అన్నమాచార్యుల వారి కుమారుడు శ్రీమాన్ తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల వారి అనితర సాధ్యమైన కృషి వల్ల అన్నమయ్య కీర్తనలన్నీ రాగిరేకులపై చెక్కించబడ్డాయి. వాటన్నిటినీ భద్రపరచుటకు తిరుమల శ్రీవారి గర్భాలయంలో భాష్యకారుల సన్నిధి ప్రక్క ‘సంకీర్తన భండారం’ ఏర్పాటు చెయ్యబడి, ‘అన్నమయ్య పద సంపద’ తెలుగు వారికి శాశ్వతంగా దక్కింది. తాళ్ళపాక కవుల సంగీతం విలక్షణమయింది. అన్నమయ్య తన పాటలు దాదాపుగా వంద రాగాలను ఉపయోగించినట్లు రాగిరేకుల పరిశీలన వలన తెలియవచ్చుచున్నది. అయితే ఆనాటి సంగీతం ఎలా ఉన్నదో, అనగా రాగిరేకులలో రాగం మాత్రమే ప్రస్తావన చెయ్యబడి ఉన్నది తప్ప సంగీత రూపం అనగా స్వర విన్యాసం తెలియజేయబడలేదు. దీనికి గల కారణాలను ఆలోచిస్తే, రాగిరేకులపై పాటలు చెక్కించడమన్నదే బృహత్ కార్యం! ఇక వాటిని స్వర విన్యాసంతో చెక్కించడమంటే మిక్కిలి కష్టతరమైన విషయం! అందునా వేల పాటలను ఇలా రాగిరేకులపై చెక్కించాలంటే సంగీత సాహిత్య పరిజ్ఞానం సూచన ప్రాయంగా తెలియజేస్తూ సంకీర్తన సాహిత్యాన్ని మనకు శాశ్వతంగా అందించారు.
కాలక్రమంలో జరిగిన సంగీత పరిణామం వల్ల త్యాగరాజస్వామి వారి కృతులకు లభ్యమవుతున్నట్లుగా, అన్నమయ్య ఉపయోగించిన సంగీతం మనకు తెలియరావటం లేదు. ఇది కొంత లోటే! నేడు అన్నమయ్య కీర్తనలకు సంగీత బాణీలు కూర్చుతున్న విద్వాంసులు కూడా రాగిరేకులలో సూచించిన రాగాలలో స్వరపర్చలేకపోతున్నారు. నూటికి నూరుపాళ్ళు అన్నమయ్య సంగీతాన్ని అందించలేకపోతున్నారు. ఈ దశలో అన్నమయ్య సంగీత సాహిత్యాలపై అపారంగా కృషి చేసిన పూజ్యులు కీ.శే. రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు, వీరు రాగిరేకులలో సూచించిన రాగాలలోనే దాదాపు 108 కీర్తనలను స్వరపరచి ప్రకటించి ప్రచారం చేశారు. అవన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. మనం ఈనాడు ‘ముఖారి’ రాగంలో పాడుకుంటున్న ‘బ్రహ్మ కడిగిన పాదము’, ‘శంకరాభరణం’ లో పాడుకుంటున్న ‘అలరులు కురియగ’, ‘భూపాళం’లో పాడుకుంటున్న‘విన్నపాలు వినవలె’ మొదలగు పాటలు అనంత కృష్ణశర్మ గారు స్వరపరిచినవే!
తరువాత ఈ బాణీని అందుకున్నవారు శ్రీ గరిమెళ్ళ కృష్ణ ప్రసాద్ గారు. హైదరాబాద్ నగరానికి చెందిన ‘సుజనరంజని’ సంస్థ ఇంతవరకూ స్వరపరచబడని, ప్రాచుర్యంలో లేని అన్నమాచార్యుల వారి 108 సంకీర్తనలను యువ శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీ సత్తిరాజు వేణుమాధవ్ గారి చేత బాణీలు కట్టించి, గానం చేయించి ‘అన్నమయ్య పద మందాకిని’ పేరిట ఓ సి.డి.ని, పుస్తకాన్ని అన్నమయ్య 602 వ జయంతి సందర్భంగా విడుదల చేసింది. ఈ సంకలనంలోని కొన్ని పాటలను వేణుమాధవ్ రేకులలో సూచించిన రాగాలలోనే వరసలు కట్టడం జరిగినది. ఈ సంకలనాన్ని సుజనరంజని కార్యదర్శి శ్రీ మహీధర సీతారామశర్మ గారు చెయ్యగా, ఈ వ్యాస రచయిత తెలుగు వ్యాఖ్యానాన్ని అందించడం జరిగింది. ఆంగ్ల వ్యాఖ్యానాన్ని ప్రముఖ విమర్శకులు శ్రీమతి రాణీకుమార్ గారు అందించారు. లిప్త్యంతరీకరణను (ట్రాన్స్ లేషన్) కుమారి కిరణ్మయి అందించారు. చిత్తశుద్ధితో రూపొందించబడిన ‘అన్నమయ్య పద మందాకిని’ ప్రజల మన్ననలు పొందినది.
ఇప్పుడు ఒక చక్కటి పరిశోధనాంశం గురించి తెలుసుకుందాం!
1949 వ సంవత్సరంలో తిరుమల ఆలయంలో శ్రీ స్వామి వారి చంపక ప్రదక్షిణోపక్రమములో ఒక అద్భుతమైన విషయం బయల్పడినది. కీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రిగారి శిష్యులైన కీ.శే. అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారు ప్రభాకర శాస్త్రిగారి సూచనల మేరకు ఆ మార్గంలో నిశిత పరిశీలన చేస్తుండగా ఓ రెండు శిలాఫలకాలు కన్పించినాయి. అవి 7'' పొడవు X 4'' వెడల్పు X 3/4'' మందంలో ఉండి 2, 3 వరుస సంఖ్యలతో ఉన్నవి. అప్పుడు ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారు వెంటనే ప్రభాకరశాస్త్రి గారికి ఈ విషయం తెలియజేశారు. శ్రీ ప్రభాకరశాస్త్రి గారు తిరుపతిలోని దేవస్థానము మ్యూజియంనకు చేర్చారు. ఈ విషయంలో సంతోషించిన శ్రీ ప్రభాకర శాస్త్రి గారు ఇలా శిలల మీద స్వర విన్యాసముతో చెక్కించబడిన సంకీర్తనలు దొరకటం అపూర్వమైన విషయమని, ఇది అంతా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహా వైభవానికి నిదర్శనమని కొనియాడారు.
ఈ శిలాశాసనాలు 15, 16 శతాబ్దాల కాలం నాటివని, అందులోని పాటలు తాళ్ళపాక కవులకు చెంది ఉండవచ్చుననే అభిప్రాయాన్ని 1949 సంవత్సరంలోనే ప్రభాకరశాస్త్రి వెల్లడిచేశారు. ఈ విషయాన్ని అనంతర కాలంలో అనగా 1961 వ సంవత్సరంలోనే ప్రభాకరశాస్త్రి గారు వెల్లడిచేశారు. ఈ విషయాన్ని అనంతర కాలంలో అనగా 1961 వ సంవత్సరంలో శాస్త్రిగారి శిష్యులైన అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారు కూడా తాము పరిష్కరించిన అన్నమయ్య సంకీర్తన సంపుటాలు 15 మరియు 16 పీఠికలలో తెలియజేశారు.
ఈ సంగీత శిలాశాసనాలు ప్రభాకర పరిశోధన మండలి, హైదరాబాదు వారి కృషి వల్ల 1998 సంవత్సరానికి ఇతమిద్ద రూపానికి పరిష్కరించబడి, 1999 సంవత్సరంలో ‘ప్రధమోపలబ్ద స్వరసహిత సంకీర్తన శిలాలేఖము’ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానముల తరపున పుస్తకరూపంలో అచ్చయినాయి. ప్రభాకర పరిశోధన మండలిలోని ఆచార్య వేటూరి ఆనందమూర్తి, డా.పి.వి.పరబ్రహ్మ శాస్త్రి, డా. తిరుమల రామచంద్ర, విద్వాన్ శ్రీ ఆకెళ్ళ మల్లికార్జున శర్మ, విద్వాన్ శ్రీ యస్. యస్. శ్రీనివాసన్ గార్ల కృషి వల్ల ఇవి లోకం వెలుగుచూశాయి.
ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారు ‘ప్రధిమోపలబ్ద స్వరసహిత సంకీర్తన శిలాలేఖనము’ పుస్తకంలో ఈ శాసనాలను గురించి తెలియజేసిన విషయాలలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
“శాసన లిపిని బట్టి అవి 15-16 శతాబ్దాల నాటివని చెప్పవచ్చును. తాళ్ళపాక కవుల పదరచనలు గల తామ్ర ఫలకాల మీది వ్రాత తీరుని పోలినవే గనుక ఇవీ ఆ కాలంలో చెక్కినవే అనవచ్చును. సంస్కృత భాషలో తెలుగులిపిలో ఉన్న ఈ శాసన ఫలకాలు తెలుగువారు వేయించినవే. లభించిన ఫలకాలలో కర్త పేరు తెలియరాలేదు. గానీ వీటిలోని సాహిత్యము, పద కవితా నిర్మాణము, భావ సంపద, సమాన ఘటన, విశిష్ట పద ప్రయోగాలు, పలుకుబడులు, యతులు, ప్రాసలు, అంత్యానుప్రాసలు, గతులు వేంకట ముద్రతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కంకితమైన ఆభోగ సూచనలు, వైష్ణవ భక్తిరచన విశేషాలు, అవతారాల కథనాలు, ఆఖరికి సూళాది రచనలు మొదలైన అంతర్గత సాక్ష్యాలన్నీ కూడా ఇవి తాళ్ళపాక వారి రచనలుగా భావింపదగి ఉన్నవి. ‘పదవిజ్ఞానాంధుల పరిజ్ఞానం పెంచేందుకై సంస్కృతభాషలో ‘సంకీర్తన లక్షణం’ రచించి, ‘సంకీర్తనా పరిశుద్ధి’ని కావించి, 32,000 లకు పైగా పదాలు పాడుకున్న అన్నమాచార్యులే తమ సంకీర్తన లక్షణానికి లక్ష ప్రయోగాలు కూర్చినారనీ, అవే ఈ శాసనాలలో పెద తిరుమలాచార్య, చిన తిరుమలాచార్యుల కాలంలో క్రీ.శ.1550కి పూర్వమే చెక్కించి ఉంటారని భావించడానికి అవకాశమున్నది.
ఈ శాసన ఫలకాలలో గుర్తించబడిన సంగీత రచనలు దక్షిణ భారతంలో ప్రాచీన గేయ రూపాలైన సాళగ సూడ ప్రబంధాలు కాలక్రమాన పరిణామమొందుతున్న తరుణంలో మన తెలుగు వాగ్గేయకారులు స్వతంత్రించి నవ్య ప్రయోగాలు చేస్తూ రూపొందించిన నూతన లక్షణ సహిత లక్ష్యోదాహరణాలని తెలుగువారు గర్వంగా చాటిచెప్పుకోదగినవి. ఎందుకంటే ఈ శాసనాలలో గోచరించే సూళాదుల నిర్మాణం లాంటి ప్రబంధ రచనా నిర్మాణం కానరావడం లేదని విజ్ఞులంటున్నారు. లక్ష్యోదాహరణలను స్వరరాగ తాళ సహితంగా ప్రదర్శిస్తున్న ఈ శాసనాలలోని వాగ్గేయరచనలు ఆనాటి మన సంగీత స్వరూపాన్నీ, సంప్రదాయాన్నీ పునర్నిర్మించుకుని పరిశీలించడానికి అనువు కల్పించే స్వరరాగాలకు సంబంధించిన మూల ద్రవ్యాలని భావించవలెను.
ఈ రెండు శాసన ఫలకాలలో కానవచ్చే వాగ్గేయ రచనలన్నీ వైష్ణవేతి వృత్తం గలవి. భక్తి ప్రధానాలు, కొన్నింట రామకృష్ణావతారాలకు సంబంధించిన గాధలధికంగా ఉన్నవి. అన్నమాచార్యుల వారి రాగిరేకులలో కూడా అనేకమైన దశావతార సంకీర్తనలు కలవు. అలాగే దేశి పద్దతిలో అన్నమయ్య రచించిన ‘సూళాది’ కూడా ఒకటి రాగిరేకులలో లభ్యమవుతున్నది. ఇది సప్తరాగ తాళమాలిక అనగా ఏడు రాగాలలో, ఏడు తాళాల్లో ఏడు కొండల వాడికి సమర్పించిన విశిష్ట సాహిత్య సంగీత కుసుమము”.
సంగీత శిలా శాసనాల వలెనే పెదతిరుమలాచార్యుల వారి స్వర సహిత సంకీర్తనలు కూడా తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీ లో తాళపత్రాల రూపంలో ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారికి లభించాయి. ఈ పాటలలోని సాహిత్యం వలన పెదతిరుమలాచార్యునకు ‘దేవబయకారుడు’, ‘తోడరమల్ల’, ‘తిరుమలగురుడు’ అనే బిరుదములు కూడా ఉన్నాయని తెలుస్తుంది.
తెలుగుజాతికి తాళ్ళపాక కవులు చేసిన సారస్వత సేవ ఎంతో ఉన్నది! ప్రత్యేకించి పెదతిరుమలయ్య విజ్ఞత ఎంతో కొనియాడదగినది! ఆ మహనీయుని కృషి వల్లనే స్వర సహిత సంకీర్తనలు మనకు లభ్యమైనవి! తెలుగు జాతికి పూజ్యుడు, ప్రాతః స్మరణీయుడు పెదతిరుమలయ్య.