గగన మంతా నిండి తుమ్మెదా - మబ్బు
జల్లుగ కురిసిందే తుమ్మెదా!
తొలకరించ తడిసి తుమ్మెదా - నేల
పులకించి మురిసిందె తుమ్మెదా!
మట్టి వాసన తోడ తుమ్మెదా - గాలి
మత్తెక్కి వీచిందే తుమ్మెదా!
అదను వచ్చిందనుచు తుమ్మెదా - రైతు
పొలం పదును చేసినాడే తుమ్మెదా!
విత్తులు కొనితెచ్చి తుమ్మెదా - బాగా
విసిరి చల్లినాడే తుమ్మెదా
విత్తుల్ని చల్లుతు తుమ్మెదా - అతడు
విశ్రాంతి మరచాడే తుమ్మెదా!
విత్తులు మొలకెత్తి తుమ్మెదా - అవి
విసవిసా పెరిగాయె తుమ్మెదా!
పైరుపచ్చలు గాంచి తుమ్మెదా - రైతు
పరవశించినాడే తుమ్మెదా!
* * *
పచ్చనీ చేలోకి తుమ్మెదా - పాడు
పురుగొచ్చి పడ్డాది తుమ్మెదా!
నిండైన పైరును తుమ్మెదా - అది
నమిలి మింగే స్తోంది తుమ్మెదా!
రైతన్న చూశాడు తుమ్మెదా - రగిలి
రంకెలే వేశాడు తుమ్మెదా!
ఆలి పుస్తెల నమ్మి తుమ్మెదా - అతడు
అంగడికి పరుగెట్టె తుమ్మెదా!
పురుగుల మందును తెచ్చి తుమ్మెదా - బాగ
పొలమంత జల్లాడే తుమ్మెదా!
పురుగు చావలేదు తుమ్మెదా - పైగ
పురపురా పెరిగింది తుమ్మెదా !
కల్తీ మందది చూడ తుమ్మెదా - శుద్ధ
కటికోడు అమ్మాడే తుమ్మెదా!
వానలు వరదలూ తుమ్మెదా - కలిసి
వరసగా వచ్చాయె తుమ్మెదా!
పగపట్టినట్లుగా తుమ్మెదా - అవి
పంటల్ని ముంచాయే తుమ్మెదా!
దిక్కు తోచని రైతు తుమ్మెదా - కడు
దీనుడై వగచాడే తుమ్మెదా!
ఆదుకో రమ్మంటు తుమ్మెదా - అతడు
ఆర్తితో పిలిచాడే తుమ్మెదా!
అధికారులందరికీ తుమ్మెదా - అతడు
అర్జీలు పంపాడే తుమ్మెదా!
అధికారులెవ్వరు తుమ్మెదా - మొదట
ఆ గోడు వినలేదు తుమ్మెదా!
పంటతోపాటుగా తుమ్మెదా - రైతు
పరపతే పోయింది తుమ్మెదా!
అప్పులోళ్ళు వచ్చి తుమ్మెదా - బాగ
అదలించి తిట్టారే తుమ్మెదా!
చేవ చచ్చిన రైతు తుమ్మెదా - చాల
చింతలో మునిగాడే తుమ్మెదా!
ఆత్మహత్యయె శరణంటూ తుమ్మెదా - అతడు
అల్లాడిపోయాడు తుమ్మెదా!
ఒకరు, ఇద్దరు కాదు తుమ్మెదా - వారు
వందల్లో చచ్చారే తుమ్మెదా!
భార్యాబిద్దల గూడి తుమ్మెదా - దివికి
తరలి వెళ్ళినారు తుమ్మెదా!
తుదకు కార్దొకటి వచ్చి తుమ్మెదా - కాస్త
కన్నీరు తుడిచింది తుమ్మెదా!
కాని, కష్టాల కడలిలో తుమ్మెదా - అది
కాకిరెట్టయ్యింది తుమ్మెదా!
రైతన్న లేకున్న తుమ్మెదా - ఇక
రాజ్యమెట్ల నిలుచునే తుమ్మెదా!
కూడు గుడ్డలు లేకుంటే తుమ్మెదా - జనులు
కుప్ప కూలిపోరటే తుమ్మెదా!
వ్యవసాయమే లేకుంటే తుమ్మెదా - మన
వ్యవస్థ లెట్లు మిగులు తుమ్మెదా!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)