నీవు లేని అసంపూర్ణమైన నేను రాసుకున్న అందమైన గేయమిది
నీవు లేని నన్ను నేను అనుక్షణం గుర్తిస్తూనే ఉన్నాను
నిన్ను ప్రేమించడం తప్ప అన్యమెరుగని మనస్సు నాది
నీ చిత్రపటాలు నా ఎదురుచూపుల మధ్య మాసిపోయాయి
నిన్ను పిలిచి, పిలిచి నా రాగాలు మూగబోయాయి
నీ కోసం వేచి, వేచి అలసిపోయాను
నిన్ను తలచుకుంటున్నాను, తలచుకుంటున్నాను
తలుచుకుంటూనే ఉన్నాను
నిన్ను పిలిచాను, నీవు లేని విరహాన్ని అనుభవించాను
నీ తోడు నా నీడగా కలలుగన్నాను
కలత నిద్ర పోయాను
ఎదురుచూపులోనే నా జీవననౌక మునిగిపోతుందేమో
అయినా నా ప్రేమ పెరుగుతోందే కానీ తరగట్లేదు
కనుచూపును విశాలం చేసే సాగరతీరాన,
క్షణక్షణం క్రొంగొత్తగా ఎగసిపడే కెరటాల సరసన,
చలచల్లగా పాదాలను తాకి, పలకరించి వెళ్ళిపోయే సలిలాల నిరసనలో,
దిగంతాల ఆవలికి చూపు సారించి,
అందని ఆకాశాన్ని అందుకోవాలని ఉవ్విల్ళూరే విహంగాన్నే అవుతున్నాను
కన్ను చూసే ప్రతి దృశ్యం, చెవిని తాకే ప్రతి శబ్దం,
బుద్ధిని మేల్కొలిపే ప్రతి అలోచనా,
హృదయాన్ని స్పృశించే ప్రతి అనుభూతి,
ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా,
నిన్నే నిన్నే తలపిస్తోంది, నీ గురించే తలపోస్తోంది
నీ వెంటే నడచి వస్తోంది
తెల్లవారి కోయిల కుహూకుహూల గానం
కరుగుతున్న తెలిమంచు కణాల చల్లదనం
చిగురిస్తున్న ఉషోదయాల వెచ్చదనం
ఎగిరివచ్చి చెక్కిలి తాకిన పూరేకుల మెత్తదనం
మనసు మూలల్లో మరల మరల ఉబికివస్తున్న జ్ఞాపకాల తీయదనం
చిలకరిస్తున్న తొల్కరి చినుకులు,
పెదవి చివర్ల విరబూసిన చిరునవ్వుల చిరుజల్లులు
అన్నీ చెప్పకనే చెప్తున్నాయి,
నీవు లేని నేను అసంపూర్ణమని!!