కబుర్లు
ముద్దూ ముచ్చట
(ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం- ఆ సందర్బానికి అనువుగా ఓ గల్పిక)
- కర్లపాలెంహనుమంతరావు
'ప్రకృతి వరం- జీవితం.జీవితం వరం- ప్రేమ . ప్రేమ వరం- ముద్దు' అంటాడు ఉమర్ ఖయాం. 'గంభీరవారాశికల్లోలమండలం, బంభోజవైరి ముద్దాడుచుండె,/అత్యున్నతంబైన యవనీధ రానీక, మంబోధ పటలి ముద్దాడుచుండె..' అంటో ముద్దుకుఅచేతనాలే మురుసి పోతుంటేమనిషి చిత్తవృత్తినిగురించి మరిక చెప్పేదిఏముంది?' అవును.. ఒకపార్శీ కవి అన్నట్లు కండచక్కెర, కలకండ పటిక, కదళీ ఫలం, ఖర్జూర మిశ్రమం, గోక్షీరసారం, ద్రాక్షారసం, దివ్యామృతం, అలరుతేనెల ధార, చెరుకు రసాల చవులు దేనిలోనూలేనిదీ ముద్దులోపలి తీపి. వట్టి రుచేనా.. మనసుముడతలను సరి చేసేదీ ఈపెదాల ముడితడే. పెదవి పెదవి కలిసాయంటేసగం సంగమం శుభప్రదమయినట్లే. 'సపది మద నానలో దహతిమమ మానసం, దేహి ముఖకమల మధుపానం' అంటూప్రియనాయిక మధురాధరాల కోసంవూరికే ఆరాటపడతాడా జయదేవుడిఅష్టపది నాయకుడు! 'అన్యులెవరు చూడకుండగొల్లభామా! ఒక్క/ చిన్ని ముద్దు బెట్టిపోవే గొల్లభామా!' అని నల్లనయ్యనే గొల్లభామవెంట పరుగులెత్తించి అల్లరిపెట్టింది ఈ అధరవల్లరి.'కన్నుల కపూర్వమైన చీకటులు గవియు, గాఢముగమేనికి వింత మైకమ్ము గ్రమ్ము/చిత్తమున కేదో యున్మాదమత్తమిల్లు, చెక్కిళ్ళు ముద్దిడునవసరమున.' అదీ మధురాధర సంగమావస్థమదనావస్థ. మదనతాపానికి ప్రథమ చికత్స ప్రియముఖకమల మధువు ఆస్వాదనమే. ఆఔషధ సేవనం'సురగణాధీశ దుర్లభసుఖమొసంగు, అగణితాత్మ వ్యథాభార మణచివేయు/ భీష్మసదయప్రతాపంబు ప్రిదుల సేయు'. తొలిరేయి తొలిముద్దును గురించికలవరించని వారుఅసలు యవ్వనులేకారు.
నిజానికి తొలిముద్దు దొరికేది తల్లినుంచే. అమ్మవరం ఇచ్చిన పాపదైవానికి భక్తతల్లి సంతృప్తితో చెల్లించే ముడుపు- ముద్దు. 'నిండుమోమున పండు వెన్నెల హసింప/ చిల్క పల్కులు ముద్దులు గుల్కుచుండ/నల్లనల్లన గజ్జియల్ ఘల్లుమనగ/చిరునడతల దరిజేరే చిట్టితల్లి'ని ఏ తల్లి నిజానికి ముద్దాడకుండా ఉండ గలదు? గోరుముద్దలే కాదు..అమ్మ నాన్నలు ఆప్యాయంగా పంచి ఇచ్చేగోరువెచ్చని మురిపాల ముద్దులూ ఎదిగే బిడ్డలకు బలవర్థక ఔషధాలే. యవ్వనంలో మనసు కోరే, మనసును కోఱే ఆ 'ఛీ పాడు' ముద్దుతోనే అసలు పేచీ. తలుపు చాటునో, పెరటిచెట్టు చాటునో, పొలం గడ్డిమేట చాటునో.. పెదవి పై పడే మొదటి ఎంగిలి ముద్రే జీవితాంతం మనసు పుస్తకంలో భద్రంగా మిగిలే నెమలీక. 'తల్లిదండ్రియు దక్కు బాంధవులు జ్ఞప్తి, దొలగిపోదురు వలచిన పొలతిమిన్న/నిద్దపుంజెక్కిలిని ముద్దు దిద్దువేళ' అన్నారు కవి దాశరథి.వెనక వచ్చిన ఆ కొమ్ముల విసురు మగాడికైతే అతిశయ బాహాటమే కానీ మగువకు మాత్రం మనసుతో సైతం పంచుకో సంశయించే అనుభవం. ఆ ముద్దుల్లో మళ్లీ ఎన్ని రకాలు! 'కార్యార్థియై యధికారిబిడ్డల చేరి, బుడిబుడి నద్దించు ముద్దు వేరు,/వెలయిచ్చి కూడెడు వెలయాలి చెక్కిళ్ళ, మురువుమై పొరలించు ముద్దు వేరు/చిన్నారిపొన్నారి చిరుత పాపల పాల, బుగ్గల గీలించు ముద్దు వేరు/నవమాసాగమమందు గవగూడు ప్రియురాలి, ముద్దు చెక్కిలిబెట్టు ముద్దు వేరు/ స్వప్నమున దాను వలచిన సారసాక్షి, నిద్దపుం జెక్కిలిబెట్టు ముద్దు వేరు'. అధరాలు అవే. ఎవరివి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆదానప్రదాలు చేస్తున్నాయన్నదే ప్రధానం. చేతి వేళ్ళ మీద అద్దే ముద్దు అభిమాన సూచకం. నుదుటి మీద దిద్దే ముద్దు భరోసాకు చిహ్నం. చుబుకం మీద సాగే చుంబనం సంసిద్దతకు అద్దం. పెదాలపైని ముద్దుదైతే పతాకస్థాయే. చెవుల దొప్పలు, ముక్కు చివరలు కంటిరెప్పల వంటి ఏ ఇతర వంటిభాగాలైనా ముద్దుసీతాకోకచిలుక రాక కోసం ఎదురు చూసే పద్మపుష్పాలే.
మనిషి పెదాలు మాత్రమే ముద్దుకు అనువుగా సృషించినట్లుంటాయి. స్పర్శ నాడుల చివరలకన్నీ చివుళ్ళ చివరనే ముడి. మనసు లోపలి ఉద్వేగాలవడి ముందుగా బైట పడేదీ అధర ముఖద్వారాలనుంచే. సిగ్గు, బిడియం, కామన, సంశయం, భయం, అసహ్యం.. ఏది ముంచుకొచ్చినా చివురుటాకుల్లా ముందు వణికేవ పెదవి చివరి భాగాలే. ముద్దులాడుకునే వేళ 'డోపమిన్' అనే రసాయనం మోతదుకి మించి విడుదలై ఆకలి మందగించడం, నిద్రకు దూరమవడం సహజం. 'ఆక్సిటోసిన్' అనే మరో ప్రేరకం అధికంగా విడుదలై శృంగారవాంఛ రెట్టింపు అవుతుంది.'న్యూరోట్రాన్స్ మీటర్స్' మెదడులోఉత్పన్నమై గుండె లబ్ డబ్ ల వేగం పెరిగిపోతుంది. మనిషి జీవితంలో ముద్దు పద్దు సరాసరి 20,160 నిమిషాలు. నిముషం ముద్దుకు 20 కేలరీలు ఖర్చు. ముద్దుకో శాస్త్రమూ కద్దు. పేరు 'ఫైల్మేతాలజీ'. మమకార ప్రకటనకి ముప్పై నాలుగు కండరాల సహకారం అవసరం. వ్యాధుల సంక్రమణంలోనూ ముద్దుదే ముఖ్య పాత్ర .'నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా? నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా?' అంటో 'టాం టాం' కొట్టే పెదవులు నంటే ఉంటాయంటున్నారు అంటువ్యాధి కారక క్రిములు. అయినా ముద్దంటే చేదెవరికి? చంటిబిడ్డలనైనా అందుకే ఓ హద్దు దాటి ముద్దాడ వద్దని ఆరోగ్యశాస్త్రం హెచ్చరిస్తోంది. మన్మధ సామ్రాజ్య విహారయాత్రలో ముద్దు ఒక 'టోల్ గేట్'. మధువుకూ, ధూమానికి ఆమడ దూరం మధురాధరాల ఆదరం. నమిలిన తిండిని బిడ్డకు అందించడంతో ప్రేమగా పెదవులు కలపడం మొదలయిందని ఓ ఊహ. ముద్దు ఆలోచన ముందు రోమనులదే అని ఒక వాదం. భారతీయులకూ బోలెడంత చుంబన సాహిత్యం ఉంది. 'శతపథ బ్రాహ్మణ'మే ఉదాహరణ. ముద్దు సమయ సందర్భాలమీద పెద్దలకే పెద్ద అవగాహన లేదంటున్నారు శృంగార శాస్త్రవేత్తలు. వారానికి సగటున 11 సార్లేనుట దంపతుల మధ్య ముద్దాయణం. అదీ కంటిరెప్ప పడి లేచే లోపలే చప్పున చల్లారిపోతోందని, పెళ్లయిన ప్రతి ఐదుగురిలోనూ ఒకరు ముద్దుకు దూరమవుతున్నారని 'డెయిలీ ఎక్స్‌వూపెస్' బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్'సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వే సారాంశం. సంపాదనే లక్ష్యంగా సాగుతున్న సంసారాల్లో ముద్దు ముచ్చట్లు తగ్గిపోవటం ఆందోళన కలిగించే అంశమే. 'ప్రణయకోపము పంచబంగాళమైపోవు, నీసడింపులవెల్ల బాసిపోవు/మనసు బింకబెల్ల మటుమాయమైపోవు, నాత్మగౌరవమెల్ల నడగిపోవు/ కోటి రూకలును గవ్వకు సాటి రాకుండు, త్యాజంబుగా తోచు రాజ్యమైన/అవధి చెప్పగ రానియానంద మెసలారు, స్వాంతంబు తన్మయత్వంబు జెందు/' .అదీ ముద్దు మహిమ మరి. వద్దనుకుంటే ఎలా?
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)