కబుర్లు
సత్యమేవ జయతే
భయం!
- సత్యం మందపాటి
Bill Murry, Richard Dryfuss నటించిన “Want about Bob” అనే హాలీవుడ్ సినిమా, ఎన్నో ఏళ్ళ క్రితం చూసినా, నాకు బాగా గుర్తుండిపోయిన సినిమా. దాన్నే తమిళ్ సినిమాగా తీసి, తెలుగులోకి “తెనాలి” అనే పేరుతో డబ్బింగ్ చేశారు. చాల హాస్యంగా తీసినా, ఎంతో బాగా తీసిన సినిమా. మద్రాసులో డబ్బింగ్ చేసిన సినిమా కనుక, చక్కటి తెలుగు వినిపించిన తెలుగు సినిమా. ఆ సినిమాలో ముఖ్యమైన విషయం ‘భయం’!
తెనాలి అనే అతనికి ఏది చూసినా, ఏది చూడకపోయినా, ఏది చేసినా, ఏది చేయకపోయినా, ఏది విన్నా, ఏది వినకపోయినా భయమే! భయంతోనే, భయంలోనే, భయం వల్లే జీవిస్తాడు. ఎందుకంటే అతనికి చచ్చిపోవటానికి కూడా భయం కనుక! భయం అంటేనే భయం కనుక!
భయం! భయం!! భయం!!!
అసలు భయం అంటే ఏమిటి? ఎందుకు ఈ భయం? ఈ భయాల వల్ల నష్టాలా? లాభాలా? ఎవరికి?
ఇక్కడ వ్రాస్తున్న ఉదాహరణలన్నీ మనం సహజంగా మన ఎదురుగా వున్న కొందరిలోనూ, కొన్ని మనలోనే, ప్రతిరోజూ ప్రతి నిమిషం చూస్తున్నవే!
తన చాలీచాలని జీతంతో పిల్లలకి తిండీ, బట్టా, చదువూ ఇవ్వలేనేమోనని తండ్రికి భయం. మగ పిల్లాడిని కాకుండా ఆడపిల్లని కంటే, అత్తమామలు, మొగుడూ విరుచుకుపడతారేమోనని నిండు చూలాలికి భయం. పిల్లాడికి పరీక్ష పాసవుతానో, లేనోనని భయం. డిగ్రీ తెచ్చుకున్న వాళ్లకి, అనుకున్న ఉద్యోగం వస్తుందా, రాదా అని భయం. గవర్నమెంట్ ఆఫీసుకి పని మీద వెడుతున్న పెద్దమనిషికి, లంచాలతో తన రక్తాన్ని ఎంతగా నంజుకు తింటారో అని భయం. తెల్లవారగానే, ఇంకొక రోజు ఎలా గడుస్తుందా అని ఆకలితో అలమటిస్తున్న ముసలి బిచ్చగత్తె భయం.
ఈడొచ్చిన ఆడపిల్ల పెళ్ళికి కట్నం ఎంత అడుగుతారోనని తండ్రికి భయం. చందాల కాలేజీలో కుంటి చదువు చదివిన చంటి అమెరికాకి కాకిలా ఎగిరిపోతాడేమోనని ఆ మాతృహృదయం భయం. స్కూలుకి వెళ్ళే పిల్లలు, తెలుగు సినిమా పేరిట వస్తున్న సినిమావాళ్ళ కొడుకుల హింసాత్మక బూతు సినిమాలకి వెళ్లి ఎక్కడ ఎంతగా పాడయిపోతారోనని తల్లిదండ్రుల భయం. ప్రభుత్వ డాక్టర్ అడిగినంత డబ్బు తను ఇవ్వలేకపోయాడు కనుక, ఆపరేషన్ టేబుల్ మీదే గల్లంతు చేస్తాడేమోనని పేషెంట్ భయం. రైల్లో వెడదామనుకున్న రత్తయ్యకి రైలు విధ్వంసాలు గుర్తుకి వచ్చి, అసలు ప్రయాణమంటేనే భయం. వయసు పెరుగుతున్న పిల్లకి, రోడ్డు మీద రౌడీ మూక వెంటపడుతుంటే అదో భయం. బస్సులో వెడుతున్న నిర్భయకి, ఎప్పుడు ఏ కామాంధుడు మానభాగం చేస్తాడో అని భయం! మతోన్మాదుల తీవ్రవాద చర్యలని అసెంబ్లీలో నిరసించటానికి, వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయోనని పదవిలోవున్న మంత్రిగారికి భయం!
కొంతమందికి, చావు తప్పదని తెలిసినా, చచ్చిపోతామేమోనని చచ్చేంత భయం!
ఇంకొంతమందికి ఇక ముందు బ్రతుకెలా వుంటుందో అని బ్రతుకు భయం.
అలా బ్రతుకుతూనే, భయాలతో కూడిన బ్రతుకు బ్రతుకుతుంటారు. అడుగడుగునా భయమే!!
ఇలా చెప్పుకుంటూ పోతే, చాల భయంకరమైన భయాలు ఎన్నో వున్నాయి. ఒక్కొక్కళ్ళ అనుభవాల్లో పైన చెప్పిన వాటిల్లో చాల వరకూనూ, ఆ పైన ఇంకా ఎన్నోనూ భయాలు వున్నాయి.
కాకపొతే ఈ భయం అన్నది, ఈ మానవ జీవితంలో ఎక్కడినించీ వచ్చింది? ఎందుకు వచ్చింది?
“ఒక యదార్ధ విషయాన్నో ఊహాగానాన్నో ఆధారం చేసుకుని, రాబోయే అనర్ధాన్నో ప్రమాదాన్నో తలుచుకుంటే, దాని వల్ల మనసులో వచ్చే ఆందోళనే భయం!” అని కొందరు మన్మధులు (మనసుని మధించే వారు), అదే మానసిక శాస్త్రవేత్తలు నిర్వచించారు.
అంతే కాకుండా, “మనకి అయిష్టంగా వున్నదో, జుగుప్సగానీ, అసహ్యంగానీ కలిగించేదో ఒక విషయాన్ని, సందర్భాన్ని, మనిషిని లేదా జంతువుని చూస్తే కలిగేది కూడా భయం” అని మన్మోహనులు ఇంకొందరు భాష్యం చెప్పారు. వీరందరి భాషలో ఎన్నో ‘ఫోబియాలు” వున్నాయి. కొంతమందికి ఎత్తులు ఎక్కటమంటే భయం, కొంతమందికి ఒంటరిగా వుండటం అంటే భయం. కొంతమందికి ఎమ్మారై మెషీన్లో పడుకోవటమన్నా, కిటికీలు లేని చిన్న గదిలో వుండటమన్నా భయం. కొంతమందికి చీకటంటే భయం. నీళ్ళల్లో దిగటం అంటే భయం. దయ్యాలంటే భయం. స్మశానం పక్క నించీ వెళ్ళాలంటే భయం. ఎలుకలన్నా, బొద్దింకలన్నా భయం. ఇలా ఎందరో మహానుభావులు, అందరికీ ఏవేవో భయాలు, ఫోబియాలు!
కొంతమందికి కొన్నిటి మీద ఎంత భయమో, వాళ్లకి వారి ఆలోచనలూ, మానసిక బలహీనతలూ బట్టి ఆ భయంలోనే ఎక్కువ, తక్కువలు కూడా వుంటాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.
ఈ భయం అనేది ఎందుకు వస్తుందీ అనే ప్రశ్నకు సమాధానం, చాలావరకూ పైన చెప్పిన మొదటి నిర్వచనంలోనే వుంది.
అంతేకాకుండా, ఏదన్నా కొత్తది అనుభవంలోకి వస్తుంటే కూడా భయంగానే వుంటుంది.
‘ఇవాళే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నాను, ఎలా వుంటుందో ఏమోనని భయంగా వుంది’ అంటాడు కొత్త రఘునాధయ్య.
“మావాడు మొదటిసారిగా అమెరికా వెడుతున్నాడు. దేశం కాని దేశంలో ఎలా వుంటాడో ఏమో” అని భయపడుతుంది కన్నతల్లి.
కొన్ని సంస్కృతులలో భయాన్ని పెద్దలే చిన్నప్పటి నించీ అలవాటు చేయటం కద్దు. మన భారతీయ సంస్కృతి ఆ విషయంలో చాల ముందు వుంది.
మూడేళ్ళ కూతురు సరిగ్గా అన్నం తినకపోతే, “బూచాడికి పట్టిస్తాను” అని భయపెడుతుంది తల్లి.
“నువ్వు క్లాసులో మొదటి రాంకులో పాసవకపోతే, నీకెవ్వడూ ఉద్యోగం ఇవ్వడు. అడ్డుక్కుతింటావ్” అని పిల్లాడిని భయపెడతాడు తండ్రి.
“ఏమయ్యా.. నువ్వు చెప్పిన పని సరిగ్గా చేయటం లేదు, ఉద్యోగంలో పైకి రావటం ఇష్టం లేదా?” అని భయపెడతాడు ఆఫీసరుడు.
కొంతమంది తమ స్వలాభం కోసం “భయం” అనే అస్త్రాన్ని వాడి, డబ్బులు గుంజుతారు.
దీనికి ఉదాహరణ మనం రోజూ చూసేదే. నగల కొట్టువాడు అంటాడు – “అమ్మా! ఈ నెక్లెస్ ఇంకొక్కటే మిగిలింది. కనీసం ముగ్గురయినా దీనికోసం కాచుకుని వున్నారు. మీరు ఇప్పుడు తీసుకోకపోతే, ఇంకా వుంటుందని అనుకోను” అంటాడు షాపువాడు. రేపటిదాకా ఆగితే ఇక వుండదేమోననే భయంతో వెంటనే కోనేస్తుంది ఆ రత్నహారాన్ని రత్న.
‘మామూలు ఇవ్వకపోతే, నీ కూరగాయల బండినీ, నిన్నూ విరగ్గొట్టి జైల్లో వేస్తాను వెధవా” అంటాడు రక్షక భటుడు, భక్షక భటుడై భయపెడుతూ.
ఆపరేషన్ అవసరం లేకపోయినా, కత్తి నూరుకుంటూ వచ్చి “మీకివాళ ఆపరేషన్ చేయకపోతే, రేపు ప్రొద్దున ఇక స్మశానంలోనే మనం కలవటం” అంటాడు డాక్టర్ కత్తుల రత్తయ్య.
“ఇరాక్ దగ్గర ప్రపంచాన్నే సర్వ నాశనం చేసే రసాయనిక మారణాయుధాలున్నాయి” అని భయపెట్టి, అవసరం లేని యుద్ధానికి దిగాడు బుష్. అమెరికాని దివాళా తీయించాడు.
కొంతమంది మనుష్యులలోని మూఢ నమ్మకాలను విరివిగా వాడుకుని, డబ్బులు చేసుకుంటారు.
“శని మూడో పాదంలో వున్నాడు, మీకు పెద్ద అరిష్టం జరగబోతున్నది. ఫలానా పూజలు చేస్తే, శాంతి జరుగుతుంది” అంటాడు పురోహితుడు.
“ఈ గదిని దక్షిణాన క్రింద నించీ పైకి మార్చకపోతే, ఇంటాయన వెంటనే పైకి వెడతాడు” అని తన దక్షిణ తను తీసుకుంటాడు వాస్తూరావ్.
“ఈ ఆంజనేయస్వామి తాయత్తులు రెండు కొనుక్కుని, ఒకటి చేతికి కట్టుకోండి. రెండోది మెడలో వేసుకోండి. ఏ విధమైన పిశాచాలు మీ దగ్గరికి రావు” అంటాడు కోతీశ్వరరావు.
తన కట్టూ, బొట్టూ, జుట్టూ చూసి భయపడ్డ వాళ్ళందరికీ రోగాలు నయం చేస్తానని, విభూది, శివలింగాలు, విష్ణువాచీలు పంచిపెడతాడు బాబా భయంకర్.
పాప భయం వున్న వాళ్ళందరి దగ్గరా, తనకి పాద పూజ చేస్తే ‘నరకం తప్పుతుందని’ వెయ్యి నూట పదహార్లు అలవోకగా కొట్టేస్తాడు, కాషాయం స్వామి.
“మీ కోడలికి ఆడపిల్ల దయ్యం పట్టింది. అందుకే చెప్పిన మాటలు వినకుండా ఆడపిల్లల్ని కంటున్నది. భూతవైద్యం చేస్తే, తిక్క కుదిరి, చక్కటి కట్నం తెచ్చే అబ్బాయి పుడతాడు” అంటాడు భూతవైద్యుడు.
“ఇక ఆ త్రాచు పాము విషం మీ అమ్మాయి తలకి ఎక్కదు. మంత్రం పెట్టేశానుగా” అంటాడు పాముల పరంధామయ్య, డబ్బులు జేబులో వేసుకుంటూ.
“ఉరేయ్.. దేవుడికి దణ్ణం పెట్టుకో.. దేవుడంటే మరీ అలా భయం, భక్తీ లేకపోతే కళ్ళు పోతాయి”
మరి ఈ భయాన్ని పోగొట్టుకునేది ఎలా అనేది పెద్ద ప్రశ్న.
దానికి పూర్తిగా జవాబు చెప్పలేనేమోనని నా భయం.
అయినా నేను చదివిన పుస్తకాల్లో వున్నదీ, సెమినార్లలో విన్నదీ కొంతవరకూ అయినా ఉపయోగ పడుతుందని, ముఖ్యంగా రెండు విషయాలు వ్రాస్తున్నాను.
ఒకటి: ఈ భయమనేది వుందే, దీనితో ఒక తమాషా వుంది. భయాన్ని చూసి మనం భయపడితే, ఈ భయం మనల్ని ఇంకా ఎక్కువగా భయపెడుతుంది. అది తగ్గిస్తామని అభయం ఇచ్చే వాళ్ళు కూడా ఎవరూ వుండరు, కొంతమంది సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు తప్ప. వారిని ఇష్టపడేవాళ్ళు అమెరికాలో బాగానే వున్నారు కానీ, ఇండియాలో బాగా తక్కువ. అందుకని దానిని మనమే ఎదుర్కోవాలి. ఎలా? కొంత స్వంత పరిశోధన ద్వారా, నిపుణుల సలహాల ద్వారా, మరెంతో ఆత్మా విశ్వాసం లేదా మనో ధైర్యం ద్వారా. ఆ పరిశోధనలో కొంత హేతువాదం కలిపితే అన్ని భయాలూ పటాపంచలవుతాయి.
రెండు: ఏదంటే భయమో, దాన్నే ఎదుర్కోవటం. లేదా ప్రేమించేయటం. అంటే దయ్యాలనీ, నీళ్ళనీ, పాముల్నీ ప్రేమించి, పెళ్ళిచేసుకోమని కాదు. నెమ్మది నెమ్మదిగా వాటికి దగ్గరవమని. మరి దయ్యాలకి దగ్గరవటం ఎలా అని దయానిధిగారికి అనుమానం రాకుండా ఎలా వుంటుంది? అమెరికాలో హాలోవీన్ అనే దయ్యాల పండగ ఏటేటా చేసుకుని, పిల్ల పెద్దా అందరూ దయాల్లా వేషాలు వేసుకుని, దయ్యమంటే భయం లేదోయ్, దయ్యమంటే మనుష్యులోయ్ అని దయ్యాల్లో కలిసిపోతారు. దాంతో భయం ఇట్టే తగ్గిపోతుంది. నీళ్ళంటే భయమున్న నీరజ, ఇక్కడ అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూలులో, పక్కనే వున్న గులాబి పూలు చూస్తూ, చూశాక కళ్ళు సగం మూసుకుని చటుక్కున దూకేస్తుంది. మరీ పదడుగుల లోతులో దూకి హరీమనకుండా, నాలుగడుగుల లోతులో వర్రీ లేకుండా దూకేస్తుంది. ముందు కాస్త ఉక్కిరిబిక్కిరి అయినా, ఐదడుగుల నీరజకు ప్రమాదం లేదు కనుక అలవాటు పడిపోతుంది. అంతే కాకుండా, ఈమధ్య స్విమ్మింగ్ పూల్ వున్న ఇల్లు కొనుక్కుని, రోజూ స్విమ్మింగ్ చేస్తున్నది అని ఈమధ్య వార్తల్లో కూడా చెప్పారుష!
నాకు తెలియని ఇంకా ఎన్నో పరిష్కారాలు (నిజంగా నాకు ఏమీ తెలీదు. ఒట్టు!) తెలుసుకోవాలంటే – ఎన్నో పుస్తకాలున్నాయి. అవి కొనుక్కొని, భయపడకుండా బట్టీ వేసేయండి!
లేదా మీ వూళ్ళో మేధో మధన శాస్త్రజ్ఞులు ఎవరైనా వుంటే, భయపడకుండా వెళ్లి, వాళ్ళని అడగండి.
ఈ వ్యాసం వ్రాస్తుంటే, ఏనాడో విన్న చక్కటి తెలుగు పాట ఒకటి గుర్తుకి వస్తున్నది.
“జయమ్ము నిశ్చయమ్మురా!, భయమ్ము లేదురా!, జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా!” అని.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)