శీర్షికలు
పద్యం - హృద్యం
- పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మ ీజవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసంప్రశ్న:
ఒకటి ఒకటి గూడి ఒకటె యగును


గతమాసం ప్రశ్న:
(న్యస్తాక్షరి, వర్ణన) పద్యములోని ప్రతిపాదములోని మొదటి అక్షరములు కలిపిన 'దసరాలు' గా వచ్చేటటుల మీకు నచ్చిన ఛందస్సులో దసరా సంబరాలు వర్ణిస్తూ పద్యము వ్రాయాలి.

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
దశమి పూజల దుర్గమ్మ తనరు మదిని
సరస సల్లాపము లయందు సంత సముగ
రాస లీలల నృత్యాల రమణు లంత
లుప్త క్షణమందు బతుకమ్మ సప్త పదిని

టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ
తే.గీ//
దశలనన్నిటి దర్శించ తత్వ మతికి
సర్దు బాటున సంసార సాగరమును
రాచ బాటగ నడిపించు రభస లేక
లులితముండదు పండుగ లోచనమున!

(లులితము= కలత/భీతి)

వారణాసి సూర్యకుమారి, రాంచి
(1) తే.గీ//
దనుజు మహిషున్ దునిమె దుర్గ దశమి నాడు
సకలజనులు సంతస మంది జరిపిన నవ
రాత్రి సంబరమ్ములు నంబర మ్ము నంటి
లుప్త మైన శాంతి లభియిం చె లోకమంత

(2) సీ//
దరహాస వదనులై తరుణులు దసరాకు
బొమ్మల కొలువుంచు నుమ్మరముగ
సరదాగ పులివేష సందడిన్ తిలకించి
పులకించు పెద్దలూ పిల్ల లంత
రామాయణాది పు రాణముల్ హరికధా
శ్రవణాలు నవరాత్రి సంబరాలు
లుప్తమౌ విశ్రాంతి లోటు తీ రెడు రీ తి
వేడుకలగు నన్ని వేళలందు

తే.గీ//
ఉల్ల ముల్ రంజిలంగను పల్లె ప్రజలు
కొత్త బట్టలు ధరి యించి కోర్కె తీ ర
పండుగ దసరా సరదాలు నిండు గాను
జరుపు కొందురు ఉత్సాహ భరితు లగుచు

(3) ఆ.వె//
దశమి పండుగనుచు దసరాకు సరదాగ
సరిగమలను రాగ సాగరికలు
రాగయుక్త మునను రాగాలు పలుకు చి
లుకల వోలె పిల్ల లుండి రపుడు

చావలి విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా
తే//
దరువు జోడుగ పులి వేష ధారి చిందు
సంబరాల కోలాటల సందడి నవ
రాత్రి బొమ్మలకొలువుల్ల రంగు చీర
లు మెరియు వనిత దసరా రోజులందు .

ఆ.
దమన మహిషు పోరు నణచిన దుర్గయె
సకల శక్తి నొసగు శాంతితొ నవ
రాత్రి పూజ ,జరుగు రావణ దహనము
లు దసరాల కొలువులు సరదాల.

గండికోట విశ్వనాధం, హైదరాబాద్‌
దనుజు మహిషుని కూల్చిన తల్లి వీవు
సరస సాహిత్య సంగీత శబ్ద మీవు
రాజ్య పూజ్యత విద్యల రాణి వీవు
లుబ్ధ బుధ్ధుల మలచి మేలొసగు మమ్మ

జంధ్యాల కుసుమ కుమారి, హైదరాబాదు.
తే. గీ
దనుజ మర్దిని లీలలు దర్పమలర
సన్నుతింతురొక స్ధలి సంతసముగ
రాశులౌ పూల సిరులలరార లలన
లుకొలుతురొక సీమ నమరులు దిగి రాగ.

ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
దగదగ దుర్గమ్మ మెరుపు,
సగుడ మొరమొరాల్పలు వరుసల ప్రతిమలహో
రాగ సరిగమల కీర్తన
లు కలగలసిన నవ రాత్రులు ముదంబిచ్చున్!

కృష్ణ అక్కులు
దమ్మిడి కరువాయె, దసరా దినంబున
సరకులు కొనలేని సగటు రైతు
రాతి గుండె తోడ బీతి వీడి అసువు
లు వదలెను విసిగి అలుపును కోరి

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)