ధారావాహికలు
రామ నామ రుచి
- ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం
కం. పంటలు పండక జనులెటు
లుంటిరొ ఇన్నాళ్ళపంటంచు నూహించగ లే
కుంటిని - ఆ విషయమె నే
నంటిని స్నేహితుని తోడ నలజడి పడుచున్
కం. ‘ఊరట్లు పాడుపడె - ఈ
యేఱును, కొలనును, పొలములు నీరీతి చెడెన్,
కారకులెవ రీ దుస్థితి
కౌరా! దాచకను తెల్పు మంతయు నాకున్’
కం. అని నే నడుగగ మిత్రుడు
వెనకాడుచు చెప్పెనపుడు వివరముగా, నే
జనిత క్లేసుడనై శ్ర
ద్ధగను వినగ జరిగిన దెల్ల తత్తఱ మొనయన్
తే.గీ “పద - నడువుము నగము పైకి - ముదముగ మును
ముందుగ మనము గుడిచూడ పోవుద - మిక
పోవు దారిలో తెలిపెద్ పూర్తిగ మన
యూరి కథ న” నుచు బయలుదేరి పలికె;
తే.గీ “ఈ వెఱిగిన జమీందారు డీల్గే ముప్ప
దేండ్ల ముందు - అంతకు ముందె ఎల్ల ఆస్తు
లాఱిపోయె జమీన్లు రద్దగుట వలన -
ఉన్న సొమ్ముతోడను కొడు కూరు విడిచె.
తే.గీ అప్పటి దనుక ప్రభువులే అచ్చుకొనుచు
విధిగ నేటేట చెఱువు త్రవ్వించువారు -
నేడు మన యూరి కేలిక లేడు గనుక
చెఱువు త్రవ్వించ నెవ్వారు చేరరైరి.
తే.గీ. జనుల విజ్ఞప్తి పైన పంచాయితీయు
తగిన తీర్మానమును జేసి త్వరితగతిని
పంపిరి ‘సమితి’ కి చెఱువు పనులు తత్ క్ష
ణంబు చేపట్టుటకు సమ్మతంబు తెలుప.
తే.గీ. అచట కొన్ని నెలలు జాప్యమయ్యె గాని,
సమితి సభ్యుల మనవారు శాంతపరచి
పంపజేసి ‘రెమ్మెల్యె’ ‘సిఫార్సు’ తోడ
‘ఆర్.డి.వో.’ గార్కి తగు ఆర్ధికానుమతికి.
తే.గీ. ఆయ ననుకూలముగ ‘పైలు’నందు వ్రాసి
పంపె నామోదము కొఱకు ‘పరిషదు’ నకు
వారలంత చర్చించి ఈ పనిని జేయ
ఎంచి ‘కంట్రాక్టరు’ ను నియోగించినారు.
తే.గీ. ఇంత జరుగుట కోస మైదేండ్లు పట్టె.
అంతలోన మన చెఱవు కంతలన్ని
పూడై, నైనను గాని ఇప్పుడిక చెఱువు
బాగుపడునని తెలిసి మా బాధ తగ్గె.
తే.గీ. తనకు ‘కంట్రాక్టు’ నివ్వ లేదనుచు నొకడు
రెచ్చి అంతలో ‘కోర్టు’న ‘రిట్టు’ వేయు
సరికి గౌరవనీయులౌ ‘జడ్జి’ గారు
‘స్టే’ ని మంజూరు చేసిరి స్థిరము గాను
తే.గీ. ఊరి నాయకు లిది విని నోరు నెత్తి
బాదు కొనుచు తగిన న్యాయవాది నొకని
‘కేసు’ వాదింప నియమించి రాస తోడ,
వలయు ‘ఫీజు’ను దండుచు ప్రజల నుండి.
(సశేశం)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)