ధారావాహికలు

సుందరకాండ

దుర్భర విషాదంలో సీత

- డా.అక్కిరాజు రమాపతిరావు

(గత సంచిక తరువాయి...)

అప్పుడు సీతాదేవి జరిగిన యావద్ వృత్తాంతం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నది. తాను జీవించి ఉండలేననుకొన్నది. జీవించి ఉండటం కంటే ఏదోవిధంగా మరణించడమే మంచిదని దు:ఖించింది. ‘నా సౌశీల్యమూ, పాతివ్రత్యమూ ఫలం లేకుండా పోయినాయే’ అని విలపించింది. వేదనలో కూరుకుని పోయింది. కృతఘ్నుడికి చేసిన ఉపకారంలాగా అవి నిష్ఫలమై పోయినాయే అని నిర్వేదం చెందింది.

’ప్రభూ! మీకు సమస్త శుభాలు, సుఖాలు కలగాలి. నేను ఎలాగూ జీవించను. మీరు అయోధ్యకు తిరిగిపోయిన తర్వాత మళ్ళీ సుఖంగా ఉండాలి’ అని రాముణ్ణి తలచుకొని ఆకాంక్షించింది సీతాదేవి. నేను బలవన్మరణం పొందాలంటే ఇక్కడ నాకు విషం కాని ఆయుధం కానీ లభించవు కదా అని గుండెపగిలేట్లుగా రోదించింది సీతాదేవి. ఆమె భయంతో వణికిపోయింది. అశోకవృక్షాన్ని సమీపించింది. తన జడతో ఉరివేసుకొని త్వరగా తనువు చాలించాలని నిశ్చయించుకొంది. ఇంతలో ఆమెకు శుభశకునాలు ఎదురైనాయి.

శుభ శకునాలు
ఆమె ఎడమ భుజమూ, ఎడమ కన్నూ అదిరాయి. ఇదివరలో ఇటువంటి శుభనిమిత్తాలు కన్పించినప్పుడు ఆమెకు సంతోషవార్తలు తెలియడం జరిగింది. అందువల్ల ఇప్పుడామెకు ఊరట కలిగింది. ధైర్యం వచ్చింది. అశోకవృక్షం మీద ఉన్న హనుమంతుడు సీతాదేవికి తనను తెలియజేసుకోవడం ఎట్లా? అని ఆలోచించాడు. ఇప్పటివరకు ఆమెను అన్వేషించడానికి తాను చేసిన అన్ని ప్రయత్నాలు ఆయన సమీక్షించుకున్నాడు. ఈమెతో మాట్లాడి, ఓదార్చకుండా వెళ్ళి సుగ్రీవుడికీ, సీతాదేవిడికీ సీతమ్మను చూచాననే వార్త తెలపడంలో ఔచిత్యం లేదనుకున్నాడు. ముందే ఈ రాక్షసులతో తలపడటం, లంకను ధ్వంసం చేయటం కూడా మంచిది కాదనుకున్నాడు. ఏమో ఎవరు చెప్పగలరు! ఈ రాక్షసులు తనను బంధిస్తే మొదటికే మోసం వస్తుందనుకున్నాడు. అందువల్ల అశోకవృక్షం గుబురు కొమ్మల మధ్య కూచుని శ్రీరాముడి వృత్తాంతం సంక్షిప్తంగా గానం చేశాడు ఆమె ఆలకించేట్లు.

హనుమ గానం చేసిన మధురాక్షర రామకథ

"గజాశ్వరథ సమూహాలతో చతురంగ సేనాసమూహం కల దశరథ మహారాజు అనే కీర్తిశాలి ఉండేవాడు. (రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్) ఆయన ఇక్ష్వాకుల వంశానికే వన్నె తెచ్చినవాడు. ఋజువర్తనుడు. సత్య సంధుడు. పుణ్యశీలి. ఆయన ప్రియపుత్రుడు శ్రీరామచంద్రుడు. ధర్మబద్ధుడైన తండ్రికోసం భార్య సీతాదేవితో, తమ్ముడు లక్ష్మణుడితో అరణ్యవాసానికి వెళ్ళాడు. అక్కడ శ్రీరాముడు ఎందరినో రక్కసుల్ని సంహరించాడు. దీనితో కోపించిన రావణాసురుడు శ్రీరామపత్నిని దండకావనం నుంచి అపహరించాడు. ఆమెను అన్వేషిస్తూ శ్రీరామచంద్రుడు సుగ్రీవుడనే వానరరాజు మైత్రిని సంపాదించాడు. సుగ్రీవుడికి జరిగిన అన్యాయాన్ని చక్కబెట్టడానికి, శ్రీరాముడు సుగ్రీవుడి అన్న వాలిని సంహరించాడు. సీతాదేవి అన్వేషణం కోసం సుగ్రీవుడు వానరులను నాలుగు దిక్కులా పంపాడు.

సంపాతి తెలిపిన జాడను బట్టి నేను నూరు యోజనాల సముద్రం దాటి లంకలోప్రవేశించాను. రాముడు చెప్పిన శుభలక్షణాలతో ఉన్న సీతాదేవిని నేను ఈ అశోకవనంలో కనుక్కోగలిగాను" అని సంగ్రహంగా అప్పటిదాకా జరిగిన సంఘటనలను చెప్పాడు. సీతాదేవి ప్రహర్షంతో ఈ మాటలు ఎక్కడ నుంచి వినపడుతున్నాయా? అని నాలుగు దిక్కులూ ఉత్కంఠతో చూసింది. అప్పుడిక చెట్టుపైకి దృష్టి సారించింది. అక్కడామెకు తూర్పు కొండపై అప్పుడే ఉదయిస్తున్న లేతసూర్యుడి వలె దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న వదనంతో హనుమంతుడు కన్పించాడు. ఆయనవైపే ఆమె గుచ్చి గుచ్చి చూడసాగింది. భయంతో వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

భీతిల్లిన సీతమ్మ

తరువాత కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. అమ్మయ్యో! ఎంత భీతి గొల్పుతున్నాడు. కలలో కోతి కనిపించడం మంచిది కాదని, అది అపశకునమని అనుకోగానే ఆమెకు మళ్ళీ స్పృహతప్పినట్లయింది. రామా!, లక్ష్మణా! అని దీనంగా విలపించింది. ఇది దుస్వప్నమా! అనుకొంది. అలా అయితే ఇది అరిష్టమే అని విలవిలలాడింది. నేను నిద్రపోతే కదా కల అనుకోవడానికి అని దిటవు తెచ్చుకుంది. స్పష్టాతిస్పష్టంగా ఈ వానరుడు నాకు కనపడుతున్నాడే అని తర్కించుకొన్నది. శుభం కలగాలి అని దేవతలకు మొక్కుకుంది. ఈ వానరుడు రాముడి దూతే అయి ఉండవచ్చు అని ఊరట తెచ్చుకుంది. అప్పుడు హనుమంతుడు నెమ్మదిగా చెట్టు దిగాడు. ఆమెకు కొంచెం దూరంగా నిలబడ్డాడు. శిరస్సు వంచి ఆమెకు నమస్కరించాడు "నీవు ఎవరమ్మా నిరాశతో, దీనురాలివై ఈ చెట్టుకింద నిల్చున్నావు?" అని ఆమెను అడిగాడు. "నీవు దేవలోకపు వనితలాగా కనపడుతున్నావు. ఇక్కడెందుకున్నావు?" అని ఆమెను అడిగాడు. "రావణుడు దండకారణ్యం నుంచి దొంగిలించి తెచ్చిన సీతాదేవివి కావుకదా! అదే నిజమైతే నాకు శుభమే శుభం. అంతకంటె నాకు గాని, వానర రాజైన సుగ్రీవుడికి కాని, సకల కళ్యాణ గుణధాముడైన శ్రీరాముడికి కాని కావల్సింది మరేముంది?" అని పులకిత గాత్రుడైనాడు హనుమంతుడు. శ్రీరాముడి ప్రసక్తి విని సీతమ్మ కూడా ఎంతో సంతోషించింది.

సీత చెప్పిన తన వృత్తాంతం

"నేను దశరథ మహారాజు కోడలిని. విదేహ ప్రభువు జనకరాజు తనయను. నా పేరు సీత. నేను రాముడి భార్యను. అంత:పురంలో చిరకాలం సకల సౌఖ్యాలతో ఉన్నాను. దశరథ మహారాజు శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేసే ప్రయత్నాలలో ఉండటంతో, మహారాజు చిన్న భార్య కైకేయికి ఆ నిర్ణయం నచ్చలేదు. అందువల్ల ఆమె కోరికకు కట్టుబడి నేను శ్రీరాముడితో అరణ్యవాసానికి వచ్చాను. నా మరిది లక్ష్మణుడు కూడా మాతో వచ్చాడు. మేము దండకారణ్యంలో ఉండగా దుష్టరాక్షసుడు రావణుడు దుర్మార్గంగా నన్ను అపహరించి ఇక్కడకు తీసుకుని వచ్చాడు. ఈ క్రూరుడు నాకు ఇంకా రెండు మాసాలు గడువు పెట్టాడు. ఈలోపల రామప్రభువు నన్ను రక్షించకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను." అని సీతాదేవి చెప్పింది.

అప్పుడామెను హనుమంతుడు ఓదార్చాడు. ఇట్లా అన్నాడు - "అమ్మా! నేను శ్రీరాముడి దూతను. ఆయన నీ క్షేమం తెలుసుకొని రమ్మన్నాడమ్మా తల్లీ! లక్ష్మణుడు నీకు సాగిలి మొక్కుతున్నట్లు చెప్పమన్నాడు." ఈ మాటలు వినగానే ఆమె ముఖం కళకళలాడింది. ఆమె హర్షంతో ఇట్లా అనుకుంది.

"పెద్దలు చెప్పేమాట నిజమే. నూరేళ్ళు బతకాలే గాని మంచిరోజులు తప్పక వస్తాయి అంటారు కదా!"

కల్యాణీ బత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే,
ఏతి జీవంత మానందో నరం వర్షశతాదపి.

(సుందర 34.6)

ముమ్మాటికీ ఈ లోకోక్తి యథార్థం అని అనుకున్నది. అప్పుడు ఆమెలో ఉల్లాసం కలిగింది. అప్పుడామె ఈ వానరుడు రాముడి దూతే అయి ఉంటాడనుకున్నది. ఈ విశ్వాసం గమనించిన హనుమంతుడు ఆమెను ఇంకాస్త సమీపించటానికి ముందుకు కదిలాడు. అప్పు డామెకు చాలా భయం కలిగింది. మారువేషంతో ఇట్లా వచ్చాడా! అని భీతి చెందింది. ఈ ఆలోచన రాగానే ఆమె నేలమీద కూలబడిపోయి శోకార్త అయింది.

 

(సశేషం)

 



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)