గురజాడ యొక్క సృజనాత్మక రచనలు ఆయన ఇతర సారస్వత కృషిని మరుగున పరిచాయన్నది చారిత్రక వాస్తవం. గురజాడ వారి సృజనకున్న శక్తి అంత గొప్పది. అందుకు కన్యాశుల్కం నాటకమే ఒక చక్కని నిదర్శనం. తెలుగు సాహిత్య చరిత్రను ప్రభావితం చేసిన ఆయన రచనల వెనుక విస్తృతమైన పరిశోధనాత్మక అధ్యయనం వుంది. గురజాడ వారి వ్యాసాలు, లేఖలు, డైరీలు పరిశీలిస్తే ఈ సంగతి స్పష్టమౌతుంది. స్వతస్సిద్ధంగానే గురజాడ పరిశోధనాత్మక దృక్ఫథం కలిగిన వ్యక్తి. చరిత్ర పరిశోధన, భాషల అధ్యయనం, శాసన పరిశీలన, నాటక రచన, విద్యాబోధన, ఇతర భాషలతో తెలుగు తులనాత్మక సింహావలోకనం, కావ్య విమర్శ మొదలైనవన్నీ ఆయన పరిశోధన కృషిని వివరిస్తాయి.
గురజాడ పరిశోధనలన్నింటిలో కెల్లా తలమానికమైనది భాషా పరిశోధన. గురజాడ తన జీవితకాలంలో అత్యంత విలువైన అత్యధిక సమయాన్ని కేటాయించింది భాషా పరిశోధనకే. అందుకు కారణం వాడుక భాషకు సాహిత్య గౌరవం కల్పించాలన్నదే ఆయన ధ్యేయం. అప్పటి పాశ్చాత్య ఆంగ్ల విద్యా ప్రభావంతో తన చుట్టూ ఉన్న ప్రపంచంలో గురజాడను ప్రధానంగా ఆకర్షించినవి రెండే రెండు. ఒకటి భాష. రెండోది నాటకం. ప్రపంచంలోని పలు దేశాల్లో భాషకు సంబంధించిన పరిణామాలను తనకు లభ్యమైన ఆధారాలను గురజాడ సూక్ష్మంగా పరిశీలించాడు. పొరుగు భాషలైన తమిళం, కన్నడం, బెంగాలీ భాషల్లోనూ, యూరోపియన్ భాషల్లోనూ సంభవించే మార్పులు – చర్ఛలు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు ఉత్సుకతతో ఆయన తెలుసుకునేవాడు. ఈ సమాచారం కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భాషా శాస్త్రవేత్తలతో పరిచయాలేర్పరచుకొని వారి నుండి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సమాచారాన్ని సేకరించి అవగాహన చేసుకునేవాడు. అంతర్జాతీయ పత్రికల్లో వెలువడే భాషా విశేషాలను అధ్యయనం చేసేవారు. దీని వెనుక వున్న బలమైన కారణం ఒక్కటే. తెలుగును నిత్య నూతనంగా, సజీవ భాషగా నిలపాలన్నది గురజాడ ఆకాంక్ష.
గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం బహుళ జనాదరణ పొందటంతో రెచ్చిపోయిన గ్రాంథికవాదులు “ఇది సాంఘిక నాటకం కాబట్టి మాట్లాడుకునే భాషలో రాయగలిగావు కానీ ఇది ఏ చారిత్రక నాటకమో అయితే మాట్లాడుకునే భాషలో రాయగలవా?” అనే సవాలుని విసిరారు. దానికి జవాబుగా ఆయన బిల్హణీయం అనే నాటకాన్ని మాట్లాడుకునే భాషలో రాశారు. ఛందోబద్ధమైన కవిత్వం రాయలేకే గురజాడ ఇలాంటి రచనలు చేస్తున్నారని గ్రాంథిక వాదులు విసిరిన మరో సవాలుకి జవాబుగా ఆయన సుభద్ర అనే కావ్యాన్ని, సత్యవ్రత శతకాన్ని రాసి చూపించాడు.
సాహిత్యం, విద్య సమాజంలోని కొందరి సొత్తుగా భావించడాన్ని గురజాడ ఆక్షేపించాడు. అవి సమాజంలోని అన్ని మూలలకు వ్యాపించాలని, అందుకు వ్యవహారిక భాషే సరియైన సాధనమని గురజాడ వాదన. ఈ ప్రయత్నంలో ఆయనకు గ్రాంథిక భాష వాదుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీన్ని ఎదుర్కొనే ప్రయత్నంలోనే విస్తృతమైన భాషా పరిశోధన చేశాడు. ఆ పరిశోధనకు ప్రతిరూపమే ‘అసమ్మతి పత్రం’. వ్యావహారిక భాషలో విద్యాబోధనకి ప్రథమ ప్రధాన బీజమిదే. ఈ పత్రంలో గురజాడ చేసిన భాషా పరిశోధన చారిత్రకమైనది. వర్ణనాత్మకమైనది, తులనాత్మకమైనది, అనువర్తితమైనది. గురజాడ అసమ్మతి పత్రంలో భాషకు సంబంధించిన ప్రతీ సూక్ష్మాంశమూ పరిశీలించబడింది. ఈ పత్రాన్ని చదివే కొద్దీ కొన్ని అంశాలను సూక్ష్మాతి సూక్ష్మంగా, ఇంత విస్తృతంగా ఎలా చర్చించగలిగారా! అనే ఆశ్చర్యం కలుగకమానదు. ఒక ప్రత్యేకమైన పరిశోధన చేయగలిగినంత విషయ ప్రాధాన్యత కలిగినటువంటిది ఈ అసమ్మతి పత్రం.
ఇంటర్మీడియట్ పరీక్షలో విద్యార్థులు రాసే సమాధాన పత్రాలలో అనుమతించదగిన తెలుగు భాషా శైలి ప్రమాణాన్ని నిర్ణయించడానికి మద్రాసు విశ్వవిద్యాలయం 1911వ సంవత్సరంలో ఒక సంఘాన్ని నియమించింది. అందులో గురజాడ కూడా సభ్యులు. ఈ విషయమై అనేక తీవ్ర వాదోపవాదాలు, తర్కవితర్కాలతో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. అనంతరం 1914లో ఈ సంఘం తీసుకున్న నిర్ణయాలు విద్యాభివృద్ధికి మేలు చేయకపోవడమే గాకుండా, తప్పక కీడు చేస్తామని నిరూపిస్తూ విశ్వవిద్యాలయానికి గురజాడ సమర్పించిన విశ్లేషణాత్మక – పరిశోధనాత్మక నివేదికయే అసమ్మతి పత్రం.
సాహిత్య రచనలో వ్యావహారిక భాష ప్రయోగాన్ని నిరసిస్తూ కొమఱ్ఱరాజు లక్ష్మణరావు గ్రామ్యరూపాలన్నీ దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ వాడుకలో ఉన్నాయన్న గురజాడ వాదనను ఆక్షేపించారు. (ఆనాడు గ్రాంథిక భాషా వాదులు వ్యవహారిక భాషకు పెట్టిన పేరు గ్రామ్యం). అందుకు గురజాడ ‘అవిస్త్’ అన్న సంయుక్త హల్లు ఉండే క్రియా రూపాలను వందల కొద్దీ ఉదాహరణలిచ్చారు. (వస్తూ, చేస్తే, చూస్తూ, రాస్తూ, ప్రార్థిస్తూ మొదలైనవి). అతి ప్రాచీన కాలం నుండి శాసనాది సాహిత్య గ్రంథాలు మొదలుకొని తన కాలం వరకు గల రచనల్లో ఆ ప్రయోగం ఎంత విస్తృతంగా వాడబడిందో వందల కొద్ది ఆధారాలతో నిరూపించారు.
సాహిత్యంలో వ్యవహారిక భాషను ఉపయోగించడం ద్వారా భాషకున్న పవిత్రత, పటుత్వం పోయి సాహిత్యం సామాన్యస్థితికి దిగజారుతుందనేది గ్రాంథిక భాషా వాదుల వాదించేవారు. ఈ భ్రమను పోగొట్టడానికి గురజాడ ప్రపంచంలోని పలు భాషల వికాసాన్ని చారిత్రక ఆధారాలతో వివరించాడు. ఇలాంటి గ్రాంథిక భాషా వాదన ప్రతి దేశంలోను ఉన్నదేననీ, ఈజిప్టు – యూరోపిన్ భాషలలో కూడా ఆరంభంలో ఇలాంటి ప్రతిఘటనలే ఎదురయ్యాయని ఆయన పలు ఉదాహరణలను చూపించారు. ఐతే కాలక్రమంలో ఆయా దేశాలలో వ్యవహారిక భాష సాధించిన ఫలితాలను, వికాసాన్ని చూపిన పిదప వారు తమ అభిప్రాయాలను మార్చుకున్నారని కూడా అసమ్మతి పత్రంలో గురజాడ పేర్కొన్నాడు.
అసమ్మతి పత్రం వ్రాయడానికి పూర్వమే తెలుగు భాషలో సంస్కరించుకోవాల్సిన సందర్భాలను తరుచుగా మిత్రులకు లేఖల ద్వారాను, వ్యాసాల్లోను గురజాడ సూచిస్తూ ఉండేవాడు. వ్యాకరణబద్ధంగా రాయాలనే పండితులే ఎన్ని రకాలుగా వ్యాకరణ నియమాలను ఉల్లంఘించారో వారి రచనల నుండే ఉదాహరణలు చూపాడు. వాడుకభాషకు గ్రామ్యం, మ్లేచ్ఛం అనే పేర్లు పెట్టి హేళన చేసే గ్రాంథిక వాదులు, అసలు ఆ పదాలనే ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నారో చూపించడానికి పతంజలి మహాభాష్యం మొదలుకొని పలు వ్యాకరణ గ్రంథాల నుండి ఉపపత్తులను చూపిస్తూ అసలు అర్ధాన్ని గ్రహించమన్నాడు.
కర్కశ గ్రాంథిక భాషావాది అయిన కొక్కొండ వెంకటరత్నం, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, జయంతి రామయ్య పంతులు, కొమఱ్ఱాజు లక్ష్మణరావు, వేదం వేంకటరాయశాస్త్రి మొదలైన వారి రచనలను, అభిప్రాయాలను పేర్కొంటూ, వారి దోషాలను వారికే చూపిస్తూ గురజాడ విస్తృతంగా తన వాదాన్ని వినిపించాడు. వేదం వేంకటరాయశాస్త్రి ప్రతాపరుద్రీయ నాటకాన్ని ఒకవైపు ప్రశంసిస్తూనే అందులోని అచారిత్రకతను, అనుదాత్తతను నిలదీశాడు. వేదం వారి ఇతర నాటకాల్లోని అనౌచిత్యాన్ని విమర్శించాడు. రచనాశిల్పంలోని అనౌచిత్యాల విషయంలో ఆయన కందూకూరిని కూడా వదలలేదు. పాఠ్యగ్రంథాలుగా ఉన్ననవలలోని చిత్ర విరుద్ధ చిత్రణలను కూడా తీవ్రంగా విమర్శించాడు.
గురజాడ కావ్యభాష ప్రస్థానాన్ని సామాజిక దృష్టితో శాస్త్రీయంగా పరిశీలించాడు. సంకుచితమైన సామాజిక, రాజకీయ, సాహిత్య ఆదర్శాలది పై చేయిగా విన్న సామాజిక పరిస్థితులు కావ్యభాష ఉత్పన్నం కావడానికి దారితీశాయని తన పరిశోధన ద్వారా వెల్లడించాడు. భాష – సమాజం- సాహిత్యం- సంప్రదాయాల మధ్య గల సంబంధాలు, అవి ఒకదానిపై మరొకటి చూపిన ప్రభావాల్ని నిగూఢమైన అంశాలను సులవైన రీతిలో సమగ్రంగా విశ్లేషించారు. సాహిత్యభాషకు ప్రజాదరణ ఉన్నదని గ్రాంథిక భాషా వాదులు చేసే మొండివాదనను తోసిపుచ్చుతూ, సాహిత్య భాషకు ఏనాడు ప్రజాదరణ లేదని, అది కొద్దిమంది గుత్తసొమ్ముగా వుండేదని పలు ఆధారాలతో గురజాడ వెల్లడించాడు. ఒక భాషారూపం దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ, సమాజంలోని ప్రతి విభాగంలోనూ వాడుకలో వుండాలనేది గ్రాంథిక భాషావాదుల వాదన. ఈ వాదన ఊహాలోకపు ప్రయాణమంటూ, ఏమాత్రం ఆచరణయోగ్యం కాదని పలు ఆధారాలను చూపించి గురజాడ నిరూపించాడు.
గురజాడ అప్పారావు పరిశోధనా కృషి అపారం. విద్య, భాష, చరిత్ర, సాహిత్యం, శాసనాలు, నాటకరంగం మొదలైన విషయాలకు సంబంధించి అప్పారావు చేసిన పరిశోధన అపరిమితమైనది. కానీ ప్రజలకు అందిన ఫలాలు పరిమితమే. అయినప్పటికీ అవి ప్రామాణికంగా చరిత్రలో నిలిచిపోయాయన్నది గమనార్హం. సంఘ సంస్కరణతో పాటు భాషా సంస్కరణకు గురజాడ శ్రీకారం చుట్టాడు. వ్యావహారిక భాషపై ఆయన చేసి వాదనలు, ప్రతిపాదనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. వ్యావహారిక భాషోద్యమకర్త గిడుగు రామ్మూర్తి, శ్రీనివాస్ అయ్యంగారు తదితరులు ఆయన చేత స్ఫూర్తి పొందినవారే. నాది ప్రజల ఉద్యమం దానిని ఒకరిని సంతోషపెట్టడానికి వదులుకోను అంటూ గురజాడ చిత్తశుద్ధితో చివరి వరకు మాట్లాడుకునే తెలుగుభాషకే పట్టం కట్టడానికే అంకితమయ్యాడు. అక్షరం ఎంతటి క్షయం లేనిదో అప్పారావు కృషి అంతటి శాశ్వతమైనదే. తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు ప్రజలు ఆయనను స్మరించుకుంటూనే ఉంటారు.