సారస్వతం
అన్నమయ్య శృంగార నీరాజనం
- టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ.

అన్నమయ్య సంకీర్తనలు 16వ శతాబ్ది నుంచే ప్రజల నాలుకలపై ప్రచారంలో ఉన్నా సరయిన గుర్తింపు, ప్రాచుర్యం ఇరవయ్యొవ శతాబ్దిలోనే వచ్చింది. అన్నమయ్య రచించిన ముప్పది రెండువేల కీర్తనలకు గాను ప్రస్తుతం కేవలం పన్నెండువేలు మాత్రమే లభిస్తున్నవి. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పినట్లు "రాగం విలువ తెలియని కాలం రాగి కోసం వాటిని కరగించుకొన్నది".

ఈ కీర్తనలలో ఎక్కువభాగం శృంగార కీర్తనలే! ఆ కీర్తనల్లో దేవదేవుని శృంగార కలాపాల వర్ణన, అలిమేలుమంగ నాయికగా, శ్రీ వేంకటేశ్వరుడు నాయకునిగా సాగుతుంది. శృంగారకీర్తనలు అనగానే జన సామాన్యంలో ఆ కీర్తనలు ఏవో అశ్లీలబద్ధం అనే అపోహ ఉంది. అసలు విషయం ఏమిటంటే..... కామం వేరు శృంగారం వేరు. " కలుషమైన తుఛ్ఛ కోరికతో కూడినది కామం అయితే.. చతుర్విధ పురుషార్ధ సాధనకై ధార్మిక చింతనతో నడిచేది శృంగారం. పదకవితా పితామహుడైన అన్నమయ్య తానే అలమేలుమంగగా, వేంకటేశ్వరునిలా, చెలికత్తెలుగా, తోడి సతి (సవతి) గా, శృంగార దూతికగా.. బహువిధమైన రూపాలతో, నాయిక రూపాలను వేలాదిగా విస్తృత పరచి నాయికా వైవిధ్యాన్ని తన కీర్తనల ద్వారా మనకు ప్రసాదించి మనలను అలరిస్తాడు. తద్వారా ఒక నూతన అలంకార శాస్త్రానికి ఒరవడి పెట్టాడు అంటే అతిశయోక్తి కాదు. నవరసాలలో ‘శృంగార’ రసానిదే అగ్రస్థానం. శృంగారం లేనిదే సృష్టే లేదు. అందువలన ఏ భాషలోనైనా శృంగారానికే ప్రాధాన్యతనిచ్చారు. అయితే....భగవత్పరమైన శృంగార సంకీర్తనా రచన ఎంతో కష్టమైన ప్రక్రియ. అన్నమయ్య ఔచిత్యాన్ని గ్రహించి, అనౌచిత్యాన్ని పరిహరించి, మనోరధ సిద్ధినీ, భగవత్సాక్షాత్కారాన్నీ పొందిన మహనీయుడు. అన్నమయ్య శృంగార కీర్తనలలో బాహ్యరతి వర్ణనమే తప్ప అభ్యంతర వర్ణనము కనపడదు. ‘ఏలితివి’, ‘కూడితివి’ వంటి సూచక శబ్దాలతోనే పరమార్ధాన్ని చూపించాడు. భక్తికీ, శృంగారానికీ అభేద ప్రతిపత్తిగా నిరూపణ గావించిన అన్నమయ్య తన సంకీర్తనలలో..అభిలాష, ఈర్ష్య, విరహము, ప్రవాసాలతో గూడిన విప్రలబ్ధ శృంగారానికే ఆధిక్యత నిచ్చాడు.

అన్నమయ్య శృంగార సంకీర్తనలన్నిటిలోనూ శ్రీవేంకటేశ్వరుడే నాయకుడు, అలిమేలు మంగమ్మే నాయిక. ఆయన తన భక్తి తత్వాన్ని అమ్మను-వేంకటపతినీ శృంగార నాయిక-నాయకులుగా జేసి సర్వజనామోదమైన రీతిలో బహుముఖంగా వర్ణించి తన్మయత్వం పొందిన మహా భక్తుడు. అన్నమయ్య శృంగార కీర్తనలన్నీ..శ్రీవేంకటేశ్వరునికీ అలమేలుమంగకూ ఇచ్చిన శృంగార నీరాజనాలుగా ప్రఖ్యాతి పొందాయి. ఈ సంకీర్తనలన్నీ వైష్ణవ మధుర భక్తి సాంప్రదాయ వృక్షo కొమ్మలే!

నాయికా నాయకుల శృంగార నైవేద్యం ఆరగించే ముందు అన్నమయ్య ఈ కీర్తనలకు "తెరతీసే కీర్తన" (కర్టన్ రయిజర్) లాంటి అద్భుతమైన కీర్తన ఒకటి రాసాడు. దానిని అస్వాదిద్దాం. "ఇది అన్నమయ్య రసికులకిచ్చిన సందేశం! రసిక జీవన నాట్య శిల్పానికి మూల సూత్రం, శృంగార సంకీర్తనలకు మహాద్వారం" అంటారు అన్నమాచార్య ప్రాజెక్టు డైరక్టర్ మేడసాని మోహన్. శృంగార ప్రియులకు సందేశమిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో చూడండి.

పల్లవి. విరహము వలవదు రసికులు వినరో చాటుచుఁ జెప్పెద
తరితీపను చెఱకున నిత్తఱిఁ బండు వండె నిదివో || విరహము||

చరణం.1. బగివాయఁగరా దిక దంపతులకు నెక్కడ చూచిన
చిగురుకుఁ జేఁగలు వచ్చెను చిత్తజు రాజ్యమున
తగిలి తగిలి కోవిల కూతలు మొగసాలల కెక్కెను
జగమున విరసపుఁ బవనుఁడు చల్లని వాఁడాయ || విరహము||

చరణం.2 పొసఁగంగ నెవ్వరికైనను పొందులె జరపఁగ వలసెను
పసిమొగ్గలు వాడెక్కెను వసంతకాలమున
ముసగస లాడెడు తుమ్మిదల మోతల చలములు చెల్లెను
సుసరము ననె పగరాజును చుట్టము వాఁడాయ || విరహము||

చరణం.3 కలయికలే కలకాలము కాణాచులుగాఁ బరగెను
ఇలలో శ్రీ వేంకటపతి యిచ్చిన సంపదను
యెలమిని పదారువేలకు ఇతఁడే మగడై నిలిచెను
కలగొని మనసనియెడి చెలికాడును దోడాయ. || విరహము||

(తాళ్ళపాక పదసాహిత్యము శృంగార సంకీర్తనలు -28 సంపుటం- రేకు 1805 - వ.సం.27)

పల్లవి. విరహము వలవదు రసికులు వినరో చాటుచుఁ జెప్పెద
తరితీపను చెఱకున నిత్తఱిఁ బండు వండె నిదివో
అయ్యా శృంగార ప్రియులారా! రసికులారా! రండు రండు! అంటూ ఎలుగెత్తి స్వాగతిస్తూ సమాదరిస్తూ చాటి చెప్తున్నాడు అన్నమయ్య. "అయ్యలారా రండు! మీకు విరహం ఏ మాత్రం వద్దు. చెఱకు విలుకాని (మన్మధుని) పంట అద్భుతంగా పండింది ఇక్కడ వినండి నామాట".

చరణం.1 బగివాయఁగ రా దిక దంపతులకు నెక్కడ చూచిన
చిగురుకుఁ జేఁగలు వచ్చెను చిత్తజు రాజ్యమున
తగిలి తగిలి కోవిల కూతలు మొగసాలల కెక్కెను
జగమున విరసపుఁ బవనుఁడు చల్లని వాఁడాయ

ఇక దంపతులకు ఎడబాటు అనేదే ఉండదు, ఒకరికొకరు హత్తుకొని తిరగడమే. ఈ చిత్తజు (మన్మధ) సామ్రాజ్యంలో చిగురుకు సైతం మంచి బలం వచ్చింది. కోకిలమ్మ కూకూ రవాలు తలవాకిటి పంచలలో వినిపిస్తున్నాయి. ఈ కూ-కూ కూతలు జవ్వనుల ఎడదలలో ఇంపైన మాధుర్యాన్ని నింపుతున్నాయి అనే అర్ధంలో చెప్తున్నాడు అన్నమయ్య. అప్పటివరకూ వేడి గాలులు వీచిన వాయుదేవుడు మనసు మార్చుకుని చల్ల గాలులతో శృంగారవిహారులకు అనుకూల పవనుడయ్యాడు.

చరణం.2 పొసఁగంగ నెవ్వరికైనను పొందులె జరపఁగ వలసెను
పసిమొగ్గలు వాడెక్కెను వసంతకాలమున
ముసగస లాడెడు తుమ్మిదల మోతల చలములు చెల్లెను
సుసరము ననె పగరాజును చుట్టము వాఁడాయ

ఇక ఇప్పుడు ప్రేయసీ ప్రియులకు సమాగమం, సంగమం తప్పదు. ఆ తరుణం ఆసన్నమయినది. పసి మొగ్గలు సైతం ఈ వసంత కాలంలో ఎంత వాడిగా ఉన్నాయో చూసారా! మొగ్గలు వాడిగా ఉన్నందువల్లనే మన్మధుడు ఈ పుష్పాలను అంత సులభంగా ఎక్కుపెట్టగలుగుతున్నాడన్న భావంతో వాడాడు. క్రిక్కిరిసిన తుమ్మెదల గుంపుల మాత్సర్యాలకు కాలం చెల్లింది ఇక. ప్రేయసీ ప్రియులపై పగబూని విరహతాపాలకు గురిచేసిన చంద్రుడు ఇక ఇప్పుడు మీకు దగ్గరి చుట్టమయ్యాడు. రండు రండు ఆలశ్యం వలదు.

చరణం.3 కలయికలే కలకాలము కాణాచులుగాఁ బరగెను
ఇలలో శ్రీ వేంకటపతి యిచ్చిన సంపదను
యెలమిని పదారువేలకు ఇతఁడే మగడై నిలిచెను
కలగొని మనసనియెడి చెలికాడును దోడాయ.

ప్రేయసీ ప్రియులకు కలయికయే కాణాచి గా ఉండడం గురించి చమత్కరిస్తున్నాడు. మనస్సనే చెలికాడు తోడయ్యాడు. ఇక రసికులకు విరహబాధ ఉండనే ఉండదని ఉద్ఘాటిస్తూ అన్నమయ్య శృంగార సామ్రాజ్యానికి తెరతీసి పిలుస్తున్నాడు. పదహారువేల గోపకాంతలకు మొగడై నిలిచిన శ్రీవేంకటేశ్వరుడు ఈ కలియుగంలో సర్వ సంపదలతో నిలిచాడు. సర్వసంపదలను ఇవ్వగల మూర్తి అనే భావంతో చెప్తున్నాడు.

ముఖ్య అర్ధములు: వలవదు = వలదు; తరితీపు = కోరిక; ఇత్తఱిఁ = ఇప్పుడే; వండె = పండె; బగివాయఁగ= ఎడబాటు; చేఁగలు (చేవ) = బలము; చిత్తజుడు = మన్మథుడు; మొగసాలలు = ఇంటి తలవాకిటి చావడి; పొసఁగంగ = అనుకూలించు; ముసగస = క్రిక్కిఱియు; చలములు=మాత్సర్యములు; సుసరమున = వెంటనే; పగరాజు=చంద్రుడు; కాణాచి = చిరకాలవాసము; పరగు = ప్రసరించు, ఎలమిని = సంతోషము; తృప్తి; కలగొని =కలుగు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)