కథా భారతి
అనగనగా ఓ కథ / స్త్రీ హృదయం
- కోమలాదేవి
పేరంటానికి వెళ్తున్నట్లు సింగారించుకుని వెళ్ళారు స్త్రీలంతా. అంతర్జాతీయ స్త్రీ (సంక్షేవా) సంవత్సరం అంటూ పెద్ద సభ ఏర్పాటు చేశారు స్థానిక స్త్రీలు - పెద్దలు. పెద్ద పందిరి మైక్ లు - రికార్డులు వేయగానే చిన్నాపెద్దా జనం రావడానికి ప్రారంభించారు. అదే అదను అనుకుని పట్టుచీరలు కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని వచ్చారు. ఈ సభలవల్ల మనోవికాసం కలిగే మాట ఎంత? ఏమోకానీ ఆ తరువాత డాన్స్ ప్రోగ్రాం ఉంది. కనీసం గంట సేపు పైసా ఖర్చు లేకుండా చూడవచ్చు నన్న ఆశతో చాలామంది స్త్రీలు, పెద్దవాళ్ళు కూడా వచ్చారు.
సెక్రెటరీ విమల తృప్తిగా పందిరి నలుమూలలా చూచింది. స్త్రీలతో సందడిగా కనులపండువగా ఉంది.
అంతా పెద్దలు వేదికమిదకి వచ్చారు. పరిచయాలయ్యాయి. పూలమాలాలంకృతులను చేస్తుంటే ఉత్సాహంతో చప్పట్లు చరిచారు. ఆ తరువాత ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు. స్త్రీల హక్కులను గూర్చి మాట్లాడుతుంటే వింతగా ఉంది. ఆ హక్కులను ఏం చేసుకోవాలి? అన్న అనుమానం కూడా వచ్చింది సభాసదులకు. పురుషుడి కూలి, స్త్రీ కూలి సమానం అన్నప్పుడు నిజంగానే ఆనందించారు. భూస్వాములభార్యలు ముఖాలు చిన్నబోవడం ఎవరూ గమనించలేదు. "మీకు పిల్లలు చాలును అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవచ్చు భర్త అనుమతి అవసరం లేదు. మీ కుటుంబ పరిమితి ఎంత ఉండాలో స్త్రీ నిర్ణయిస్తుంది". .. ఉహు.. చాలామందికి ఈ హక్కు చాలా ఎబ్బెట్టుగా తోచింది."ప్రతి ఆడపిల్లకు చదువు చెప్పించాలి." .హూ..ఆడపిల్ల బడికి వెళ్తే ఇంట్లో చంటి పిల్లను ఎవరుచూస్తారు? కూలి చేసుకునే స్త్రీలు పెదవి విరిచారు. ఇది బాగులేదని...ఎలా గంటన్నరసేపు ఉపన్యాసకులు మాట్లాడారు.
ఆఖరుగా విమల మైక్ దగ్గరకొచ్చింది. క్లుప్తంగా ఎన్నో విషయాల్ని చర్చించి చివరకు అంది ప్రస్తుతం మన సంఘంలోని స్త్రీ ఎన్నో విధాలుగ అణగద్రొక్కబడుతోంది. ముఖ్యంగా అవివాహిత స్త్రీకి లేక అనివార్య కారణలవల్ల ఇల్లు విడిచిన స్త్రీకి ఎక్కడికి వెళ్ళినా అన్నీ అడ్డంకులే. ఈమను పెడదారి పట్టించి ఒక ఆట వస్తువుగా మార్చివేస్తుంది పురుషలోకం.
నిరాశ్రయులైన స్త్రీకి రక్షణలేక ఆమె జీవచ్ఛవంలా బ్రతుకుతూ దేహిఅంటు చివరికి అర్ధరూపాయకి కూడా అడుక్కోవాలసిన స్థితికి దిగజారిపోతుంది. అటువంటివారికి ఒక ఆశ్రయం కావాలి. అవివాహిత తల్లులకు - అలా పుట్టిన బిడ్డలకు ఒక గృహం నిర్మించాలి. ఒక శరణాలయం కావాలి. అందుకు మనమందరం సాయశక్తులా ప్రత్యత్నించి చందాలు ప్రోగుచేయాలి. ప్రజాసేవ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. వారి సహాయంతో ఈ హోంను మనం నడిపించాలి. ఇటువంటి శరణాలయం మన ఊళ్ళోలేదు. నిలువ నీడలేని వరికి అక్కడ ఆశ్రయం లభించాలి.. ఈ క్షణంలోనే మీరంతా నాకు ప్రమాణం చెయ్యాలి. ఈ సంవత్సరం తిరిగక ముందే ఒక హోంను కట్టాలి. అంతవరకు చిన్న అద్దె ఇంట్లో ఇలాంటివారికి ఆశ్రయమివ్వాలి. చిన్నవారైతే వారిని బడికి పంపే ఏర్పాటుచేస్తాము. పెద్దవారైతే వారికొక పని కల్పిస్తాము. ఇక్కడ కూర్చున్న డాక్టరుగారు, లాయరు గారు, మనకు తగిన సలహాలు ఇస్తారు. రేపటి నుంచి చందాలు ప్రోగుచేస్తాము. మనమంతా స్త్రీలం. మనల్ని ఒకరు ఉద్ధరించనవసరం లేదు. ముందు మనల్ని మనం ఉద్ధరించుకుందాము...
విమల మాటలు ఎందరు విన్నారో ఎందరు వినలేదోగాని పందిట్లో మాత్రం చిన్నరకం కలకలం బయలుదేరింది. బహుశ చందాల మాటకు విసుక్కుంటున్నారో లేక డాన్స్ ప్రోగ్రాంకు సంబంధించిన సరంజామాను చూచి సంబరపడుతున్నారో? చెప్పటం కష్టం. సభ విజయవంతంగా ముగిసింది.
డాన్సర్ మోహిని (అసలు పేరు మంగమ్మ అని గుసగుసలాడారు) అప్పుడే రెండు వేలు విరాళం ఇచ్చింది. ఆ సభ ముగిసేసరికి దాదాపు పదివేల రూపాయల విరాళం ప్రోగైంది.
పెద్ద ఫైల్ తో ఇంట్లోకి అడుగు పెట్టిన భార్యను చూసి చిరునవ్వుతో పలుకరించారు ప్రభు "మీ మీటింగ్ ఎలా జరిగింది? జుట్లు పట్టుకున్నారా?"
విమల గర్వంతో ఫైల్ అందించింది. "జుట్లు కాదు; నోట్లు పట్టుకున్నాను. చూడండి".. ధీమాగా వెళ్ళి సోఫాలో చేరబడి కళ్ళుమూసుకుంది.
... ఆ నిలయం మహా భవన రూపంలో ఆమె మనోనేత్రంలో కనబడింది....
ఎంతోమంది ఆశ్రయం కోరుతూ రేయింబవళ్ళు ఆ నిలయంలోకి వస్తున్నట్లు ఊహించుకుంటూ మురిసిపోతోంది. .. ఆమె పెదమలపై తారట్లాడుతోన్న మందహాసాన్ని చూస్తూ నవ్వుకున్నాడు ప్రభు.
"గుడ్.. చాలా సాధించారు. ఈ డబ్బు..ఆ ప్రోగయ్యే డబ్బు ఎవరి జేబులోకి? ఐమీన్ ఎవత్తి పర్స్ లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూడాలి. నెల నెలా దానికి ఆదాయం కావాలి. ప్రభుత్వం ఈ పని చెయ్యాలి. వెంటనే పని ప్రారంభించండి...ప్రభుత్వం నెల నెలా కొంత డబ్బు పంపితే ఆ తరువాత మిగతా ప్రోగ్రాం చూడవచ్చు.." అని గభాల్న ఆపుచేసి విమల ఎదురుగ కూర్చుని అన్నాదు. "ఔనూ ఒక పదిహేను రోజుల్లో కనీసం అద్దె ఇంట్లోనైనా ఏదైనా ఏర్పాటుచేయగలరా?"
"ఎందుకూ..? " అంది ఆశ్చర్యంతో
"ఇవ్వాళ మా హాస్పటల్ కి ఒక అమ్మాయి వచ్చింది. పాత కథే. ఇంకో వారానికి ప్రసవించచ్చు. ఆ తర్వాత ఆమెను ఎక్కడికి పంపాలో తెలియక మేమంతా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నామనుకో. మా ఆయాకు ఎవ్వరూలేరు. ఓ పదిరోజులు పెట్టుకోమంటె సరేనంది. ఆ తరువాత, చూస్తూ చూస్తూ బాలింతను, చంటిపిల్లను వీధి పాలు చేయగలమా? దేవుడిలా ఈ ప్లాన్ వేశారు. ఇకనేం, మీకు ఫస్ట్ ఇన్ మేట్స్ దొరికినట్లే. ఈ ఇద్దరితో మీ హోంకు ప్రారంభోత్సవం జరిపించండి.."
విమల కూడా చాలా ఎగ్జైట్ అయింది. అలాగేనంది. ఆ రాత్రి చాలాసేపు మనవ సేవయే మాధవసేవగా ఎంచుకున్న ఆ దంపతులు శరణాలయం ను గూర్చిన ముచ్చట్లతోనే కాలం గడిపారు.
కానీ వాస్తవంలోకి అడుగుపెట్టగానే అడుగడుగునా అవాంతరాలే వచ్చాయి. అసలు మొట్టమొదట అద్దెర్కు ఒక ఇల్లు లేదు గదా ఒక్క గది కూడా దొరకటం కష్టమై పోయింది. అది ఎందుకో తెలిసిన ప్రతి ఒక్కరు "టులెట్" బోర్డులు ఉన్నా ఎవరూ అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారని అబద్ధం ఆడారు. వాళ్ళు కోరి అద్దెకివ్వడంలేదని తెలిసికూడా ఏమి చేయలేకపోయారు. ధనవంతుల కాంపౌండ్ లో స్థలంకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. పక్షం రోజులు దాటినా ఒక్క అంగుళం కూడా ముందుకెళ్ళలేకపోయారు.
ఈ పక్షం రోజుల్లో వారి ప్లాన్స్ అన్నీ కాగితం మీద ఉండిపోయాయి. కాని ఆ అమ్మాయి కడుపులో పాప అలా స్థిరంగా ఉండిపోలేదు. చక్కటి ఆరోగ్యవంతుడైన బిడ్డను ప్రసవించింది. వారం రోజులు హాస్పటల్ లో ఉంది. అ తరువాత వరం రోజులు ఆయా ఇంట్లో ఉంది. మరికొన్ని రోజులు ఆమె ఇంట్లోనే ఉండేట్లు ఏర్పాటు చేయాలనుకున్నారు కానీ ఆయా ఇంటతను పేచీపెట్టాడు. అసలు కారణం తెలుసుకున్న ఆయా ముక్కు మీద వేలేసుకుంది. అమ్మాయిమీద జాలిపడింది కాని చేసేది లేక మరోచోటికి చేర్చాలని ప్రభుకి చెప్పింది. దాంతో సమస్య మొదలైంది. ఆలోచిస్తూ కూచున్నాడు. ఆ అమ్మాయికి భద్రతలేక హిస్టీరికల్ గా తయారవుతున్నదట. అనుక్షణం తన గతి ఏమవుతుందో అని తలచుకుని కుమిలిపోయి ఏడుస్తోందట పాపం. అన్నీ వింటూ ఏమిచేస్తే బావుంటుందో అలోచిస్తోంది విమల.
ప్రభుకు ఒక ఆలొచన రావడం తడవు సంతోషంతో అరిచాడు. "దీనికింత ఆలోచించాలా విమలా? నువ్వు సెక్రెటరీవి మన ఇంటికి తీసుకొని వస్తే ఏం? మేడమీద గది మనం వడము కదా? ఈ హోం పెట్టేదాకా పైన ఉంటుంది."
ఎంత ఉత్సాహంతో ఎంతో రిలీఫ్ ఫీలవుతూ చెప్పాడు గాని విమల మౌనం అతి భయంకరంగా తోచింది.
గ్రుడ్లప్పగించి "మీకు మతిగాని పోలేదుకదా?" అన్నట్లు చూస్తోంది. ఆమె పెదవులు కఠినంగా ఒంపు తిరిగాయి.
"అలా చూస్తావేం?"
"ఇంకెలా చూడాలి. శభాష్.!
భలే మార్గం చూపారు. అని మిమ్మల్ని మెచ్చుకోవాలా?"..ఎంతో ఏవగింపు అంది.
ప్రభు శిలా ప్ర తి మ యే అయిపోయాడు. అతని నోట మాటరాలేదు. .. "ఈమె...ఈమేనా...ఒకహోం కోసం శాయసక్తులా ప్రయత్నిస్తోంది. ఎండనక వననక విరాళాలు ప్రోగు చేస్తోంది. సహ స్త్రీని ఉద్దరించాలని కంకణం కట్టుకున్నది.. హే ప్రభూ స్త్రీకి స్త్రీయే శత్రువు. స్త్రీని ఉద్ధరించాలని ప్రధమంలో పూనుకున్న వారంతా పురుషులు కావటంలో ఆశ్చర్యం లేదు", అనుకున్నాడు.
"విమలా...ఆనాడు అంతసేపు ఇలాంటి స్త్రీని ఉద్ధరించాలని ఆమెకొక ఆశ్రయం కల్పించాలని ఉపన్యసించావు? ఈనాడు అటువంటి అవకాశం లభిస్తుంటే వెనక్కి పోతున్నావెందుకు? నువ్వూ అందరిలా పిరికిదానిఅవేకదూ? నిజంగా నీలో ఇంతటి మహోన్నత భావం కల్గలేదు. అది కేవలం పలుకుబడి కోసం నలుగురు ఎదుట గొప్ప ప్రజాసేవకురాలిగా. కనబడాలన్న కాంక్షతో చేసిన పని ఇది. సరే కానీయ్... ఏదో మార్గం దొరక్కపోదు. కాని నీ అసలు రంగు గుర్తించాను విమలా. చాల బాధగా ఉంది. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే నిన్ను ఏమేమొ అనగలను. " అతడు ఆమె ఎదుట ఉండలేను అన్నట్లు గబగబ జోళ్ళు తొడుక్కుని వెళ్ళిపోయాడు.
విమల విచారించలేదు. అతడు త్వరగానే తన అయిష్టతను గుర్తించి నందుకు ఆనందించింది. ఎవత్తెనో ఎవడికో కన్న బిడ్డతో వచ్చి తన ఇంట్లో ఉంటుందా? అలాంటివారు చెట్టు నీడలో ఉండి అడుక్కుతినాలే గాని తన ఇంట్లో - అందునా తన భర్తలాంటి వ్యక్తి ఎదుట మసలటమా? ప్రభుది మంచి రూపం , మంచి మనసు. స్నేహశీలి. అతది మనసు చలిస్తుందేమో? తన భయాలు తనవి. మంచిదే.. ఆమెను ఎక్కడో ఉంచనీ, అనుకుని తృప్తిపడింది.
ప్రభు పిచ్చిగా తిరిగాడు. ఆమెను ఎక్కడ ఉంచాలా అన్నది పెద్ద సమస్య కాదు. ఎక్కడో ఆశ్రయం దొరక్కపోదు. విమలలాంటి సంస్కారవంతురాలు - విద్యావతి - ప్రతిభాశాలి - స్నేహశీలి - కార్యదీక్ష గల వ్యక్తి ఎంతటి వెలితి భావాలు కలది. మసిపూసిన అంతరాన్ని ఈ రంగు రంగుల తెరలతో కప్పిపుచ్చుకుంది. తను ఎంత ఘనంగా ఫీలయ్యాడు.?
ఆమెను గూర్చి ఎంత గొప్పగా చెప్పుకున్నాడు.
ఛీ! ఆమెకూడా మాములు స్త్రీ. తనకు ఆమె ఏ విధంగాను సాయపడదు.
తిరిగి తిరిగి ఆయా ఇంటికి వెళ్ళాడు.
ఆయాను బైటికి పిల్చాడు. "నెల రోజులు సెలవు తీసుకుని ఇంట్లోనే ఉండిపో. ఆ అమ్మాయికి తోడుగా ఉండు. డబ్బు సంగతి చూస్తాను. అమ్మగారి హోం ఇంకా మొదట్లోనే ఉంది. ఇంటతను గొడవచేస్తే ఇల్లు మార్చెయ్యి."
జేబులో ఉన్న ఇరవై రూపాయల చివర ఆమె దోసిట్లో పోసి చటుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.
ఆయా అతడివేపు ఆరాధనతో చూస్తూ.. "ఇంత మంచి బాబుకు ఆ దేముడు ఒక్క నలుసు ఇచ్చాడు కాదు. ఈ పిల్లకు వద్దంటే ఇచ్చాడు" అనుకుంది.
ఎంతోసేపు బైట తిరిగి కూల్ డ్రింక్ త్రాగి మనసు స్థిమితపడిన తరువాత ఇల్లు చేరుకున్నాడు. స్నానం చేసి రాగానే అలవాటుగా ఇద్దరూ భోంచేశారు. ఎంత మామూలుగా ఉండాలన్నా ప్రభు అదృశ్య పగ్గం పట్టి లాగుతున్నట్లు మసిలాడు. ఆమె విషయం ఏం చేశారు అని అడగడానికి విమలకు ధైర్యం చాలలేదు.
సరిగ్గా నాలుగురోజులు గడిచాయి. అవిరామంగా మార్పులేని కార్యక్రమంతో ఆ నాలుగురోజులు గడిచాయి.
ఆ రోజు సాయంత్రం ఎంతో ఉత్సాహంతో ఇంటికొచ్చాదు. కానీ ఫలహారం చేసి జేబులోంచి ఓ కవర్ తీసి విమలకందించాడు. దస్తూరి చూసి పోల్చుకున్నది. అది ప్రభు ప్రాణ స్నేహితుడు రవి రాసినది. ఇద్దరినీ రాస్తాడు. ఆమె ఆత్రంగా తీసి చదవడం మొదలుపెట్టింది. . ఉభయకుశలాలనంతరం...
..ఈ సమయంలో ఒక విషాద వార్త మీకు చెప్పవలసి వస్తున్నందుకు విచారిస్తున్నాను. చెల్లి కుసుమకు ఈ మధ్య పెళ్ళి చేశాము. అంతా మూడు నాల్గురోజుల్లో జరిగిపోయింది. (తెలిసిన కుటుంబమే) . అందుకని మీకు శుభలేక పంపటానికే వ్యవధి లేకపోయింది. అతడు ఇక్కడే పోస్ట్ ఆఫీసులో పనిచేసేవాడు. మూడు నెలను గడిచిపోయిన తరువాత ఒకనాడు చాలా సీరియస్ అయింది. మెనంజైటిస్ తో మరణించాడు. కుసుమకు రెండవ నెల. చాల దుఃఖంలో ఉంది. ఈ ఊరు ఈ పరిసరాలు ఆమెను మరీ పిచ్చిదానిగా చేస్తున్నాయి. నాకు అన్నదమ్ములు అప్పచెల్లెండ్రు లేరు. ఎక్కడికైనా మార్పుకు పంపుదామంటే నకెవరూ లేరు. దూరపు బంధువులు ఇంతటి బాధ్యతను తీసుకోగలరా? మీరు జ్ఞాపకం వచ్చారు. కుసుమను తెచ్చి మీ దగ్గర విడిచివెళ్తే ఆమె బాధ్యత వహించగలరా? ప్రసవించేవరకు మీ దగ్గర ఉంటుంది. ఆ తరువాత బి.ఎ.లో చేర్పించి చదివిస్తాను...ఆమెకు మార్పు ఎంతైనా అవసరం మీ జవాబుకోసం ఆశతో నిరీక్షిస్తుంటాను..
"పాపం కుసుమకు అన్నీ అయిపోయాయి. వస్తుంటే పోస్టుమాన్ ఉత్తరాలిచ్చాడు. రవినించి ఉత్తరం చాలా రోజులకు వచ్చిందన్న సంతోషంతో ఉండగానే అది ఇలాంటిదని అనుకోలేఎదు. ప్చ్.. మన జవాబు అతడికి శరాఘాతంగా ఉంటుందేమో".. అన్నాడు బాధగా..
"ఎందుకు?" అంది ఆత్రంగా.
"మరి.. కుసుమ బాధ్యత నెత్తిమీద వేసుకుందామా?" "అయ్యో, మన మీది ఎన్ని ఆశలు నిలుచుకున్నారో.. స్నేహితులన్న తరువాత అలాంటి సమయాల్లోనే ఆదుకోవాలి. వెంటనే ఉత్తరం రాసేద్దాం. కుసుమను తెచ్చి వదిలిపెట్టి వెళ్ళమని. ఎంత ఆశతో ఎదురుచూస్తుంటారో పాపం".. విమల సానుభూతితో అంది.
అప్పటికప్పుడు ఇద్దరు కలిసి ఉత్తరం రాసేశారు. పోస్ట్ కూడా పంపారు.
వీరుండేది మదనపల్లిలో. రవి వాళ్ళుండేది విశాఖపట్నంలో. వారం రోజులు దాటిన తర్వాత ఒకనాటి ప్రాతఃకాలం రవి కుసుమ దిగారు. కుసుమను చూసి విమల ఆశ్చర్యపోయింది.
సన్నగా ఎండిన జాజిమొగ్గలా ఉంది కుసుమ. కాలేజికి వెళ్ళే అమ్మాయిలా ఉంది. నుదుట కనీకనిపించని చుక్క పెట్టింది. ఆమెను చూడగానే భర్తృహీన అనుకోరు.
మంచిదే. చిన్నపిల్ల పదిహేను పద్దెనిమిదేళ్ళుండవచ్చు అనుకుని తృప్తిపడింది.
రవి రెండురోజులు ఆగి మూడవనాడు ప్రయాణమయ్యాడు. అతి కష్టంతో చెల్లికి చెప్పాడు . ప్రభుకు చెప్పడానికి ఏముంది? రెండు చేతులు పట్టుకుని కన్నీరు నిండిన కళ్ళతో కృతజ్ఞతతో చూచాడు. విమలకు చెప్పి వెళ్ళిపోయాడు.
కుసుమ దాదాపు మౌనవ్రతం దాల్చినట్లే ఉండేది.
వేవిళ్ళతో బాధపడ్తుంటే విమల ఎంతో సేవ చేసింది. కాస్త సర్దుకుంటుంటే నోటికి రుచించే పదార్ధాలు చేసిపెట్టేది. వద్దన్నా చీకటిపడిన తరువాత షికారుకు తీసుకుని వెళ్ళేది. అప్పుడప్పుడు బలవంతంగా సినిమాకి తీసుకెళ్ళేది. అందరికీ మెల్లగా చెప్పేది "మావారి పెదతండ్రి కూతురు. పెళ్ళయిన మూణ్ణెళ్ళకే జబ్బుచేసి చనిపోయారు ఆయన, అందుకే తీసుకొచ్చాము" అందరు సానుభూతి చూపేవారు.
కుసుమ గది విడిచి బైటకొచ్చేది కాదు. వారి ఓదార్పు మాటలు వినాలన్న అభిలాష లేదు. దిగులుగా ముభావంగా కూర్చునేది. పెద్దవాళ్ళు కుసుమ వస్త్రధారణలో విముఖత చూపిస్తూ ఏదో అనేవారు. కాని విమల సర్దిచెప్పేది. "ఈ కాలంలో ఆ పాత దురాచారాల్ని మాన్పించాలండీ. రేపు బిడ్డపుట్టిన తర్వాత కాలేజికి వెళ్ళి చదువుకుంటుంది. ఆ తర్వాత ఉద్యోగం చేస్తుంది. ఎవరైనా పెళ్ళాడటానికిష్టపడితే పెళ్ళిచేస్తాము చట్టవిరుద్ధమూకాదు - ధర్మ విరుద్ధమూ కాదు. మనమంతా ఇటువంటివారికి జీవనోపాధిని కల్పించాలి. వీలైతే పెళ్ళిచేసి పంపాలి. పదిహేడేళ్ళ పిల్ల మూడు నెలలు కాపురం చేసిన ఫలితంగా జీవితాంతం విధవగా కాలం గడపడం న్యాయమేనా? ఇటువంటివారికి చేయూత నివ్వాలని ప్రతివారికి ఉంటుంది. కాని ఇంకొకరేమనుకుంటారో అనే భయంతో మనల్ని లొంగదీస్తుంది. అందరూ ఈ శరణాలయాన్ని స్థాపించాలని అంత ఆత్రపడ్తున్నది."
మూడు నెలలకు శరణాలయం బోర్డు తగిలించడానికి అనువైన ఇల్లు దొరికింది. మూడు గదుల ఇల్లు వెనుక నూతి పళ్ళెం ఉంది. నుయ్యి లేదుగాని అక్కడే బోరింగ్ పంపు ఉంది. ఒక పెద్ద వేపచెట్టు ఉంది. దానికి ప్రారంభోత్సవం జరిపించలేదు గాని ఫలానా చోటున శరణాలయం ఉందని కరపత్రాలు పంచిపెట్టారు. స్థానిక మండలి సభ్యులు, ఇతర ఆఫీసర్లు వచ్చి తనిఖీ చేసి వెళ్ళారు.
ఆ గృహంలో మొట్టమొదట అడుగు పెట్టింది ఆయా ఇంట్లో ఉన్న అమ్మాయి. ఆమె కొడుక్కు అప్పుడే నాలుగవ నెల. ఆయా హాయిగా ఇంటికి సంతోషంగా వెళ్ళింది. పోనీ తలదాచుకోడానికి ఆశ్రయం దొరికిందని ఆమె అమితంగా ఆనందించింది.
శరణాలయాన్ని స్థాపించిన మూడవ రోజున విమల కుసుమను వెంటబెట్టుకుని అక్కడికెళ్ళింది. అప్పటికి ఇంకా ఆ అమ్మాయ్ ఇ వనజ బిడ్డమత్రమే ఉన్నారు.
వనజ చేతి మెషీన్ ముందర కూర్చుని బ్లౌజు కుడ్తోమ్ది. వనజ - కుసుమ దాదాపు సమవయస్కుల్లా కనిపించారు. కుసుమ చిన్నవాదిని ఎత్తుకుని ముద్దులాడింది.
మెల్లగా వనజ కుసుమను మాటల్లోకి దింపింది. ఇల్లాంటి ఆశ్రయం దొరుకుతుందని కల్లోకూడా అనుకోలేదు. నాది పత కథ. నమ్మి మోసపోయాను. ప్రేమకు వివాహానికి మధ్యలో పెద్ద అఘాతం ఉందని అప్పుడు నాకు తెలీదు. ప్రేమ అనేది మందబుద్ధి కలిగించింది. పరిశీలనగా చూసే శక్తి నశించింది. అనుకున్నదంతా జరుగుతుందని నమ్మాను. నిజమైన ప్రెమ చిరకాలం నిలుస్తుందనుకున్నాను. కని ఇద్దరం చిన్నవాళ్ళమే. అతడు నాలా స్టూడెంటే. అతడు నన్ను పోషిస్తాడని ఎలా అనుకున్నాను? ఏమో, ఆ రోజుల్ని పునరావృతం చేసుకుంటే సిగ్గుకూడా. అటు ఇటు ఎవ్వరికి అంతగా డబ్బులేదు. యౌవనపు పొంగులో ఇవన్నీ అట్టడుగున పడిపోయాయి. కనీసం గుళ్ళీ పెళ్ళన్నా చేసుకోలేదు. పెళ్ళికేం తొందర అనుకున్నాను. అతడు నావాడైనప్పుడు అతడికి మనస్ఫూర్తిగా అర్పించుకున్నప్పుడు వేరే అనుమానాలెందుకు వస్తాయి. ఇద్దరం లేచిపోయాము. సరిగా పదిరోజుల్లో తేలిపోయింది. ఒక్కత్తిని మిగిలిపోయాను. ఇంటికెళ్ళాను. వెళ్ళగొట్టినంత పనిచేశారు. ఆ తరువాత మా పెద్దక్కయ్య తన వెంట తీసుకెళ్ళింది. మా బావగారు రోగిష్థి. అక్క పనిచేస్తుంది ఇంటి పనిలో సహాయంగా ఉంచుకుంటానంది. ఆ నెలలోనే తేలిపోయింది నేను ఒంటరి మనిషినికానని. మూడు నెలలు కడుపులో దాచుకుని నన్ను చూచుకుంది ఆ తరువాత ఎక్కడికి పంపాలో తోచలేదు. చివరికి హైద్రాబాద్ లో శరణాలయం ఉందని అక్కడికి తీసుకెళ్ళి విడిచి వచ్చింది. ఒక నెల రోజుల్లో నేను ఎటువంటి విషవలయంలో చిక్కుకున్నానో తెలిసింది ఆ గృహాలు పైకి శరణాలయాలు లోలోపల అవి వ్యభిచార గృహాలు. ఆ సంగతి తెలిసిన వెంటనే అదను చూసి బైటపడ్డాను. ఎక్కడికి వెళ్లను.? మెల్లగా ఒక ప్రైవేట్ హాస్పటల్ కి వెళ్ళాను. ఆ డాక్టరు డబ్బిచ్చి మీ అన్నగారి దగ్గరకు పంపాడు. హాస్పిటల్ లో ఆ పనీ ఈ పనీ చేసేదాన్ని. తిండి బట్టకు లోటు లేకపోయింది. నెలలు నిండుతుంటే నాకు ఆ తరువాత అశ్రయం ఎక్కడ దొరుకుతుంది? అని వచరించని క్షణం లేదు. ఆ భగవంతుడే నాకీ మార్గం చూపాడు. ఏదో విధంగా నా పొట్ట నేను పోషించుకోవాలి. వీడితో తిరిగి వెళ్ళ లేను. వీడిని విడిచి వెళ్లలేను. అందుకే ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను.
కుసుమ అంతా విన్నది. వనజ చెబుతుంటే ఉద్రిక్తయై ఏడ్చింది కూడా. సానుభూతి మాటలు నాలుగు చెప్పి అంది.
" అసలు ఇలాంటి గృహాలకు కాలేజి విద్యార్ధినులను విజిట్ కు తీసుకెళ్ళాలి. చిన్న వయసులో అందర్నీ పోగొట్టుకుని నిరాధారులై పడరాని పాట్లు పడుతున్న ఇలంటి అమ్మాయిలను వాళ్ళు చూడాలి. వారు నిజం గుర్తించాలి. వివాహత్పూర్వ ప్రేమ పనికిరాదని వారు తెలుసుకుంటారు. తండ్రి పేరు పెట్టుకోడానికి అర్హతలేని పసివారి ముఖాలను చూచి వారి హృదయాలు చలించాలి. అటువంటి పొరపాటు తాము చేయకూడదని తెలిసికొంటారు. నేను మీ లాంటి పొరపాటు చేయబోయాను కని వెంటనే పెళ్ళిచేసారు. కాని ఇప్పుడేం జరిగింది.." కుసుమ కంట నీరు పెట్టింది.
వద్దు..మీరు ఏడవకూడదు.. మీరు చిన్నవారు. మీ భవిష్యత్తు మాలా అందకార బంధురం కాదు. మీ పాపకు, మీకు ఎక్కడికెళ్ళినా తెరచిన తలుపులే ఎదురౌతాయి.
కుసుమ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది.
వనజ "పాపం " అనుకుని తన కుట్టులో నిమగ్నమైపోయింది. మరో నెలరోజులు గడిచిపోయిన తరువాత మరో నలుగురు స్త్రీలు జేరారు. అందరివీ కన్నీటి గాధలే.
కానీ అక్కడ వారు తమ పాత జీవితాన్ని మరిచిపోయినట్లే నటిస్తూ యాంత్రికంగా తమ పనులు చేసుకుపోతున్నారు. స్త్రీకి భద్రత అంటూ ఉంటే కనీస జీవితావసరాలు తీరితే ఆమెకి సెక్స్ జీవితం అవసరం లేదు. స్త్రీకి సెక్స్ ఆరవస్థానంలో ఉంటుంది. ఎవ్వరో కాని కోరి వ్యభిచరించి ఆనందించరు.
విమలకు చేతినిండుగా పనిఉంది. ప్రభు ఆమెకు ఏ విధమైన సలహాలూ ఇవ్వడు. శరణాలయం విషయాలే పట్టించుకోడు. అనారోగ్యంతో ఉన్నవారికి, డాక్టర్ కాబట్టి మందులిచ్చేవాదు.
ఒకనాక ప్రాతఃకాల సమయంలో కుసుమ ఆడపిల్లను ప్రసవించింది. పాప ఆరోగ్యంగా ఉంది. ఆ తరువాత నెల రోజులు గడవక ముందే రవి వచ్చి తీసుకెళ్ళిపోయాదు. కాలేజీలో జేర్పించాలని లేటవుతే కష్టమని చెప్పాడు.
కుసుమ విమలకు కృతజ్ఞతతో నమస్కరించి సెలవు తీసుకుంది. ప్రభు ఎదుట నుంచుని భోరున ఏడ్చింది.
ప్రభు చెమ్మగిల్లిన కళ్ళను వత్తుకుంటూ ధైర్యం చెప్పాడు. అప్పుడప్పుడు కుసుమనుంచి ఉత్తరాలొచ్చేవి. చదువు బాగా సాగుతున్నట్లు. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో చదువుతోంది. పాపను వాళ్ళ నానమ్మగారింట్లో ఒదిలినట్లు రాసింది.
రాను రాను ఆ ఉత్తరాల సంఖ్య తగ్గిపోయింది.
ఒకనాడు బి.ఏ. పాసయినట్లు రాసింది.
ఆ తరువాత ఎం.ఏ లో జేరినట్లు రాసింది.
మరి ఉత్తరాలు లేవు. రవిద్వారా అప్పుడప్పుడు ఆమె క్షేమ సమాచారాలు తెలిసేవి.
విమలకు బాధ్యతలు ఎక్కువయ్యాయి.
వనజకు మరిద్దరిని తోడిచ్చి టైలరింగ్ షాప్ ఆశ్రమంలోనే పెట్టించారు. విరక్తితో ఆ శరణాలయానికి వచ్చిన వారిని మామూలు మనుషులుగా చేయడానికి అక్కడివారు విమల ఇతర సహాయకులు ఎంతో పాటుపడవలసి వచ్చేది.
అనుకున్నట్లు నాలుగేళ్ళలో పది గదులు కల "హోం" కట్టించగల్గారు. అక్కడికి వచ్చే స్త్రీ ఎవరి తాలూకో కనిపెట్టడానికి కొన్నిసార్లు పోలీసు సహాయం తీసుకోవలసి వచ్చేది భర్థ హాస్పిటల్ లో ఉన్నంత సేపు విమల "హోం " లో గడిపేది.
ఆ శరణాలయ ప్రారంభోత్సవం నాడు ఏదో కేసుందని చాలా సీరియస్ కేసని ప్రభు ప్రక్క ఊరికి వెళ్ళిపోయాడు.
దాని అంతరార్ధం ఒక్క విమలకే తెలుసును. ఆమె హృదయం గాయపడింది.
కుసుమ ఎలా ఉన్నదో? అని ఏడాది కొకమాటు అనుకోడానికి కూడా వీల్లేనంతగా పని విమలకుండేది.
కాలగతిలో తొమ్మిది సంవత్సరాలు దొర్లిపోయాయి.
ఆ రోజు ఇంటికొచ్చిన ప్రభు ముఖం ఆనందంతో నిండి ఉంది. రాగానే ఒక శుభలేఖ బల్లమీద వేశాడు.
"చూడు విమలా.. ఎవరిదో.. "
ఆత్రంగా విప్పింది..
చి.సౌ.కుసుమకు
చి.విజయానంద్ కు..
"మన కుసుమ పెళ్ళండీ.. "ఆనందంతో అంది.
"ఔను. అతడు చాల మంచివాడట."
అని లోపలికెళ్ళిపోయాడు.
"మంచివాడు కాబట్టే విధవను పెళ్లాడుతున్నాడు. "
"అందుక్కాదు మంచివాడనటం " అని విమలకు ఒక కవరు అందించాడు.
అది చాత పాతగా పసుపువన్నె దాల్చిన కవరు భర్త ఇచ్చినదాన్ని అందుకుని సంశయంతో చూచింది. ‘చదువు’ అని కుర్చీలో కూర్చుని కాఫీ కప్ అందుకున్నాడు
అది కార్బన్ కాపీ ఉత్తరం. ప్రభు రవికి రసిన లేఖ. పది సంవత్సరాల క్రితం తేది వేసి ఉంది.
విమల ఆత్రంగా చదివింది.
"
రవీ,
కుసుమను గూర్చి నువ్వు రాసిన వివరాలు చదివి చాలా విచారించా. స్నేహితుడిగా నీకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను. కని..కుసుమ కాలుజారి గర్భవతి..అయిందన్న విషయం తెలిస్తే గుమ్మం ఎక్కనివ్వదు. అందుకని మూడు నెలల క్రితం వివాహమైందని భర్త పోయాడని ఒక ఉత్తరం రాయి. నీ తెలివినంతా ఉపయోగించి అనుమానానిని ఆస్కారం లేనటువంటి లేఖ రాయి. కుసుమకు కూడా ఈ విషయం చెప్పి మౌనంగా ఉండమను. కుసుమ ప్రసవించిన తర్వాత బిడ్డను ఎవరికైనా పెంపకానికివ్వడమో - లేదా అనాధ శరణాలయానికివ్వడమో ఆ విషయం నేను చూసుకుంటాను. ఈ సమయంలో మనం తెలివిగ ప్రవర్తిస్తే కుసుమ భావి జీవితం సుఖప్రదమౌతుంది.
బెస్ట్ ఆఫ్ లక్
ప్రభు."
విమల చాలా సేపు మౌనందాల్చింది. ఆ తరువాత అంది "పాప ఎక్కడుంది? ప్రభు ఆశ్చర్యంతో చూచాడు." మన పాపగా హైద్రాబాద్ లో నా ఫ్రెండ్ ఇంట్లో పెరుగుతోంది అన్నాడు.
"రేపే వెళ్ళి తెచ్చుకుందాము!" జవాబుగా ఆమెను కౌగిట్లోకి తీసుకుని ఆమె కళ్ళను తుడుస్తూ రేపే వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు ప్రభు.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)