చతుస్సంతాన సుబ్బారావు వివిధ దిన, వారపత్రికల వివాహవేదికల పేజీల్లో తన కూతుళ్లు సుహాసినీ, సుకేశినీల వివాహార్థమై ప్రకటనలు చేశాడు. సంచారవాణి సంఖ్యా, చిరునామా తెలియజేసాడు. ఓ పదిరోజుల వ్యవధిలో యిద్దరివీ ఫోటోలు పంపమంటూ దేశం నలుమూలలనుంచీ ఓ పాతికదాకా ఉత్తరాలు వచ్చాయి. సుబ్బారావు అందరికీ తిరుగు టపాలో ఓ జిరాక్సు జవాబు రాశాడు.
‘ కేవలం వరుల తాలూకు ఏకపక్ష నిర్ణయంతో జరిగే వివాహవ్యవస్థ నాకు కానీ, నా కూతుళ్లకు కానీ ఇష్టం లేదు. యింతకుముందు కొందరు కొంగముక్కుగాళ్ళు, చప్పిడిముక్కువాళ్లు, బండముక్కువాళ్లు నా కూతుళ్లను చూసి కొండలంత కట్నాలడిగారు. నా కూతుళ్ళు వాళ్ళమ్మలాగే చాలా అందంగా ఉంటారు. కోరి కట్టుకున్నది కోతిలా ఉన్నా అందంగానే ఉంటుందన్న సామెత కాదుకాని, వాళ్ళమ్మ నిజంగానే చాలా అందంగా ఉంటుంది. వరాన్వేషణలో అందగాళ్లకోసం ప్రత్యేకించి ఎదురుచూడకపోయినా, కనీసం కనుముక్కుతీరు బావుండి, ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలి కదా? మీరెవరూ ఫోటోలు పంపలేదు. మాకు జాతకాలమీద నమ్మకం లేదుకాని, కుటుంబ సంస్కారం, కుర్రాళ్ళు చేసే ఉద్యోగాల సంగతీ చాలా ముఖ్యం. అందుచేత మీ కుటుంబం తాలూకు రెండుతరాల చరిత్రా, కుర్రాళ్ళుచేసే ఉద్యోగ వివరాలూ, ఫోటోలూ పంప ప్రార్థన. మాకు నచ్చినా, నచ్చకపోయినా ఆ విషయాన్ని మా స్వంత పోస్టు ఖర్చులతో మీకు నిర్మొహమాటంగా తెలియజేస్తాము. నచ్చనివారి ఫోటోలు తిరిగి పంపిస్తాము. మాకు నచ్చినవారికి మా అమ్మాయిల ఫోటోలు పంపడం జరుగుతుంది. అమ్మాయిలకి జాతకచక్రాలు వేయించలేదు. పుట్టిన సమయం, తేదీ తెలియజేస్తాము. పురపాలక సంఘంవారు జారీ చేసిన జననధ్రువపత్రం తాలూకు జిరాక్సు కాపీలు పంపిస్తాము. మీకు జాతకాలమీద నమ్మకముంటే మీరే చక్రాలు వేయించి చూసుకోండి.. మా అమ్మాయిల ఫోటోలు నచ్చితేనే, జాతకాలు నప్పితేనే చూడ్డానికి రండి. చూసిన తర్వాత జాతకాలు కుదరలేదన్న వంకపెట్టడానికి మీకు ఆస్కారముండదు. ప్రత్యక్ష వీక్షణంలో మా అమ్మాయిలు నచ్చకపోతే ఆ వంకా, ఈ వంకా పెట్టకుండా ఎందుకు నచ్చలేదో మీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ప్రత్యక్షంగా కుర్రాళ్లని చూసిన తర్వాత మేము మా కూతుళ్ల అభిప్రాయాలకి విలువనిస్తాము. మీ కుర్రాళ్ల మాటతీరూ, నడవడీ నచ్చకపోతే, నచ్చలేదని మా అమ్మాయిలు అప్పటికప్పుడే చెప్పేస్తారు. యిక కట్నాల ప్రసక్తి మీరు తీసుకు రాకూడదు. ఎందుకంటే దాన్ని కుసంస్కారంగా భావిస్తాము.
కాకపోతే నాకున్న రెండెకరాల భూమినీ అమ్మేసి, కొంత ఋణం తీసుకొని యిద్దరమ్మాయిలకి చెరో అపార్ట్మెంట్ నీ కొని యిచ్చేశాను. వాటిమీద వస్తున్న అద్దెని వారే తీసుకొంటున్నారు. ఆడపిల్లలికీ ఆస్తిలో హక్కుండాలన్నది మా నమ్మకం. చేసిన ఋణం మట్టుకు నేను నాఖాతాలో తీరుస్తున్నాను. మా కుర్రాళ్ళిద్దరూ ఒకరు నాగపూర్ లోనూ, మరొకరు చెన్నైలోనూ గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తున్నారు.
తర్వాత చెప్పవచ్చేదేమిటంటే, మా ప్రకటనలో తెలియజేసినట్లుగా అమ్మాయిలిద్దరూ సాఫ్‌టవేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మీది సమష్టి కుటుంబమే అయితే నాలుగోవంతు జీతం అత్తగారి చేతికి అందిస్తారు. లేదా వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటే బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. అది వేలల్లోనే ఉంటుందికాని వందల్లో కాదు.
యింటర్ పాసయిన తర్వాత ప్రవేశ పరీక్షల్లో అత్తిసరు ర్యాంకులు వచ్చిన అమ్మాయిల యింజనీరింగ్ చదువులకి తడిసి మోపుదైంది. చదువులకోసం నేను చేసిన ఋణాలు తీరేవరకు అమ్మాయిలు నాలుగోవంతు జీతం మాకిస్తారు. చదువులు సరిగా చదివి, ర్యాంకులు సరిగా వచ్చి, డొనేషన్ కట్టకుండా వాళ్ళకి సీట్లు వచ్చి ఉంటే, యితరత్రా చదువు ఖర్చులన్నీ నేనే భరించే వాణ్ణి. ఒకవేళ కుర్రవాళ్ళకి తల్లిదండ్రుల బాధ్యత కనక లేకపోతే మా అమ్మాయిలు ప్రతినెలా తమ కాపురానికి అయ్యే ఖర్చు సగం భరిస్తారు. తమజీతంలో నాలుగోవంతు పుట్టబోయే సంతానం కోసం పొదుపు చేస్తారు. అబ్బాయిలు కూడా నాలుగోవంతు జీతం కనబోయే సంతానం కోసం దాచాలి. మా అమ్మాయిల జీతాల్లో మిగిలిన సొమ్ముపై మీరు ఆశ పెట్టుకోకూడదు. నిబంధనలు పెట్టకూడదు. ఆ మొత్తం మా అమ్మాయిలు తమ భవిష్యత్ కోసం దాచుకొంటారు. ఆప్తులకీ, పేదలకీ ధనసహాయంచేసే స్వేచ్చ మా అమ్మాయిలకుంటుంది. యిప్పుడు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు పెళ్లయినతర్వాత మీరు మానమంటే మానరు. వాళ్లే మానడానికి నిర్ణయం తీసుకొంటే మీరు కాదనకూడదు. భార్యాభర్తలిద్దరూ ఒకే ఊరిలో ఉద్యోగాలు చెయ్యడానికి అమ్మాయిలు సహకరిస్తారు. అయితే ఒకే ఊరిలో ఉద్యోగాలు చేయడంకోసం, ఒకఊరినుంచి మరో ఊరికి బదిలీ, లేదా ఒక కంపెనీ విడిచి మరో కంపెనీలో చేరడంలాంటి ప్రయత్నాలు అబ్బాయిలే నడుం కట్టుకొని చేయాలి.
అబ్బాయిలకి మా అమ్మాయిల కంటే జీతాలు తక్కువైనా పర్వాలేదు. అలాగని భర్తల్ని చులకన చూపులు చూడరు. తలకి అమృతాంజనం రాస్తారు. కాళ్లు పీకితే పడ్తారు. నడుంనొప్పివస్తే తాడో, గోడో పట్టుకొని అడుగులతో తొక్కుతారు. ప్యాంటులూ, షర్ట్ లూ ఇస్త్రీ చేస్తారు. కానైతే తమ బట్టల్ని మట్టుకు బయటి ఇస్త్రీ బండి దంపతులకే యిస్తారు. ఎంచేతనంటే చీరల ఇస్త్రీ అంత సులువు కాదు.
ఇక వంటావార్పు విషయమై అబ్బాయిలూ, అమ్మాయిలూ ఓ అవగాహనకి రావాలి. సాప్ట్ వేర్ కంపేనీల ఉద్యోగ సమయాల సంగతి మీకు తెలుసుకాబట్టి, అమ్మాయిలే వంట చేయాలన్న నిబంధన పెట్టకూడదు. అదీకాక మా అమ్మాయిలకి అమ్మ తిండీ, హాస్టల్ తిండీ తినడం తప్ప, వంటింట చెయ్యి కాల్చుకొన్న అనుభవం లేదు. అబ్బాయి, అమ్మాయి కలిసి వంట నేర్చుకొని వాళ్ల తంటాలు వాళ్లేపడాలి. కాదంటే, ఖర్చు ఎలాగూ సగం భరిస్తారు కాబట్టి ఓ వంటమనిషిని ఏర్పాటు చేసుకోవడంలో అభ్యంతరం ఉండకూడదు. మరో ముఖ్యమైన సంగతి. ఏమిటంటే మేము ఫక్తు శాకాహారులం. కులపరమైన పట్టింపులు లేవని మేము ప్రకటనలో పేర్కొన్నా, శాకాహారులకే ప్రాధాన్యత యివ్వబద్తుందన్న సంగతిని తెలియజేయనందులకు క్షంతవ్యుణ్ణి. మా ఊరూ, తాలూకా, జిల్లా, ప్రాంతం, రాష్ట్రం, దేశం, తర్వాత ప్రవాసాంధ్రులూ, భారతీయులూ- యిలా ప్రాధాన్యత యివ్వబద్తుంది. తెలుగువారంటే మరింత ప్రాధాన్యత యివ్వబద్తుంది. కేవలం ప్రాంతీయ, దేశీయ ఆచారవ్యవహారాల దృష్ట్యా, ఆహారనియమాల దృష్ట్యా ఈ పద్ధతిని ఆచరించదలిచాము. చేపలు ఈదే కూరగాయలంటే మాకు నచ్చదు. కోడిగుడ్డు బంగాళాదుంప లాంటిదే అన్నా మాకు నచ్చదు. అంచేత బెంగాల్, అసోమ్, ఒడిశా వాసులు ఈ విషయాన్ని గమనించాలి.
మరో సంగతి ఏమిటంటే మా అమ్మాయిలకి ఎంబ్రాయిడరీ, నిట్టింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లాంటి హస్తకళల్లో అభిరుచి లేదు. కంప్యూటర్ కీబోర్డ్ మీద వేగంగా కదిలే వాళ్ల వేళ్లు, యిటువంటి హాబీలంటే మొరాయిస్తాయి. వాటి ఊసెత్తితే అవి చదువులేని స్త్రీల వ్యాపకాలని హేళన చేస్తారు. ఊడిపోయిన, లేదా విరిగిపోయిన బొత్తాల స్థానే కొత్త బొత్తాల్ని కుట్టలేరు. అందుకని చొక్కాబొత్తాల విషయమై అబ్బాయిలే చూసుకోవాలి.
ఇలాంటి మా అభిప్రాయాలపట్ల మీకు అభ్యంతరం లేకపోతే ఫోటోలు పంపండి. అటు తర్వాత మీ అబ్బాయిల ఫోటోలను చూసి, మా అమ్మాయిలకి నచ్చినవారికి మా అమ్మాయిల ఫోటోలు అవీ పంపుతాం. ఆ తర్వాత ఆగష్టు నెలలో 15 వ తారీఖున మా యింట స్వయంవర మౌఖిక సమావేశానికి ఏర్పాట్లు చేస్తాను. కతికితే అతకదన్న నమ్మకం మాకు లేదు కాబట్టి భోజనాల ఏర్పాట్లు చేస్తాం. కుర్రవాళ్లతో తల్లిదండ్రులూ, పెళ్లికాని ఆడపడుచులూ రావొచ్చు. కానీ దారిఖర్చులు మీరే భరించి రావాలని మనవి.
తోటకూర గింజల్లో నల్లపూసలు కలిపిచేసే పాతకాలపు దృష్టి పరీక్షలకి మాకు అభ్యంతరం లేదు. అయితే అబ్బాయిలుకూడా అవే పరీక్షలకు సిద్ధం కావాలి. మా అమ్మాయిలిద్దరికీ కళ్లజోళ్లున్నాయి.
యింకో చాలా ముఖ్యమైన సంగతి ప్రస్తావిస్తున్నందుకు మన్నించాలి. రాగానే ఓ డైయాగ్నిస్టిక్ లేబొరటరీ నిపుణుడు వచ్చి అబ్బాయిలకీ, అమ్మాయిలకీ రక్తపరీక్షలు చేస్తాడు. ఆకారాలూ, ఉద్యోగాలూ, బహిరమైన సంస్కారాలూ నచ్చడమే కాకుండా, రక్తారోగ్య పరీక్షలు యిరుపక్షాలా శ్రేయస్కరం. రక్తం గ్రూపులపై నిపుణుల సలహా తీసుకోబద్తుంది. నేను రక్త పరీక్షలన్నాను కాబట్టి మీరు కన్నెపరీక్షలనొచ్చు. అందుకని మీరే యిక్కడి గైనకాలజిస్ట్ ని ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఓ సంగతి. మా అమ్మాయిలిద్దరికీ స్పొర్ట్స్ అంటే చాలా ఆసక్తి. స్కూల్, కాలేజీల్లో చాలా పతకాలు గెలుచుకొన్నారు. మీరూ, గైనకాలజిస్టులూ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుందేమో.
మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనలు మారాలి. స్త్రీ భవిష్యత్ కేవలం భర్త చేతుల్లోనే ఉంచే రోజులు కావుకాబట్టి, గుండెలమీది కుంపటి బరువును తీర్చుకోవడమే కాకుండా, మెట్టినింట్లో ఆ కుంపటి నిత్యమూ ప్రజ్వరిల్లుతోనే ఉండాలన్న తల్లిదండ్రుల కోరిక అసమంజసం కాదు. అబ్బాయిలనూ, అబ్బాయిల తల్లిదండ్రులనూ ఉన్న వాస్తవాల్ని అర్థంచేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ,
భవదీయుడు,
సుబ్బారావు.
***
“ఇలాంటి అర్థం పర్థం లేని ఉత్తరాలు రాస్తే ఎవరైనా అబ్బాయిలూ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులూ హర్షిస్తారా?
వారికి అవమానంగా ఉండదూ? బాలీవుడ్ రాజ్యాన్నేలిన సుప్రసిద్ధ నాయకుడు తన వారసత్వ నటకుమార రత్నం వివాహం, కీర్తిశేషుడైన మరో మహానటుడు, చలన చిత్రనిర్మాత మనవరాలితో జరిపించాలని తాంబూలాలు పుచ్చుకొన్న తర్వాత, పిల్ల తల్లి ఆ మహానటుడి ఆస్తిపాస్తుల పంపకాలు పెళ్లికి ముందే జరిగిపోవాలని పెంట పెట్టేసిన సంగతి మీకు తెలిసిందే కదా? అంతపెద్ద మహానటుడూ తోకముడిచి దణ్ణం పెట్టేశాడు.” సుబ్బారావు భార్య సాగదీస్తూ అడిగింది.
“ సినిమారంగంవాళ్ల జీవితాలు ఏ క్షణంలో ఏం మలుపులు తిరుగుతాయో చెప్పడం చాలా కష్టం. తన కూతురు భవిష్యత్ కోసం ఆవిడలా పట్టుబట్టడం సంస్కార రహితమనిపించినా, ఘోరమైన అపరాథమేమీ కాదు. వాస్తవానికి ప్రతివివాహం విషయంలోనూ పైకి తేలకపోయినా ఆడపిల్లల తల్లిదండ్రుల మనస్సుల్లో ఇలాంటి ఆలోచనలు కలిగి తీరుతాయి. అందుకని మర్మం లేకుండా ధైర్యంగా నా ఆలోచ్నల్ని ఎరికపర్చాను. ఇందులో అవమానమేముందని? ప్రస్తుత వివాహ వ్యవస్థనీ, వైవాహిక జీవితాన్నీ విశ్లేషించే ఉత్తరమిది. ఆస్తులున్నవాళ్లు కూతుళ్లకెంతైనా యివ్వగలరు, యివ్వాలికూడా. చాలా సందర్భాల్లో ఉన్నా యివ్వనివ్వని అన్నావదినెలు కూడా ఉంటారు! ఈ కాలంలో లేనివాళ్లు కూడా తల తాకట్టు పెట్టి కొడుకులతోబాటు కూతుళ్లనికూడా చదివిస్తున్నారు. ఆ తల తాకట్టుని విడిపించే బాధ్యత కొంత కూతుళ్లది కూడా కాదా? వచ్చిన జీతమంతా కట్టుకొన్నవాడికే యివ్వాలంటే, అదీ న్యాయమనిపించుకోదు. అదీకాక యిటీవలీ కాలంలో చాలామంది ఆడపిల్లలతోనే సరిపెట్టేసుకొంటున్నారు. వారిని విద్యావంతుల్ని చేస్తున్నారు. వృద్ధాప్యంలో వారినాదుకోవలసిన బాధ్యత కూతుళ్లదీ అల్లుళ్లదీ కాదా? కన్నకొడుకులే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్న రోజుల్లో ఎంతమంది అల్లుళ్లు యిలాంటి బాధ్యతల్ని తలకి రుద్దుకొంటారు? ఎంతమంది అబ్బాయిల తల్లిదండ్రులు ఈ విషయాన్ని హర్షిస్తారు? తలకొరివి పెట్టడందగ్గర్నుంఛీ ఎన్నో సమస్యలు. అందుకని అమ్మాయిల జీవితాలు హాయిగా ఉండాలనుకొంటే మొహమాటాలకి పోకుండా, అన్నివిషయాలు మాట్లాడుకోవడం అనుచితం కాదు,” అన్నాడు సుబ్బారావు.
***
యిద్దరంటే యిద్దరు కుర్రాళ్ళు ఆగష్టు పదిహేనున ఎవరూ తోడూలేకుండా సుబ్బారావింట్లో వాలారు. చామనచాయ కలవాళ్లైనా, పంపిన ఫొటోల్లోలాగే అకర్షణీయంగా ఉన్నారు. పంపిన వివరాల ప్రకారం ఒకతని పేరు నాగార్జున్. కానీ, అతను చూడ్డానికి మరో అర్జున్ లా ఉంటాడు. చదువు ఏం.ఏ. బి.యిడి. ఉద్యోగం ‘సెలెక్టివ్ సాఫ్ట్ వేర్ ఎనలిస్ట్స్’అంటే ‘ఎస్.ఎస్.సి.’అనే కంపెనీలో. రెండవ అతని పేరు రవితేజ. చూడ్డానికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నాలా ఉంటాడు. చదువు ఏం.కామ్. బి.యిడి. ఉద్యోగం ‘మాస్ సాఫ్ట్ వేర్ సొల్యుషన్స్’ అంటే ఎమ్.ఎస్.ఎస్. అనే కంపెనీలో. యిద్దరూ జిల్లాపరిధి టీచర్ సెలెక్షన్ పరీక్షలు రాసి ప్యాసయికూడా ఆర్డర్లు చేతికి రానివారు.
“అరె, నాగార్జునగారూ! నేనూ ఎస్.ఎస్.ఏ. లో పనిచేస్తానే, మీరెప్పుడూ కనిపించనేలేదు! మీరెన్నో ఫ్లోర్ లో పనిచేస్తారు?” అక్క సుహాసిని ఆశ్చర్యంగా అడిగింది.
“నేను గ్రౌండ్ ఫ్లోర్ లో మీ కాంటీన్ మెన్యూలని మెయింటైన్ చేస్తాను. ఏవి, ఎప్పుడు, ఎలా చెయ్యాలో దిశానిర్దేశం చేస్తాను. విదేశీ కస్టమర్లు, అనుబంధ సంస్థల అమెరికా బాస్ లు వచ్చినప్పుడు వారికి తోడుగా వెళ్ళి మార్కెట్ లో దుబాసీగా వ్యవహరిస్తాను.”
“అలానా?!” అతనంటే కాస్త సుముఖమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకొన్న చెల్లి సుకేశిని నీరసంగా అంది. మరుక్షణంలోనే పుంజుకొని రవితేజని ఉద్దేశించి అంది. “అయితే రవితేజగారూ! మీరు ఎమ్.ఎస్.ఎస్.లో ఉన్నారని రాశారు. నేనూ టెన్త్ ఫ్లోర్లో ప్రోగ్రామ్ అసిస్టెంట్ గా ఉన్నాను. మిమ్మల్నెప్పుడూ చూడలేదే!” నన్ను చూడకపోయినా, నా అధ్వర్యంలో తయారు చెయ్యబడ్డ వంటకాలెన్నో మీరు క్యాంటీన్లో తింటూనే ఉన్నారు. నేను చెఫ్ ని. ఫైవ్ స్టార్ హోటళ్ల ఛెఫ్ లు కూడా రహస్యంగా నన్ను కన్సల్ట్ చేస్తారు.”
రవితేజా అంటే మనసులో మొగ్గు చూపిన అక్క సుహాసిని కొద్దిగా మ్రాన్పడిపోయింది.
“మీరు చదివిన చదువులు టీచరు ఉద్యోగాలకోసం. మీ తాతలు టీచర్లని రాశారు. మీ నాన్నలు కంప్యూటర్ కంపెనీల్లో పని చేస్తున్నారని రాశారు. కానీ మీరు చేస్తున్నది దాదాపుగా వంటపని! యిదేలా సాధ్యం?” సుబ్బారావు ప్రశ్నించాడు.
“అందరూ యింజనీర్లే అయితే పాఠశాలల్లో పాఠాలు చెప్పేవారుండరు, పంతుళ్ల ఉద్యోగాలు చెయ్యండని మా తాతలు నూరిపోశారు. అ చదువులు పూర్తయిన తర్వాత రెండేళ్లు ఖాళీ! ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలకి వెడ్తే, కాయితమ్మీద వంద చూపించి చేతికిచ్చేదిమట్టుకు సగం అన్నారు. యిష్టం లేకపోయింది. మన యిండియన్ టెలివిజన్ ఛానెళ్లలో వచ్చిన వంటల ప్రోగ్రాంలన్నీ మమ్మల్ని నిష్ణాతుల్ని చేశాయి. యింతకీ చెప్పడం మరిచాము. మేమిద్దరమూ కజిన్స్ మి. మా తల్లులు అక్కచెల్లెళ్లు,” అన్నాడు నాగార్జున్.
“ మీ జీతాలెంతో మాకు తెలియదుకాని, మా జీతాలూ వేలల్లోనే!” అన్నాడు రవితేజ.
“మరో సంగతేమిటంటే మా తల్లిదండ్రులకు మేము ఒక్కొక్కళ్లమే సంతానం. ఫక్తు శాకాహారులం,” అన్నాడు నాగార్జున్.
సుబ్బారావు భార్యనీ, కూతుళ్లనిద్దర్నీ లోపలికి తీసుకుపోయాడు. “ పురాణకాలంనాటి నలుడూ, భీముడూ, ఈ నాటి ఫైవ్ స్టార్ ఛెఫ్ లూ తక్కువేమీ కాదు. ఖానాఖజానా సంజీవ్ కపూర్ కోటీశ్వరుడైపోయాడు. ఛానెళ్ళలో వంటల కాంపిటీషన్లు జరిపి లక్షల్లో బహుమతులిస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ వంటి గొప్ప రచయిత కూడా ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఎలా వండాలో టెలివిజన్ షోలిచ్చాడు. మరో ముఖ్యమైన సంగతి ఏమిటంటే ముఫ్ఫై లోపయినా మీకిద్దరికీ వయసు బాగా ముదిరిపోయినట్టే లెఖ్ఖ. ఉద్యోగాలు చేస్తూ వయసు ముదిరిపోయిన కన్యల వివాహాలు ఓ పట్టాన సులువుగా జరగవు. కుర్రళ్ళిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు, ఆలోచించుకోండి,” అని ఓ చిన్న క్లాసు పీకాడు.
పెళ్ళయిన కొద్దిసంవత్సరాల్లోనే సాఫ్ట్ వేర్ దంపతుల వివాహాలు ప్రపంచమంతటా శీఘ్రగతిన పాతబడిపోయిన హార్డ్ వేర్ ల్లా కొండెక్కుతున్న సంగతి వారికి తెలియంది కాదు. వయసు చేసే తొందరలు ఎంతకాలమని భరించడం? అయినా కథల్లోనూ, వ్యాసాల్లోనూ, సినిమాల్లోనూ స్త్రీకి అన్యాయం జరిగిపోతోందని వాపోతారేకాని, అయిదోక్లాసు చదివిన అమ్మాయిలు ఐ.ఏ.ఎస్. భర్తల్నికూడ తమ అదుపాజ్ఞల్లో ఉంచుకొన్న ఉదంతాలెన్ని లేవు? యిద్దరికీ చదువు బాగానే ఉంది. జీతం తక్కువే కావొచ్చుకాని, అది తమకి ఓ రకమైన ఆధిపత్యం చెలాయించడానికి మంచిదే. యిద్దరు తలలూపారు. సుబ్బారావు నిర్మొహమాటంగా అనుకొన్న పరీక్షలు చేయించాడు. సుహాసినికి రవితేజాతోనూ, సుకేశినికి నాగార్జునతోనూ వివాహాలు అబ్బాయిల తండ్రుల కోరిక మేరకు ఎక్కడో దూరంగా ఓ చిన్న దేవాలయంలో నిరాడంబరంగా జరిగిపోయాయి.
పెళ్ళిలో తెలిసిన సంగతేమిటంటే, నాగార్జున్ తండ్రి ‘ఎస్.ఎస్.ఏ.’ ఛైర్మన్ కం మానేజింగ్ డైరెక్టర్. అలాగే రవితేజ తండ్రి ‘ఎమ్.ఎస్.ఎస్.కి’డిట్టో. ఎం.డి.ల కొడుకులే వాళ్లవాళ్ల సంస్థల్లో పాకప్రవీణులుగా పనిచేస్తున్నప్పుడు, మామగార్లు ఎమ్.డి.లైనా తాము కష్టపడి పనిచేస్తేకాని పైకి రాలేమన్న సంగతి అక్కచెల్లెళ్లు గ్రహించారు. అయితే సుహాసిని సుకేశిని మామగారి సంస్థలోను, సుకెశిని సుహాసిని మామగారి సంస్థలోను ఒకే ఊరిలో పనిచేస్తున్నారని మీరు గ్రహించాలి. తమ భర్తలు పని చేస్తున్న స్వంతకంపెనీల్లోకి ఉద్యోగమార్పిడికోసం వారి మనసులు కువకువలాడినా నాగార్జున, రవితేజలుకాని, మామగార్లుకాని అంగీకరించలేదు. వారివారి కారణాలు వారికున్నాయి. అంతేకాక ‘కష్టసుఖాలు తెలుస్తాయి, వేరేగా ఉండండి!’ అని అనడంతో సుహాసినీ-రవితేజాలు, సుకేశినీ-నాగార్జునలు తమతమ తల్లిదండ్రులనుంచి వేరువేరు కుంపట్లు పెట్టేశారు. ఇంట్లో వంటెవరు చేస్తున్నారూ అంటే అతిథులుగా వెళ్ళి చూడండి మరి!