కబుర్లు
సత్యమేవజయతే!
పుస్తకం నేత్ర భూషణం
- సత్యం మందపాటి
పుస్తకంహస్త భూషణం అంటారు కానీ, నేత్ర భూషణం ఏమిటయ్యా...
అవును, సార్! మీరు చెప్పింది అక్షరాలా నిజం. కానీ మన తెలుగునాట ఈ మధ్య పుస్తకం మరిహస్త భూషణం కానేకాదు. ఇప్పుడు తెలుగు పుస్తకాలు చదివేదెవరు?
ఎందుకని? కారణాలు ఏమిటంటారు?
ఒక కారణం కొత్త తరం తెలుగువాళ్ళల్లో చాలమంది ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నారు కనుక, వాళ్ళకి తెలుగు చదవటం రాదు. అలా అని, అసలు ఇంగ్లీషు పుస్తకాలు చదివే అలవాటు కూడా ఎంతో మందికి లేదు. రెండవ కారణం ఏమిటంటే, ఈరోజుల్లోమలయాళీలు, తమిళులు, బెంగాలీలు, గుజరాతీ వాళ్ళ లాగా, మనకి మన భాష మీదా, సాహిత్యం మీదా అంత ఉత్సాహం కానీ, సరదా కానీ లేదు. మనవాళ్ళకి ముఖ్యంగా, ఈనాటి తెలుగువారికి, తెలుగు సినిమాల మీదా, క్రికెట్ ఆట మీదా వున్న ఉత్సాహంపుస్తకపఠనంమీద లేదు.
నువ్వేమైనా దీని మీద ‘అథారిటీ’వా?అంత నిక్కచ్చిగా చెబుతున్నావ్. నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు!
నాకు ఎప్పటినించో ఒక హాబీ వుంది. ఇక్కడ అమెరికాలో కానీ, అక్కడ ఇండియాలో కానీ, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, ముందు గదిలో కూర్చున్నప్పుడు, అక్కడ కాఫీ టేబుల్, టీపాయ్ మొదలైన చోట ఏమయినా పుస్తకాలు కనపడతాయా అని చూస్తుంటాను. వాళ్ళకి ఏదో పరీక్ష పెడదామని కాదు. మనవాళ్ళు, నాకు ఏమాత్రం ఇష్టం లేని కుళ్ళు రాజకీయల మీదా, మత సంబంధమైన విషయాల మీదా వాదించుకుంటుంటే, కాస్త పుస్తకాలు తిరగేసి, మనసు ప్రశాంతంగా వుంచుకుందామని. తెలుగేతర ఇళ్ళల్లో, వాళ్ళ భాషా పుస్తకాలు, పత్రికలు, కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు సహజంగా కనపడుతూనే వుంటాయి. అవి చూసిన ఒకళ్ళో, ఇద్దరో ఆ పుస్తకాల విషయం మీద మాట్లాడటం కూడా సహజంగా జరిగేదే. అది తెలుగువారి ఇళ్ళల్లో ఎక్కడో కానీ, ఎప్పుడో కానీ జరగదు.
మరి ఇంతకుముందు అలా వుండేది కాదా?
1980లముందుపుస్తక పఠనం ఎక్కువగానే వుండేది.నేను స్కూల్లో, కాలేజీల్లో చదువుకునే రోజుల్లోనూ, తర్వాత 1970లలో ఇండియాలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ, ఎక్కడ చూసినా చక్కటి లైబ్రరీలు. ఎన్నో తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలే కాకుండా, హిందీ, బెంగాలీ, మలయాళ, తమిళ సాహిత్యం తెలుగు అనువాదాలు ఎన్నో వుండేవి. ప్రతి ఆదివారం కొన్ని గంటలు నేను లైబ్రరీలో కూర్చుని, అవన్నీ విడిచిపెట్టకుండా చదువుతూ వుండేవాడిని. నేనొక్కడినే కాదు, ప్రతి లైబ్రరీలోనూ ఎంతోమంది జనం. కొన్ని మంచి పుస్తకాలు అయితే, ముందే రిజర్వ్ చేసుకుని చదవాల్సివచ్చేది. అలాగే కొన్ని పత్రికల్లో వారం వారం సీరియల్స్ చదవటం కోసం, పత్రిక విడుదలయే రోజున జనం షాపుల దగ్గర లైన్లు కట్టి కూడా నిలుచునేవారు. అవి పుస్తకాలుగా మార్కెట్టులోకి రాగానే, వెంటనే అమ్ముడు పోయేవి. చక్రభ్రమణం, జీవన తరంగాలు, పుణ్యభూమీ కళ్ళుతెరు, ఎమెస్కో పుస్తకాలు లాంటి పేర్లు వినలేదా?
అప్పుడే, మన తెలుగు గౌరవాన్ని డిల్లీలో నిలబెట్టిన మన ప్రియతమ నాయకుడు, ముఖ్యమంత్రి, తెలుగు నాట గ్రంధాలయ వ్యవస్థని నాశనం చేశాడు. గ్రంధాలయాలకి ప్రభుత్వ ధన సహాయం తగ్గించి, ఎన్నో గ్రంధాలయాలని మూసివేయటానికి కారకుడయాడు. విజయవాడ గవర్నర్పేట, గాంధీనగరాల్లో వున్న ఎంతోమంది పుస్తక ప్రచురణకర్తలు, తమవ్యాపారాలకు స్వస్తి చెప్పి, తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు. పుస్తకానికి వెయ్యి కాపీలు అమ్ముకునే వారికి, ఐదు వందల పుస్తకాలు అమ్మటం కూడా కష్టమయింది. నా ఉద్దేశ్యంలో అదొక ముఖ్యకారణం. తర్వాత ప్రభుత్వాలు మారి, లైబ్రరీలు మళ్ళీ నిలదొక్కుకున్నా, ఇంకా ఆ పూర్వ వైభవం పూర్తిగా వచ్చిందని అనుకోను.
మన తెలుగుదేశంలో చదువులని అమ్మకానికి పెట్టిన తర్వాత, మరి విద్యార్ధి దశలో పిల్లలకి, దేనికీ సమయమే చిక్కటం లేదుట కదా! అదీ ఒక కారణమా..
తప్పకుండా అదీ ఒక కారణమే. విద్యార్ధి దశలో, ఆ ఉత్సాహం, అవకాశం ఇవ్వనప్పుడు, తర్వాత చాలమందిలో అది పెద్దయాక రావటం కష్టమే! అయినా బహుకొద్దిమంది పిల్లలు, తర్వాతఅప్పుడు కోల్పోయింది గమనించి. మళ్ళీ పుంజుకుని చదవటం కూడా చూస్తూనే వున్నాం. ఇలాటివిఎంతజరిగినా, మనతెలుగుజనాభా అప్పటినించీఇప్పటి దాకా రెండు రెట్ల పైగా పెరిగినా, తెలుగు పుస్తకాలు చదివేవారి సంఖ్య రెట్టింపో, ఇంకా ఎక్కువో అవకుండా దాదాపు అక్కడే వుంది.
అందుకని, పుస్తకాల్లో వూరికే బొమ్మలు చూస్తారనా.. పుస్తకం నేత్ర భూషణం అంటున్నావు?
కాదు. ఇప్పుడు హైటెక్ యుగం వచ్చేసింది కదా. చదువుకునే ఆ అచ్చు పుస్తకాలతో పాటు ప్రపంచమంతటా ఈ-పుస్తకాలు వచ్చేశాయి.ఇక్కడ అమెరికాలో వుంటున్న పుస్తకాలు చదివే భారతీయులు, రెండవ తరం పిల్లలు చాలమంది ఈ-పుస్తకాల ద్వారా, ఇంగ్లీషు సాహిత్యానికి దగ్గరయిపోయారు. తర్వాత ఈ-పుస్తకాలు భారతీయ భాషల్లో కూడా ఎక్కువగా రావటం మొదలుపెట్టాయి. మనం దీనిలో కూడా బాగా వెనక పడ్డా, గత రెండేళ్ళుగా తెలుగు పుస్తకాలు కూడా, అక్కడక్కడా అప్పుడప్పుడూ కనపడుతున్నాయి. కిండిల్, నుక్ అనే కంపెనీల ద్వారా లభించటం మొదలుపెట్టాయి. తర్వాత ఒకటి రెండేళ్ళుగా, మన తెలుగు దేశం నించే వస్తున్న ‘కినిగే’అనేకంపెనీద్వారాఈ ఈ-పుస్తకాలు ఎక్కువగా వస్తున్నాయి. అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. సంఖ్యాపరంగా కూడా, ఎక్కువ పుస్తకాలు కినిగేలో వస్తున్నాయి. ప్రచురణ ఖర్చు ఎక్కువ వుండకపోవటం వల్ల, రచయితలకు కూడా ఈ-పుస్తకాలు స్వంతంగా కినిగేలో ప్రచురించుకునే అవకాశం వచ్చింది. ఇలాటి వెబ్ సైట్ల ద్వారా ఈ-పుస్తకాలు ఎక్కువ వస్తాయని నా ఆశ. నమ్మకం. అది తప్పకుండా ఒక శుభ సూచకం.
పుస్తకం నేత్ర భూషణం ఏమిటి? ఇది దుష్ట సమాసం కాకపోయినా, అలాగే అనిపిస్తున్నది. అయినా నేత్రాలకి అలంకారమేమిటి?
బాపుగారి సినిమాలు చూసారా?ఆయన దివ్యవాణి, ఆమని, సంగీత, శారద మొదలైన వారి కళ్ళకు కాటుక దిద్ది, ఎంత అందంగా చూపిస్తారో! అయినా ఇక్కడ నేను చెబుతున్నది వేరు. ఈ-పుస్తకాలు. దాని తర్వాత పుస్తకం కాని పుస్తకం ఇంకొకటి వచ్చింది.
మన చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, కారం కాని కారం ఏమిటి.. అంటే మమకారం, ప్రాకారం, ఆకారం అని.. అలానా? ఏమిటి ఆ పుస్తకం కాని పుస్తకం?
దాని పేరు ముఖ పుస్తకం.
ఎంతోమంది వారి జన్మ నక్షత్రాల నించి, జాతకంతోసహా, వారి రోజువారీ జీవితంలో జరిగే వన్నీ, ముఖ పుస్తకం పేజీల్లో పెట్టి ప్రపంచానికి చాటి చెబుతుంటారే.. ఆ పుస్తకం.ముఖపుస్తకం.
ఇది వచ్చాక ఎంతో మంచితోపాటు, కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి.
ముందుగా, మంచి విషయాలు చెప్పుకుందాం. నేను 1960లలోచదువుకునేటప్పుడుస్నేహితులైనమా గుంటూరుహిందుకాలేజీమిత్రులు, కాకినాడగవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ మిత్రులు, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మిత్రులు – మళ్ళీ దగ్గరయారు. అలాగే 1970లలో పదేళ్ళు నేను తిరువనంతపురంలో పనిచేసినప్పుటి మిత్రులతో, మళ్ళీ కలిసే అవకాశం వచ్చింది. ఆనాటి, ఈనాటి కబుర్లు, ఫొటోలు ఒకళ్ళవి ఒకళ్ళు చూసుకుంటూ ఎంతో ఆనందిస్తున్నాం.
అలాగే సాహిత్యం. ఎంతోమంది నా అభిమానులు, నా రచనల మీద వారి అభిప్రాయాలు, స్పందనా పంచుకుంటుంటే సంతోషంగా వుంటుంది. నా పుస్తకాలూ పదిమందితో పంచుకుంటున్నాను. కొంతమంది రచయితలు, రచయిత్రులుతమ రచనలకు లంకెలు ఇచ్చినప్పుడు అవి చదువుకోవటానికీ, మంచి అవకాశం దొరుకుతున్నది.
సాహిత్యంతో పాటు సంగీతం. కొన్ని కొత్త పాటలు, ఎన్నో పాత తెలుగు, హిందీ పాటలు వినటానికి కూడా ముఖ పుస్తకం ఉపయోగపడుతున్నది.
ఒక మిత్రుడు, ప్రతి రోజూ కొందరు ప్రముఖుల పుట్టినరోజులు, నిర్యాణమైన రోజులు చెబుతూ, వారి గురించి కూడా కొంత చెబుతున్నారు. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఆయనకి ఎన్నో ధన్యవాదాలు.
ఆమధ్య ఒక పాప, ‘సత్యం శివం సుందరం’ అనే పాట పాడుతున్న విడియో వచ్చింది ముఖ పుస్తకంలో. ఆ మాణిక్యాన్ని కనుక్కుని గుర్తించటానికి కూడా ముఖ పుస్తకం ఎంతో దోహదపడింది.
కొంతమందిపెట్టే జోకులు, కార్టూన్లు, మనసు కొంచెం బాగా లేనప్పుడు ఆహ్లాదపరుస్తుంటాయి.
ఇలాటివి ఎన్నో మంచి విషయాలు జరుగుతున్నప్పుడు, ముఖ పుస్తకం విలువ పెరుగుతుంది.
ప్రతి మంచి పనితో పాటు, కొన్ని ఇబ్బందికరమైన విషయాలూ జరుగుతూనే వుంటాయి.
కొంతమందికి తెలుసో, తెలీదో కానీ, నేను ఇందాక చెప్పినట్టు వారి స్వంత విషయాలు ఎన్నో ఈ ముఖపుస్తకపు పుటల మీద, ముఖమాటం లేకుండా పెట్టేస్తుంటారు. అది అంత మంచిది కాదు. కొంతమంది టీనేజర్లు పెట్టిన ఫొటోలను, ఫొటోషాప్ అనే సాఫ్ట్ వేర్ ఉపయోగించి. ఎన్నో మార్పులు చేసి, విశ్వమంతటా పంచిన ప్రముఖులు వున్నారు. వాటిలో కొన్ని వారివారి అశ్లీలపు ఫొటోలు చూసి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళున్నారు. అలాగే, కొంతమంది పెట్టిన వారి ఫోన్ నెంబర్లు, అడ్రసులు వాడుకుని, వారి వెంటపడినవారూ వున్నారు. అందుకని ఇలాటివి ఏం చేసినా, కొంచెం ఆలోచించటం అవసరం. ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే మీదకి ఎక్కిన తర్వాత, ఆ రోడ్డు మీద మీరు అందరికీ కనపడుతుంటారు. వాళ్ళల్లో మిమ్మల్ని వారి స్వప్రయోజనాలకి వాడుకునే వాళ్ళే ఎక్కువ. అందుకే జాగ్రత్త అవసరం అనేది.
ఆమధ్య ఐసిస్ అనే టెర్రరిస్ట్ గ్రూపు కూడా, ముఖపుస్తకం ద్వారానే కొంతమందిని, తమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారనే వార్త బయటికి వచ్చింది.
అందుకే ప్రతిరోజూ ప్రొద్దున్నా, సాయంత్రం మీ బుర్రలో ఏముందో అందరికీ చెప్పనవసరం లేదు.
ఈమధ్య కొత్తగా ముఖ పుస్తకం తెరిచిన ఒకావిడ, నాకొక వ్యక్తిగత సందేశం పెట్టింది. (నాకే ఎందుకు పెట్టిందో నాకు నిఝంగా తెలీదు).
‘నా పేజీలో రొజూ ఎంతోమంది ఎన్నో పోస్టింగులు పెడుతుంటారు. అవన్నీ లైక్ చేయలేక చస్తున్నాను. లైక్ చేయకపోతే ఫరవాలేదా’ అని.
లైక్ అంటే గుర్తుకి వచ్చింది. నేను నాకథ ఏదయినా పత్రికలో పడిందని లంకె ఇస్తే, పావుగంటలో పదహారు లైకులు వస్తాయి. ఆ కాస్త సమయంలో వాళ్ళకి అది చదివే సమయం వుండదని వాళ్ళకీ తెలుసు, నాకూ తెలుసు. అంటే వాళ్ళు లైక్ చేస్తున్నది, నా కథని కాదు. కథ ప్రచురింపబడింది అనే వార్తని! అదే కొంచెం సమయం చేసుకుని, చదివి ఎలా వుందో తమ అభిప్రాయం చెబితే బాగుంటుంది కదూ. పదహారు లైకుల కన్నా, ఒక్క అభిప్రాయం విలువ ఎక్కువ కదూ!
ఒకావిడ రాత్రి పడుకోబోతూ, “నాకు నిద్ర వొస్తుణ్ణట్టుం...ది” అని ముఖపుస్తకంలోనే ఆవలిస్తుంది.
ఇంకొకాయన, ‘ఇప్పుడే నిద్ర లేచాను.. ఇహ పళ్ళు తోముకుని, కాఫీ తాగాలి’ అని పోస్టింగ్ పెడతాడు.
తర్వాత ఇంకా ఏమేం చేస్తాడో చెప్పనందుకు, సంతోషించి అది అంతటితో వదిలేస్తాం. కొంతమంది మిత్రులు ముఖమాట పడి, అది కూడా లైక్ చేస్తారు.
ఇంకొకాయన అయితే, ‘నేనిప్పుడే అల్పాహారం తినబోతున్నాను. ఇవిగో ఇవి.. “ అని కొన్ని ఫొటోలు పెడతాడు. వాటిలో రెండు ఇడ్లీలు, రెండు వడలు, ఒక పెసరెట్టు, కొంచెం ఉప్మా, పక్కనే రెండు పచ్చళ్ళు, కారప్పొడి, ఒక చిన్న బక్కెట్టులో సాంబారు, ఒక వెన్నముద్ద, కాఫీ.
అది అల్పాహారం ఎలా అయిందో నాకు, నా చిన్ని బుర్రకి అర్ధం కాదు!
అప్పుడప్పుడూ వ్యక్తిగత సందేశాలు పంపిస్తుంటారు కొందరు.
ఇంగ్లీషులో “Hi” అనివుంటుంది.
ఎవరోపాపంపలకరిస్తున్నాడుకదాఅని, మనంకూడాపలకరిస్తేమళ్ళీజవాబువుండదు.
తర్వాతఇంకోగంటకో, నాలుగుగంటలకోమళ్ళీఆయనదగ్గరనించే, “Hi” అనివుంటుంది.
అటువంటివి ఇక పట్టించుకోవటం మానేశాను.
ఇది వ్రాస్తుంటే, ముళ్ళపూడివారి జోకు ఒకటి గుర్తుకి వస్తున్నది.
ఒక అడవిలో ముగ్గురు మునిపుంగవులు దీర్ఘ తపస్సు చేసుకుంటున్నారుట.
ఒక గుర్రం వారి పక్కనించీ చకచకా పరుగెడుతుంది.
ఆ గుర్రం అలా వెళ్ళిన ఆరు నెలలకి, ఒక ముని అంటాడు, “తెల్ల గుర్రం ఇలా పరుగెత్తింది” అని.
అది విన్న ఇంకో సంవత్సరానికి, రెండో ముని అంటాడు, “అది తెల్ల గుర్రం కాదు. నల్ల గుర్రం” అని.
అది జరిగిన ఇంకో రెండు సంవత్సరాలకి, మూడో ముని కోపంతో లేచి, “మీరు చీటికీ మాటికీ ఇలా వాదించుకుంటుంటే, నా తపస్సు ఎలా చేసుకునేది” అని అక్కడనించీ వెళ్ళిపోతాడు.
అదీ మన రమణగారి జోకు.
ఇవీ ఈ ముఖ పుస్తకం కబుర్లు. మీకు తెలియనవి కాదు, మళ్ళీ ఇంకొక్కసారి గుర్తు చేద్దామని.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)