కవితా స్రవంతి
"పోరనట్టి ఆలిగలదె?"
- కిభశ్రీ

ఏ మగాడైనా, భార్య పదే పదే ఏదైనా చెప్పిందంటే దాన్ని పోరు కింద పరిగణిస్తాడు.
సరదాగా భార్య పెట్టే పోరుగానే వివరిస్తూ, తనమంచికే ఆమె చెబుతూందన్న భావాన్ని కొన్ని ఆటవెలది పద్యాలలో .....

ఏమగాడికైన ఇంట్లోన యేబాధ
లసలు పెట్టనట్టి ఆలి గలదె?
చదువులెన్నియున్న చవటాయివేనీవు
యనుచు పోరనట్టి ఆలి గలదె?

సూర్యుడదిగొ లేచె చూడెంత బాగుండె
మొద్దు నిదుర మాని ముసుగు తీసి
జాగుచేయకుండ జాగింగుకే పొమ్ము
యనుచు పోరనట్టియాలి గలదె?

బానపొట్ట చూడు పనస పండంతయ్యె
మోయలేక బరువు మూల్గుటేల
వళ్ళు తగ్గగాను వర్కౌటుచేయరా
యనుచు పోరనట్టియాలి గలదె?

పగలు రేయి నేను పనిచేయుచుంటినే
కౌచుమీదినుంచి కదలవీవు
హెల్పు కొంత చేయ హెల్లు కూలదులే
యనుచు పోరనట్టియాలి గలదె?

కూరలైన తరిగి కుక్కింగులో కొంత
సాయపడక పోతె సమయమునకు
డిన్నరేవిధము రెడీ ఔనననుకొందు
వనుచు పోరనట్టియాలి గలదె?

మొహము వెలుగునే సమోసా కచోరీలు
చూడగానె నీకు చొంగకారు
కాలరీలు ఫాటు గలఫుడ్లు తిననేల
యనుచు పోరనట్టియాలి గలదె?

లాగులుతుకగాను లాండ్రీకి డబ్బేల
ఇంట మిషినుయున్నదేల మనకు
ఆదివారముతుకటలవాటుచేసుకొ
మ్మనుచు పోరనట్టియాలి గలదె?

దుమ్ములో కదలక తుమ్ముతూకూర్చోని
ముక్కు చీదుకుంటు మురుగకుండ
వడిగ లేచి వచ్చి వాక్యూముచేయరా
యనుచు పోరనట్టియాలి గలదె?

కొన్ని కూరలేవొ కొనితేగ నినుపంప
మోసుకొస్తివేల మూటలెన్నొ
వేస్టు చేతువేల విత్తమీవిధినీవ
ననుచు పోరనట్టియాలి గలదె?

ఆబు రోలరెక్కి ఆయాసపడుదువే
పాంటు పట్టనంత ఫాటువున్న
సిక్సు పాకు వున్న షేపెట్లువచ్చేను
అనుచు పోరనట్టియాలి గలదె?

తీయ మనసె కాని తీపియే తనువంత
తీయదనముతో రుధిరమునిండె
షుగరు తగ్గగాను సూపులేనీకింక
యనుచు పోరనట్టియాలి గలదె?

ఎన్ని విధులనామె నేడిపించినకూడ
ఇంటనుండనిచ్చు ఇంతియామె
వెంటబడుచు తరిమి వెళ్ళపో యిటనుండి
యననుచు పోరునట్టియాలి గలదె?

చదువమనుచునివ్వ చదివేసి నవ్వేసి
చిదిమి బుగ్గ, చూపె చిలిపితనము
ఇంక కొన్ని రాయ ఇన్స్పైరుచేసేటి
యాలియామెయనునదసలు నిజము

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)