సారస్వతం

అన్నమయ్య కీర్తనలు

 


- జి.బి. శంకర రావు

 

 

 


ఏలే ఏలే మరదాలా
ఏలే ఏలే మరదలా
చాలు చాలు చాలును
చాలు నీతోడి సరసాలు బావ

గాటపు గుబ్బలు కదలగ కులికేవు
మాటల తేటల మరదలా
చీటికి మాటికి చెనకేవు వట్టి
బూటకాలు మాని పోవే బావ

అందిందె నన్ను అదిలించి వేసేవు
మందమేలపు మరదలా
సందుకో తిరిగేవు సటకారి ఓ బావ
పొందుకాదిక పోవే బావా

చొక్కపు గిలిగింత చూపుల నన్ను
మక్కువ సేసిన మరదలా
గక్కున నను వేంకటపతి కూడితి
దక్కించుకొంటివి తగువైతి బావ

బావా మరదళ్ళ సరస సల్లాపాల యుగళ గీతం! జానపదశైలి! అచ్చ తెలుగు పదాల అందమైన పొందికలో జానపదుల గుండెల్ని పరవశింపచేసే రీతిలో రచన చేసిన అన్నమయ్య భావుకతకు జోహార్లు అర్పించవలసిందే.

గాటము = అధికమైన
గుబ్బలు = కుచములు
చెనకేవు = తాకేవు
బూటకాలు = మాయలు, వంచనలు
సటకారి = మోసకారి,
చొక్కపు = వాడియైన, మనోజ్ఞమైన
 

ఏవం శ్రుతిమత మిదమేవ
ఏవం శ్రుతిమత మిదఏవ త
ద్భావయితు మతఃపరం నాస్తి

ఆతులజన్మ భోగాసక్తానాం హితవైభవసుఖ మిదమేవ
సతతం శ్రీహరి సంకీర్తనం త -ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి

బహుళ మరణపరిభవచిత్తానా - మిహపరసాధన మిదమేవ
అహిశయనమనోహరసేవా త - ద్విహరణం వినా విధిరపి నాస్తి

సంసారదురితజాడ్యపరాణాం హింసావిరహిత మిదమేవ
కంసాంతక వేంకటగిరిపతేః ప్ర - శంసైవా పశ్చా దిహ నాస్తి
 
భగవంతుని నిర్మల అంతఃకరణముతో కీర్తించుట మాత్రమే వేద సమ్మతమైన మతము అని స్పష్టంగా అన్నమయ్య ఈ సంకీర్తనలో ఎలుగెత్తి చాటుతున్నాడు!. మనం ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది అని తగవులాడుకుంటూ కాలాన్ని వ్యర్దం చేసుకుంటాం! అలాకాక అన్నమయ్య చెప్పినట్టు ఈ సంకీర్తనామతాన్ని ఆచరిస్తే శ్రీహరి కృపకు సులభంగా పాతృలవుతాం.

1. వ చరణం
అతుల భోగాసక్తానాం = సాటిలేని జన్మభోగములయందు ఆసక్తులైన వారికి
హితవైభవసుఖం = మేలు గూర్చు ఐశ్వర్య సుఖము
ఇదం ఏవ = ఇదియే (అది)
సతతం = ఎల్లప్పుడు
శ్రీహరి సంకీర్తనం = శ్రీ మన్నారాయణుని సంకీర్తనయే
తద్వ్యతిరిక్తసుఖం = దానికంటే వేఱైన సుఖము
వక్తుం = చెప్పుటకు
నాస్తి = లేదు
 

2. వ చరణం
బహుళ మరణ పరిభవచిత్తానాం = అనేకములైన మరణావమానములతో కూడిన మనస్సుగల వారికి
ఇహపరసాధనం = ఇహలోకమునందున, పరలోకమందును (ఉత్తమగతికి) సాధనమైనది
ఇదం ఏవ = ఇదియే
అహిశయన మనోహరసేవా = శేషశయనుడైన శ్రీహరి యొక్క మనోహరమైన సేవయే
తద్విహరణం వినా = ఆ సేవా విహారము దప్ప
విధిరపి = (మరొక) విధానము గూడ
నాస్తి = లేదు

 

3. వ చరణం
సంసార దురిత జాడ్యపరాణాం = సంసార పాపమనెడు రోగములకు వశులైన వారికి
హింసావిరహితం = హింసలేనిది
ఇదం ఏవ = ఇదియే (అది)
కంసాంతక వేంకటగిరిపతే = కంసనాశకుడైన శ్రీ వేంకటాచలపతి యొక్క
ప్రశంసా ఏవ = గుణకీర్తనమే
ఇహ = ఈ విషయమునందు
పశ్చాత్ = దీని వెనుక (దీనికంటే)
నాస్తి = (మరొక మేలైన త్రోవ) లేదు

 

 




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)