"నన్నొకడు వ్యాపారంలో మోసం చేశాడు. నాకు రావలసిన మొత్తం ఇవ్వకుండా తప్పుడు లెక్కలు చూపించాడు. ఇప్పుడు నేనతనిని కోర్టుకు లాగి, శిక్ష పడేలా చేసి, న్యాయంగా రావలసిన నా వాటా నాకొచ్చేలా చేయాలా? లేక అంతా నా కర్మ అని సరిపెట్టుకోవాలా? మీరేమంటారు?"
"సృష్టి అంటేనే వైవిధ్యం. అందరికీ ఒకే మార్గం ఎలా సాధ్యం? పచ్చి లౌకికంగా జీవించేవారు, పాపభీతితో కొంత ప్రాపంచికంగా ఉండేవారు, ధర్మమే లక్ష్యంగా జీవించేవారు ఇలా రకరకాల జీవన నేపథ్యాలు, అభిప్రాయాలు, లక్ష్యాలు కలిగి జీవించే ఈ ప్రపంచానికి ఒకటే పరిష్కారం ఎలా సాధ్యం? ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది మరి!
కొందరు మోసగాళ్ళకు గుణపాఠం నేర్పాలనుకుంటారు. ఆ విధంగా చేస్తే వాళ్ళు మరొకరిని మోసం చేయరని అనుకుంటారేమో, అందుకే కోర్టులకు వెళ్ళి, శిక్షలు వేయించడానికి ప్రయత్నిస్తారు.
ఇంకో మార్గం ఉంది. "మోసం చేసేదెవరు? చేయబడేదెవరు? అంతా ఆ పరమాత్ముని స్వరూపాలే. భగవంతుడే ఇచ్చాడు, ఆ భగవంతుడే తిరిగి తీసుకున్నాడు. శిక్షించడం, రక్షించడం పరమాత్ముని పని" అని విశ్వసించి, జీవించేవారు మరికొందరు.
మూడో మార్గం ఉంది. ఒక కథ చెప్పి వివరిస్తాను.
ఒక దొంగ ఒక సాధువు నివాసంలోకి దూరి, దొరికిన వస్తువులు మూటగట్టుకుని వెళుతున్నాడు. ఇంతలో సాధువు తిరిగి వచ్చాడు. ఆ దొంగను చూసి, "నాయనా, ఆగు. ఇంకా నీకు ఉపయోగపడే వస్తువులు కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవి కూడా తీసుకుని వెళ్ళు. ఆగు నాయనా" అని అరవసాగాడు. ఇదొక పద్ధతి.
ఐతే దీనికి అందరూ సిద్ధంగా ఉండరు. ఎంతో సాధన, నిష్ట కావాలి.
ఇక నాలుగో మార్గం చెప్తా వినండి.
నిత్యమూ శ్రీ కృష్ణుడినే ధ్యానించే ఒక భక్తుడు ఉన్నాడు. ఎప్పుడూ ఆ శ్రీ కృష్ణుడినే హృదయములో నిలుపుకొని, జీవించడానికి శ్రద్ధగా ప్రయత్నించేవాడు.
ఒకనాడు అతడు కృష్ణ నామస్మరణలో లీనమై, నడుస్తూ, చూసుకోక దారిలో ఒక చాకలతను శుభ్రపరచి, మడచి పెట్టుకున్న బట్టలను తొక్కాడు. ఎంతో కష్టపడి చేసిన పనంతా వ్యర్థమైనందుకు, అతడికెంతో కోపం వచ్చింది. ఆ కోపంలో ఆ చాకలి ఆ భక్తుని కొట్టడానికి కర్ర తీసుకొని వెంటబడ్డాడు.
ఆ సమయంలో కృష్ణుడు భోజనానికి కూర్చున్నాడు. రుక్మిణీ దేవి వడ్డిస్తోంది. అన్నంలో కూర కలుపుకొని, నోట్లో ముద్ద పెట్టుకోబోయేంతలో, చేతిలో అన్నం అలాగే విడిచేసి, పరుగందుకొన్నాడు కృష్ణుడు. వడ్డిస్తున్న రుక్మిణమ్మకు ఏమీ అర్థం కాలేదు.
ఇంతలో, ఎంత వేగంగా వెళ్ళిన కృష్ణుడు అంతే వేగంగా తిరిగొచ్చేసాడు. ఆశ్చర్యంగా రుక్మిణి అడిగింది, "ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ ఇంత వేగంగా తిరిగొచ్చేసారెందుకు?"
"ఏమీ లేదు. నన్నే స్మరించే వాడొకడు తెలియక ఒక పొరపాటు చేశాడు. అందుకోసం అతడు దెబ్బలు తినే పరిస్థితి వస్తే, కాపాడుదామని వెళ్ళాను." అన్నాడు కృష్ణుడు నింపాదిగా భోజనం చేస్తూ.
"మరి అంత త్వరగా వచ్చేశారే?"
"ఏముంది, అతడు తనను తాను కాపాడుకోవటానికి ఒక రాయి తీసుకొని, తనని కొట్టడానికి వచ్చినవాడి మీద తిరగబడ్డాడు. తన ప్రయత్నం తాను చేస్తున్నపుడు నేనెందుకు కల్పించుకుంటాను? అందుకే వచ్చేశాను" అన్నాడు కృష్ణ పరమాత్ముడు.
అంటే మీరు ప్రత్యేకంగా ప్రయత్నించినంత వరకూ భగవంతుడు కల్పించుకోడు. కేవలం మీరు చేసినదానికి మాత్రమే మీరు ఫలితం పొందుతుంటారు. ఎప్పుడైతే ఉండేదంతా ఆ పరమాత్ముడి సంపదే, జరిగేదంతా ఆయన సంకల్పమే, కనపడేదంతా ఆయన ప్రతిరూపమే అని విశ్వసించి, జీవిస్తారో అప్పుడు మీకంటూ ప్రత్యేకించి ఏ సమస్యలూ ఉండవు. మీ బాధలు, బాధ్యతలు, భారాలు అని విడిగా ఉండవు. అన్నీ ఆయనే అయినపుడు, అంతా ఆయనే చూసుకుంటారు కదా! ఇక మీరు చేయవలసింది ఏముంటుంది? నిర్ణయించడానికి ఎం మిగిలింది?
కాబట్టి ఇన్ని మార్గాల్లో ఏది మీ సంస్కారానికి తగి ఉండి, సులువనిపిస్తే దానిని అవలంబించవచ్చు.
ఐతే అన్నిటికంటే ఉత్తమమైనది మాత్రం సర్వస్య శరణాగతి."
ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు బెంగాల్ ప్రాంతంలో గొప్ప మహాత్మురాలిగా సిద్ధి పొందిన శ్రీ ఆనందమాయి అమ్మ ఇచ్చిన సమాధానమిది.
ఈ ప్రపంచమందుండు మహనీయులందరూ మనకెల్లప్పుడు జ్ఞప్తియందుండి, సరియైన మార్గము తృటిసేపైనను మరువనీయక, కాపాడుగాక! అనే ప్రార్థనతో సెలవు.