ధారావాహికలు
విశ్వామిత్ర 2015 - నవల
- యస్ యస్ వి రమణారావు

ఫోన్ లో వచ్చిన ఆదేశం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు అంటే రౌడీలని తీసుకుని ఒక స్లమ్ ఏరియాకి పక్కనే ఉన్న హోటల్ లో మిత్రా ఉన్నాడన్న విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నాడు కేప్టెన్. హోటల్ నుంచి మిత్రా వెళుతున్నపుడు తను తీసిన ఫోటో ఆధారంతో, పోలీసుల సహకారంతో మిత్రా ఎక్కడుంటున్నదీ కనుక్కోగలిగాడు. వచ్చిన మనుషుల ని, వాళ్ళ చేతుల్లో కర్రలు చూడగానే కేష్ కౌంటర్ లో కూర్చున్న వ్యక్తి మూడు వేళ్ళు చూపించాడు. నూట పదకొండు రూమ్ దగ్గరికి చేరుకున్నారంతా. అప్పుడు సమయం సరిగ్గా అర్థరాత్రి పన్నెండు గంటలయింది. ఆత్రుతగా రూమ్ తలుపు తట్టబోయాడు ఒక రౌడీ. రవిబాబు వారించాడు. రవిబాబు మెదడులో హోటల్ లో మిత్ర సర్వర్లని బౌన్సర్లని చితక్కొటిన దృశ్యం కదలాడింది.

"110,112 రూముల తాళాలు తీసుకురండి"ఆజ్ఞాపించాడు. వెంటనే తాళాలు వచ్చాయి. తాళాలు తీసి ఆ బాల్కనీల్లోంచి 111రూమ్ బాల్కనీలోకి ప్రవేశించారందరూ. వెంటనే బాల్కనీ తలుపు బద్దలు కొట్టడానికి కర్ర ఎత్తాడు ఒక రౌడీ. అంతకంటే వేగంగా అతనిని ఆపాడు రవిబాబు."మళ్ళీ ఏంటన్నా?"విసుగ్గా అడిగాడు రౌడీ. ఆ రౌడీ కణతల మీద చూపుడువేలుతో గుచ్చాడు రవిబాబు. వెంటనే ఆ రౌడీకి హోటల్ ఫైటింగ్ దృశ్యం కనబడింది. వెంటనే కర్ర దించాడు."వీడికి అర్థమైపోయింది"అనుకున్నాడు రవిబాబు. ఇంకో రౌడీ వేరేఐడియా చెప్పాడు. కిటికీ గ్రిల్ తీసి, గదిలోకి దిగి, మిత్రా పడుకున్న మంచం చుట్టూ చేరారంతా. మంచంమీద వెల్లకిలా పడుకుని నిద్రపోతున్నాడు మిత్రా.తట్టి నిద్ర లేపబోయాడు గ్రిల్ తీసిన రౌడీ. ఆపాడు కేప్టెన్."ఈసారేంటన్నా?"చాలా విసుగ్గా అడిగాడు. రవిబాబు, మిత్ర ఎడమ భుజం మీద వాలి ఉన్న‌ఈగని చూపించాడు."అయితే ఏంటన్నా?"రౌడీ మాట ఇంకా పూర్తి కాలేదు. మిత్రా కుడి చెయ్యి ఎప్పుడు లేచిందో, ఎలా కదిలిందో ఎవరూ చూడలేదు. చచ్చిన ఈగ రౌడీ మొహం మీద వచ్చి పడింది. అప్రయత్నంగా అరవబోయి , నోరు గట్టిగా మూసుకున్నాడు.

`వీడికి కూడా అర్థమైపోయింది' అనుకున్నాడు కేప్టెన్ అలియాస్ రవిబాబు. అందరూ నిశ్శబ్దంగా తీసిన గ్రిల్ లోంచే తిరిగి బయటకు వెళ్ళి పోయారు.110,112 రూముల బాల్కన్నీల్లోంచి తిరిగి 111రూమ్ గది తలుపు దగ్గరకు వచ్చారు."ఇప్పుడేం చేద్దామన్నా?"ఇంకో రౌడీ అడిగాడు.`ఈడికింకా అర్థం కాలేదు' అనుకుని

"నాకు నిద్రొస్తోందిరా, నేను పడుకుంటున్నాను. తలుపు శబ్దమైతే లేపండి"వెంటనే అక్కడే కారిడార్ లో పడుకుని నిద్రపోయి కొంచెంసేపట్లోనే గుర్రు పెట్టడం మొదలుపెట్టాడు. మిగతా రౌడీలు కూడా ఆ కారిడార్ లోనే పడుకుని వాళ్ళు కూడా గుర్రు పెట్టడం ప్రారంభించారు.

ఉదయం ఏడు గంటలు. 111 రూము తలుపులు తెరుచుకున్నాయి. మిత్రా కాలు బయట పెట్టబోయి ఆగి, కారిడార్ లో ఉన్న రౌడీలని చూసి, తన్ని నిద్రలేపాడు.

"ఓనర్, హోమ్ మినిస్టర్ నిన్ను చూస్తాడంటన్నా, తీసుకు రమ్మన్నాడు"రవిబాబు వెంటనే టక టకా చెప్పేశాడు. మిత్రా చుట్టు పక్కన ఇంకా పడుకునే ఉన్న రౌడీల వంక చూశాడు."రాత్రే వచ్చామన్నా, నిను నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక..."వెర్రి నవ్వొకటి నవ్వాడు. నవ్వుతూనే అందరినీ ఠపేల్, ఠపేల్ అని అందరినీ తన్నాడు. అందరూ నిద్ర లేచారు.

"మరి కర్రలెందుకు తెచ్చార్రా?"అడిగాడు మిత్రా అందరి కళ్ళు పెద్దవయ్యాయి.

"సెక్యూరిటీ కన్నా, నీ సెక్యూరిటీకి"వెంటనే చెప్పాడు రవిబాబు, రౌడీలందరి మొహాలు నిట్టూర్చాయి.

మిత్ర మొహంలో చిన్న నవ్వు కదలాడింది"సరే, అందరి మొహాలు ఎదవ కంపు కొడుతున్నాయి, ఎళ్ళి మొహాలు కడుక్కుని రండి. నేను టిఫిన్ కి బయటకు వెళ్ళబోతున్నాను. ఇంకెందుకు మీరంతా వచ్చారుగా, మొహాలు కడుక్కుని వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకు రండి"చెప్పాడు

"అలాగే అన్నా, నువ్వేంచెపితే అదే"

"ఎక్కడనుంచి తెస్తావు టిఫిను"

"ఈ ఎదవ హోటల్ నుంచి కాదన్నా, మన హోటల్ నుంచే తెప్పిస్తాను"వెంటనే ఫోన్ చేశాడు" "ఇడ్లీ సాంబార్, పెసరట్టుప్మా, పెరుగు వడ... ఆపై ఓ కాఫీ"

"షార్ప్ మెమొరీరా నీది" అంటూ నవ్వుతూ మిత్రా తిరిగి రూములోకి వెళ్ళాడు.

* * * * * * * * * * * * * *

"ఏ ఊరు?"

"వేమవరం"

"ఏ జిల్లా"

"తూర్పుగోదావరి"

"ఎంతవరకు చదువుకున్నావు"

"టెంత్ క్లాస్"

"ఎక్కడ"

"బాల సరస్వతి స్కూలు, రాజమండ్రి"

అప్పటివరకు మెత్తటి ఇంపోర్టెడ్ సోఫాలో కూర్చుని నిలబడి ఉన్న మిత్రాని, ప్రశ్నలన్నీ అడుగుతున్న హోమ్ మినిస్టర్ ఒకసారి ప్రశ్నలడగడం ఆపి పక్కనే ఉన్న సెక్రటరీ వంక చూశాడు. సెక్రెటరీ వెంటనే ఎవరికో ఫోన్ చేశాడు. ఏదో మాట్లాడాడు

"ఆ, ఆస్కూలే. హెడ్మాస్టర్ ని లైన్లో పెట్టు."

కొద్దిసేపట్లోనే ఫోన్ వచ్చింది సెక్రెటరీకి. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాడు.

"మిత్రా అనే మనిషి గురించి మీకేమైనా తెలుసా?"

"మిత్రానా, ఆ పేరు గల వ్యక్తి ఎవరూ నాకు తెలియదే"

హోమ్ మినిస్టర్ కళ్ళు పెద్దవయ్యాయి. సెక్రెటరీవంక, మిత్రా వంక మార్చి మార్చి చూశాడు.

"ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఏడెనిమిదేళ్ళక్రితం స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఫొటో పంపించమంటారా"

ఒక్కక్షణం అవతలిపక్కనుంచి ఎటువంటి మాటా వినబడలేదు

"మిత్రానా అంటే రౌడివెధవ మిత్రా గురించా మీరు అడిగేది? మీరు పోలీసా? అయ్యే ఉంటారు. దొరికిన వాళ్ళనందరినీ కొట్టడమే, అదే పని వెధవకి. పదోక్లాసు పరీక్షలో స్లిప్పులు పట్టుకున్నందుకు నన్ను కొట్టి నామీద పేపర్ విసిరి కొట్టి పారిపోయాడు. ఆడు స్కూల్ వదిలి పారిపోయాక అంతా ప్రశాంతంగా ఉన్నాం. వాడు గనక దొరికితే, పోలీస్ స్టేషన్ లో పడేసి కుమ్మేయండి వెధవని.వాడు చచ్చినా ఇక్కడ అడిగేవాళ్ళు ఎవ్వరూ.." ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు హెడ్మాస్టరు. ఫోన్ కట్ చేశాడు సెక్రెటరీ.

హోమ్ కళ్లు ప్రశాంతంగా మారాయి.

"హోటల్లో ఎందుకు గొడవ చేశావ్?"

మిత్రా చటుక్కున హోమ్ కణతలమీద చూపుడు వేలు పెట్టాడు. వెంటనే హోమ్ కళ్ళముందు ఒక దృశ్యం కదలాడింది......

"నన్ను బెదిరించి నాహోటల్లో ఫ్రీటిఫిన్లు తినేయడం కాదురా, దమ్ముంటే.."

"మిత్రా ఈడి రొద భరించలేకపోతున్నాం రా"అన్నాడు మిత్రా గ్రూప్ లో ఒకడు. మిత్రా అతని స్నేహితులు ముగ్గురూ కూచుని ఉన్నారు ఆ హోటల్లో. కేష్ కొంటర్ లో కూర్చుని వారిమీద అరుస్తున్నది ఆ హోటల్ ఓనరు. ఆ మాత్రం మాటైనా అనగలిగే ధైర్యం అతనికి ఒక్కడికే ఉంది. కారణం కొద్దిగా ముసలివాడు కావడం వల్లనేమో?

"దమ్ముంటే.."ఇంకా వాక్యం పూర్తి చేయలేదు ఓనరు. కౌంటర్ దగ్గరకు మిత్రా ఎప్పుడు వచ్చాడో చూడలేదు.

"ఊ..దమ్ముంటే.., చెప్పు, ఏం చేయాలో?"మొహంలో మొహం పెట్టి అడిగాడు మిత్రా.

"ఊ..ఏం చేయాలంటే.."తల తిప్పి చూసిన ఓనర్ కి ఆరోజు పేపర్ లో ’గ్రాండియోర్ ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభం. ముఖ్య అతిధిగా విచ్చేయనున్న ముఖ్యమంత్రి’ అని కనబడింది.

వెంటనే అన్నాడు"పేపర్ తీసి కౌంటర్ టేబుల్ మీద పెట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ చూపిస్తూ అన్నాడు"దమ్ముంటే ఈ హోటల్లో టిఫిన్ తిని రావాలి, డబ్బులివ్వకుండా, ప్లేట్లు కడగకుండా, తన్నులు తినకుండా"

"తింటే"

"నీకూ ఆ బేవార్స్ గాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం టిఫిన్లేంటి ,భోజనాలే పెడతాను"

హోమ్ కణతలమీదనుంచి చూపుడు వేలు తీసేశాడు మిత్రా.

హోమ్ సంతృప్తిగా తలాడించాడు. సూటిగా మిత్రా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు.

"నేం జెప్పినట్టు జేస్తే నీకు నీ ఫ్రెండ్స్ ఇద్దరికీ గూడా జీవితాంతం నా ఫైవ్ స్టార్ హోటల్లోనే భోజనాలు పెట్టిస్తాను"

మిత్రా కళ్ళు పెద్దవి చేశాడు.

"అందుకు ఏం చేయాలో నా సెక్రెట్రీ చెప్తాడు"

పని అయిపోయింది, అందరినీ బయటకు వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు హోమ్

* * * * * * * * * *

"మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను.థాంక్స్ ఫర్ యువర్ కో‌ఆపరేషన్" ఆ మాట అన్నది ద్రోణాచార్య కోర్ గ్రూప్ లోని ముగ్గురిలో ఒకరు.

"ఎంతమాట.ద్రోణాచార్య గారే లేకపోతే ఈ స్కూల్ ఎక్కడిది?ఆయన పనిలో సహాయపడే అవకాశం దొరకడం అంటే రామకార్యంలో పాలుపంచుకునే అదృష్టం దక్కడం లాంటిది"

అన్నారు బాలసరస్వతి స్కూల్ హెడ్మాస్టరు సంతోషంగా తలాడించాడు కోర్ గ్రూప్ లోని వ్యక్తి.

"ఒకటే బాధ. మంచి స్టూడెంట్ ని రౌడీ అనాల్సొచ్చింది"ఆ మాటకూడా నవ్వుతూనే అన్నాడు హెడ్మాస్టరు
నవ్వాడు కోర్ గ్రూప్ లోని వ్యక్తి.నవ్వుతూనే మహానగర మహానిర్మాణంలో మొదటి‌అంకం అనుకున్నట్టుగానే జరిగిందని ద్రోణాచార్యకి చెప్పడానికి జేబులోంచి ఫోన్ బయటకు తీశాడు.

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)