ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
(కందుల వరప్రసాద్ గారు పంపిన సమస్య) "చెలియ చీర దోచి చెల్లి కిచ్చె"
గతమాసం ప్రశ్న:
(సమస్య) తక్కువ డబ్బున్నవాడె ధనవంతుడిలన్
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
మిక్కిలి ప్రేమను పంచుతు
చక్కని భాషణము లందు సాంత్వన మొందన్
మక్కువ మీరగ సమ్మతి
తక్కువ డబ్బున్నవాడె ధనవంతు డిలన్
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
(1)
మక్కువ కలిగిన వన్నియు
గ్రక్కున పొందుటకు కతము కలిమియె కాదా ?
దక్కిన సంతృప్తి కగున
తక్కువ? డబ్బున్న వాడె ధనవంతుడిలన్
(2)
మిక్కిలి విపత్తు నుండగ
గ్రక్కున దరిజేర్చు కొనెడు కరుణామయులే
చక్కని మనుజులు, వారే
తక్కువ! డబ్బున్న వాడె ధనవంతుడిలన్
చావలి విజయ, సిడ్నీ
ఎక్కువ రాబడి వెదకుచు
మిక్కిలి తప్పులు సలుపుట మేలా? తెలివిన్
దక్కిన సొత్తుకు సుఖపడు
తక్కువ డబ్బున్నవాడె ధనవంతుడిలన్.
గండికోట విశ్వనాధం, హైదరాబాదు
మక్కువ తీరగ వనరులు
చక్కగ బొక్కుచు దొరవలె చతురత చెలగన్
నిక్కెడి ధనేశు కంటెన్
తక్కువ డబ్బున్నవాడె ధనవంతు డిలన్
శివప్రసాద్ చావలి, సిడ్నీ, ఆస్ట్రేలియా
(1)
లెక్కకు మించుచు బడయగ
పక్కని నిద్రకొరగని యభాగ్యుని జూడన్
చక్కటి నిద్రను పొందగ
తక్కువ డబ్బున్నవాడె ధనవంతుడిలన్
(2)
రెక్కాడగ డొక్కాడుచు
రెక్కల కష్టంబున నిదురించగ సుఖమున్
తక్కువ కాదెంచగ మరి
తక్కువ డబ్బున్నవాడె ధనవంతుడిలన్
డా. రామినేని రంగారావు యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా.
లెక్కకు మించిన రొక్కము
మక్కువ "స్విస్"బ్యాంకులందు మరుగున నుండన్
లెక్కకు పన్నును కట్టగ
తక్కువ ధనమున్నవాడె ధనవంతుడిలన్
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
ఎక్కువగ డబ్బులుండిన
మక్కువలు పెరుగు నపరితమగుచు మనిషికిన్,
తిక్కెక్కు మెదడుఁ, గావున
తక్కువ డబ్బున్నవాడె ధనవంతుడిలన్!
పుల్లెల శ్యామసుందర్, శేన్ హోసే, కాలిఫోర్నియా
పెక్కుగ కష్టములొందును
తక్కువ డబ్బున్నవాడె, ధనవంతుడిలన్
జక్కగ తాఁ రొక్కముతో
యిక్కట్లను పారద్రోలు నింపుగ శ్యామా!