సారస్వతం
అంతా విధి విలాసం
- టీవీయస్.శాస్త్రి

కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతోంది. భీష్ముడు కౌరవుల పక్షాన నిలబడి ప్రత్యర్ధులను తుదముట్టిస్తున్నాడు. పాండవులు అతని ధాటికి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. శ్రీకృష్ణుడు సైతం ఒకసారి కుప్పించి భీష్ముడి పైకి ఉరికాడు. ఆ మహాయోధుడిని ప్రత్యక్షంగా ఎదుర్కొని జయించటం కష్టమని భావించిన శ్రీ కృష్ణుడు, పాండవులు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఆ ఉపాయం ప్రకారం అర్జునుడిని భీష్ముని దగ్గరకు మధ్యవర్తిగా పంపిస్తారు. అర్జునుడు భీష్ముని వద్దకు వెళ్లి ,"తాతా! నీ ధాటికి మేము తట్టుకోలేక పిక్కటిల్లిపోతున్నాం. ఈ వయసులో కూడా మీకు ఇంతటి శక్తి సామర్ధ్యాలు ఉండటానికి కారణం ఏమిటని?" అని అడుగుతాడు. అందుకు భీష్ముడు అర్జునుడితో, "నాయనా!సహజంగా బ్రహ్మచారులకు నైతికబలం, ఆత్మబలం ఎక్కువ. నాకు వీటితో పాటు ఆధ్యాత్మిక బలం కూడా ఉంది. ఈ బలంతోనే నేను ముందుకు వెళుతున్నాను."అని చెప్పాడు.అప్పుడు అర్జునుడు భీష్ముడితో,"తాతా!నీవు కౌరవుల పక్షాన నిలబడినంత కాలమూ మాకు విజయం కలుగదు. నిన్ను నిర్జిస్తే తప్ప మాకు జయం చేకూరదు. దానికి తగిన ఉపాయాన్ని కూడా నీవే చెప్పి ఈ యుద్ధానికి ఒక ముగింపు చెప్పాలి!"అని వేడుకున్నాడు. అందుకు భీష్ముడు," అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. నేను శిఖండి ముఖం చూస్తే అస్త్ర సన్యాసం చేస్తాను. అప్పుడు నిరాయుధునిగా ఉన్న నన్ను నీవు సంహరించవచ్చు." అని చెబుతాడు. అదే విషయాన్ని అర్జునుడు సోదరులతో, శ్రీకృష్ణునితో చెబుతాడు. మరుసటి రోజు యుద్ధం ప్రారంభం కాగానే అర్జునుడు శ్రీకృష్ణుని సలహా ప్రకారం తన రథంలో తన ముందర శిఖండిని ఉంచుకుని భీష్ముడిని ఎదిరించటానికి బయలుదేరుతాడు. అర్జునుడి ముందర ఉన్న శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి రధంలో కుప్పకూలి పడుతాడు. అదే అదనుగా భావించి అర్జునుడు బాణాలు సంధించటంతో భీష్ముడు నేలకొరుగుతాడు. భీష్ముడు నేలమీద పడకుండా అర్జునుడు అంపశయ్యను ఏర్పాటు చేస్తాడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు ఆ అంపశయ్య మీద పడుకొని అర్జునుడు తన అస్త్రాలతో తెచ్చిన గంగను సేవిస్తూ ప్రాణాలు వదలటానికి ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆఖరిదశలో ఉన్న భీష్ముని ఆశీస్సులు పొందాలని పాండవులు, ద్రౌపదితో సహా శ్రీకృష్ణుడిని తీసుకుని భీష్ముని దగ్గరకు వస్తారు. భీష్ముడు వచ్చిన వారితో, "ధర్మమే గెలుస్తుంది. రాజ్యం మీ వశం అయిన తర్వాత ధర్మపాలన గురించి మీకు కొన్ని సలహాలిస్తాను" అని పాండవులకు చెబుతాడు. పాండవులు భీష్ముడు చెబుతున్నమంచిమాటలు శ్రద్ధగా వింటుంటారు. అయితే ద్రౌపది మాత్రం వ్యంగ్యంగా నవ్వుతుంది. ఆ అసందర్భపు నవ్వుకు ఆగ్రహించిన పాండవులు ద్రౌపదిని మందలిస్తారు. అప్పుడు భీష్ముడు, "ఆమె నవ్వులో అర్ధం ఉంది, ఆవేదన ఉంది. ఆ నాడు నిండు పేరోలగంలో నేను, ద్రోణాచార్యుని వంటి ప్రముఖులు అనేక మంది ఉన్నప్పటికీ ఆమె మానాన్ని రక్షించలేకపోయాం. అప్పుడు పల్లెత్తి మాట్లాడని నేను ఇప్పుడు నీతులు బోధించడం ఏమిటని ఆమె భావన దానికి నా సమాధానం ఇప్పుడు చెబుతున్నాను, వినండి!ఆ నాడు రాజుగా దుర్యోధనుడు ఉన్నాడు. అతని ఉప్పు, పులుసు తింటున్నందున మేము అతని ఆధీనంలో ఉన్నాం! అందుకే రాజనీతిలో భాగంగా మౌనంగా ఉండిపోయాం! ఆ పరిస్థితిలో మేము ఏమీ చేయలేకపోయాం "అని భీష్ముడు కన్నీరు పెట్టడంతో, ద్రౌపదితో సహా పాండవులు ఆయన్ని క్షమించమని వేడుకుంటారు . పరిస్థితుల ప్రభావం వలన ఒక్కొక్కసారి మంచి పనులను చేయాలని అనుకున్నా చేయలేం, అలానే చెడ్డపనులు జరగకుండా కూడా ఆపలేం!అంతా విధి విలాసం!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)