ఆశ-1
శ్లోకం:
आशा नाम मनुष्याणां शृङखला काचिदद्भुता ।
यया बद्धाः प्रधावन्ति मुक्तास्तिष्टन्ति पङगुवत् ।।
ఆశా, నామ, మనుష్యాణామ్, శృంఖలా, కాచిత్, అద్భుతా,
యయా, బద్ధాః , ప్ర ధావన్తి, ముక్తాః, తిష్టన్తి, పంగువత్
సంధి విగ్రహం
ఆశా, నామ, మనుష్యాణామ్, శృంఖలా, కాచిత్, అద్భుతా,
యయా, బద్ధాః , ప్ర ధావన్తి, ముక్తాః, తిష్టన్తి, పంగువత్
శబ్దార్థం
ఆశా = ఆశ, నామ = అనేది, మనుష్యాణామ్ = మనుష్యులకి, శృంఖలా = బంధకము లేదా బంధనము, కాచిత్ = ఒకానొక, అద్భుతా = అద్భుతమైనది, యయా = దేనిచేతనైతే, బద్ధాః = కట్ట బడతారో, ప్రధావన్తి = పరుగిడతారు, ముక్తాః = విముక్తుడైన వారు, తిష్టన్తి = కూర్చుని ఉంటారు, పంగువత్ = అవిటి వాని వలె.
Meaning
For human beings, aspiration or ambition or the hope or the worldly desires, is a kind of wonderful shackle.
People when tied by this wonderful shackle of desires, keep running through out their life with their continued efforts to succeed in the battle of life to fulfill their desires or ambitions or hopes. When they are freed from any kind of desires in the life, will sit without any efforts in their lives and do not run to accomplish things like a physically disabled person sits as he cannot run.
భావార్థం
మనిషికి ఆశ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ఆశ అనగా కోరిక, ఒక నిర్దేశిత గమ్యం, ఒక లక్ష్యం, జీవిత సాఫల్యానికై ఏర్పరుచుకునే ఉత్కృష్ట లక్ష్యం. ఈ ఆశలు అనేకానేక రకాలు. విద్యా సాధన కావచ్చు, విశేష ధన సముపార్జన కావచ్చు, ఐహికమైన సుఖాల లబ్ధి కావచ్చు. శారీరక సుఖాలను అనుభవించుట కావచ్చు లేదా ఉన్నతమైన అధికార కాంక్ష కావచ్చు. అనాదిగా మనుష్యులు వెంపరలాడే ఇతరములైన అనేకానేక విషయాలు కావచ్చు.
ఈ ఆశ అనేది మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే దాకా వానిని నడిపించే లేదా పరుగుపెట్టించే ఒక మహా శక్తి లాంటిది. ఈ ఆశ అనేది మనిషిని కట్టి పడేసే ఒక రకమైన అద్భుతమైన శృంఖలము. లేదా ఒక బంధనం. తమాషా ఏమిటి అంటే, ఈ అద్భుతమైన ఆశ అనే శృంఖలము చేత బంధింపబడే ప్రతీ మనిషీ కూడా ఆ యొక్క ఆశా సాధనకోశం పరితపిస్తూ తన జీవితాంతం నిరంతరమూ శ్రమ పడుతూనే ఉంటాడు. అలా జీవితాంతము పరిగెడుతూనే ఉంటాడు. సాధించిన నాడు ఆనందపడతాడు. విఫలమైన నాడు నిరాశా నిస్పృహలకి లోను అవుతాడు. వాటి పర్యవసానాలని అనుభవిస్తూ ఉంటాడు.
మరల కోలుకుని ఆ ఆశని పరిపూర్తి చేసుకోవడానికి మరల పరుగుకి సిధ్ధమౌతూ ఉంటాడు. నిజానికి సాధారణ మానవ జీవితాలలో అత్యంత ముఖ్యమైనది ఈ ఆశ. ఇది చాలా ఆవశ్యకము కూడా.
అయితే, ఈ ఆశ అనే శృంఖలాల నుండి విముక్తి పొందిన వానికి ఈ ప్రపంచముతో సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి, ప్రాపంచికమైన విషయ వాంఛలమీద ఏ రకమైన ఆకర్షణలూ కానీ, మోహాలు కానీ ఉండవు. ఆ శృంఖలా బధ్ధతనుండి ఆ మోహ వాంఛలనుండి విముక్తుడైన నాడు ఈ ప్రాపంచిక విషయ సాధనల లక్ష్యాలు ఏమీ ఉండవు కావున వాటికై పరుగులు పెట్టడం మానేసి ఒక అవిటి వాని వలె ఒక దగ్గర చతికిల పడతాడు.
ఆశ అనే శృంఖలాలచే బధ్ధుడైన వాడు జీవితంలో పరుగులు పెడతాడు. వాటి నుండి విముక్తుడైన వాడు అవిటివాని వలె చతికిల పడతాడు అని తాత్పర్యం.
ఇలా చతికిల బడే వాడు సామాన్యుడు కాడు. అసామాన్యుడు. ఎందుకంటే ఈ శృంఖలాలనుండి విముక్తి దాదాపుగా అసాధ్యం. అటువంటి వారు నిజంగా మహాత్ములు, మహోన్నతులు, యుగ పురుషులూ అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఆ కోవకి చెందిన వారిని చరిత్రలో మనం కొద్ది మందిని చూస్తూ ఉంటాం. పరమ పూజ్యులు ఆది శంకరాచార్యులు, గౌతమ బుధ్ధుడు, రామకృష్ణ పరమ హంస, స్వామీ వివేకానంద మున్నగు వారు ఆ కోవలో పరిగణించగలిగే మహోన్నత వ్యక్తులు. వారు విశ్వ కల్యాణానికై అప్పుడప్పుడు జన్మించే కారణ జన్ములు.
---------- ॐ ----------
ఆశ-2
శ్లోకం
आशायाः ये दासाः , ते दासाः सर्वलोकस्य ।
आशा येषां दासी , तेषां दासायते लोकः
ఆశాయాః యే దాసాః , తే దాసాః సర్వ లోకస్య ।
ఆశా యేషాం దాసీ, తేషాం దాశాయతే లోకః ॥
సంధి విగ్రహం
ఆశాయాః , యే, దాసాః, తే, దాసాః , సర్వ, లోకస్య ।
ఆశా, యేషాం, దాసీ, తేషాం, దాశాయతే, లోకః ॥
శబ్దార్థం
ఆశాయాః = ఆశలకి, యే = ఎవరైతే, దాసాః = దాసులో, తే = వారు, సర్వ లోకస్య =సమస్త లోకమునకు, దాసాః = దాసులు,
యేషాం = ఎవరికైతే, ఆశా = ఆశ లేక కోరిక, దాసీ = దాసీయో, తేషాం = వారికి, లోకః = లోకము, దాశాయతే= దాసోహం అవుతుంది.
Meaning
Those who are the slaves of 'desire' are slaves of the entire world. But world itself is the slave of those to whom 'desire' is a slave
భావార్థం
ఆశ మనిషికి సహజం. అదే ఆశ అత్యాశ అయితే అది మనిషిని తన బానిసని చేసుకుంటుంది. ధన వ్యామోహము ఒక ఆశ. విపరీతమైన ధన వ్యామోహము లేదా దానిమీద విపరీతమైన కోరిక లేక మమకారం అనేకమైన విపరీతాలకి దారి తీస్తుంది. విపరీత ధనకాంక్షతో మనిషి ఉచ్చ నీచాలు కూడా మరచిపోయి ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు. మద్యపానమూ, జూదమూ, వ్యభిచారమూ, చౌర్యమూ, మాదకద్రవ్య సేవనమూ, హత్యలూ, మాన భంగాలూ ఇవన్నియూ తీవ్రమైన కోరికల పర్యవసానములు. అవే వ్యసనాలుగా పరిగణిమిస్తాయి. ఇటువంటి కోరికలకి ఎవరైతే దాసులో, వారు ప్రపంచానికే దాసులు. వారి ప్రవర్తనని సమాజం ఏవగించుకుంటుంది. వారు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ చులకనైపోతారు. వారిని ఎవరూ గౌరవించరు, ఎవరూ లక్ష్య పెట్టరు. చివరకి సమాజవిద్రోహకులుగా ముద్రవేయబడి తీవ్రమైన శిక్షాపాత్రులు అవుతారు.
అటువంటి కోరిక ఎవరికైతే దాసీయో వారికి ప్రపంచమే దాసోహం అంటుంది. అనగా, కోరికలని అదుపులో ఉంచుకుని, వాటిని అధిగమించిన వారు, ఉన్నతమైన లక్ష్యాలని ఏర్పరుచుకుని, జీవితములో అనేక విజయాలు సాధించ గలుగుతారు. సమాజ శ్రేయస్సుకై పాటుపడతారు. అట్టి వారికి ప్రపంచమంతా దాసోహం అంటుంది. వేనోళ్ళ కొనియాడుతుంది, ప్రశంసిస్తుంది. వారు చిరస్మరణీయులౌతారు. సత్సమాజ నిర్మాణానికై, సమాజ అభివృద్ధికై ఇటువంటి వారు ఎంతైనా అవసరం.
వ్యక్తి మనుగడకి, అభివృద్ధికి మరియు సమాజ శ్రేయస్సుకై వ్యసనాలకి దూరంగా ఉండమని సారాంశం..
---------- ॐ ----------