శీర్షికలు
పద్యం హృద్యం
-నిర్వహణ : పుల్లెల శ్యామసుందర్
ఈ క్రింది "ప్రశ్న"కు పద్యరూపములో జవాబు పంపాలి. మీజవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసం ప్రశ్న:
దత్తపది: ఈనెలప్రారంభమౌతున్నప్రపంచక్రికెట్టుపోటీలసందర్భముగా, "దోని" (ధోని), "కోలి" (కోహ్లి), "రానే", "రైనా" పదాలను నామవాచకములు కాకుండా వాడుతూ క్రికెట్టు ఆటపై మీకునచ్చిన చంధస్సులో పద్యము వ్రాయాలి.
గతమాసం ప్రశ్న:
సమస్య: తప్పులుఁ జేసెడి మనుజుడె ధన్యుండిలలో
ఈ ప్రశ్నకుమాకుఅందినక్రమములోపూరణలు ఇలా వున్నాయి.
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్నం
నిప్పును ముట్టిన ముప్పగు
తప్పదు దండన మనుజుల తప్పుల కెల్లన్
గొప్పగ చెప్పగ మరియే
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో?
డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా.
ఎప్పుడు దుష్టుల గూడుచు
తప్పులె మరి యొప్పులనుచు దౌర్జన్యముతో
నొప్పెడు జను భావములో
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో
శివప్రసాద్ చావలి, సిడ్నీ
ఒప్పెను ధర్మము రాముడు
తప్పుగ వాలిని మరుగున దాగియు చంపన్!
తప్పక ధర్మం బొప్పగ
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో!
చెప్పెను రణమున ధర్మం
బొప్పగ సత్యము నసత్యముగ ధర్మజుడున్!
తప్పనిసరి వేళల తగు
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో!
నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ
నప్పును కలియుగ మందున
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో
జెప్పితి నలనాడు నలువకు
తప్పింపగ తరముగాదు ధర్మమెవరికిన్
గండికోట విశ్వనాధం, హైదరాబాద్
తప్పులు కప్పుచు, గొప్పలు
చెప్పుచు, మెప్పులు బడయుచు, చెలగెడి ముప్పుల్
తిప్పలు తప్పించుకొనెడి
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో
ఎప్పుడొ కప్పుడు చేసిన
తప్పులు తెలిసికొని -అట్టి తప్పులు తొలగన్
తప్పులు దిద్దుకొని మెలగు
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో
టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ
ఎప్పుడు దోషము లెన్నుచు
తప్పుడు పనులే దలచుచు, తామే ధరణిన్
గొప్పని నుడివెడు జనులకు
తప్పులుఁజేసెడిమనుజుడెధన్యుండిలలో
జంధ్యాల కుసుమ కుమారి, హైదరాబాదు
తప్పక సంపద నంతయు
కప్పురమువలె కరిగింప గలడని జనులె
ల్లప్పుడు జేసెడి తలపుల
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
ఇప్పటి లోకపు తీరిది!
గొప్పలు చెప్పుచు, బలముల కొనగలననుచున్,
తప్పొప్పు లేవి చూడక,
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో!
చెప్పెను శాస్త్రం బిటులన్,
తప్పులు చేసిన నరకము తథ్యము! కనులున్
కప్పిన మూర్ఖుల కిప్పుడు,
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో!
రాజతల్లాప్రగడ, సిడ్నీ&శ్యామసుందర్పుల్లెల
తప్పగునేమోమనకిక
ఘుప్పనిపొగత్రాగకున్నగురువుగిరీశం
చెప్పెనుగద "పొగత్రాగెడి
తప్పులుఁజేసెడిమనుజుడెధన్యుండిలలో!"
( ఈ నాపద్యమునకు ప్రేరణ క్రిందఇచ్చిన శ్రీరాజతల్లాప్రగడ గారు పంపినకవిత )
పొగతాగనివాడుదున్నపోతైపుట్టునన్నారొకరు
తప్పులెన్నువారుతమతప్పులెరుగరన్నారింకొకరు
మరితప్పులున్జేసెడిమనుజుడేధన్యుడిలలోననగా!!
తప్పులుజేయకపోవుటేతప్పగునేమోఇకపై..!!!
శ్యామసుందర్పుల్లెల, శాన్హోసె, కాలిఫోర్నియా
ముప్పులుపొందునుభువిలో
తప్పులుఁజేసెడిమనుజుడె - ధన్యుండిలలో
తప్పొప్పులభేదమెఱిగి
ఎప్పుడుతాఁమసలువాడు, ఎఱుగరశ్యామా!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)