ఆగష్టు 6న జరిగిన సిలికానాంధ్ర 15వ వార్షికోత్సవ వేడుకల్లో మహా సహస్రావధాని గరికిపాటి నరసింహారావు ద్విగుణిత అవధానం ఆద్యంతం అద్భుతంగా సాగింది. వార్షికోత్సవ వేడుకలు సన్నీవేల్ నగరంలోని హిందూ దేవాలయ సభాప్రాంగణంలో ఘనంగా జరిగాయి. సాయంత్రం అయిదు గంటలకు అవధాని గారిని పూర్ణకుంభంతో, పండితుల వేదప్రవచనాలతో సభాస్థలికి ఆహ్వానించారు. అధ్యక్షుడు తనుగుల సంజీవ్ సభను ప్రారంభిస్తూ పదిహేను సంవత్సరాల క్రితం గరికిపాటి వారి చేతుల మీదుగా జ్యోతీ ప్రజ్వలనతో ప్రారంభమైన సిలికానాంధ్ర మళ్లీ ఇప్పుడు అదే అవధానితో అవధానం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. పదహారు మంది పృచ్చకులను, సంచాలకునిగా వ్యవహరించిన కిరణ్ ప్రభను, అవధాని నరసింహారావుని అందంగా అలంకరించిన వేదికపైకి ఆహ్వానించారు.
అనంతరం సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ భారతదేశం నుండి మాట్లాడుతూ సిలికాన్ వ్యాలీలో ఉద్భవించిన సిలికానాంధ్ర నేడు విశ్వవ్యాప్తమై ప్రప్రధంగా విదేశీ గడ్డపై భారతీయ కళలను బోధించడాని సిలికానాంధ్ర విశ్వవిద్యాలాయాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పనులు విజయవంతంగా నిర్వహించడానికి లక్ష్మీ కటాక్షం కూడా కావాల్ని అందుకుగాను దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేసారు. . సిలికానాంధ్ర వైస్ చైర్మన్ కొండిపర్తి దిలీప్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఇంతింతై వటుడింతై' అన్న రీతిన ఈనాడు సిలికానాంధ్ర జగమంత కుటుంబంగా విలసిల్లుతున్నదని అన్నారు. వైస్ చైర్మన్, మనబడి కులపతి చమర్తి రాజు, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ఆర్థిక నిర్వహణాధికారి కొండుభట్ల దీనబాబు ముఖ్య అతిధి, అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకర్ కోడెల శివప్రసాద్, నార్త్ అమెరికా ప్రవాసాంధ్ర ప్రతినిధి కోమటి జయరాం లను వేదికపైకి తోడ్కొని వచ్చారు. కొడెల శివప్రసాద్ మాట్లాడుతూ ప్రవాస భారతంలో తెలుగు సంస్కృతి బావుటాను ఎగురవేస్తూ, భావితరాలకు తెలుగు సంప్రదాయాన్ని నేర్పిచండానికి సిలికానాంధ్ర చేస్తున్న సేవలను కొనియాడారు.
అయిదు గంటలకు పైగా జరిగిన ద్విగుణిత అష్టావధానంలో ప్రుచ్చకులుగా పాలడుగు శ్రీచరణ్ (నిషిద్ధాక్షరి), పుల్లెల శ్యాంసుందర్ (న్యస్తాక్షరి), మారేపల్లి వెంకటశాస్త్రి, జీడిగుంట విజయసారధి (పురాణ పఠనం), బండి ఆనంద్, డా. పావులూరి సునీల (సమస్య), కాశీవఝల శారద, డా. దారా సురేంద్ర (దత్తపది), తాటిపాముల మృత్యంజయుడు, ఇవటూరి కాశ్యప్ (ఆశువు), మొహమ్మద్ ఇక్బాల్, డా. చెరుకుపల్లి శ్రీనివాస్, కాజా రామకృష్ణ (వర్ణన), కూచిభొట్ల అనూష (వ్యస్తాక్షరి), ప్రఖ్య మధుబాబు, కూచిభొట్ల శాంతి (అప్రస్తుత ప్రసంగం) పాల్గొన్నారు. పృచ్చకులు సంధించిన ప్రశ్నలను పూరించడమే కాకుండా భక్తి, వ్యంగ్య, హాస్య, వ్యక్తిత్వ కోణాల్లో వ్యాఖ్యానిస్తూ, సంస్కృతాంధ్ర పురణాప్రబంధాల్లోని ఉదాహరణలను ఉటంకిస్తూ సభను ఆద్యంతం రసవత్తరంగా నడిపించారు.
సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు మాలెంపాటి ప్రభ, కూచిభొట్ల రవీంద్ర, బొడ్డు కిశొర్ అవధానిని పూలకిరీటంతో సత్కరించారు. వేయిమందికి పైగా విచ్చేసిన అతిధులకు భోజనాలు వండడంలో, వేదిక అలంకరణలో, ఆడియో వీడియోల్లో వేదుల స్నేహ, నాదెళ్ళ వంశీ, యోగి, కందుల సాయి, అన్నం అనిల్, కూచిభొట్ల అరుణ్, మమత, పేరి శ్రీనివాస్, గంటి శ్రీదేవి, కోట్ని జయంతి, ఇంకా ఎందరో స్వచ్చందంగా సహాయం చేసారు.