కథా భారతి
మొట్టమొదటి
- శ్యామలాదేవి దశిక
ఎవరితో ఫోన్ లో అంత గలగలా మాట్లేడేస్తున్నావ్ అంటారా ?
ఇంకెవరూ? మా గురువుగారితో మాట్లాడుతున్నా....ఇవ్వాళ ఆయన పుట్టినరోజు,శుభాకాంక్షలు చెప్దామని ఫోన్ చేసా.. ఆయన మాటలు....చేసే పనులు వింటుంటే టైమే తెలీదు!
అదేమిటో !వయసు మీదపడుతోందన్న భయం గాని బెంగ గాని లేదుసరికదా.. పైపెచ్చు రోజురోజుకీకుర్రాడిలా తయారవుతున్నారు.ఆ హుషారు ఆ పట్టుదల చూస్తే గురువుగారికిడెబ్బయి ఏళ్ళంటే ఎవ్వరూ నమ్మరు!
ఇంత వయసొచ్చినా ఇంకాఎంతసేపు ఎవరిని పిలుద్దామా.....ఎక్కడ సాహితీ సమావేశాలు పెడదామా... ఎవరి పుస్తకాలు అచ్చువేయిద్దామా....అని అహర్నిశలు అదే తపన. ఇన్నేళ్ళ నుంచీ ఇంత సంఘ సేవ చేస్తూ కూడపెట్టటం ఎలాగో లేదు... కనీసంఎదుటి వాళ్ళను చూసి ఏవన్నా నేర్చుకుంటున్నారా అంటే అదీలేదు. అందరిలా ఆల్ రెడీ పాపులర్ అయిన వాళ్ళను...వాళ్లతో పాటు కొద్దిగా టచ్ ఆఫ్ గ్లామర్ కోసం ఓ టాలీవుడ్ తారను.....అలాగేకాస్త టచ్ ఆఫ్ పరపతి కోసంపవర్లో వున్న ఓ పొలిటికల్ లీడర్ని పిలిచి ఆ సాహిత్య సభల్ని జోరు...జోరు గా జరిపించచ్చు గదా?! అబ్బే.. మా గురువుగారి తీరే వేరూ!
ఏమన్నా అంటే “అయ్యో పాపం! ఇంత జ్ఞానం వున్నా ఎవరూ పట్టించుకోడంలేదు....ఇంత పాండిత్యం వున్నా ఎవరూ గుర్తించడం లేదు....ఇంత సేవ చేస్తున్నా ఏ సంఘం వాళ్ళు ఇంతవరకూ ఇక్కడకి పిలవలేదు” అని వాపోతూ.. పనిగట్టుకుని వెతికి వెతికి అలాంటి వాళ్ళను పిలిచి...ఎవళ్ళు చెయ్యని పనులు చేస్తూ వుంటారు మా గురువుగారు! ఒక్కొక్కసారి....ఒక్కొక్కసారి ఏమిటీ నామొహం! చాలాసార్లు ఆ సభల్లో ఈయన బొట్టుపెట్టి... స్పాన్సర్ చేసి పిలిపించినవాళ్ళు, సాహిత్యం.. సమావేశంసాకుతోఇల్లు..వాకిలీ పట్టకుండా తిరిగే మా గురువుగారు, ఇకపోతే ఆయన అసిస్టెంటు తప్ప నాలుగో మనిషి వుండడు తెలుసా ?! అయినా మా గురువుగారు ఎక్కడా బేజారెత్తకుండా తనే వందమంది పెట్టు అన్నట్టు హడావిడిగా తిరిగేసి, రానివాళ్ళమీద జాలిపడుతూ సభల్ని దిగ్విజయంగా జరిపించేస్తుంటారు!
లోకజ్ఞానం దండిగా వున్న నాలాంటి శిష్యులం“కాస్త మారండి గురువుగారూ” అని చెపుతూనే వుంటాం. అహా వింటేనా! తా పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అనే రకం.మన పని మనం చేసుకుపోవటమే...ఫలితం దానంతట అదే వస్తుంది అంటూ ఓ చిరునవ్వు నవ్వేస్తూ వుంటారు.
ఆయనకు తెలుసు ప్రతి సారీ తను పప్పులో కాలేస్తున్నట్టు. మా గురువుగారేమన్నా తెలివితేటల్లో తక్కువవారా? గిరిశం అంతటివారు! అసలు గిరిశం కాని ఇప్పుడు బతికివుంటే మా గురువుగారి దగ్గర తప్పకుండా ట్యూషన్ తీసుకునే వాడు!! చేసే పనుల్లో లొసుగులు..లోపాలు కప్పిపుచ్చుకోడం కోసం ప్రతిదానికీ “మొట్టమొదటి” అంటూ ఓ బ్రహ్మాస్త్రం వాడేస్తూ వుంటారు. మా గురువుగారికి అత్యంత ఇష్టమైన తెలుగు పదం “మొట్టమొదటి”. ఏ సభఐనా ....అంశమైనా....వ్యక్తి అయినా....కధ అయినా...కవితైనా...ఊరైనా...దేశమైనా అన్నింటికీ ఆ మాటతో ఓ శ్రీకారం చుట్టేస్తారు!
అది ఎలాగాఅంటారా?
“మొట్టమొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు.....నా మొట్టమొదటి కధ....అమెరికాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ....
మొట్టమొదటి అంతర్జాతీయ ఉత్తమ కధల పోటీ.....మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహిళా రచయిత్రుల సమ్మేళనం..
మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం......మొట్టమొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సు......మొట్టమొదటి అంతర్జాతీయ రచయిత్రుల కధల పోటీ..... మొట్టమొదటి యువతరం కవితల పోటీ.. ఉత్తర అమెరికాలో మొట్టమొదటి తెలుగు కధా స్వర్ణోత్సవాలు.”........ ఇలా గంగా ప్రవాహం లాగ సాగిపోతూనే వుంటుంది.!
గత ఇరవై ఏళ్ళు గా గమనిస్తున్న నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను..ఇక ఈ “మొట్టమొదటి” అనే మాటను గురువుగారు ఇంతటితో ఆపేస్తారని.ఎందుకంటే ఆయన చెయ్యని సభలేదు...టచ్ చెయ్యని అంశం లేదు కనుక, ఇక ఏ కొత్త మాట వాడతారా అని కుతూహలంగా ఎదురుచూస్తుంటాను!కానీ నా ఊహను తల్లకిందులు చేస్తూ నన్ను ఆశ్చర్య పరుస్తూ“తిమ్మిని బ్ర్హమ్మిని చేసి బ్రహ్మ్మిని తిమ్మిని చేసి” మొట్టమొదటి అనేఆ బ్రహ్మ్మస్రాన్ని అలా సంధిస్తూనే వున్నారు! ఆ బ్రహ్మస్త్రం తోనే ఇన్నేళ్ళు సాహితీ ప్రపంచంలో వున్న అందర్నీ కట్టిపడేస్తూ వచ్చారు. ఈ మధ్యనే వుండపట్టలేక అడిగేసాను ఏమిటి గురువుగారు అన్నింటికీ “మొట్టమొదట” అంటూ మొదలు పెడతారు...ఎందుకూ అని?
ఏమిటీ గురువుగారి పట్ల భయభక్తుల తోనూ...వినయవిధేయతల తోనూ వుండాలి గాని అలా ఎదురు ప్రశ్నలు వెయ్యడం...హాస్యాల్లాడ్డం ఏమిటీ అంటారా?
సడేలేండి!“యధా రాజా...తధా ప్రజా” అని యధా గురూ....తధా శిష్యా! మా గురువుగారికి లేని కుదురు మాకెక్కడి నుంచి వస్తుంది?! అయినా ఈయన అందరి గురువులాంటి వారు కాదులేండి.చాలా....స్పెషల్! శిష్యులు భయ భక్తులతో ఉంటే మా గురువుగారికి అస్సలు ఇష్టం వుండదు. పైపెచ్చు చాలా చిరాకు కోపం కూడా వస్తుంది. మేం అంత అల్లరి చేస్తే ఎంత సరదాగా వుంటే ఆయనకు అంత ఇష్టం!
మీకో రహస్యం చెప్పనా... అప్పుడప్పుడు గురువుగారే మా శిష్యగణానికి భయపడుతూ వుంటారుతెలుసా? !!
ఏమిటీ...శిష్యుల సుత్తి ఆపి ఇంతకూ ఆయన ఏమన్నారో చెప్పమంటారా?
చెపుతా...అక్కడికే వస్తున్నా! సాహిత్యంలో “ప్రతిదానికీ ఓ ప్రత్యేకత వుంటుందోయి....దాన్ని మనం గుర్తించి గౌరవించాలి” అది మన బాధ్యత అంటూ రెండు ముక్కల్లో భేషుగ్గా చెప్పారు.మీ తెలివి తేటలకు...మీ ఆలోచనా తీరుకు “హాట్స్ ఆఫ్” గురువుగారు! అంటే... అప్పుడే ఏమైంది ఇంకా బోలెడు “మొట్టమొదటలు”వున్నాయి! మనం వెతుక్కోవాలి అంతే అంటూ గిరీశం స్టైల్లో నవ్వేసారు!
మా గురువుగారికి ఈ“మొట్టమొదటి” అనే వ్యాధి రావడానికి కారణం ఆయనకున్న సాహిత్య వ్యసనమే అని కనిపెట్టింది మేమే!ఈ మొట్టమొదటి పిచ్చి గురించి మా శిష్యగణం లో చాలా రోజులపాటు ఓ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. ఈ జబ్బుని ఇలాగే వదిలేస్తే ఏం ప్రమాదమో అని గురువుగార్ని ముందుఅమెరికా డాక్టర్లకు చూపించాం. పాపం అమాయకులైన ఆ డాక్టర్లు, చూడ్డానికి దబ్బ పండులా మెరిసిపోతున్న మా గురువుగారిని చూసి ఈయనకు ఏ జబ్బూ లేదని.. ఏదో కాస్త కొలెస్ట్రాల్...కాస్త బీపీ తప్ప ఎటువంటిపిచ్చీ లేదని ఉంటే గింటే ఆయన్ను అనవసరంగా అనుమానిస్తున్న మాకే మెంటల్ అంటూ మమ్మల్ల్నిటెస్ట్ చెయ్యడం మొదలు పెట్టారు!
అప్పుడు తెలిసింది గురువుగార్ని తెల్ల డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళి తప్పుచేసామని. వెంటనే హుటాహుటిన పదహారు అణాల అచ్చ తెలుగు డాక్టర్ దగ్గరికి తీసికెళ్ళా౦. ఇంకేముందిగురువుగారు అలావస్తుంటే ఆమడ దూరం నుంచే ఆయనలో వున్న భాషా జ్ఞానం...సాహిత్య పిపాస.....హాస్య ధోరణీ.... అన్నీ ఘుప్పు మనటంతో డాక్టరుగారు ఆయనకున్న జబ్బును ఇట్టే పసిగట్టేసాడు!! చూసిన వెంటనే ఏంలాభం లేదని వ్యాధి బాగా ముదిరిపోయిందని తేల్చేసాడు.
ఈ జబ్బును ఎలాగైనా నయం చెయ్యమని ఎంత ఖర్చైనా ఫరవాలేదని మా గురువుగారికి మల్లే మేం కూడా“సూపర్ రిచ్” అని అవసరమైతే మా దగ్గర వున్న ఆస్తులన్నీధారపోస్తామనిశిష్యులం అందరం డాక్టర్లకి హామీ ఇచ్చాం!మా గురువుగారు సొంత ఖర్చులు పెట్టుకుని పంపించిన పుస్తకాల ఆస్తులు మా అందరి దగ్గరా పుష్కలంగా వున్నాయని వాటితాలూకు డాక్యుమెంట్స్ కూడా చూపించాం. ఎంత ఆశ చూపించినా.... ఈ వ్యాధి నయం కాదని ఏం ప్రయోజనంవుండదని డాక్టర్ పెదవి విరిచేశాడు.
మేమందరం కాళ్ళా వెళ్ళా పడగా చివరికిమా గురువుగారు పది కాలాల పాటు ఆరోగ్యం గా వుండాలంటే ఒక్కటే ఒక్క మార్గం వుందన్నారు. ఇంత ముదిరిపోయిన ఈ జబ్బును ఇలా ముదిరిపోనివ్వటమే తరుణోపాయం అని చెప్పారు!సరే ఏంచేస్తాం “గుడ్డిలో మెల్ల”అని దానికేసెటిల్ అయిపోయాం. మా ఇళ్ళు ఇప్పటికే గురువుగారి పుస్తకాలతో నిండిపోయినా ఇంకో పది బుక్ షెల్ఫులు అమర్చుకుని ఎలాగోఅలాఅవస్థ పడతాం తప్పదుకదా ?! గురువుగారి కోసం ఆ మాత్రం చెయ్యక పోతే ఎలా?
శిష్యరికం చెయ్యగా.... చెయ్యగా..... మాట్లాడగా..... మాట్లాగా గురువుగారి జ్ఞానం కొంతలో కొంతైనా శిష్యులకి అబ్బటంలో పెద్ద అబ్బరమేముందీ!
ఇన్నాళ్ళు ఆయనకు పిచ్చి అనుకున్నా ఆలోచించగా.... చించగా......ఈ “మొట్టమొదట” అన్న మంత్రమేదో బానే వుందని పిస్తోంది. మా గురువుగారి లాగే నేనుకూడా ఈ మాటతో పాపులర్ అయిపోవచ్చేమో అని అనిపిస్తోంది. మీకు తెలీదుకానీ...నాక్కూడా “మొట్టమొదటలు” (చాలా) వున్నాయి!
మా ఊరునుంచి హైదరాబాదు వెళ్ళి కాలేజీలో చదువుకున్న మొట్టమొదటి అమ్మాయిని నేనే!
ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా తెలుగు మీడియం లో చదివిన మొట్టమొదటి అమ్మాయిని నేనే!
అటుతరంలో ఇటు తరంలో ఎటు చూసినా అమెరికాలో వున్న అబ్బాయిని పెళ్ళిచేసుకున్న మొట్టమొదటి అమ్మాయిని నేనే!
అప్పటి వరకూ ఎడ్లబండిలో తిరుగుతూ... అమాంతం విమానం ఎక్కిన మొట్టమొదటి వ్యక్తిని కూడా నేనే!
మా వంశంలో అమెరికా వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తిని నేనే....అమెరికా ప్రెసిడెంట్ తో కరచాలనం చేసినఘనత కూడా నాకే దక్కుతుంది తెలుసా!
మా ఇంట్లో వుద్యోగం చేసిన అమ్మాయిల్లో నేనే మొట్టమొదటి దాన్ని!
మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల ఊర్లతో సహా హైస్కూల్లో...కాలేజీలో నాటకాలు వేసిన మొట్టమొదటి అమ్మాయిని కూడా నేనే!
మా ఇంట్లో కధలు.... కాకరకాయలు... అంటూ కాగితం మీద గిలికిన మొదటి అమ్మాయిని నేనే!
ఇన్ని “మొట్టమొదటలు” వున్న నాకు ఎలాంటి ఆపర్చునిటీస్ వున్నాయో ఓ సారి గురువుగారిని పిలిచి కనుక్కుందాం అనుకుంటున్నా!!
మీరేమంటారు?
ఏమిటీగురువుకు తగ్గ శిష్యురాలిని అంటారా!!
చిట్టెన్ రాజు గారు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ మరెన్నెన్నో “మొట్టమొదటలు” చేస్తూనే వుండాలని కోరుకుంటూ.....
వారి 70వ జన్మదిన సందర్భంగా ఓ అమెరికాఇల్లాలి ముచ్చట.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)