కథా భారతి
అనగనగా ఓ కథ -
కష్టార్జితం
- రచన : బులుసు జీ ప్రకాష్
దుర్లభం త్రయమేవైత ద్దేవానుగ్రహ హేతుకమ్
మనుష్యత్వం ముముక్షుత్వం మహా పురుష సంశ్రయః
‘మానవజన్మ, మోక్ష జిజ్ఞాస, పరమార్ధ జ్ఞానులైన మహాపురుషుల సాంగత్యము అనే ఈ మూడున్నూ దైవానుగ్రహం లేనిదే లభ్యం కావు’ అని ఆదిశంకరులవారు సెలవిచ్చినట్టు - నేనీ కార్యాలయంలో కొత్తగా నూనూగుమీసాలనూత్న యౌవనంలో ఉద్యోగిగా చేరేసరికి అప్పలస్వామిగారిమిత్రత్వం నాకు ప్రాప్తించింది.
పాపం! అప్పలస్వామిగారు సహృదయులు, అందరి శ్రేయోభిలాషులు అయినా, నాకుమాత్రం అధిక శ్రేయోభిలాషులు. వారికి నాపైగల ప్రత్యేక ఆదరాభిమానాలు ఇంకొకరిపై ఉంటాయని నేను భావించడం లేదు. భావించను కూడాను.
కొత్తగా కార్యాలయంలో అడుగు పెట్టి కుడ్యాల నలంకరించిన ప్రముఖ దేశనాయకుల చిత్రపటాలను తిలకిస్తూ, గుటకలు వేస్తున్న తరుణంలో తరుణ వయస్కులైన అప్పలస్వామిగారు భుజంమీద చెయ్యివేసి, కొత్తగా గుమాస్తాగా చేరబోయే పుణ్యశ్లోకరావు నువ్వేనా నాయనా? అని ఆప్యాయంగా అడిగేరు.
ఆయన పవిత్ర హస్తం నా గాత్రం మీద పడగానే కాయం పులకరించింది. ఆ నెమ్మది, ఆ మంచితనం. ఆ పుత్రవాత్సల్యం చూస్తే ఎంతటివారికైనా గుండె నీరవుతుంది.
అవున్నేనేనండీ! నమస్కారం! అన్నాను.
వెళ్ళు- తలగుమాస్తాని కలుసుకో. నువ్వు చెయ్యవలసిన పనేమిటో చెప్తాడు అన్నారు.
అప్పలస్వామిగారు చూస్తే నన్ను తలగుమాస్తా దగ్గరకు వెళ్ళమన్నారు.
ఇంతకీ ఈయనెవరు? ఈయన నిర్వహించే పదవి ఏమిటి?
సరే - ఏదో ఆప్యాయంగా మృదువుగా చెప్పేరు. ఆయనమాట త్రోసిరాజనడం ఎందుకని, వెళ్ళి తలగుమాస్తాని కలిశాను. ఒక ఖాళీ కుర్చీ చూపించి, నన్నందులో కూర్చోమన్నాడు తలగుమాస్తా. కూర్చుని ఏవో పాతకాగితాలు తిరగేస్తూ, చదువుతూ, అందులో ఉన్న విషయాలను అవగాహన చేసుకోమన్నారు. నేనలాగే చేస్తున్నాను.
మిమ్మల్ని అధికారిగారు రమ్మని కబురుపెట్టేరు. వెళ్ళండి.. అని ఆదేశించాడు తలగుమాస్తా.
నేను కార్యాలయంలో చేరి రెండు గంటలయ్యింది కాని ఇంతవరకూ అధికారిగారిని చూడలేదు.
సరే బయలుదేరాను.
నా అదృష్టం ఏమోగాని అధికారి గారు దయార్ధ్ర నవనీత హృదయులైన అప్పలస్వామిగారే!
తన క్రింది ఉద్యోగుల్ని తుఛ్ఛంగా చూడక, సమదృష్టితోను, పుత్రవాత్సల్యంతోనూ చూసే అప్పలస్వామిగారి వంటి అధికారులు ఎంతమంది ఉంటారు?
నమస్కారమండీ అని చేతులెత్తి జోడించాను.
" వచ్చావా నాయనా! రా కూర్చో! " అని ఎదుటి కుర్చీని చూపించారు.
న ప్రక్కన కూర్చున్న మరో ఇద్దర్ని అవతలకి వెళ్ళమన్నట్టుగా సంజ్ఞ చేశారు. దీన్ని బట్టి చూస్తే వారు నాతో ఏకాంతంగా ఏదో మాట్లాడ నిశ్చయించుకున్నారని అనుకున్నాను.
నీకు తల్లీ తండ్రీ ఉన్నారా నాయనా? ప్రశ్నించారు.
ఉన్నారండీ!
మీ నాన్నగారేం చేస్తున్నారు?
ప్రస్తుతం విజయనగరం సంస్థానంలో పనిచేస్తున్నారండీ!
అయితే నీకూ ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం కనుక భోజనం గడిచిపోతుంది. నీకొచ్చే జీతం నీ స్వంతానికి వాడుకోవచ్చునన్నమాట.
అంతా స్వంతానికే వాడుకుంటే ఎల్లాగండీ! ఇన్నాళ్ళూ వాళ్ళు పెంచి పెద్దచేసినందుకు వారికేమైనా ఇవ్వాలి కదా? అందులోకి మా నాన్నగారు త్వరలోనే రిటైరవుతున్నారాయె అన్నాను.
అదే నీకు నేను చెప్పదలచాను. ఎవరైనా డబ్బు రుణం ఇమ్మంటె అలాగే చెప్పు!
ఈ ఆఫీసులో ఏమాత్రం అవకాశం ఉన్నా, అప్పు తెమ్మంటూంటారు తోడి గుమాస్తాలు. వాళ్ళు చేసే ఒత్తిడికి తట్టుకోవడం కష్టం.
నీ మనసు కరగించి, నీకు జాలి కలిగించేట్లు చేయాలని గొప్పగా నటనలు చేస్తారు. పిల్లాడికి జీతంకట్టాలి. ఇవాళ కట్టకపోతే బడిలో తీసేస్తారు. వాడి జీవితం పాడైపోతుంది. ఇల్లాలికి విపరీతంగా జబ్బుచేసింది. ఈ క్షణంలో మందు కొనకపోతే దాని ప్రాణాలు దక్కవు. రక్షిమ్చు. అని వారి కుటుంబ బాధలు వర్ణిస్తూ నీ సానుభూతి సంపాదింపజూస్తారు. ఒకసారి ఇచ్చావా మరి నీ డబ్బు నువ్వు కళ్ళచూడవు! వారికేవిధంగాను లొంగకు జాగర్త! అని హెచ్చరించారు.
అప్పలస్వామి గారి హెచ్చరికను మననం చేసుకుంటూ పని చేసుకుంటున్నాను.
మా గుమాస్తా సోదరులతో ఈ నెల రోజుల్లోనూ ముఖపరిచయమైనా సర్గ్గా అవలేదు. అప్పలస్వామి గారు చెప్పినట్లు అపుడే ఒక మిత్రశ్రీ దాపరించేడు.
నమస్తే పుణ్యశ్లోకరావుగారూ! అన్నాడతను.
నేను నోటిమాట లేకుండా ప్రతి నమస్కారం చేశాను.
వర్కు బాగా పికప్ చేస్తున్నారా? అడిగేడు.
చేస్తున్నానన్నట్లు తలకాయ ఊపాను.
కొంచెం తొందరగా అవసరం వచ్చింది. నా భార్యకు గర్భస్రావం కలిగి సుస్తీ చేసింది. ఓ పదిరూపాయలిద్దురూ! రెండ్రోజుల్లో ఇచ్చేస్తాను అన్నాడతను.
నాకు అవకాశం లేదండీ! నేను జీతం అందుకోవడం ప్రధమం కూడానా?
మా నాన్నగారికి లెక్క చెప్పాలి. అన్నాను.
ఇటువంటి సమాధానాలు నిర్మొహమాటంగా నలుగురైదుగురికి చెప్పేను.
ఈ సందర్భంలో అప్పలస్వామిగారికి నేనెంతో ధన్యవాదాలర్పించాను. ఆ మహాభాగుడే కాని ఈ గుమాస్తా సోదరుల సంగతి ముందుగా తెలియపరచక పోతే, నేను అప్పివ్వడమూ వాళ్ళ ఎగవెయ్యడమూ తప్పదుకదా!
నేనో చచ్చుదద్దమ్మని! ఎదుటివాడు చెప్పింది అబద్ధమో, సుబద్ధమో తెలుసుకునేటంత చతురత నాకు లేదు. వాళ్ళడిగిందేదో ఇచ్చివెస్తినా - నా గతేం కాను! ఆ అప్పలస్వామిగారి చల్లని చూపు వల్లనే ఏదో ఇలా ఈడ్చుకొస్తున్నాను.
రెండోసారి కూడా జీతం అందుకున్నాను. కొంత డబ్బుతో కొత్త బట్టలు కుట్టించుకోవాలని సంకల్పం.
ఇంతలో అధికారిగారైన అప్పలస్వామిగారు రమ్మన్నారని కబురు. తక్షణమే బయల్దేరాను. ఈ పర్యాయం నా మేలుకోరి ఏమని హెచ్చరించనున్నారో ఏమో! ఆయన హెచ్చరికను పాటించకపోతే నా డబ్బు ఏంకాను?
రావోయ్ పుణ్యశ్లోకరావు ! కూర్చో! అని కుర్చీ చూపించారు. కూర్చున్నాను.
నాకు ఈ నెల ఎక్కౌంటెంటు జనరల్ దగ్గర్నుంచీ పేస్లిప్ రాలేదోయ్!
అంచేత నా జీతం డ్రా చేసుకోలేక పోయాను. నీ జీతంలో ఓ వందరూపాయలు ఇవ్వవోయ్! మళ్ళీ రెండ్రోజుల్లో ఇచ్చేస్తాను అన్నారు.
ఎంతటివారికైనా కష్టాలొస్తాయి. ఇంత పెద్ద అధికారీ ఎంతో కష్టంలోఉండకపోతే అడగడు కదా అనివెంటనే ఇచ్చేశాను.
ఒకటి కాదు, రెండు కాదు ఆర్నెల్లు గడిచయి కాని, అప్పలస్వామిగారు నాకివ్వవలసింది ఇవ్వలేదు. ఇవ్వమని అడిగే సాహసం నాకు లేదు. అడిగితే ఆయనకి కోపం వచ్చినన్ను ఉద్యోగంలోంచి ఊడబెరికితే?
ఆఖరికి నా వందరూపాయలూ నాకు దక్కలేదు.
కష్టార్జితం ఎప్పుడూ పోదని మహానుభావులంటారు. అది నిజమని నాకుతోచదు. నేను కోల్పోయిన వంద రూపాయలూ కష్టార్జితమే కాని అక్రమార్జితం కదే?
శిఖ్కు మతాచార్యుడు నానక్ కష్టార్జితం పోదని, పోయినా దొరికి తీరుతుందని ఉపన్యసిస్తున్నాడు. ఒక శ్రోత లేచి ఇదిగో ! నా వేలిఉంగరం నా కష్టార్జితమే. ఇది ఎదురుగా కన్పిస్తున్న చెరువులో పారేస్తాను. మీరు చెప్పింది నిజమో కాదో పరిశీలిస్తాను! అన్నాడు.
అలాగే చూడమన్నాడు నానక్. శ్రోత ఉంగరాన్ని సరస్సులో పారవేశాడు. అది ఒక చేపమింగడం ఆ చేప జాలరి వలలో చిక్కడం, అతను చేపను కోయగా ఉంగరం దొరకడం అది మళ్ళీ భద్రంగా యజమానికి అందివ్వడం జరిగిందిట.
ఈ దృశ్యం నా తలంపుకు వచ్చి కళ్ళకు కట్టినట్లు అనిపించింది.
కాని నా డబ్బు నాకు దక్కలేదు!
ఇప్పుడు నేను రిటైరయి పింఛను దారుణ్ణయ్యాను కూడా! కష్టార్జితం పోదా?
- - -
నాకు అవకాశం లేదండీ!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)