ధారావాహికలు

రామ నామ రుచి

- ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం

 

(గత సంచిక తరువాయి)

ఆ.వె. పసుపు పచ్చ రంగు పట్టు బట్టయె కాని
సీతకున్న చీర చెంగుచినిగె,
హనుమ నడ్డి క్రింది అంతరీయము చూడ
అచ్చటచట చివికి మచ్చల్లయ్యె.

ఆ.వె. రామ లక్ష్మణులకు రతనాల మకుటాలు,
గళములందు పసిడి పలకసరులు,
పొలుపుగా నడుమున విలువైన మొలనూళ్ళు
ఒక్కటైన లేదు లెక్కకైన.

తే.గీ. జానకీదేవి మెడలోన స్వర్ణ రచిత
హారములు గాని, సప్తకి, అంగదములు,
అంగుళులు గాని, ఇవియవి అనగ నేల
కానబడదయ్యె ఒక్క బంగారు నగయు.

ఆ.వె. అంజనాకుమారు హస్త మందుండెడు
కంచు గదయు కానిపించదయ్యె,
ఉత్సవంబులందు ఊరేగుచుండెడు
మహితవిగ్రహాలు మాయమయ్యె.

కం. దయనీయమైన స్థితిలో
మయిదొడవులు దక్కిన ప్రతిమల కనలేమిన్,
రయమున గర్భగుడి వదలి
వయస్యుని గొ వెలికి వెస వచ్చితి నార్తిన్.

కం. ఈ రాయిడికిన్ కారణ
మారయగా నన్నుజూచి అలతను మిత్రుం
డారాట మడప తెలిపె వి
చారమును తను దిగమ్రింగి జరిగిన దెల్లన్.

శా. "జామీందారు దివంగతుండగుట, దుశ్చారిత్రుడౌ ఆత్మజుం
డా మీదన్ గుడినున్న సొమ్ములు, హిరణ్యాలంకృతుల్, వస్తువుల్,
సామూలంబుగ ఉత్సవగ్రహములున్, సామాగ్రితో సర్వమున్
మోమోటంబును లేక లాగికొనియెన్ పూజారి నీండ్రించుచున్.

కం. నీవట చూచియె యుందువు,
ఠీవిగ రాముని ఘన భృకుటిన్ గల నామం
బే విధియోగంబు వలన
నో వదలిరి పెఱక జాలకుండిన బంటుల్.

కం. ఆ పై దేవుని పొలముల
నా పాపోపేతు డమ్మె - అయ్యవి యెల్లన్
"మా పూర్వికుల వ" టంచును -
వాపుచ్చక యుండ నూరి వారలు భీతిన్.

కం. వ్యాజముతో వా డంతట
పూజారికి వేతనంబు పూర్తిగ నాపెన్,
పూజల కయ్యెడు ఖర్చు స
మాజపు బాధ్యత యగునని మానె నొసంగన్.

ఉ. క్రూరుడు జీతమిచ్చుటను కుత్సిత బుద్ధిని మానినంత పూ
జారికి తిండిలేక తన జాయము తానును పస్తులుండియున్,
వారలు మానరైరి భగవానుని పూజలు నిత్యసేవలున్ -
పౌరుల నెన్నడైన నొక పైసను వేడరు పుణ్యదంపతుల్.

తే.గీ. కొంద రూరి ఖామందులు కొన్ని యేండ్లు
అర్చకస్వామి సంసార మాదుకొనిరి,
చెఱువు పూడుట చేతను కఱవువలన
నడగి వారిశక్తి కృశించు నంతవరకు.

తే.గీ. భక్తు లెవరైన గుడిచూడ వచ్చిరేని
చేతనైనంత సాయంబు సేయువారు;
అట్లు వచ్చిన సొమ్ముతో నర్చకునకు
మూడుపూటల కొకసారి కూడు కలిగె.

తే.గీ. తులసి వనమున పూల మొక్కలను పెంచి,
కష్టపడి కూరగాయలు కాయజేసి,
గుడినిగల చెట్ల పండ్లను కోసి, వాటి
నమ్మి తినుచుండె భార్యతో నర్చకుండు.

కం. ఆ విధి క్రుంగి కృశించుచు,
దేవునిపై భారముంచి దీనత వారల్,
జీవితమును సాగించిరి
భావి తలంచకను భక్తి పరిపాకముతో.

 

4. పూజారికి సిరి

ఉ. అంతయు మాఱె నీ నడుమ - అర్చకు డించుకయంత తేర్కొనెన్,
కొంతకు కొంత భోగ మొనగూడెను, తిండికి కట్టుబట్టకున్
వంతలు దీరె, మంచిగ నివాసములో సమకూడె వస్తువుల్ -
సంతసమంది వారు సుఖ శాంతులతో కనిపించి రెప్పుడున్.

తే.గీ. వేళమించగ నీక దేవాలయాన
నిత్య దీపాలు వెలిగించి ప్రత్యహమ్ము
భక్తి సేవలు జరిపి విధ్యుక్తముగను
ఆరగింపుల చేయించు నర్చకుండు.

తే.గీ. గుడికి వచ్చెడు భక్తులకు పులిహోర,
స్వాదు శర్కరాన్నముల ప్రసాదములుగ,
కోర్కిదీర సీతమ్మ కుంకుమము, పసుపు
పుష్కలంబుగ నిచ్చును పూజ చేసి.

మ. కలయో మాయయొ లేక తంత్రబలమో కాకున్న నే రీతి నీ
కలికాలంబున నున్నపాటుగను భాగ్యంబబ్బు? ఏవేని లం
కెలబిందెల్ కనిపెంచెనో, ఇతర మింకే కారణం బిందులో
కలదో! ఆ పెరుమాళ్ళకే యెఱుక ఈ కారుణ్య మెవ్వానిదో!

కం. కారణ మేమీ సిరికని
ఆరయ మారాడకుండి ఆలున్ దానున్
నోరెత్తక స్మరియింతురు
శ్రీరాముని నామము తమ జిహ్వల పైనన్.

కం. ఎక్కడిదో సొమ్మని మే
మెక్కున తర్కించలేదు; ఎవరో దాతల్
మక్కువ నిడుచున్నారని
మ్రొక్కితి మా ఈవికాండ్ర మోదముతోడన్.

తే.గీ. కొన్ని మాసాల కొకసారి గుట్టుగాను
ఆలయపు బాధ్యత నతివ కప్పగించి,
ఎవ్వరును గాని తన జాడ నెఱుగకుండ
పట్టణమునకు పోవును వైష్ణవుండు.

తే.గీ. రెండు దినముల లోనను దండిగాను
గుడికి నింటికి తగినట్లు కూడు గుడ్డ,
వలయు సంభారముల నన్ని కలయబరచి
సంచి కెక్కించి తెచ్చును సంజకడను."

తే.గీ. అనుచు చెలికాడు చెప్పుచున్నపుడు వచ్చె
అగరువత్తులు కర్పూర మరటిపండ్లు,
పూలతో సజ్జ చేపట్టి పొందికగను,
అర్చ నొనరింప మా పేర నర్చకుండు.

తే.గీ. పూజలో నేను శీలనా స్ఫూర్తి తోడ,
రామచంద్రుని శ్యామల ప్రతిమ ముఖము
చూడ యత్నించియు మసక నీడ వలన
జాగరుకత పరికింప జాలనైతి.

 

 

(సశేషం)



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)