తిరుపతి కొండమీద పెద్ద కళ్యాణం ఉదయం పదింటికి. తొమ్మిదికే వచ్చేసి లైన్లో నించో కపోతే ఇంతటి కష్టమూ బూడిదలో పోసిన పన్నీరే. ఈ కళ్యాణం టికట్ దొరకడానికో లంచం, ఓ రెకమెండేషనూ అన్నీ సంపాదించడం అన్నీ ఓ ప్రహసనం. ఎంతమందికి లంచాలు పెట్టి సంపాదించాడు ఈ టికట్? పోనీ లంచం తీసుకున్న పెద్దమనుషులు సరిగ్గా ఇచ్చారా అంటే అదీ లేదు. ఏదో కంచంలో ముష్టి పడేస్తున్నట్టూ ఓ విసురు విసుర్తారు.... ఆలోచనల్లోంచి బయటకి తరుముతూ ఓ కంఠం వినిపించింది,"కదలండి, కదలండి." సోమేశ్వర్రావు ముందుకి కదిలేడు అందరితోపాటూ.
కళ్యాణం అదీ అయ్యేసరికి దాదాపు ఒంటిగంట. భోజనం చేయాలి; ఆకలి నక నకలాడుతూంది. కూడా ఉన్నవాళ్ళకి సరే సరి. పొద్దుటనుండీ కంగారులో చిన్న పిల్లకి కూడా ఏమీ తినిపించలేదు. తనకే ఇలా ఉంటే చిన్న పిల్ల ఎలా ఓర్చుకుంటోందో? కళ్యాణమండపం లోపలకి వెళ్ళడం ఒక పద్మ వ్యూహం అనుకుంటే బయటకి రావడం మరొకటి. పూజార్లు మొత్తం సరంజామా అదీ తీసుకుని గేటు దగ్గిర నించుని ఒక్కొక్కళ్ళకీ తీర్థం, శఠగోపం పెట్టి పంపిస్తున్నారు. సోమేశ్వర్రావు వంతు వచ్చేసరికి రెండౌతోంది. అక్కడో పూజారి తీర్థం ఇస్తూ పక్కనున్న పళ్ళెంలో డబ్బుల వేపు కావాలనే చేయి చూపిస్తున్నాడు - దక్షిణ వేయమని కాబోలు. పూజారి నోట్లో మంత్రాలు ఆటోమేటిగ్గా వస్తున్నా ఆయన దృష్టి దక్షిణ పళ్ళెం మీదే అని తెలుస్తూనే ఉంది. ఇది దాటాక శఠగోపం పెట్టే పూజారీ ఇదే తంతు. రెండుచోట్లా వేరువేరుగా సమర్పించుకోవాలి. వేద మంత్రాలు చదువుతూ ఈ పూజార్లు శ్రీనివాసుడికి చేసే చాకిరీ ఇదా? ఈ లోపుల సోమేశ్వర్రావు పదేళ్ల కూతురు మొదలెట్టింది, "నాన్నా ఆకలి" అంటూ. పాపని సముదాయించడానికి చేతిలో అప్పుడే తీసుకున్న ప్రసాదం పెట్టేడు. అది తిన్నాక కొంచెం శాంతించింది.
బయటకొచ్చేరందరూ. భోజనశాల ఎక్కడో కనుక్కుని మళ్ళీ లైన్లో నుంచునేసరికి దాదాపు నాలుగు. నిరతాన్నదానం కనక ఎప్పుడు తినడానికైనా ఢోకా ఏమీ లేదు. భోజనశాల తలుపులు తెరవగానే మళ్ళీ పరుగులు సీటుకోసం. ఈ కంగార్లో ఏది ఎక్కడ పడిపోతుందో అని బెంగ, ఎవరి కీళ్ళు విరుగుతాయో తొక్కిసలాటలో అనే చింతాను; శ్రీనివాసుణ్ణి తల్చుకోడానికి టైమేదీ?
భోజనం కానించి మొత్తానికి బయటకొచ్చేరు. సాయంత్రం అవుతోంది అప్పుడే. మోహమ్మీద ఎండ తీక్షణంగా పడుతోంది. చెప్పులెక్కడున్నాయో చూసేలోపుల సోమేశ్వర్రావు కుతురు 'నాన్నా..’ అని అరిచి కూర్చుండిపోయింది ఎక్కడిదక్కడే. కంగారుగా కూతురిదగ్గిరకెళ్ళేడు "ఏమైంది?" అంటూ.
భళ్ళున వాంతి. పొద్దుటనుండీ ఏమి తిందో? అన్నీ కల్సిపోయి బయటకొచ్చేసేయి. చుట్టూ ఉన్న జనం మీదా, తనమీదా అక్కడే అందరూ తిరిగే చోట పబ్లిగ్గా డోకేసింది. వెర్రి పిల్ల అంతటి డోకొస్తే ఓర్చుకోగలదా? చుట్టూ ఉన్నవాళ్ళు అసహ్యంగా ఓ చూపు చూసి పక్కకి తప్పుకుంటున్నారు. ఎవడో ఒకాయన ఉచిత సలహా పారేసాడు, "ఇక్కడ క్లీన్ చేసేవాళ్ళుంటారు చూడండి. వాళ్ళతో చెప్తే తుడుస్తారు, డబ్బులు బాగా వదుల్తాయ్ మరి" అన్నాడు చివర్లో గుంభనంగా నవ్వుతూ. ఇంతటి కష్టంలోనూ అదృష్టం ఏమిటంటే కూతురు బాగానే ఉంది. జ్వరం అదీలేదు.
చచ్చీ చెడీ ఈ క్లీన్ చేసేవాళ్ళని పట్టుకున్నాడు సోమేశ్వర్రావు. వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే చేతులు ఎత్తేది లేదని వార్నింగ్ లాంటి మాట కొట్టి వెళ్ళిపోయేరు - తాము చెయ్యాల్సిన పనికి నెలవారీ జీతాలందుకునే - తి.తి.దే ఉద్యోగస్తులు. కొయ్యబారిపోయేడు సోమేశ్వర్రావు. డోకు క్లీన్ చేయడం వాళ్ల ఉద్యోగమే అయినా డబ్బులిలా గుంజుతారేం? అదే అడిగితే విసురుగా వచ్చింది సమాధానం ఏకవచనంలో, చెంప మీద కొట్టినట్టుగా, "పూజార్లకి ఇస్తావుగా, మాకు ఇమ్మంటే ఏడుస్తావేం?"
ఏం చెయ్యాలా అని చూస్తూంటే ఈ లోపుల ఇద్దరు పలకరించేరు, "ఏమైంది?" అంటూ. చెప్పేడు జరిగిందంతా సోమేశ్వర్రావు అన్యమనస్కంగా. వీళ్ళిద్దరూ చెప్పులుకుట్టుకునేవాళ్ళు, ఏదో ఊర్నుంచి వచ్చార్ట తిరుపతి నడుచుకుంటూ ఏనాటిదో మొక్కు తీర్చుకోవడానికి. ‘మీరు ఇలా పక్కన నుంచోండి మేము చూస్తాం’ అన్నారు. పది నిముషాల్లో ఉత్త చేతుల్తో అంతా ఊడ్చేసి క్లీన్ చేసి పెట్టారు. సోమేశ్వర్రావుకి, వాళ్ళావిడకీ, కూతురికీ నోటమ్మట మాటరాలేదు. వాళ్ళు వెళ్ళిపోతూంటే సోమేశ్వర్రావు వాళ్ళావిడ మోచేత్తో పొడిచింది, "వాళ్లకేమీ ఇవ్వకపోతే బాగుండదు అంటూ."
పరుగున వాళ్ళదగ్గిరకెళ్ళి తలో రెండు వందనోట్లూ ఇవ్వబోయేడు సోమేశ్వర్రావు. "లేదు, లేదు తప్పు, మేము అలా తీసుకోం. మీరు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసాం అంతే." అంటూ పడమటగా అస్తమిస్తూన్న సూర్యుడికేసి అప్పుడే చిక్కబడుతున్న చీకట్లో కల్సిపోయేరిద్దరూ.
కనుమరుగయ్యే వాళ్లకేసి అలా చూస్తూంటే వీళ్ళిద్దరూ - పొద్దున్న శ్రీనివాసుడికి అతి దగ్గిర్లో నుంచుని బ్రహ్మాండ మండలాకారుడికి కళ్యాణం చేయిస్తూ దృష్టి మాత్రం దక్షిణ పళ్ళెం మీద ఉంచే - పూజార్ల మీద "ఇంతింతై, వటుడింతయై...బ్రహ్మండముం నిండుచోన్" అన్నట్టుగా వామనుడు ఒక్క క్షణంలో ఎదిగిపోయినట్టూ విజృంభిస్తున్న భావన. తల వంచుకుని వెనక్కి వస్తూంటే కూతురు అడిగింది, "నాన్నా ఎందుకేడుస్తున్నావ్?" అని. ఏమీ చెప్పలేక కూతుర్ని దగ్గిరకి తీసుకుని వాళ్ళావిడ చూడకుండా చెంపలమీదనుంచి జారిపోయే కన్నీళ్ళు తుడుచుకున్నాడు సోమేశ్వర్రావు.
దూరంగా మైకులో ఘంఠసాల పాట వినిపిస్తోంది "ఏ చోట గాంచినా నీ వుండు అందునే, ఏమిటో నీ మాయ తెలియ కున్నామయా …ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా.... ఎన్ని మెట్లిక్కినా కానరావేమయ్యా.."