books. Social Studies books have an image of Last Supper to depict Christianity. For Islam, there is the Blue Mosque from Istanbul. But to portray Hindus, there is an image of a woman carrying garbage. The same is true with New York Times. Hindus and India are portrayed in negative contexts.I made small efforts to bring Telugu into English literature. In my book "The Mythologist", the story of a Telugu boy "Parasurama", the grandchild of a yesteryear hero, the dialogue between the protagonist and the lead female character is in Telugu, written in English script. The publisher asked me to change it to English. I refused and questioned him, if you can accept Bengali dialogue in English novels, you should be able to accept Telugu dialogue too."

తరువాత "బొట్టు శతకం" పుస్తకావిష్కరణ కౌముది పత్రిక సంపాదకులు కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ గారి అమృత హస్తముల మీదుగా జరిగింది. ఈ బొట్టు శతకము సంధాన కర్తలు రావి రంగారావు గారు. ఆయన Facebook లో "బొట్టు" మీద పద్యములు వ్రాయవలసిందిగా పలువురు కవులను ఆహ్వానింపగా, స్పందించిన శ్రోతల యొక్క కవిత్వ సంకలనం బొట్టు శతకము. బ్రిం గారు "జడ" అనే పదము ఇచ్చి తేటగీతిలో పద్యములను వ్రాయవలసిందిగా కోరినప్పుడు వచ్చిన ప్రతి స్పందన "జడ శతకము". ఆ రీతిలోనే "బొట్టు శతకము" కూర్చబడినదని రావి రంగారావు గారు తెలిపారు. ఈ సంకలనములోని పద్యములను మచ్చుకగా రావు తల్లాప్రగడ గారు వినిపించి, బొట్టు అనే మాట యొక్క వివిధ వర్ణనలు, అర్ధాంతర, గూడార్ధ రూపములను ఈ శతకములోని పద్యాలను కూర్చిన కవులు తెలిపారని ప్రశంసించారు. రావి రంగారావు గారి "బొట్టు శతకం" పద్య పఠనము కావించి, మరి కొన్ని మంచి పద్యములను పరిచయం చేసారు.

ఐదవ ప్రసంగం అక్కిరాజు సుందర రామకృష్ణ గారిది. సంఘ సంస్కరణ ప్రబోధాత్మకమైన, మహాకవి "కాళ్లకూరి నారాయణ రావు" గారిచే విరచితమైన "చింతామణి" నాటకము నుండి అక్కిరాజు వారు, "తల్లిదండ్రులకి సేవ చేసినప్పుడే వాడు కుమారుడనియు, ఎంతటి విజ్ఞానవంతుడైనా, పండితుడైనా అపమార్గమున పడినప్పుడు భ్రష్టుడు కాక తప్పదనే పద్యములను ఉదహరించారు. అటులనే చమత్కారముగా, స్త్రీపురుషులు ఇరువురి యందునూ పొర పొత్యములు ఉండుననియూ, అవి సరి దిద్దుకున్నప్పుడే కాపురములు శుభప్రదములు అగుననియు" చక్కని పద్యములు వివరించినారు. కాళ్లకూరి నారాయణరావు గారు వంగ దేశమున ప్రసిద్ధమైన నాటకాన్ని, "చింతామణి" నాటకముగా అంధ్రీకరించారు. నారాయణ రావు గారి కవిత్వ పటిమ, నాటకాన్ని నడిపిన తీరు, పాత్రలను చిత్రీకరించిన పద్ధతి ఉదాత్తమైనది" అని వివరించారు అక్కిరాజు వారు.

వారు ఉదహరించిన పద్యములు:

1. కాలు పెట్టిన తోనె కాంతుని మెడవిరిచి

2. అర్ధాంగ లక్ష్మి అయినట్టి ఇల్లాలిని

3. ఘనుని హరిశ్చంద్రు కాటి కాపరి చేసె

4. ప్రాయము వచ్చినంత, గృహ భారము మూపున దాల్చి

5. చల్లని పిల్లగాడుపులు

6. తన కల్మియను మొదలగునవి.

తరువాత సుభాష్, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, రావు తల్లాప్రగడ గార్లు అక్కిరాజు గారిని సన్మానించారు. వారి పద్య పఠనా, నటనా ప్రావీణ్యతకు ఆశువుగా శ్రీ చరణ్ గారు వ్రాసిన ప్రశంసా పత్రం:

సీ|| `కవన గాండీవి' సౌ `గాత్ర వంశీధరా'
"అక్కిరాజా"న్వయ చుక్కల దొర!
మాటయున్ పాటయున్ పోటు పొల్పు నిగుడు
కైత పాటవ ముబ్బు గాన మూర్తి!
మంద మంద గతుల మందలించు మగని
సౌరి స్తుతించిన శూర సూరి!
పేర్మి నధిక్షేప పూర్ముల నుప్పొంగు
సరసప్రవాళార్థ జలధి రత్న!

తే|| ఘంటసాల ఆత్మ నిడె! నీ కంఠసీమ!
విజయ సఖు పాత్ర యును మరి విజయు పాత్ర
గాత్ర మున్నిల్పు నాటక కళల చంద్ర!
ఏమి చెబుదింక "సుందర రామ కృష్ణ!"

ఆరవ ప్రసంగం చుక్కా శ్రీనివాస్ గారిది. కల్యాణ రావు గారి రచించిన "అంటరాని వసంతము" పుస్తకము సమీక్షించారు. వారి ప్రసంగము: “వేల సంవత్సరాలుగా, వర్ణ వ్యవస్థ వలన అణగారిన వర్గాల చరిత్రలో ఒక అంకమును తెలిపే పుస్తకము "అంటరాని వసంతం". ఇది బాపట్ల, ఒంగోలు ప్రాంతములోని "చిందు మాదిగ" వారి గత 200 సంవత్సరముల చరిత్ర. Alex Haley “Roots” లాగా, ఒక చిందు మాదిగకు చెందిన ఒక వ్యక్తి వంశోత్తరాలు, వారి ఆచార వ్యవహారాలు, సమాజంలో జరిగిన మార్పులు, అట్టడుగు వర్గాలలో వారు పడిన బాధలు తెలిపే కథ. "ఈ పుస్తకము నన్ను అత్యంత ప్రభావితము చేసినది. కొ.కు, గంగు, అల్లం రాజయ్య, బాలగోపాల్ నా అభిమాన రచయితలు. ఈ పుస్తకం ద్వారా, కల్యాణ రావు గారికి కూడా నేను అభిమానిని అయ్యాను" అన్నారు. కుల వ్యవస్థ ఎంత పాతుకుపోయిందో ఉదహరిస్తూ "ఈ దేశంలో పీల్చే గాలికి కులం వుంది", అంటూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చదివారు.”

ఏడవ ప్రసంగము గునుపూడి అపర్ణ గారిది. వారు అడవి బాపిరాజు గారి వర్ణనా చాతుర్యము గురించి ప్రసంగించారు. ఆడువారి గురించి, వీరులను గురించి, అడవులను (ప్రకృతి) గురించి, వేరొక్క విషయము ఏదయినా సరే, "గోన గన్నారెడ్డి" నవలలో బాపిరాజుగారు ఎంత చక్కగా వర్ణించారో ఉదాహరణలతో తెలిపారు. ఇప్పటి కవులు, రచయితలు ఈ రకమైన వర్ణనలు ఎందుకు చేయటములేదు? లేక పాఠకులు కోరటంలేదా? అని ప్రశ్నించారు.

ఎనిమిదవ ప్రసంగం సి.రమణ గారిది. నేడు షష్ఠిపూర్తి సందర్భముగా జరిగే ఆర్భాటాలను విశ్లేషించారు . వారి ప్రసంగ విశేషములు: "ఈ మధ్య 60 సంవత్సరాలు నిండిన పుట్టిన రోజు వేడుకలు బాగా జరుగుతున్నాయి. వేడుకలు, పండుగలు, ఆర్భాటాలతో జరగడం మనకు ఆనవాయితీ అయిపోయింది. కొందరు పెద్ద పెద్ద హోటళ్లలో ఆడవాళ్ల ధగధగలు, మగవాళ్ల ముందు గ్లాసుల గలగల మధ్య ఘనంగా జరగుతున్నాయి. ఇంతకంటే భిన్నంగా ఆలోచించలేమా? మన తల్లిదండ్రుల తరువాత, మన గురువులు, మన సోదరీ సోదరులు, బంధువులు, మిత్రులు, మన సమాజం, మనం ఈ రోజున ఈ స్థితిలో వుండటానికి కారకులు. ఎంతమంది రైతులు కష్టించి, పండించి ఇస్తే ఆహారాన్ని తీసుకున్నాము? 60 సంవత్సరాల పండుగ అంటే Thanks Giving. తిరిగి ఇవ్వడం. అందుకే సమాజానికే ఏదైనా తిరిగి ఇద్దాము. మరి ప్రకృతి నుండి, పంచభూతాల నుండి చాలా, చాలా తీసుకున్నాము కదా! ప్రకృతి మాతకు మనం "return gift" గా మొక్కలు నాటడం, చెట్లని సంరక్షించడం, నీరు, విద్యుత్ వృధా చేయకుండా, ప్లాస్టిక్ వాడకం మానివేసి, పేపరు వాడకం తగ్గించి ప్రకృతిని రక్షించుకుందాము. మనం పుట్టినప్పుడు వున్న ప్రకృతి స్థితిగతులను మెరుగు పరచి మన భావి తరాలకు అందించుదాము.” అన్నారు.
కవి సమ్మేళనములో రావు తల్లాప్రగడ గారు నిర్వహించారు.

కవితలు చదివినవారు:

1. డా॥ కె.గీత - "నిరీక్షణ"

2. షంషాద్ - కిన్నెరసాని

3. పిల్లలమఱ్ఱి - వీక్షణంబున ఈ క్షణంబున

4. ప్రకాశరావు - కల్తీ యుగం, డాక్టర్లు బాబోయ్ డాక్టర్లు

5. రావు తల్లా ప్రగడ - తల్లీ లక్ష్మీ దేవి

6. గంగా ప్రసాదు - మాతృదేవోభవ

7. జ్యోత్స్న - నర్తించును

చక్కని కవిత్వాన్ని మెచ్చుకుంటూ , అధ్యక్షులు రావి రంగారావు గారు, "నెహ్రూగారిలా కవిత్వము ఉండగూడదు. గాంధీ గారిలాగా ఉండాలి, కవిత్వమంటే ఒక అనుభూతి" అని వివరించారు.
వీక్షణ సమావేశములో ఆనవాయితీగా జరిగిన కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమములో సభికులు ఆసక్తితో, ఉత్సాహముగా పాల్గొన్నారు.

చివరగా బాబా సాహెబ్ గారు, ముంతాజ్ గారు తమ తెలుగు భాషా అభిమానాన్ని గురించి వివరించారు.
బాబా సాహెబ్ గారి ప్రసంగం: "నేను ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగులో MA పట్టా అందుకున్న మొదటి ముస్లిం ని. దివాకర్ల వెంకటావధాని గారి దగ్గరే చదువుకోవాలని కోరిక. ఆ కోరికను సాధించా. ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి ఆనాటి పెద్దలు నాకు పరిచయస్తులు. సినారె వంటి వారు ఇంచు మించుగా సహాధ్యాయులు."
ముంతాజ్ గారి ప్రసంగం: "బూర్గుల రామకృష్ణారావు గారు, మాడపాటి హనుమంతరావు గారు స్త్రీ విద్య కోసం చాలా కృషి చేశారు. మావారు కూడా నన్ను చదువుకోవటానికి చాలా ప్రోత్సహించటమే కాకుండా, సాహితీ సమావేశాలకి తప్పని సరిగా తీసుకు వెళ్లేవారు. పిల్లలని కూడా తీసుకు రాకపోతే ఊరుకునేవారు కాదు. అక్కడి వాతావరణములో పిల్లలకి కూడా సాహిత్యం అబ్బుతుందని వారి అభిప్రాయం. మూడేళ్ల ఇక్బాల్ ని తీసుకు వెళ్లితే, వాడు నిద్రపోయేవాడు. అలా బాబా సాహెబ్ గారి ప్రోద్బలముతో నేను కూడా ఎమ్.ఏ పూర్తి చేశాను.
చిన్నప్పుడు పోతన భాగవతము లోని దశమ స్కంధములో చదివిన రుక్మిణీ కల్యాణము లోని పద్యాలు, పుస్తకం పేజీ ఇప్పటికీ అలా కళ్ల ముందు కనిపిస్తున్నది. అంటూ ముంతాజ్ గారు రుక్మిణీ కల్యాణము లోని పద్యాలు చక్కగా చదివి వినిపించి వివరణ కూడా ఇచ్చారు.

ఆఖరుగా పిల్లలమఱ్ఱి వారు, ఈ సమీక్షకు ముందు పొందు పరచిన పద్యములు చదివారు.

ఈ సభకు మృత్యుంజయుడు తాటిపామల, జయ తాటిపామల, ఉదయ లక్ష్మి, అద్దేపల్లి ఉమాదేవి, రమామణి, ఇక్బాల్, కె.శారద, శారద, మురళి, విజయ మొ.న స్థానిక రచయితలు, సాహిత్యాభిమానులు ఎందరో హాజరయ్యారు.

చివరగా సభకు విచ్చేసిన వారందరి పరిచయ కార్యక్రమముతో సభ ముగిసింది. అందరికీ ధన్యవాదములు తెల్పుతూ గీత గారు సభ ముగించారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)