ధారావాహికలు

మరీచికలు

-వెంపటి హేమ

(గత సంచిక తరువాయి...)

టైం చూస్తే రాత్రి ఎనిమిదిన్నర అయ్యిందిగాని యామిని ఇంకా ఇంటికి రాలేదు. కంగారు పడుతూ, రకరకాల ఊహాగానాలు చేస్తూ వీధి తలుపు బార్లా తెరుచుకుని, గుమ్మంలోకంతా కుర్చీలు లాక్కుని ఎదురుచూస్తూ కూర్చున్నారు శారదాంబ, సదాశివం దంపతులు. అంతలో గేటుబయట కారు ఆగినచప్పుడు వినిపించింది. గమ్మున లేచి వీధివరండాలోకి పరుగెత్తింది శారదాంబ.

డ్రైవర్ సీటులోంచి దిగివచ్చి అమరేంద్ర, యామినికోసం కారు తలుపు తెరిచాడు. యామిని కారుదిగి అతనికి "థాంక్స్" చెప్పింది. అతడు యామినికి "భై" చెప్పి, కారెక్కి వెళ్ళిపోయాడు. యామిని కారు బయలుదేరీవరకూ అక్కడే నిలబడి, ఆ తరవాత గేటు తీసుకుని లోపలకు వచ్చింది.

యామిని తిన్నగా తన వాటాలోకి వెళ్ళబోతూండగా శారదాంబ భర్తవైపు, యామినివైపు కొరకొరా మార్చి మార్చి చూసింది. ఆ చూపుని అర్ధంచేసుకున్న సదాశివం కుర్చీ లోంచి లేచాడు.

" ఇలా రా యామినీ! ఎవరా అబ్బాయి" అని సూటిగా అడిగాడు.

యామిని ఏ అలజడీ లేకుండా జవాబు చెప్పింది, " ఆయన మా బాస్ అంకుల్! ఈ వేళ పని పూర్తయ్యేసరికి బాగా లేటయ్యింది. ఈ సమయంలో ఒంటరిగా పంపడం మంచిది కాదని, స్వయంగా తన కారుమీద తీసుకువచ్చి దిగపెట్టారు" అంది.

వెంటనే శారదాంబ అందుకుంది, "ఆ అబ్బాయిని చూస్తే నిండా ముప్ఫై ఏళ్ళయినా ఉండవేమో ననిపింఛేటంత లేతగా ఉన్నాడు. అంత చిన్నవాడికి అంత పెద్ద పోస్టు ఇచ్చారంటే నమ్మకం కుదరడం లేదు" అంది స్వరంలో అదోవిధమైన విరుపుధ్వనించేలా.

యామినికి ఏం మాట్లాడడానికీ తోచక అవాక్కై ఉండిపోయింది.

మళ్ళీ శారదాంబే భర్తతో మాటాడింది, "ఆ అబ్బాయి చక్కగా ఉన్నాడు. మీరోసారి తీరుబడి చేసుకుని వెళ్ళి అసలు కులమేమిటో, గోత్రమేమిటో, తల్లిదండ్రులు ఎక్కడుంటారో అన్నీ కనుక్కురండి. కుదిరితే ఇద్దరిదీ సరిజోడీ ఔతుంది! అబ్బాయి సుముఖుడని తెలుస్తూనే ఉంది కదా, ఇక తక్కినవన్నీ కలిసొస్తే వాళ్ళ పెద్దవాళ్ళను కదపొచ్చు" అంది.

వాళ్ళ మనస్సులో లేని ఊహలు వాళ్ళకు అంటగట్టి, తోచిన మాటల్లా అనెయ్యడం న్యాయమా?వయసులోఉన్న ఒక అబ్బాయీ, అమ్మాయీ ఒకేచోట కనిపిస్తే చాలు, వాళ్ళిద్దరిమధ్యా ఏదో అక్రమ సంబంధం ఉండే ఉంటుందనీ, వాళ్ళిద్దరికీ సాధ్యమైనంత తొందరగా పెళ్ళి జరిపించెయ్యడమే దానికి తగిన పరిష్కారమనీ నిర్ణయానికి వచ్చేస్తారు కదా ఈ పెద్దాళ్ళు! స్త్రీ పురుషుల మధ్య పవిత్ర స్నేహ బంధానికి ఆస్కారమే లేదా - అనుకుని, లోలోపలబాధపడింది యామిని. ఆమెకు పెద్దవాళ్ళ మనస్తత్త్వం పట్ల ఏవగింపు కలిగింది. ఏకాంతంలో కూడా ఏమాత్రం హద్దులు మీరని అమర్ ప్రవర్తన గుర్తుకొచ్చి, అతని మీది గౌరవం ఇనుమడించింది. కాని, సదాశివం దంపతులఎడల తన మనసులో పెల్లుబికిన కోపాన్ని పైకి తెలియనీకుండా, మృదువుగా మాటాడీ ప్రయత్నం చేసింది యామిని ఎంతో ప్రయత్నంచేసి!

"ఎవరు సుముఖంగా ఉన్నా, నేను పెళ్ళికి సుముఖంగా లేను బాబాయ్ గారూ! మా నాన్న మామూలు మనిషి అయ్యీ వరకూ నేను పెళ్ళిని గురించి ఆలోచించ దలచుకోలేదు. ఇక అప్పుడంటారా.... , మా నాన్నే చూసుకుంటాడు అన్ని విషయాలూను! ఇక అంతవరకూ మనమా విషయం మాటాడుకోవద్దు. అది నాకు నచ్చదు" అంది.

"మరయితే ఇలా మొగాళ్ళతో కలిసి వేళా పాళా లేకుండా తిరగడాలూ, అర్ధరాత్రీ, అపరాత్రీ కొంపకి చేరడాలూ పనికిరావు, గుర్తుంచుకో! సంసారుల ఇళ్ళలో ఇలాంటివి అందగించవు సుమీ" అంది శారదాంబ నిష్టూరంగా...

తెల్లబోయింది యామిని. ఏం జవాబు చెప్పాలా అని ఆలోచించింది. పరుషంగా మాటాడితే గొడవౌతుంది. వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యమని అన్నా అనగలరు! నా మూలంగా రామేశం అంకుల్ కీ వీళ్ళకీ మధ్య రగడ ప్రారంభమవ్వవచ్చు. అది మంచిపని కాదు. ముళ్ళకంచ మీద పడ్డ బట్టను విడదీసుకున్నట్లు, జాగ్రత్తగా, మృదువుగా, నేర్పరితనంతో సమర్ధించాలి ఈ సమస్యను - అనుకుంది

ఉరకలు వేస్తూ ఉబికి వస్తున్న కోపాన్ని బలవంతంగా అణిచిపెట్టి, మృదుస్వరంతో జవాబు చెప్పింది యామిని. "ఇబ్బందులన్నవి రోజూ రావు కదా పిన్నిగారూ! ఈ వేళ అర్జంటు లెటర్ ఒకటి వెంటనే క్లియర్ చెయ్యాల్సిన అవసరం రావడంతో, ఎక్కువ సేపు ఆగి, పని చెయ్యవలసి వచ్చింది. టైం తెలియకుండా గడిచిపోయింది. రేపు దాన్ని టైపు చెయ్యడం కోసం రేపు మళ్ళీ నేను తొందరగా ఆఫీసుకి వెళ్ళవలసి ఉంది.

తప్పనిసరిగా రేపటి పోస్టులో అది వెళ్ళిపోవాలి మరి! ఈ పని బాధ్యత నాది. నెలనెలా జీతం పుచ్చుకుంటున్నందుకు నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలసి ఉంది. రేపు ఆ పనిమీద నేను వంటైనా చేసుకోకుండా ఆఫీసుకి వెళ్ళ వ లసి ఉంది. ఉద్యోగం అన్నాక, విధి నిర్వహణ చెయ్యక తప్పదు కదా! దానిలో కూడా అప్పుడప్పుడు చిన్నచిన్న మార్పులూ చేర్పులూ ఉంటూంటాయి. ఉద్యోగ బాధ్యతలు మగవాళ్ళకైనా ఆదవాళ్ళకైనా ఒకటే! కావాలంటే ఈ విషయం మీరు బాబాయ్ గారిని అడగండి. శ్రద్ధగా నేను నా డ్యూటీ చెయ్యడం తప్పా?

ఇంటికి రావడం లేటైతే మీకు నచ్చదు. అలాగని, పని పూర్తి చెయ్యకుండా వెళ్ళిపోతే బాసుకి నచ్చదు! ఐనా నేనేం చిన్నపిల్లని కాను, ఇరవై ఏళ్ళు దాటాయి! నా మంచి చెడ్డల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నా గురించి మీరేం బెంగ పడకండి. బస్సు స్టాప్ నుండి రెండు ఫర్లాంగులు నడిస్తేనేగాని, మనిల్లు రాదు కదా! ఈ సమయంలో రోడ్డు సర్వే చేస్తూ రౌడీలు తిరుగుతూ ఉంటారు కదా! ఒంటరిగా అంతదూరం, ఇలాంటప్పుడు నదిచి రావడం క్షేమం కాదు - అన్నది మనందరికీ తెలిసినదే. అందుకే, నా మేలు కోరి బాస్ నన్ను కారుమీద తీసుకొచ్చి, ఇంటి దగ్గర క్షేమంగా దింపుతానంటే, నేను, "సరే" అనక తప్పలేదు. ప్రతిరోజూ వచ్చే అవసరం కాదు కదా ఇది" అంది.

ఆ తరవాత "గుడ్నైట్ బాబాయ్! గుడ్ నైట్ పిన్నిగారూ" అంటూ వాళ్ళకు మరి మాటాడే అవకాశం ఇవ్వకుండా తన వాటాలోకి వెళ్ళి, తలుపు దగ్గరగా వేసింది యామిని.

అ రాత్రి కింక యామినికి తిండి తినాలనిపించలేదు. అలసిన మనసుతో, బడలిన శరీరంతో, బట్టలైనా మార్చుకోకుండా మంచానికి అడ్డంగా పడుకుండిపోయింది. చాలా సేపు శారదాంబ మాటలే తలుచుకుంటూ, నిద్రపట్టక దొల్లిదొల్లి, క్రమంగా ఎప్పటికో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.

మరునాడు ఆమె నిద్రలేచేసరికి పొద్దు బారెడు పైకి లేచింది. ఇంక ఆ వేళ వంటా వార్పూ కుదరవనిపించి, తొందరగా తయారయ్యి, కాఫీ కలుపుకు తాగి, ఆఫీసుకి రోజూ కంటె ఒక అరగంట ముందుగానే బయలుదేరింది యామిని, రాజువచ్చి తలుపులు తెరిచేసరికల్లా తాను అక్కడ ఉండా లన్న ఉద్దేశ్యంతో. బాస్ ఆఫీసుకి వచ్చే వేళకి తను ఆ లెటర్ సిద్ధం చేసి ఉంచాలన్న సంకల్పంతో.ఉంది ఆమె.

** *

అమరేంద్ర కూడా ఆ రోజు, మామూలుకంటే తొందరగానే వచ్చాడు ఆఫీసుకి. యామిని అప్పడికే లెటర్ని నీటుగా టైపు చేసి, ఎన్వలప్ మీద టూ అండ్ ఫ్రం అడ్రస్సులతో సహా టైపుచేసి సిద్ధంగా ఉంచింది. అతడా లెటర్ని చదివి సంతృప్తిపడి, దానిమీద సంతకం చేసి తిరిగి ఆమెకే ఇచ్చాడు. దానిని మడిచి ఎడ్రస్ ఉన్న కవర్ లో ఉంచి, పోస్టుకు సిద్ధం చేసి, అర్జంట్ అని ఎర్రటి అక్షరాలతో రాయబడి ఉన్న ట్రేలో ఉంచి అప్పుడు స్తిమితపడింది యామిని.

మళ్ళీ పోస్టు వచ్చీ వరకూ తనకు పనేమీ లేదు. నిన్న రాత్రి కూడా తిండీ, నిద్రా సరిగా లేకపోడం, ఈ వేళ ఇంకా ఏమీ తినకపోవడంతో ఆమెకు చాలా బడలికగా ఉంది. తనగదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి - అనుకుని వెళ్ళడానికి లేచింది యామిని.

కాని అమర్ ఆమెను వెళ్ళిపోనీయలేదు. "కూర్చో యామినీ! నీతో మాటా డాలి" అన్నాడు.

"ఎస్ బాస్! చెప్పండి" అంటూ ఆమె మళ్ళీ కుర్చీలో కూర్చుండి పోయింది.

"నిన్న రాత్రి మీ ఇంటి గుమ్మంలో ఒక "ప్లంప్ లేడీ" మనల్ని గుడ్లురిమి చూస్తూ కనిపించింది, ఆమె ఎవరు? బంధువా? నీకు ఏమౌతుంది?"

"బంధువేం కాదు, వాళ్ళు మా అంకుల్కి ఫ్రెండ్సు, గోపాల్రావుగారికి చుట్టాలు" అంది యామిని. "ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళే నాకు లోకల్ గార్డియన్లు!"

"ఐతే, నిన్న నువ్వు లేటుగా ఇంటికి వచ్చినందుకు, వాళ్ళు నిన్నేదో అనే ఉంటారు! నిన్నామె మనల్ని చూసిన చూపునుబట్టి ఆమె నీతో తప్పకుండా గొడవ పెట్టుకునే ఉండి ఉంటుంది అని నా గట్టి నమ్మకం. యాం ఐ కరెక్టు? ఆమె వాలకం చూస్తే, ఆమె ఎవర్నీ అంత తేలిగ్గా వదలిపెట్టే రకం కాదనిపిస్తోంది" అన్నాడు అమర్, యామినినే నిశితంగా చూస్తూ.

ఆశ్చర్యపోయింది యామిని. నిన్న రాత్రి అతడు దృష్టి నిలిపి యెవరినీ చూసిన జాడలేదు. అలాంటిది ఇంత బాగా శారదాంబని ఎలా చదవగలిగాడు - అనుకుంది. కళ్ళు విశాలం చేసుకుని, అతన్నొక విడ్డూరాన్ని చూసినట్లు చూసింది.

రాత్రి శారదాంబకూ తనకూ మధ్య సాగిన సంభాషణలన్నీ "తు - చ" తప్పకుండా, ఉన్నది ఉన్నట్లుగా అతనికి చెప్పాలనిపించ లేదు యామినికి. అలా చేసినట్లైతే, తమ ఇద్దరిమధ్యా కొనసాగుతున్న ఈ ఆరోగ్యకరమైన సంబంధం చెడిపోవచ్చు! ఇప్పుడు తమ మధ్య నున్న, బాసు అండ్ హిస్ P.A. (ఓన్లీ) అన్న ప్యూర్ రిలేషన్ షిప్, ఈ తరవాత కూడా క్షేమంగా ఉండాలి అనుకుంటే, ఉన్నదున్నట్లుగా - మొత్తం అంతా చెప్పకపోడమే మేలు, తీరా చెపితే ఎటుపోయి ఎటువస్తుందో, ఏమో"అనుకుంది.

సదాశివం దంపతుల మనసులో పుట్టిన ఆలోచనలను అతనికి చెప్పినట్లైతే, ఇప్పుడిప్పుడే నిద్రలో పడ్డ అతనిలో ఉన్నకోతి, చటుక్కున మళ్ళీ లేచి కూచుని తనను వేధించడం మొదలుపెట్టే ప్రమాదం ఉంది. "ఎందుకులే కోరి కష్టాలు కొని తెచ్చుకోడం," అనుకుంది యామిని.

"వాళ్ళు ఏమనడానికైనా తగినంత కారణం ఉంది కదా! వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ కూచునీలా చేశాను! పని ఎక్కువుంది, అందుకని లేటయ్యింది. ఇంకెప్పుడూ అలా జరగనీయను, సారీ" అని చెప్పి తప్పుకుపోయా" అంటూ క్లుప్తంగా చెప్పి ముగించేసింది యామిని.

కాని ఆమె ముఖంలోకి చూస్తూ, ఆమె చెపుతున్న మాటలు వింటున్న అమర్ ఆ మాటలు నమ్మలేదు. "ఆమె అంత తేలికగా వదిలేస్తుందంటే నేను నమ్మను. ఆమె నన్ను గురించి ఏమీ కామెంట్ చెయ్యలేదా? చిత్రమేనే! నిజం చెప్పు" అన్నాడు.

గతుక్కుమంది యామిని. కాని, అంతలో సద్దుకుంది. "చెయ్యకేం, చేసింది. అవకాశం దొరికితే మాటల తూటాలు వదలకుండా ఊరుకుంటారా ఎవరైనా ....?"

"ఏమందేమిటి? నాలో ఆమెకు ఏం లోపం కనిపించిందిట" అని అడిగాడు అమర్ నవ్వుతూ.

"లోపమనాలో గుణమనాలో నాకయితే తెలియదు. నాతో వచ్చింది మా బాస్ - అనీ, అంత రాత్రివేళ ఒంటరిగా పంపలేక, తీసుకొచ్చి, ఇంటిదగ్గర దిగవిడిచారు" అంటే ఆమెకు నమ్మకం కుదరలేదు కాబోలు, అంత చిన్న వయసులో, అంత పెద్ద బాధ్యతగల ఉద్యోగం ఎలా ఇచ్చారు - అంటూ ఆమె ఆశ్చర్యపోయింది."

"ఈ వీధి దీపాలకు అసలు బుద్ధి ఉండదు. కావలసినచోట వెలగవు, అక్కరలేనిచోట మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతూ కాంతులు వెదజల్లుతూ ఉంటాయి." అని స్వగతంలా గొణుక్కుని, ఆపై,"నేనీ ఉద్యోగంలోకి ఎలా వచ్చానో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నీక్కూడా ఉంటే చెప్పు" అన్నాడు.

"చెప్పండి సర్! మళ్ళీ ఎవరికైనా అలాంటి సందేహం వస్తే చెప్పడానికి ఉంటుంది. నిన్నను నాకు జవాబు ఏం చెప్పాలో తోచక, తికమక పడి మౌనంగా ఉండిపోవలసి వచ్చింది"

"ఇది నా పర్సనల్ మేటర్. అందరికీ "టాం టాం" వెయ్యాల్సిన పనిలేదు. మనం ఇద్దరం కలిసి పని చెయ్యాల్సిన వాళ్ళం కదా! మన మధ్య అపార్ధాలూ, అభిప్రాయ భేదాలూ, అవగాహనా లోపాలూ లాంటివి ఉండకూడదని నా ఉద్దేశ్యం. నీ మనసులో కూడా అలాంటి సందేహం ఏమైనా ఉంటే, అది

క్లారిఫై అవ్వడం కోసం చెపుతున్నా, అంతే ..... "

అంతలో రాజు ఫ్లాస్కుతో కాఫీ తీసుకొచ్చాడు. ఇద్దరూ కాఫీ తాగుతూ ఉండగా తన కథ చెప్పసాగాడు అమరేంద్ర. ......

" ఎట్టిపరిస్థితిలోనూ మన మధ్య అవగాహనా లోపాలు ఉండకూడదన్నది నా ఉద్దేశం!

నేనేం అనాధను కాను. నాకూ అమ్మా, నాన్నా, చెల్లెలు - అందరూ ఉన్నారు. వాళ్ళకి నేనంటే ప్రాణం! కాని దురదృష్ట వశాత్తు ఒకసారి, పరాయివాళ్ళ కుతంత్రానికి లొంగిపోయి, వాళ్ళు చెప్పినది నిజమనుకుని మా నాన్న, శాస్వతంగా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని నేను ఎంతమాత్రం ఆమోదించలేకపోయా. నలుగురి మధ్య ఆయనమాట కాదన్నానని మా నాన్నకి కోపం వచ్చి, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. నా జీవితాన్ని సర్వనాశనం చేసే ఆ అబద్ధాన్ని గెలిపిండం ఇష్టం లేక, నేను వెంటనే ఇల్లు వదిలి, కట్టు బట్టలతో బయటికి వచ్చేశాను. అప్పుడు నా దగ్గర వంద రూపాయిల చిల్లరుంది. అడి కాక, మా అమ్మ ప్రియమారా చేయించి నా మెడలో వేసిన బంగారు గొలుసు, నా వేలికి ఒక ఉంగరం కూడా ఉన్నాయి. వాటిని అమ్మి, టికెట్ కొనుక్కుని అహమ్మదాబాద్ వెళ్ళిపోయా.

అప్పటికి నేను ఇంజినీరింగ్ మాత్రం పూర్తి చేసి ఉన్నా. అహమ్మదాబాద్ లో అప్పుట్లో నేను M.B.A. ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నాల్గు నెలలకు ఆవల ఉన్నాయి మా ఫైనల్ ఎగ్జామ్సు. ఆ పరిస్థితిలో నా చదువు ఆగిపోడం నాకు ఇష్టం లేకపోయింది. వెంటనే నా కొచ్చిన కష్టాన్ని నా ఫ్రెండ్ సురేశ్ మిత్రాకి చెప్పాను. సురేశ్ మన సుప్రీం బాస్ కొడుకు. వెంటనే అతడు నా గురించి వాళ్ళ నాన్నగారికి చెప్పాడు.

ఆయన నాతో ఫోన్ లో మాట్లాడారు. మేమిద్దరం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము, నేను చదువయ్యాక నాలుగు ఏళ్ళపాటు వారి కంపెనీలో పనిచేస్తానని ఒప్పుకుంటే, ఆ నాలుగు నెలలూ నా చదువుకయ్యే ఖర్చు మొత్తం తనే భరిస్తానని చెప్పారు. నేను ఒప్పుకున్నా. శ్రద్దగా చదివి, మంచి మార్కులతో పరీక్ష నెగ్గాను. ఆ తరవాత, మూడేళ్లపాటు ఆయన నన్ను తనదగ్గరే అట్టే పెట్టుకుని, స్వయంగా నన్ను ట్రెయిన్ చేశారు.

నాల్గవ సంవత్సరంలో గోపాలరావుగారి స్థానంలో నన్నిక్కడికి పంపించారు. ఆయనకు నా మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంది. ఆ తరవాతి సంగతులన్నీ నీకు తెలిసినవే కదా " అని చెప్పి ముగించాడు అమర్.

ఆశ్చర్యంగా కళ్ళు విశాలం చేసుకుని, అతడు చెప్పినదంతా శ్రద్ధగా వింది యామిని. చిలిపిగా అందర్నీ ఆటపట్టిస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా కనిపించే ఇతని వెనక కూడా ఇంత విషాదం ఉందా - అని విస్తుపోయింది యామిని. ఆమెకు నోట మాట రాలేదు. భావోద్వేగం వల్ల అతను కూడా కొంచెంసేపు, మాటాడలేకపోయాడు.

మధ్యాహ్నం లంచ్ అవర్లో బైటికి వెళ్ళి ఏదో కొంచెం తినివచ్చి, స్థిమితంగా కూర్చున్నాక అనిపించింది యామినికి, అతడు తమ ఊరు ఎందుకు వచ్చాడో అడిగి ఉండవలసింది - అని. కాని అంతలోనే, వివేకం హెచ్చరించింది, "అంతపని చేసేశావు కాదు, ఇంకా నయమే! ఇప్పుడిప్పుడే అతడు కొంచెం స్నేహపాత్రుడిగా మారుతున్నాడు. అతడు మర్చి పోయిన విషయాన్ని మళ్ళీ నువ్వు గుర్తుచెయ్యడం అన్నది తీరికూర్చుని, తేనెటీగల తుట్టని కదపడమే ఔతుందేమో, ఎవరికెరుక!నువ్వు జాగ్రత్త ఉండాలి" అంటూ.

అక్కడితో యామిని, ఆ సంగతి తెలుసుకోవాలని ఉన్న కుతూహలం మొత్తం మనసులోంచి పూర్తిగా తుడిచేసింది.

** *

రిసెప్షనిస్టు భామిని ఎందుకనో ఆ రోజు సెలవుపెట్టింది. భామిని ఉంటే, రోజూ ఇద్దరూ, లంచి కలిసి యామిని గదిలో చేసేవారు. ఈ రోజు ఆమె లేకపోవడం యామినికి వెలితిగా ఉంది. భామినిది ఒక్కక్షణమైనా మాటాడకుండా ఊరుకునే స్వభావం కాదు. ఎప్పుడూ వసపిట్టలా ఏదో ఒక విషయం ఎత్తి, కామాలూ, ఫుల్ స్టాపులూ అంతగా పాటించకుండా గలగలా మాటాడుతూనే ఉంటుంది, ఎదుటివాళ్ళకు మరేమీ తోచనివ్వకుండా. ఈవేళ ఒంటరిగా ఉండడంతో యామిని ఆలోచనలు బాస్ చుట్టూ పరిభ్రమించ సాగాయి.

అతని ఇల్లు చూశాక, అతని వెనకనున్న కథ విన్నాక ఆమె ఎదలో అతని ఎడల పీఠం వేసుకుని ఉన్న వ్యతిరేకత సడలడం మొదలుపెట్టింది. స్నేహ పాత్రుడు కాదగిన మంచి గుణాలు అతనిలో చాలానే ఉన్నాయనిపించింది ఆమెకు. అతని విద్య, అతని సంస్కారవంతమైన జీవనశైలి, నీటైన అతని అలవాట్లూ, ఎదుటివారి కష్టసుఖాలను అర్థం చేసుకోగల అతని మనస్తత్వం ..... ఇలా ఎన్నెన్నో విశేష లక్షణాలు నెమ్మదిగా ఆమెకు కనిపించసాగాయి.

స్వతరహాగా అతడు సద్గుణ సంపన్నుడే కావచ్చు!. కాని వకుళ చెప్పినట్లు; అతడు స్త్రీజాతినే ద్వేషిస్తున్నట్లు కనిపించడానికి కారణం బహుశ:, ఏ ఆడపిల్లైనా అతని మనసుని ఘోరంగా గాయపరచి ఉండడం కారణం కావచ్చుగా! ఏది ఏమైతేనేం, మంచి రంగు, సువాసనా ఉన్న మొగలి పొత్తికి ముళ్ళులా! ఇతనిలో ఎదుటివాళ్ళని ప్రతి చిన్నదానికీ వంకలెంచి, ఆటపట్టించే అవగుణం ఒకటి మాత్రం, చంద్రునిలోని మచ్చలా బాగాకనిపిస్తోంది! అదికూడా లేకపోతే, ఇతడు మచ్చలేని చంద్రునిలా......."

ఉలిక్కి పడ్డట్లై, " ఏమిటిలా ఆలోచిస్తున్నాను ఇవేళ! మతిగాని పోయిందా ఏమిటి నాకు" అనుకుని మనసు మళ్ళించుకుని భోజనం చెయ్యసాగింది యామి ని.

** *

హైదరాబాదులోని "మైత్రీ ఫర్నిషింగ్సు" వ్యాపారం "మూడుపూలు ఆరు కాయలుగా" దిగ్విజయంగా వర్ధిల్లుతూ, అపరిమితమైన లాభాలు తెచ్చిపెడుతోంది. పనిలో పనిగా ఫర్నిచర్ అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు ఘటకేసర్ లో ఉన్న కార్ఖానాలో ఫర్నిచర్ కూడా తయారౌతోంది. కలపమాత్రం మధ్యప్రదేశ్ అడవులలో దొరికే నాణ్యమైన, టేకు, విరుగుడుచేవ, మద్ది వగైరాలు, కావలసిన పరిమాణం లోకి కొయ్యబడి, వేగన్లమీద వస్తున్నాయి. పనివాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. అందరికీ చేతినిండా పని ఉంది. అజమాయిషీ మొత్తం చూడవలసి రావడంతో అమరేంద్ర కూడా బిజీ అయ్యాడు

ఏ రోజునా రిసెప్షన్ హాలు విజిటర్సుతో నిండి ఉంటోంది. వచ్చిన కష్టమర్లు కుర్చీల్లో కూర్చుని, తమవంతు పిలుపుకోసం ఎదురుచూస్తూ ఉంటే; భామిని, వరుసక్రమంలో వాళ్ల పేర్లు రాసుకుని, బాస్ తో మాటాడి, క్రమం తప్పకుండా ఒక్కొక్కరినే లోపలకు పంపిస్తూ తనూ బిజీగా ఉంటోంది.

భామిని మరీ పెద్ద అందగత్తె కాకపోయినా, ఎల్లవేళలా, అప్పుడే విడిచిన పువ్వులా ఫ్రెష్ గా కనిపించడంతో, ఎవరికైనా, చూడగానే ఆమె అందంగా ఉందనే అనిపిస్తుంది. అలా ఫ్రెష్ గా ఉండడానికి ఆమె బజార్లో దొరికే సౌందర్య సాధనాలెన్నో వాడుతూ, మేకప్ కోసం ప్రతిరోజూ చాలా టైం వెచ్చిస్తూంటుంది. అవి చాలక, చీర బొడ్డు దిగువకు కట్టుకుని, లోనెక్ జాకెట్ తొడుక్కుని తళుకులీనే నగలు ధరించి, తలనిండా పూలతో ...... మొత్తం మీద ఓవర్ గా, మగవాళ్ళకు వెర్రెత్తించేలా ముస్తాబై మరీ ఆఫీసుకి వస్తుంది. దానికి తోడుగా, పలకరించిన వాళ్ళతో అవిశ్రాంతంగా ఏదో ఒకటి మాటాడుతూనే ఉంటుంది. అక్కడకి వచ్చేవారికి ఆమె ఒక పెద్ద "ఆకర్షణ " అయ్యింది.

యామినికి, భామినికి ఎందులోనూ సాపత్యం లేదు. కాని భామిని రాకతో తనకొక ఆడపిల్ల తోడు దొరికిందని సంతోషించింది యామిని. లంచ్ అవర్ లో ఇద్దరూ ప్రతిరోజూ కలుసుకునీ వారు. కలిసి భోంచేసీవారు. భామిని ఆపకుండా చెప్పే కబుర్లు సగం వింటూ, సగం వినకుండా భోజనం చెయ్యడం యామినికి అలవాటుగా మారింది. అవసరం ఉంటేగాని మాటాడేదికాదు యామిని.

పనున్న వాళ్ళూ లేవివాళ్ళూ కూడా భామినితో కబుర్లకోసం రిసెప్క్షన్ హాల్లోకి వచ్చి కూర్చుని, గంటలతరబడీ భామినితో "హస్కు" కొడుతున్నారన్న విషయం నెమ్మదిగా బయటపడింది. స్టాఫ్ అందరూ ఆవిసహాయమే గుస గుసగా చెప్పుకోసాగారు.

ఆ రోజు పని తొందరగా ఐపోడంతో పెన్సిల్ కి కేప్ పెట్టి, వెళ్ళడానికి లేచింది యామిని.

"కూర్చో యామినీ! నీతో కొంచెం మాటాడాల్సివుంది" అన్నాడు అమరేంద్ర.

యామిని కూర్చుంది. తను అంతవరకూ చూస్తున్న డాక్యుమెంటు ఫైల్లో ఉంచి, యామినివైపు చూశాడు అమర్. "భామినిని గురించి నువ్వేమనుకుంటున్నావో, ఉన్నదున్నట్లు నాకు చెప్పగలవా" అని యామినిని అడిగాడు.

ఆ ప్రశ్న ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడు అలా ఎందుకు అడుగుతున్నాడో తెలియక తికమక పడింది యామిని. అయినా జవాబు చెప్పింది. "ప్రత్యేకం నాకు ఆమెమీద అభిప్రాయమంటూ ఏమీ లేదు. మేమిద్దరం కలుసుకునీది లంచ్ అవర్ కొంచెంసేపు మాత్రమే! నాదృష్టిలో భామిని అమాయకురాలు. మంచి అమ్మాయి! కొంచెం ఓవర్ గా మాటాడుతుందిగాని, ఎప్పుడూ నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ ఉంటుంది, అది మంచిపనే
కదా" అంది .

"ఔను! నవ్వించడం మంచిపనే, కాదనను. కాని, తాను నవ్వుల పాలవ్వడం మంచిది ఎలాగౌతుంది? మితిమీరిన మేకప్పు, డీసెన్సీ లేని వస్త్రధారణ, ఆ.....!మ్చు..... ! " ఇంక చెప్పడం సభ్యత కాదన్నట్లు మాట తుంచేసి మౌనంగా ఉండిపోయాడు అమర్.

అదిరి పడ్డట్లై, తల వంచుకుని ఉండిపోయింది యామిని.

"మనతో పనిలేనివాళ్ళు కూడా వచ్చి, ఆమె చుట్టూ చేరి, గంటలతరబడీ చొల్లుకబుర్లు చెపుతున్నారని కంప్లైంట్ వచ్చింది. అంతా తలనొప్పిగా తయారయ్యింది!"

"మరి ఈ అమ్మాయిని మీరు ఇంటర్వ్యూకి పిలిచి మాటాడినప్పుడు చూడ లేదా?"

"లేదు. అలాంటిదేమీ జరగలేదు. మన "మైత్రీ ఫర్నిషింగ్సు"కి తొలి ఆర్డర్ ఇచ్చిన వీరేంద్ర భూపతికి ఈమె బంధువుట. అతని రికమెండేషన్ తో వచ్చింది ఈ ఉద్యోగానికి. చాలా పెద్ద ఆర్డర్ ఇచ్చాడన్న థ్రిల్ లో ఉన్నానేమో, వెంటనే ఒప్పేసుకున్నా. ఆ మరునాడు, నేను ఆఫీసుకి వచ్చేసరికి ఈమె రిసెప్షన్ డెస్కు దగ్గరవుంది, కష్టమర్సుతో కబుర్లు చెపుతూ." వికారంగా మొహంపెట్టాడు అమర్.

యామినికి నవ్వొచ్చింది. చిన్నగా నవ్వి, గమ్మున ఆపుకుంది. "భామిని మరీ అంత భయంకరమైన వ్యక్తి ఏం కాదు. పాపం! లిమిటెక్కడో తెలియక కొంచెం ఓవర్గా మాటాడుతుంది."

" కొంచెమా! ఆమెకు ఆ సంగతి సరిగా తెలిసీలా చెప్పగలవా?"

"నేనా?" ఆశ్చర్యపోయింది యామిని. మనసులో, "అమ్మో! అలా గాని చెపితే, వెంటనే అపార్ధం చేసుకుని ఆమె, తన పాప్యులారిటీ చూసి నేను జెలసీ పడుతున్నాననుకోవచ్చు. అటువంటి మాటలు చెప్పడం అనుకున్నంత తేలికేం కాదు" అనుకుంది .

అమరేంద్ర కూడా మనసులోనే అనుకున్నాడు, "ఛీ ! వీళ్ళు ఏం ఆడవాళ్ళో ఏమో! తమకు ఇష్టమొచ్చినట్లుగా, ప్రవోకింగా ముస్తాబయ్యి జనం మధ్యకి రావడం; మళ్ళీ, వాడిలా అన్నాడు, వీ డిలా చేశాడు అంటూ వీధిన పడి దెబ్బలాడడం .... , ఛీ! అసహ్యంగా! మరీ అంత సిగ్గుమాలిన తనం ఏమిటో ఈ జనానికి" అనుకున్నాడు. కాని, పైకి మాత్రం,"పదిమంది మధ్య తిరుగుతూ ఉద్యోగం చేసీటప్పుడు వస్త్రధారణ డీసెంటుగా, సింపులుగా ఉండాలనీ, మాటతీరు డిగ్నిఫైడ్ గా ఉండాలనీ చెప్పాలా ఎవరైనా? నీకు ఎవరు చెప్పారు" అని అడిగాడు యామినిని. .

యామినికి ఏమని మాట్లాడాలో తోచలేదు. ఆమె ఇంక అక్కడ ఆగకుండా మరుక్షణమే, పనుందని చెప్పి తన రూం కి వెళ్ళిపోయింది.

** *

లంచ్ అవర్ అవ్వగానే లంచ్ బాక్సు చేత్తో పట్టుకుని యామిని గదిలోకి వచ్చింది భామిని, "అక్కా" అంటూ. మరునాడు జరగబోయే డీలర్సు మీటింగ్ లో చెయ్యాల్సిన ప్రెజెంటేషన్ కోసం పేపర్లు చూసి ముఖ్య విషయాలను నోట్ చేస్తున్న యామిని, ఆమెను చూడగానే ఆ పేపర్లను డ్రాయర్లో పెట్టి, దాని తలుపు మూసి లేచింది. భామిని ఉన్నచోట మరే పనీ జరగదన్నది ఆమెకు అనుభవంలో ఉన్న విషయమే కావడంతో.

"హలో, భామినీ" అంటూ పలకరించి, యామిని తన లంచ్ బాక్సు తెచ్చుకుని వచ్చి ఆమె పక్కన కూర్చుంది.

ఈ వేళ చూసినట్లు , యామిని ఇదివర కెప్పుడూ భామినిని పరిశీలనగా చూసింది లేదు. ఈ రోజు భామిని, గులాబి రంగు నైలాన్ చీర కట్టుకుని, దానికి మాచ్ అయ్యే లోనెక్ గులాబీరంగుదే బ్లౌజ్ వేసుకుంది. పైన చీర కప్పిఉన్నా, అది ఉలిపిరిది కావడంతోనూ, చీరను దిగువకంతా కుదించి కట్టడం వల్లా ..... ఆమె నాభి, నడుమూ కూడా ప్రస్ఫుటంగా బయటికి కనిపిస్తున్నాయి. మొహానికి స్నో పూసి పైన దిట్టంగా పౌడర్ మెత్తడంతో తెల్లగా, ఒకవిధమైన మెరుపుతో ఉంది ఆమె ముఖం. నుదుట దోసగింజను పోలిన బొట్టు, పింక్ రంగుది పెట్టుకుని దాని చుట్టూ ముత్యపు రంగు చుక్కలు పెట్టింది. మధ్య పాపిడి తీసి, జుట్టు రెండువైపులా ఎత్తుగా వచ్చేలా దువ్వి, వెనక వదులుగా జడ అల్లి, సగంలో వదిలేసింది. తలనిండా పూలు, మెడనిండా నగలు! రెండుచేతుల వేళ్ళకీ ఉంగరాలు; చెవులకు, ఆమె తలతిప్పుతూ మాటాడుతుంటే కదిలి తళతళా మెరిసే పెద్దపెద్ద లోలకులు ఉన్నాయి.

విపరీతమైన అలంకరణతో ఉన్న భామిని, తన కళ్ళకు అచ్చం, గాలికి ఊగిసలాడే కొండపల్లి బొమ్మలా కనిపించడంతో యామినికి నవ్వు వచ్చింది. పొంగి వస్తున్న నవ్వును ఆపుకోడానికి ఆమె చాలా కష్టపడవలసి వచ్చింది.

ఎప్పటిలాగే భామిని చెప్పే కబుర్లు వింటూ యామిని భోజనం చేస్తోంది. భోజనాలయ్యి బాక్సులు సద్దుకుంటూండగా భామిని అకస్మాత్తుగా, "అక్కా" అని పిలిచింది.

చేస్తున్న పని ఆపకుండానే తలెత్తి చూసింది యామిని.

"అక్కా! మన బాస్ ఈ భూప్రపంచం మొత్తంలోనే "మోస్టు హాండ్సం గై" కదూ?" అంది భామిని .

దానికి జవాబు ఏం చెప్పాలో తెలియలేదు యామినికి. జవాబు రాకపోడంతో మళ్ళీ అదే రెట్టించింది భామిని.

జవాబు చెప్పేవరకూ భామిని విడిచిపెట్టదని తెలిసివున్నది కావడంతో, ఏమీ తోచక గోడమీది పిల్లి వాటంగా మాటాడింది యామిని, " ఆయన నీకు అంత హాండ్సమ్ గా కనిపిస్తున్నారంటే ఆయన నీకు బాగా నచ్చారని కదా అర్థం" అంది.

"నిజమే అక్కా! సారు నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేశారు. ఎప్పుడూ ఆయన్నే చూస్తూ ఉండిపోవాలని ఉంటుంది. నీకలా అనిపించదా? నిజం చెప్పు" అని అడిగింది భామిని.

"ఇప్పుడు నా సంగతి అప్రస్థుతం. నాకు ఇతర విషయాలన్నింటికన్నా ఈ ఉద్యోగమే ముఖ్యం. నీ కాయన నచ్చారన్నావ్, బాగుంది. ఇక ఆయనకి ఏం నచ్చుతుందో కూడా తెలుసుకోవాలి కదా నువ్వు! ఎప్పుడైనా ఆ సంగతి ఆలోచించావా?" సూటిగా భామినినే చూస్తూ అడిగింది యామిని.

"నా కదేం తెలియదు అక్కా! నువ్వు చెప్పు. నువ్వైతే ఎప్పుడూ కూడా కూడా ఉంటావు కనక నీకు తెలుస్తుంది. ప్లీజ్!అదేమిటో నాకు చెప్పవా అక్కా?"

"నేను కూడా కూడా ఉంటానన్నది నిజమే గాని, మేము ఎప్పుడూ మా ఉద్యోగ విషయాలు తప్ప ఇతరమైనవేమీ చెప్పుకోము. అయినా నాకు అనిపించింది నీకు చెపుతా విని అర్థం చేసుకో....." అంది యామిని.

" ఏమిటది అక్కా! చెప్పవూ? నేనది తప్పకుండా ఫాలో ఔతా" అంటూ తొందర పెట్టింది భామిని.

"అదేం పెద్ద విశేషం కాదు. ఆయనకి గాడీగా ఉన్నవాటికంటే సింపుల్గా ఉన్నవి ఎక్కువగా నచ్చుతాయని నా అభిప్రాయం. అది కేవలం నా అభిప్రాయం మాత్రమే సుమీ! ఋజువడక్కు" అంది యామిని.

"అంటే నీలాగన్నమాట! కదూ?" కాటుక అద్దిన కనురెప్పల్ని రెపరెపలాడించింది భామిని.

గతుక్కుమంది యామిని. భామిని తన మాటల్ని ఎలా అర్థం చేసుకుంటుందో నని భయపడింది. ఏమీ మాటాడకుండా పని తొందరలో ఉన్నట్లు టిఫిన్ బాక్సు సద్దుతూ మౌనంగా ఉండిపోయింది.

లంచ్ అవర్ ఐపోడంతో భామిని తన సీటు దగ్గరకి వెళ్ళిపోయింది.

** *

అమరేంద్ర ఆ నెలలో ఫర్నిచర్ డివిజన్లో వచ్చిన ప్రోగ్రెస్ ని గురించిన వివరాలు హెడ్డాఫీస్ కి రిపోర్టు పంపించే హడావిడిలో ఉన్నాడు. ఫైళ్ళు రిఫర్ చేసి, అతడు చెపుతున్న డేటా నోట్ చేసుకుంటోంది యామిని. అప్పుడు ఫోన్ రింగయ్యింది.

అమరేంద్ర ఫోన్ ఎత్తి, "అమరేంద్ర హియర్" అన్నాడు. అవతలిమాట వినగానే, ఫోను యామినికి అందిస్తూ, "ఇది నీకు, మీ ఊరినుండి"అన్నాడు.

ఇంటినుండి ఫోన్ అనగానే యామినికి ఒళ్ళు ఝల్లుమంది. తన తండ్రికి ఏదైనా కష్టం వచ్చిందేమోనని కంగారు పడింది. ఆమె ఆ ఫోన్ నంబరు వకుళకు మాత్రమే ఇచ్చింది. ఆమె ఇలా అర్ధంతరంగా తనకు ఎందుకు ఫోన్ చేసినట్లు!?

"ఈ ఫోన్ నీకే! ఇంటినుందడి. పర్సనల్, తీసుకో" అంటూ మళ్ళీ హెచ్చరించాడు అమర్. అప్పుడు వణికే చేతులతో ఫోన్ తీసుకుని, "హల్లో"అంది యామిని భయం భయంగా.

మ్లానమై ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చున్న అమర్ క్షణ క్షణానికీ వికసిస్తున్న ఆమె ముఖారవిందాన్ని చూసి, అదేమీ దుర్వార్త కాదని అర్థం చేసుకున్నాడు.

యామిని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. "తప్పకుండా వస్తా. అదిసరే. రాకుండా ఎలా ఉండగలననుకున్నావు" అంది. ఆ తరవాత ఫోను క్రేడిల్ మీద పెట్టేసింది.

"అంతా బాగున్నారని నీ మొహమే చెపుతోంది. ఇంతకీ ఏమిటిట విశేషం?"

" విశేషమే సర్! నాకు గురు, శుక్ర వారాలు సెలవు కావాలి. మళ్ళీ సోమవారం మామూలుగా ఆఫీస్ టైంకి తిరిగి వచ్చేస్తా. ఒక రోజు మినీ పుట్టినరోజు, రెండోది ఆమెకు అక్షరాభ్యాసం జరిగేరోజు. శని ఆదివారాలు కూడా కలిసివచ్చాయి."

"మినీయా! అదేం పేరు?"

"పూర్తి పేరు యామినీ పూర్ణతిలక! ముద్దుగా "మినీ" అంటాం. మినీ మురళీ కూతురు. చాలా తెలివైనది. అందుకే మూడేళ్ళు నిండగానే అక్షరాభ్యాసం చేసెయ్యాలనుకున్నారు." పట్టరాని సంతోషంతో యామిని పూర్వాపరాలన్నీ మరిచిపోయి, ఆట్టే ఆలోచన లేకుండా మాటాడేసింది.

" వట్టి పప్పుసుద్ద అనుకున్నాగాని ఘటికుడే! నువ్వతని చెంప పగలకొట్టినా, కూతురుకి నీ పేరే పెట్టాడంటే ఏమనుకోవాలిట! ఔనులే, అలనాడు కృష్ణ పరమాత్మ తనను ఎడమకాలితో సత్యభామ తలమీద తన్నినా కోపగించలేదుట! ఈ దద్దమ్మ, తను కూడా ఒక కృష్ణ పరమాత్ముళ్ళా ఫీలైపోతున్నాడు కాబోలు" అన్నాడు వెటకారంలా.

ఉవ్వెత్తున ఎగసిన ఉత్సాహమంతా నీరుకారిపోగా, కసిగా అనుకుంది యామిని, "దుర్మార్గుడు! మారాడనుకున్నా గాని, ఏమీ మారలేదన్నమాట! ఇక ఈ జన్మకి నాకు పట్టిన ఈ బంక వదలేది లేదు కాబోలు ! అనాలోచితంగా చేసిన ఒకే ఒక్క పొరపాటుకి జీవితాంతం శిక్ష అనుభవిస్తూ ఉండాల్సినదేనా! ఇలాంటప్పుడే నాకు ఈ ఉద్యోగం వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఉద్యోగం వదిలి పోడానికి కూడా వీలుకాని పరిస్థితి నాది. ఏది ఏమైనా రాసిన బాండు టైమ్ పూర్తైన తరవాతి క్షణం నేనిక్కడ ఉండను. వేరే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతా ... " అలా అనుకుని గాయపడిన మనసుని సరిపెట్టుకునే ప్రయత్నం చేసింది యామిని.

అదృష్టవశాత్తూ, అక్కడ ఏ విస్ఫోటనం జరక్కముందే భామిని ఫోను చేసింది, ఎవరో కస్టమర్సు బల్కు ఆర్డరుతో వచ్చారంటూ. దాంతో అక్కడి సీను మొత్తం మారిపోక తప్పలేదు.

** *

బంధువుల ఇంట్లో పెళ్ళని శలవు తీసుకుని వెళ్ళిన భామిని, నాల్గు రోజులు గడిచాకగాని తిరిగి రాలేదు. ఆ రావడం కూడా వేరే అమ్మాయి - అనిపించేలా పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ తో వచ్చింది.

అమరేంద్ర ఆఫీసుకి రాగానే అతన్ని విష్ చెయ్యడానికి కుర్చీలోంచి లేచి నిలబడ్డ భామినిని చూసి అతడు ఆనవాలు పట్టలేకపోయాడు. ఆనవాలు పట్టాక కూడా ఆశ్చర్యంతో, తిరిగి ఆమెను విష్ చెయ్యాలన్న విషయం మర్చిపోయాడు. దానికి కారణం ఆమె ఆహార్యంలో లో వచ్చిన పెను మార్పు!

ఆమె రోజూలా కాకుండా ఈ వేళ చక్కని జరీ అంచుతో ఉన్న వెంకటగిరి చీర కట్టుకుని, అదే రంగులో ఉన్న హైనెక్ జాకట్టు తొడుక్కుని, యామినిని ఇమిటేట్ చేస్తూ సింపుల్ గా, డీసెంటుగా ముస్తాబై వచ్చింది. జుట్టుకూడా నున్నగా దువ్వి, కొసదాకా అల్లుకుని చివరలో చక్కగా రిబ్బన్ మడిచి కుచ్చు పెట్టుకుంది. ఇదివరకులా అన్ని వేళ్ళకీ కాకుండా, కుడిచేతి అనామికకు మాత్రమే ఒకే ఒక వజ్రపు పొడి ఉన్న ఉంగరాన్ని పెట్టుకుంది. కుడిచేతికి రెండు బంగారు గాజులు, ఎడమచేతికి రిష్టువాచీ ఉన్నాయి. మొహానికి కూడా పెద్దగా మేకప్ చేసుకోకుండా కొద్దిగా పౌడర్ రాసుకుని, నుదుట కనుబొమల మధ్యలో తిలకపు చుక్క పెట్టుకుంది. అమెనలా చూసి స్టాఫ్ అందరూ విస్తుపోయారు.

"అద్భుతమైన మార్పు! యామిని ఏం ట్రిక్ చేసిందోగాని, అది ఎంతో బ్రహ్మాండంగా పనిచేసింది" అనుకున్నాడు అమరేంద్ర, తన చాంబర్ లోకి వెళుతూ. ఆ తరవాత యామిని కనిపించినప్పుడు, మెచ్చుకోలుగా అదేమాట అని, థాంక్సు చెప్పాడు. అక్కడితో ఊరుకోకుండా, "ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం! నీ దగ్గర ఏదైనా మేజిక్ వేండ్ గాని ఉందా ఏమిటి" అని అడిగాడు ఆమెను.

యామిని తెల్లబోయింది. "మీరంటున్నదేమిటో నాకు తెలియడం లేదు" అంది.

"నువ్వు చూడలేదా భామినిని?"

"ఓ! అదా మీరు చెప్పేది" అంది యామిని చిరునవ్వుతో.

"ఔను, అదే! ఏం మందు వేశావేమిటి, జబ్బు ఇట్టే కుదిరిపోయింది" అన్నాడు అమర్ తనూ నవ్వుతూ.

"ట్రిక్కులూ, మేజిక్కులూ, మందులూ, మంత్రాలూ లాంటివేమీ నాకు తెలియవు. ఏదో మాటలసందర్భంలో అడిగితే, సారుకి గాడీగా ఉంటేకన్నా సింపుల్గా ఉంటేనే ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది నాకు - అని చెప్పా. ఆ ఒక్క మాటే కారణం కావచ్చు ఈ మార్పు కంతటికీ " అంది యామిని.

అమర్ ముఖంలో రంగులు గబగబా మారిపోయాయి. "చచ్చాం ఫో" అన్నాడు అప్రయత్నంగా. మళ్ళీ అంతలోనే సద్దుకుని, " కారణం ఏదైతేనేంలే, మనం ఆశించిన మార్పు ఆమెలో వచ్చింది, అది చాలు" అన్నాడు.


***
(సశేషం)



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)