“ ఇది కలా ? వైష్ణవ మాయా ? … ఏమి అర్థం కావడం లేదు.”
“ అర్థం కావడం లేదని అర్థం అయ్యిందా ? చాలా సంతోషం.”
“ లేదు స్వామి ! … ఇప్పుడిప్పుడే…”
“ సరే, నేను ప్రత్యక్షమయితే … ఏదో…”
“ నిజమే భగవాన్ ! నీదర్శనమయితే … ఏదో విన్నవించుకోవాలని తహ తహ లాడాను.”
“ అలాగే కానియ్ … ఆలస్యం అమృతం విషం.
“ స్వామీ ! దుర్లభమైన మానవజన్మ నాకు ప్రసాదించావు కృతజ్ఞతలు.”
“కానీ, నువ్వు.. దర్జాగా … నిర్లజ్జగా … ఎన్నెన్ని ఘనకార్యాలు చేసావ్!”
“ ప్రభూ! నన్ను క్షమించు. నిజమే, యవ్వన గర్వంతో… ధన గర్వంతో… ఆనాడు చేసిన పనులు … నిజంగా క్షమించలేనివి కానీ, ఈనాడు … జీవిత చరమాంకంలో … జీవన సంధ్యలో … మృత్యుదేవత దోబూచు లాడుతుంటే … ప్రభూ ! “
“సంతోషం సత్యాన్ని అంగీకరించావు”
“ ప్రపంచ రంగ స్థలం మీద, నేను కేవలం నటుడ్ని అని తెలిసేసరికి, నాటకం పూర్తికావస్తోంది. ఎంత మాయ చేసావు స్వామి!”
“ పొరపాటు, మాయలు, గారడీలు మనుషులకేగాని నాకు తెలియవు”
“ క్షమించు స్వామి! ఈ మూర్ఖుడ్ని క్షమించు.”
“ సత్యం బోధ పడినందుకు సంతోషం.”
“ కానీ ప్రయోజనం ఏముంది స్వామీ! ఈ దీనుడికి దిక్కే లేదు?”
“ పోనీ, ఇంకోసారి మానవజన్మ కావాలా ? జన్మ సార్థకం చేసుకొంటావా?”
“ స్వామీ! నీ తేనె తీనియల పలుకు మ్రోయ లేదీ బ్రతుకు. ఎంతటి కారుణ్యం! మళ్ళీ నరజన్మా ! నాకు.”
“ అవును, ఈ దేశంలోనే మరోసారి మనిషిగా అవతరించి…”
“మనిషిగా అవతరించినా, తరించలేనేమో ప్రభూ! అప్పుడు నన్ను కొందరు వివేకానందుడనవచ్చు … కొందరు మదర్ థెరిస్సానవచ్చు… మరి కొందరు అబ్దుల్ కలామనవచ్చు…
నా మార్గం ఏదైనా … హిందువనో … ముస్లిమనో … క్రిస్టియనో అంటూ నాలోని నిన్ను పైకి రానియ్యరు.”
“యదార్ధం కంటే పదార్ధమే అందంగా కనబడుతుంది మాకు.”
“ మరి ఏమిటి నీకోరిక?”
“ స్వామీ నిజంగా నిన్నుకోరే అర్హత లేదు నాకు.”
“ నువ్వు ఇచ్చినా పుచ్చుకొనే శక్తి నాకు లేదని అర్థమయ్యింది. నీఇష్టం స్వామీ.”
“ సంతోషం నాయనా! ఈ భూగోళం మీద మనిషిగా కంటె మొక్కగా జీవించడమే ఉత్తమం.”
“ఎంత బాగా చెప్పావు స్వామీ! అన్ని ఇజాలకీ దూరంగా, నిజాయితీగా, నిండుగా, పరోపకారమే పరమావధిగా జీవించే మొక్క, నిజంగా మనిషికంటే మహోన్నతమైనది, ధన్యోస్తి స్వామీ!”
చిట్టిచిట్టి చేతుల్లో నవనవలాడుతున్న మొక్కలతో పాఠశాల విద్యార్థుల ఊరేగింపు ఇంటిముందు సాగుతోంది. చకచక పిల్లలు పెద్దలు ఏకమై చెట్లు నాటుతున్నారు. పచ్చని పట్టు చీరతో ప్రకృతి క్రొత్త అందాలు దిద్దుతోంది వనభారతి – జన హారతి కార్యక్రమం నడుస్తుంది…
“ఇది కల… వైష్ణవ మాయ కాదు, పరమసత్యం.”