కబుర్లు - సత్యమేవ జయతే
ఐదు సున్నాలు!
- సత్యం మందపాటి

‘ఐదు సున్నాలా? ఇదేం మకుటం బాబూ!’

‘ఇది నా వ్యాసం. నా ఇష్టం! నాకు ఈ మకుటమే బాగుంది’’

‘అయినా చదివే వాళ్ళం మేము కదా! అసలు ఎవరు నీకు లెఖ్కలు నేర్పిన మాష్టరు? ఒక సున్నా చాలదూ? దాని పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాని విలువ ఒక పెద్ద గుండు సున్నానే అని ఆమాత్రం తెలియదూ... ఐదు సున్నాలుట... ఐదు సున్నాలు’

‘ఈసారి బ్రెసిల్లో జరుగుతున్న ‘ఒలెంపిక్స్’ గురించి వ్రాస్తున్నాను’

‘అంటే మనకి మెడలు వంచి తగిలించే మెడల్స్ ఎక్కువ రావటం లేదని కడుపు మంటతో, ఇలా పేరు పెట్టావా?’

‘లేదు. అది ఒలెంపిక్స్ చిహ్నం. దానిలో ఐదు సున్నాలు వున్నాయి. పైన మూడు, క్రింద రెండు. అన్ని దేశాల స్నేహపూర్వకమైన కలయికనూ చూపిస్తూ, ఒకదానితో ఒకటి పెనవేసుకుని, మనకి ఐకమత్యం లోని విలువను చూపిస్తూ వుంటాయి. ఈ ఐదు సున్నాలూ ఐదు ఖండాలకి గుర్తు. అంటే యూరప్, అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్ని కలుపుతాయి అన్నమాట. అదే నా ఈ వ్యాసానికి మకుటం’

‘అవి సున్నాలు కాదు. రింగులు. రింగులు అంటే ఉంగరాలు కాదు. పోనీ తెలుగులో చక్రాలు అందాం. విష్ణు చక్రాలు. అయినా ప్రపంచంలో ఐదేనా దేశాలు వున్నది?’

‘ఆదిలో హంసపాదులా నువ్వెక్కడ దొరికావురా బాబూ! దేశాలు కాదు. ఖండాలు. దేశాలన్నిటినీ కలిపి, రెండొందల పైన సున్నాలు పెడితే ఒలెంపిక్ చిహ్నమే, ఒలెంపిక్ స్విమ్మింగ్ పూలంత వుంటుంది. ఏవో కబుర్లు వ్రాసుకునే వాడిని, నాకేం తెలుసు. ఇంకా వివరాలు కావాలంటే గూగులమ్మని అడుగు. ఆవిడే చెబుతుంది. ఈలోగా నా వ్యాసం చదువు!’

౦ ౦ ౦

మా ఇంటిల్లిపాదీ మూడు వారాలుగా, ప్రోద్దున్న తొమ్మిది గంటల నించీ అర్ధరాత్రి దాకా, మా టీవీకి అతుక్కుపోయాం. మాటీవీ కాదు. ఆ మాటీవీలో తెలుగుని నేను భరించలేను. మా ఇంట్లో టీవీకి.

బ్రెసిల్ దేశంలోని రియోలో జరుగుతున్న, ముఫై ఒకటవ ఒలెంపిక్స్, అమెరికాలోని ఎన్బీసి వారి పది పన్నెండు ఛానళ్ళలో, ప్రతి చోటా ఒక్కొక్క రకమైన ఆటలు చూపిస్తున్నారు. ముఫ్ఫై ఐదేళ్లుగా అమెరికాలో వుంటున్నాం కనుక, అమెరికా పాల్గొన్న ఆటలు చూస్తున్నాం. ఇండియా ఎక్కడయినా కనిపిస్తే, ఇండియాని ‘గెలిపించటానికి’ చప్పట్లు కొట్టాం. మిగతా దేశాల ఆటలు చూస్తున్నప్పుడు, వాళ్ళల్లో అన్ని దేశాలవారినీ ప్రోత్సహిస్తూ చూశాం.

ప్రపంచంలో మొత్తం 196 దేశాలని ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా గుర్తించారుష! కానీ దానిలో చాల దేశాలనీ, ద్వీపాలనీ, ఏవేవో రాజకీయ కారణాల వల్ల చేర్చుకోలేదు. ఇంటర్నేషనల్ ఒలెంపిక్ కమిటీ మాత్రం 206 దేశాలను గుర్తించి, సభ్యత్వం ఇచ్చింది. ఏ దేశాలూ లేని కాందిశీకులను కూడా గుర్తించి అదే పేరుతో వాళ్ళనీ కలిపి, మొత్తం 207 దేశాలను ఈ రియో ఒలెంపిక్సుకి ఆహ్వానించింది. ఈ 31వ ఒలెంపిక్ ఆటల్లో 11,728 మంది పాల్గొంటున్న 28 రకాల ఆటల్లో 306X3 పతకాలను ప్రదానం చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఇది మొట్టమొదటి ఒలెంపిక్ ఆటల ప్రదర్శన.

ఈ ఆటలు అన్నింటిలోనూ మాకు ఇష్టమైనవి చాల ఆటలు వున్నాయి. స్విమ్మింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్, డైవింగ్, వాలీబాల్, హాకీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వైట్ లిఫ్టింగ్, రోయింగ్, బైకింగ్ ఇలా ఒకటా రెండా.. ఎన్నో వున్నాయి. అందులోనూ మళ్ళీ మగవాళ్ళు, ఆడవాళ్ళు. అన్ని ఆటలలోనూ వారి నైపుణ్యం చూపించే మహత్తర అవకాశం. నాలుగేళ్ల నించీ పది-పదహారేళ్ళ శిక్షణ, క్రమశిక్షణ, శ్రమ, నిబద్ధత, ఇరవై నాలుగు గంటలూ వారికి అదే ఆలోచన. గెలిచినవారి ముఖంలో ఆనందం. గెలవనివారి ముఖంలో ఆవేదన. ఇక్కడ ఓడిపోవటమనే ప్రసక్తి లేదు. అసలు ఒలెంపిక్స్ స్థాయికి ఎదగటం అంటేనే మాటలు కాదు. ఆ స్థాయికి రావటమే పెద్ద గెలుపు. కాకపొతే ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనుక. అంతే!

ప్రపంచంలోని ఎన్నో చిన్న, పెద్ద దేశాల నించీ, ఇంతమంది గొప్ప క్రీడాకారులని ఒకచోటకు రప్పించి, విశ్వమానవ సౌభ్రాతృత్వం చూపించటమే ఒలెంపిక్స్ ముఖ్యోద్దేశం. అది ఒలెంపిక్సులో ప్రతిరోజూ కనిపిస్తూనే వుంది. సెమీ ఫైనల్ రౌండులో వేగంగా పరుగెడుతున్న ఒక అమ్మాయి పడిపోతే, పక్కనే వస్తున్న ఇంకొక దేశపు క్రీడాకారిణి ఆగి, ఆవిడని లేవదీసి ఫినిష్ లైన్ దాకా తన భుజాల మీద ఆనించుకుని తీసుకువెళ్లటం, ఇంకొక దేశం జాతీయగీతం వస్తుంటే జమైకా దేశపు ఉసేన్ బోల్ట్ తన టీవీ ఇంటర్వ్యూ ఆపి, ‘జాతీయ గీతం వస్తున్నది’ అని చెప్పి నిశ్చలంగా, నిశ్చబ్దంగా నిలబడటం, మన భారతదేశపు రజిత పతక గ్రహీత సింధు, ఆనందంతో నేలకు వాలిన స్పానిష్ విజేతకు చేయి అందించి, ఎక్కడో విసిరేసిన ఆవిడ బాడ్మింటన్ రాకెట్ తీసి, ఆమె దగ్గర పెట్టటం.. ఇవన్నీ మనలోని మానవత్వాన్ని నిద్ర లేపే ఎంతో గొప్ప ఉదాహరణలు! ఇక్కడ ఎవరు గెలిచింది? ఎవరు గెలవనిది? తెలుపూ, నలుపూ, ఆడా, మగా, నువ్వూ, నేనూ, ఈ మతం, ఆ మతం, ఈ భాష, ఆ భాష, ఈ దేశం, ఆ దేశం అనే సమస్య లేనే లేదు. అందరూ ఒకే నీళ్ళల్లో ఈదటం! ఒకే నేల మీద పరుగెత్తటం! ఒకే గాలిలో ఎగరటం! వసుధైక కుటుంబం అంటే ఇదేనేమో!

క్రీడాకారులు అందరూ ఎంతో శ్రమ పడినా, కొన్ని ఆటల్లో ఒక్కొక్క స్థానానికి మధ్య సమయం, ఒక్క సెకండులో పదో భాగం. లేదా ఒకటో రెండో పాయంట్లు. ట్రైయాథలాన్ పోటీలో ముందు ఒకటిన్నర కిలోమీటర్లు ఈదుకుంటూ పోవాలి. తర్వాత నలభై కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి. తర్వాత పది కిలో మీటర్లు పరుగెత్తాలి. ఇది మానవశక్తికీ, పట్టుదలకీ ఒక పెద్ద పరీక్ష. మొత్తం నలభై మందికి పైన వివిధ దేశాల క్రీడాకారిణులు పాల్గొంటే, రెండు మూడు గంటల తర్వాత ఇది పూర్తి అయింది. అమెరికా, స్విట్జర్లాండ్, బ్రిటన్ ఇదే వరసలో మొదటి మూడు స్థానాలలొకీ వచ్చారు. మిగతా వారిలో ఇంకొక అమెరికన్ అమ్మాయి, సైకిల్ మీద నించీ క్రిందపడి, వెంటనే లేచి తన కార్యక్రమం పూర్తి చేసింది. ఇలా ఈ ఆటలో పాల్గొన్న నలభై మందీ విజేతలే! కాకపొతే ఇందాక చెప్పినట్టు, కొందరు ముందు. కొందరు వెనుక.

అన్ని ఆటల పోటీలు అయిపోయాక, అమెరికా 121 పతకాలతో మొదటి స్థానంలో, చైనా 70 పతకాలతో రెండవ స్థానంలోనూ, యూకే 67 పతకాలతో మూడవ స్థానంలోనూ వున్నాయి. భారతదేశం 2 పతకాలతో 64వ స్థానంలో వుంది.

ఇక్కడ మన మనసుకి చివుక్కుమనే విషయం, మన భారతీయులు ఏవో బహు కొద్ది ఆటలలోనే ఒలెంపిక్స్ స్థాయి దాకా ఎదగటం. మిగతా ఆటలలో ఎక్కడా కనపడక పోవటం. మన జాతీయ గీతం ఎక్కడా వినపడకపోవటం.

నూట ఇరవై తొమ్మిది కోట్ల భారతీయులలో మొత్తం అరవై ఆరు మగ, యాభై నాలుగు ఆడ, అంటే మొత్తం నూట ఇరవై మంది క్రీడాకారులు మాత్రమే రియో ఒలెంపిక్సులో పోటీకి స్థానం సంపాదించారు. ఎన్నో చిన్న చిన్న దేశాలవారే ఎన్నో ఆటలు ఆడుతుంటే, మనవారు బాస్కెట్ బాల్, ఫుట్బాల్ (మగవారు), వాలీబాల్, ఎన్నో ట్రాక్ అండ్ ఫీల్డ్, స్విమ్మింగ్, డైవింగ్, రోయింగ్ మొదలైన ఆటల్లో ఒలెంపిక్స్ స్థాయికి ఎదగలేదు. రియోకి రావటానికి అర్హత సంపాదించుకోలేదు. ఎందుకని? ఈ విషయం చర్చించుకునే ముందు, భారతీయులు ఈ ఒలెంపిక్సులో ఎలా ఆడారో చూద్దాం. ఈ ఆటలు పన్నెండు ఛానళ్ళలో చూపించటం వల్ల, కొన్ని చోట్ల రికార్డింగు పెట్టుకుని, కొన్ని అప్పటికప్పుడు చూశాం.

అన్నిటిలోకి మనల్ని కదిలించేదీ, హృదయాలని కరిగించేదీ జిమ్నాస్టిక్సులో దీపా కర్మార్కర్. ఆమె ఎంతో గొప్ప క్రీడాకారిణి. అప్పటికే వెనుకపడ్డ దీపాకి, బంగారు పతకం తెచ్చుకునే ప్రయత్నం వచ్చింది. ముందుకు వెళ్ళాలంటే అప్పుడు ఆమెకి ఒక్కటే అవకాశం. అన్ని పాయంట్లు తెచ్చుకోవటానికి “ప్రుడునోవా’ జంప్ అనే ప్రయత్నం చేసింది. రెండు చేతులతో పైకి వెళ్లి, గాలిలో రెండు ప్రత్యేకమైన సోమర్సాల్టులు వేసి, నేల మీదకి దిగాక కాళ్ళ మీద కదలకుండా నిలిబడాలి. అది సరిగ్గా చేస్తే కావలసిన పాయంట్లు తెచ్చుకుని, బంగారు పతకం సంపాదించుకునే స్థాయికి ముందుకు వెడుతుంది. కానీ దానిలో ఎంతో ప్రమాదం వుంది. ఈ ప్రుడునోవా జంపుని ఇంతకుముందు ప్రయత్నం చేసినవారు బహు కొద్దిమంది. ఎన్నో బంగారు పతకాలు తెచ్చుకున్న అమెరికా జిమ్నాస్టిక్స్ అమ్మాయిలు కూడా ఈ ప్రయత్నం చేయలేదు. దీనివల్ల ఆ చిన్నారి ఎముకలు విరిగిపోయే అవకాశం వుంది. పక్షవాతమే కాకుండా, తలకి దెబ్బ తగిలి చనిపోయే అవకాశం కూడా వుంది. అయినా దీపా ప్రాణాలు కూడా లెఖ్ఖ చేయకుండా ఈ ఎంతో ప్రమాదకరమైన జంప్ చేయటాని ధైర్యం చేసింది. కామెంటరీ చెప్పే వాళ్ళు కూడా ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోవటమే కాకుండా, భయపడ్డారు కూడాను! దీపా అంతా చక్కగా చేసింది కానీ, చివరికి కాళ్ళ మీద నిటారుగా నిబడలేక క్రింద కూర్చున్నది. పతకం రాలేదు. కానీ ప్రేక్షకుల దృష్టిలోనే కాక, అక్కడ వున్న ఇతర దేశాల క్రీడాకారుల దృష్టిలో కూడా ఆమె విజేత!

మనకి వచ్చిన పతకాలు రెండే రెండు. ఒకటి బాడ్మింటనులో పివి సింధు రజత పతకం. సాక్షి మాలిక్ రెసిలింగులో సంపాదించిన కాంస్య పతకం. ఇక్కడ విశేషం ఏమిటంటే పున్నామనరకం తప్పించుకోవటానికి మగపిల్లలే కావాలనీ, ఆడపిల్లలు వద్దనీ, వాళ్ళు పుట్టక ముందు, పుట్టిన వెంటనే చాల చోట్ల తుదముట్టించే భారతంలో, ఇక్కడ పతకాలు సంపాదించిన ఇద్దరూ మన ఆడపిల్లలే! మగ క్రీడాకారులు నిద్ర లేవటానికి ఇది సమయం! ఆడపిల్లలని కని, పెంచి, బంగారు తల్లులుగా తీర్చిదిద్దటానికి ఇది ఒక మేలుకొలుపు!

సైనా నెహ్వాల్, బాబర్ మొదలైన వారు ఆడిన ఆటలు చూశాం. గెలిచినా, గెలవకపోయినా వారి పరిమితిలో చక్కగా ఆడారు. హాకీలో మన ఆడపడుచులు బాగా ఆడారు కానీ, అది ఒక టీం ఆట కనుక, మన క్రీడాకారిణిల మధ్య కలిసికట్టుగా ఆడుతున్న సూచనలు కనపడలేదు.

2.7 కోట్ల జనాభాగల జమైకా 11 పతకాలు, 4.6 కోట్ల జనాభాతో కెన్యా 10, 17 కోట్ల జనాభాతో కజగస్తాన్ 17, 11 కోట్ల జనాభాతో క్యూబా 11, 5.7 జనాభాతో డెన్మార్క్ 15, 9 కోట్ల జనాభాతో ఆజర్ బైజాన్ 18, 4 కోట్ల జనాభాతో క్రొయేషియా 10 పతకాలతోనూ మనకన్నా ఎంతోముందు వున్నాయి. మరి ఇప్పుడు 129 కోట్ల జనాభాతో, ఇంకొక నాలుగేళ్లలో ప్రపంచంలోనే ఎక్కువ జనాభాగల దేశంగా మారబోతున్న మనం, ఈ చిన్నచిన్న దేశాలముందు కూడా నిలవకపోవటానికి కారణాలు ఏమిటి? మనకి ఆ సత్తా ఎందుకు లేదు?

మనవాళ్ళకి సత్తా లేదంటే నేను ఒప్పుకోను. ఉంది. సమర్దులైన వారిని గుర్తించక పోవటం, గుర్తించినా వారికి అవకాశాలు ఇవ్వకపోవటం, ఇచ్చినా వారికి అవసరమైన శిక్షణ ఇవ్వకపోవటం, ప్రభుత్వం ఆటలలో వేలు పెట్టి రాజకీయ వినాయకుల స్వంత లాభాలతో ఇచ్చిన నిధులు గుటకాయ స్వాహా చేయటం.. ఇలా ఎన్నో కారణాలు వున్నాయి.

దీపా కర్మార్కరుకి మంచి కోచింగ్ ఇవ్వలేదుట. కావలసిన ధన సహాయం చేయలేదుట. అలాగే తన ఇల్లు తాకట్టు పెట్టి తనే స్థాపించిన కోచింగ్ సెంటరులో పుల్లెల గోపీచంద్, సింధుకి శిక్షణ ఇచ్చాడుట. ప్రభుత్వ సహాయం చాల కొద్దిగా వుండవచ్చు కానీ మరి ఆటల మంత్రిగారు ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎక్కడ దాచిపెట్టారో! అసలు ప్రభుత్వం ఈ పనులు చేయవలసిన అవసరం ఏముంది? కోట్లకి కోట్లు దండుకునే క్రికెట్ ప్లేయర్లకి ధన బహుమానాలూ, తనదే దేశమో తెలియని టెన్నిస్ ఆవిడకి కోట్ల కొద్దీ డబ్బులు ఇచ్చే ప్రభుత్వం.. ఆ నిధులని అన్ని ఆటలలోనూ శిక్షణ కోసం ఇవ్వవచ్చు కదా! అమెరికాలో బాస్కెట్ బాల్ ఆడే లెబ్రాన్ జేమ్స్ తను ఆటల్లో సంపాదించిన డబ్బుల్లో అక్షరాలా నలభై ఒక్క మిలియన్ల డాలర్లు పెట్టి, పదకొండు వందల మంది కాలేజీ విద్యార్ధులకి ఆటల్లోనూ, చదువులోనూ సహాయం చేస్తున్నాడు. లిటిల్ మాష్టర్లూ, మాష్టర్ బ్లాస్టర్లూ, మాహి, దాదా ఇలాటి ఎందరో మహానుభావులు, ఒక్కొక ఆటలో కనీసం ఒక్కొక్క ప్లేయరుకి సహాయం చేయలేరా? ఎన్నో లాభాలు గడిస్తున్న ఇండియన్ కంపెనీలు, అమెరికాలోలా, కొన్ని ఆటలకే పూర్తి సహకారం ఇవ్వలేరా? నటన ఏమాత్రం లేకపోయినా మాఫియాల సహాయంతో, వంశాల పేరుతో, మతాల పేరుతో, కులాల పేరుతో సినిమా హీరోలయిన, నటశూన్య జీరోలు కూడా సహాయం చేయవచ్చునే? ముందు ఏమాత్రం సహాయం చేయకుండా, ఎవరికైనా మెడల్స్ వస్తే మాత్రం ఈ అమ్మాయిది మా కులమే, మా మతమే, మా రాష్ట్రమే అని ఫేస్ బుక్ నిండా వ్రాసేవారికి ఏమాత్రమైనా సిగ్గూ ఎగ్గూ అవున్నాయా? సింధుని ఒలెంపిక్సులో ఇండియన్ అనే చూపించారు కానీ, ఆమె కులంతో కాదు. మతంతో కాదు. రాష్ట్రంతో కాదు. బహుమతి ప్రదానమప్పుడు ఆమె వెనుక ఎగిరినది భారతదేశ జాతీయ పతాకం. కుల పతాకం కాదు. మత పతాకం కాదు. ఏ రాష్ట్ర పతాకమూ కాదు. ఆ రెండు రాష్ట్రాల సిగ్గులేని ప్రధాన మంత్రులూ, ‘సింధు మా అమ్మాయే! మేమే ఆమెకి రజత పతకం రావటానికి కారణం’ అని చంకలు బాదుకున్నారు. గూగుల్ సెర్చిలో సింధుది ఏ కులం అని విపరీతంగా వెదికారుట మన కులగజ్జి వెర్రి జనం! ఒక క్రికెట్ మేచ్ జరుగుతుంటే, వందలూ వేలూ పెట్టి టిక్కెట్టు కొనుక్కుని వెళ్ళే ఈ జనం, మన హైద్రాబాదులోనూ, బాంబేలోనూ, ఒక హాకీ మేచ్, ఒక బాస్కెట్ బాల్ ఆట, హాకీ, ట్రాక్ అండ్ ఫీల్డ్, స్విమ్మింగ్ ఆటలు పెడితే, క్రికెట్ చూడటానికి పెట్టినంత డబ్బులో కనీసం సగం పెట్టి టిక్కెట్టు కొనుక్కుని, ఆ ఆటలు చూస్తారా? మరి ఆటల్లో కూడా రిజర్వేషన్లు వున్నాయా? ఒక్కొక్క ప్లేయరు నుదుటి మీద ఏ కులమో, ఏ మతమో ముద్రలు వేస్తారా?

బట్టీ చదువులని అమ్మకానికి పెట్టాక, విద్యార్ధులకి మా చిన్నప్పటి రోజుల్లోలా రకరకాల ఆటలు ఆడటానికి సమయం చిక్కటం లేదు. ప్రొద్దున్న ఆరింటికి నిద్ర లేచి స్కూల్ బస్సులెక్కే విద్యార్ధులు, రాత్రి బట్టీ పట్టటం పూర్తిచేసేసరికి పదకొండు గంటలు అవుతుంది. ఇక ఆటలు ఆడే సమయం ఎక్కడ? పిల్లలకి ఈ కాలేజీలు అందిస్తున్నది చదువులా, చావులా?

మనకి ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన ఇండియన్ మహా సముద్రం, తూర్పున బంగాళా ఖాతం, పశ్చిమాన అరేబియా మహా సముద్రం వున్నాయని గొప్పలు చెప్పుకుంటే చాలదు. హిమాలయాలు మనకి తూర్పున వుంటే, చైనాకి దక్షిణాన వున్నాయి. అవేం మారవు. మారవలసింది మన రాజకీయ, సాంఘిక, జీవన విధానాలు. లంచాలు లేని ప్రజలు, ప్రభుత్వం. మనుష్యుల్లో పట్టుదల, విలువలు, ఆశయాలు.

కుల మత విభజనతో, ఇతర దేశాలలో లేని ఈ అర్ధంపర్ధం లేని రిజర్వేషన్లతో, ఆటలతో సహా అన్ని రంగాల్లోనూ సమర్ధులైనవారికి అవకాశాలు రాకపొతే దేశం ఎటు వెడుతుందో, ఇప్పుడు భారతదేశాన్ని మిగతా దేశాలతో పోలిస్తే, మనం ఎక్కడ వున్నామో మనకే తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)