(గత సంచిక తరువాయి)
తే.గీ. శిక్షణా స్మృతిలోని నిశిత నిబంధ
నముల మక్కికి మక్కిగా నమలుపరచు
పోటరివి, నీవొక కీల్బొమ్మవౌదు,
మానవత ఎదలేని అమానుషుడవు.
తే.గీ. నేరపరిశోధనంబున నారితేరి,
దోషులను చెరసాలలో త్రోయువలన,
కపట దుర్జన సంపర్క చపలమతివి,
దేవునైనను నమ్మని తీట నీది.
కం. నీ కెట్లు తెలియును! జనా
నీకంబున అస్ఖలిత పునీత గుణశ్రీ
వ్యాకోచిత ఘన హృదయులు,
లోకహితులు, స్వార్థరహితులు గలరటంచున్.
తే.గీ. ధీరు డీ బ్రాహ్మణుం డసదృశ గుణుండు,
ధార్మికుడు, మర్మమెఱిగిన కర్మయోగి,
రామపదయుగ సేవానురక్తిపరుడు,
భక్తజన హృదయ నళిన భాస్కరుండు.
మ. తను జీతంబును కోలుపోయినను ఖేదంబొంద లేదన్నడున్,
తినగా తిండియు లేని నాడయిన చింతింపండు, చేచాచి యె
వ్వనినైనం దయచూప వేడి ధన మొప్పంగోర డా రాఘవేం
ద్రుని పాదద్వయి నమ్మి సంతతము సంతోష ప్రభూతాత్ముడై.
కం. రేపట్లు గడుచునో యని
వాపోవడు, నేటి కుడుపు వర్ణంబైనన్
తాపము నొందం డదియును
దాపర మవదేని నీరు ద్రావును ప్రీతిన్.
కం. సాపాటు లేక పూజా
రా పట్టున పస్తులుండి అయమయును దా
నే పాట్లు పడిరొ ఎఱుగుదు
వా! పండ్రెండేళ్ళుగ ప్రతివాసరమందున్.
ఉ. ఐననుకాని భామినియు నాతడు రాముని సేవ లెన్నడున్
మానరు, దేవళంబును క్రమమ్మున మార్జన చేసి, లోగుడిన్
మానుగ రంగవల్లుల సమాహితరీ రచించి, రామభూ
జానిని, జానకీసతిని జాజులతోడ నలంకరించుచున్.
తే.గీ. చామరంబుల వీచి సాష్టాంగ పడుచు,
తులసిదళముల పూజింతు రలఘుభక్తి,
ఆర్తితో కొన్ని మేలైన కీర్తనములు
వీను లలరంగ పాడి సేవింతు రెపుడు.
తే.గీ. సొమ్ము చిక్కినట్లైనచో సుంతయైన,
ధూప, హారతులెత్తి ప్రత్యూషమందు,
చిన్న వత్తితోనైనను సన్న దీప
శిఖను వెలిగించువారు నిశీధులందు.
ఉ. అన్నములేక ఆలు మగ లారతి కప్పురమట్లు చిక్కియున్
విన్నన నొందరయ్యె, రఘువీరుని నామ నిరంతర ప్రశం
సోన్నతి లోన చిక్కి - మఱి నొందిలి నొందుదు రప్పుడప్పుడున్
తిన్నన జానకీపతికి దీపికకైనను నూనె లేమిచే.
కం. ఈ విధి కొన్నేండ్లుగ వా
రావేశిత భక్తి రాఘవాధిపు, సీతన్
సేవించిరి ఎండైనను,
వావిరి వానైనగాని ప్రతిదినమందున్.
కం. రాముని సేవకు లీ విధి
బాముల పడగా మహానుభావుండౌ శ్రీ
రాముం డూరక యుండెనె
ప్రేమాదర భావజాల వేల్లితుడగుటన్.