ధారావాహికలు - శ్రీరామాయణ సంగ్రహం
యుద్ధకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

రావణుడు మాయాకల్పితమైన శ్రీరామశిరస్సును,
ధనుర్బాణాలను చూపి సీతమ్మను బెదిరించటం

రావణుడు అంత్ణపురంలోకి వెళ్ళి చాలాసేపు ఆలోచించి మాయలలో అప్రతిమానసమర్థుడైన విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచి, సీతమ్మను అమితంగా క్షోభపెట్టి ప్రాణత్యాగసన్నద్ధురాలిగా చేయాలనీ, శ్రీరాముడి శిరస్సూ, ఆయన కోదండమూ, శరమూ మాయతో సృష్టించి తన దగ్గరకు తీసుకొని రావలసిందనీ కోరాడు. వెంటనే అశోకవనానికి పోయినాడు రావణుడు. అక్కడ రామవియోగంతో దురపిల్లుతున్న పరమసాధ్వి సీతమ్మకు ఒక కట్టుకథ విపులంగా విన్పించాడు. అదేమంటే వానరసైన్యమంతా నూరు యోజనాల సముద్రమంతా వారధి కట్టి, దాని మీదుగా సముద్రం దాటి అలసిసొలసి సొమ్మసిలి ఆ రాత్రి నిద్రిస్తుండగా తన మహాసేనాధిపతి ప్రహస్తుడు కపటోపాయంతో రాముణ్ణి వధించాడనీ, ఎప్పుడైతే రాముడు హతుడైనాడో వానరులంతా కకావికలై చెల్లాచెదరవుతుంటే రాక్షసులు ఆ దిక్కులేని వాళ్ళందరినీ ఊచకోత కోశారనీ, హతసైన్యాన్ని చూసి బిక్కుబిక్కుమంటూ తక్కినవాళ్ళు పారిపోయారనీ, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, మైంద ద్వివిదులు, జాంబవంతుడు, పనసుడు, కుముదుడు లాంటి వానర ప్రముఖులు ఘోరమరణం పాలైనారనీ, వానరసైన్యమంతా నుగ్గుసూచమంఐదనీ, హావభావాలతో స్వాతిశయంతో కళ్ళు తిప్పుతూ వర్ణించి చెప్పాడు సీతాదేవికి.

ఇంకా ఆమెను పెనుద్ణుఖంలో ముంచడానికి ధూళిధూసరితమై, రక్తసిక్తమైన శ్రీరాముడు శిరస్సు ఇప్పుడే నీకు చూపిస్తానని సీతాదేవిని భయవిహ్వలను చేసి విద్యుజ్జిహ్వుణ్ణి ఆ శిరస్సు తీసుకొని రమ్మని చెప్పమని తన సేవకులను ఆజ్ఞాపించాడు రావణుడు. అప్పుడు విద్యుజ్జిహ్వుడు మాయాకల్పితమైన శ్రీరాముడి శిరస్సునూ, ఆయన అరివీరభయంకర ధనుస్సును తెచ్చి రావణుడి సమక్షంలో ఉంచి, ఆ రాక్షసాధిపుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు రావణుడు వికటాట్టహాసంతో వీటిని సీతాదేవికి ప్రదర్శించాడు. ప్రగల్భంగా తన ప్రతాపాన్ని పొగడుకున్నాడు. ''ఇక నీవు నేను చెప్పినట్లు వినక తప్పదు'' అని సీతాదేవిని శాసించాడు.

ఇక అప్పుడు సీతాదేవి ద్ణుఖం వర్ణనాతీతం. ఆమె లేడిపిల్లవలె రోదించింది. హనుమంతుణ్ణి గూర్చి తలచుకొంటూ బావురుమని యేడ్చింది. తాము అడవికి పోవటానికి ప్రేరకురాలైన కైకను తలచుకొని పెద్దపెట్టున శోకించింది. తన అత్త కౌసల్యను తలచుకొని విలవిలలాడింది.

'ఓ వీరాధివీరా! ఈ స్వర్ణాలంకృతమహౄధనుస్సును గంధమాల్యాదులతో మనం పూజించేవాళ్ళం కదా! ఇప్పుడిది ఇట్లా దిక్కుమాలింది అయిపోయింది ఏమిటి?'' అని దీనాలాపాలు పలికింది. ''లక్ష్మణుడు ఒక్కడే అయోధ్యకు వెళ్ళగా కౌసల్య అతణ్ణి చూసి ఎట్లా భరిస్తుంది? ఇంత సముద్రం నా కోసం దాటి ఒక క్షద్రుడి చేతిలో హతం కావడమంటే ఆవుగిట్టమేర నీటిలో నీవు మునిగి పోయినట్లే అయింది. నా నిమిత్తంగానే నీవు మరణం పాలైనావు. ఓ రావణా! నన్ను కూడా చంపివేస్తే నేను నా రాముణ్ణి చేరుకుంటాను. ఈ మాత్రం దయచూపు నాపై'' అని నరికివేసిన అరటిచెట్టులాగా నేలపై పడిపోయింది.

అప్పుడు ఒక పరిచారకుడు వచ్చి ''సేనాధిపతి ప్రహస్తుడు మంత్రిసమేతంగా మీకోసం నిరీక్షిస్తున్నాడు'' అని మనవి చేశాడు. ఆ మాట విని రావణు డక్కడనుంచి కదలిపోగానే మాయాశిరస్సూ, మాయాధనుస్సూ మాయమై పోయినాయి.

రావణుడు సభాభవనంలోకి వెళ్ళి ''యుద్ధభేరి మోగించండి'' అని ఆజ్ఞాపించాడు సేనలను. అశోకవనంలో ద్ణుఖమూర్చితురాలిగా అత్యంత దీనావస్థలో పడి ఉన్న సీతాదేవిని విభీషణుడి పత్ని సరమ చూసింది. సీతాదేవికి కావలి ఉంచిన రాక్షసాంగనలలో ఆమెను కూడా రావణుడు ఉంచి, సీతాదేవి తనపట్ల సుముఖత చూపేట్లు చేయవలసిందని ఇదివరలో కోరి ఉన్నాడు. కాని సరమ ఉత్తమురాలు, స్నేహశీలి. ఆమె సీతాదేవిని ఓదార్చుతూ ఉండేది.

సరమ సీతమ్మను ఓదార్చి, ఆమె చూసింది రావణమాయ అని చెప్పటం

విపరీతమైన అలసటతో నేలమీద పొరలి పొరలి లేచిన ఆడుగుర్రపు పిల్లలాగా దేహమంఆ దుమ్ముకొట్టుకొని ఉన్నట్లున్న సీతాదేవిని సరమ చూసి పరమవ్యాకులచిత్త అయింది. ''ఇక్కడ చాటునుంచి అంతా చూశాను, అంతా విన్నాను. అమ్మా! సీతా! ఏమీ ఆందోళన చెందవద్దు. భయపడవద్దు. ఇదంతా రావణుడు పన్నిన మాయ. రావుడే లేకపోతే మరి అంత ఆందోళనతో కలువుకూటానికిపోయి యుద్ధభేరి మోగించవలసిందని ఈ రావణుడు ఎందుకు ఆజ్ఞాపిస్తాడు? ఈ యుద్ధసమయంలో రాముడు గాఢనిద్రాపరవశుడై ఉండడం కల్ల. ఆయన పక్కనే ధనుర్దారి అయి కంటికి రెప్పలా కాపాడే లక్ష్మణుడు ఎక్కడకు పోయినాడంటావు? రాముణ్ణి కడతేర్చగలవా డెవ్వడూ ఈ మూడు లోకాలలో లేనేలేడు. శత్రువులందరినీ శ్రీరాముడు చంపి వేస్తాడు. కాని ఆయనను ఎవరైనా హతమార్చగలరా?వానరసైన్యంతో శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. నేను చూశాను. రావణాసురుడి గూఢచారులు చెప్పిన సంగతులన్నీ నేను విన్నాను. అందుకే ఇక్కడ నుంచి రావణాసురుడు కలతచెంది వడివడిగా పరుగులు తీశాడు'' అని సరమ సీతాదేవికి ధైర్యం చెప్పింది. ఊరడించింది.

ఇంతలో వాళ్ళిద్దరికీ భేరీనాదాలు విన్పించాయి. ''రాక్షసులు బయవిహ్వలురై బిక్క చచ్చిపోతున్నారు. నీ ఆపద గట్టెక్కబోతున్నది. కాబట్టి ధైర్యంగా ఉండు'' అని సరమ సీతకు నమ్మబలికింది. ''రావణుడి చావు తథ్యం. ఇప్పుడు నీవు మీ వంశకర్త సూర్యుణ్ణి ప్రార్థించమ్మా'' అని కూడా సరమ సీతాదేవికి మనస్స్వాస్థ్యం కలగజేసింది. ''తల్లీ సీతా! నేను ఆకాశమార్గంలో ఎవరి కంటా పడకుండా వేగంగా వెళ్ళగలను. నేను శ్రీరామప్రభువు దగ్గరకు వెళ్ళి నీ కుశలం చెప్పి వస్తానమ్మా'' అని కూడా సీత ఊరట పొందట్లు సరమ చెప్పింది. అప్పుడు సీతాదేవి దిటవు తెచ్చుకొని ''సరమా! నీవు సర్వసమర్థురాలి వని నాకు తెలుసు. సరేకాని, రావణాసురుడి ప్రయత్నాలేమిటో తెలుసుకొని వచ్చి నాకు చెప్పు. ఎప్పుడెప్పుడు వచ్చి నన్ను చంపి వేస్తాడో నని నాకు ఎంతో భీతి కలుగుతున్నది!'' అని సీతాదేవి దైన్యంగా పలికింది. సరమ ఇట్లా వెళ్ళి ఇంతలోనే మళ్ళీ సీతాదేవి దగ్గరకు వచ్చింది.

అప్పుడు ఆ దుష్టుడు మంత్రులతో జరుపుతున్న రహస్యాలోచనలన్నీ విని వచ్చింది. ''ఓ సీతమ్మా! ఆ రావణుడి తల్లి కూడా నిన్ను శ్రీరాముడికి సమర్పించి క్షమాపణ కోరుకోమని రావణుడికి ఎంతో బోధించింది. అట్లానే అవిద్ధుడనే వృద్ధమంత్రి నయానా భయానా రావణుడికి ''నీకు చేటుకాలం పూర్తిగా మూడేదాకా కళ్ళు మూసుకోవద్దు'' అని బోధించాడు. 'కాని రావణుడు మూర్ఖించాడు' అని సరమ సీతాదేవితో చెప్పింది. ''వాడు చచ్చిన తర్వాత నీకు చెర వదులుతుంది'' అని కూడా చెప్పింది.

అప్పుడు వానరసైన్యపు గర్జనలు కూడా వాళ్ళకు విన్పించాయి. లంకంతా గడగడలాడి పోయింది. రాజు చేసిన పాపానికి తమకు చావు తప్పదని లంకలోని రాక్షసులు నిర్ణయించుకున్నారు.

రాక్షసులంతా ఇట్లా భయకంపితులై ఉండడం చూసి రావణాసురుడు వాళ్ళను నిందించాడు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇప్పుడు గుబులు చెందుతారా? అని మంత్రులపైనా, సేనాధిపతులపైనా ఆగ్రహం చెందాడు. అప్పుడు రావణుడి తల్లికి పినతండ్రి అయిన మాల్యవంతుడు రావణాసురుడికి రాజనీతిని బోధించాడు. ''శ్రీరాముడితో సంధి చేసుకోవడమే కర్తవ్యం నీకు ఇప్పుడు'' అని కూడా ప్రబోధించాడు రావణుణ్ణి. ''నీ విరోధాని కంతకూ మూలకారణం సీతే కదా! ఆమెను శ్రీరాముడికి అప్పగిస్తే నీవు బతికి పోతావు. దేవతలంతా శ్రీరాముడి పక్షం. వాళ్ళంతా ఆయన జయం కోరుకుంటున్నారు. మహర్షులందరినీ నీవు సంతాపింప జేశావు. నీవు దేవదానవ యక్ష గంధర్వ సిద్ధసాధ్యుల వల్ల మరణం లేకుండా హ్మ్రవరం సంపాదించావు. కాని ఇప్పుడు నరులూ వానరులూ నీపైకి దండెత్తి వచ్చారు. వాళ్ళతో ఇంకా భల్లూకసైన్యాలూ, గోలాంగూల (కొండముచ్చుల) సైన్యాలు నీపై మోహరించాయి. లంకలోని వాళ్ళందరికీ దుస్స్వప్నాలు కలుగుతున్నాయి. దుర్నిమిత్తాలు అంతటా కనపడుతున్నాయి'' అని హితవు చెప్పాడు మాల్యవంతుడు.

అయినా పెడముఖం, ఎడముఖం ప్రదర్శించాడు రావణుడు. మాల్యవంతుణ్ణి అనరాని మాటలన్నాడు. ''వృద్ధుడివైన నీ బుద్ధి సర్వభ్రష్టమై పోయిం''దని తూలనాడాడు. నీవు శత్రువులకు మేలు, నాకు కీడు తలపెట్టావు అని ఛీత్కరించాడు. ఆ రాముడి కంటే నేను పరాక్రమశాలినని తెలిసి కూడా నన్ను పరాభవిస్తున్నావు! మహారాజుతో నీవంటి ముసలివాడు ఇట్లా మాట్లాడకూడదు. నేను రాముడికి మళ్ళీ ఇవ్వటానికికా సీతను తీసుకొని వచ్చింది? నేను భయపడతా ననుకుంటున్నావా? రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, సమస్తవానరసనేనను సంహారం చేయడం నీ కళ్ళముందే చూడ బోతున్నావు. నేను ఎవరికీ లంగను. అది నా ప్రకృతి'' అని మాల్యవంతుణ్ణి ధిక్కరించాడు రావణుడు. చేసేదేమి లేక మనవణ్ణి ఆశీర్వదించి మాల్యవంతుడు నిష్క్రమించాడు.

రావణుడు లంకాపట్టణానికి ఆయా ద్వారాలలో కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లన్నీ చేశాడు. తూర్పుద్వారం దగ్గర ప్రహస్తుడు, దక్షిణద్వారం దగ్గర మహోదరుడు, మహాపార్శ్వుడు, పశ్చిమద్వారం దగ్గర మహామాయావి ఇంద్రజిత్తు, ఉత్తరద్వారం దగ్గర శుకసారణులు సర్వసన్నద్ధులై ఉండాలని ఆజ్ఞాపించాడు. పట్టణమధ్యంలో అందరూ అప్రమత్తులై ఉండాలని నిర్దేశించాడు.

ఇక రామలక్ష్మణులు సమస్తవానరయూథపతులతో లంకాపట్టణం సమీపించారు. దీనిని ఏవిధంగా పడగొట్టాలి? అని ఆలోచనలు చేశారు. అప్పుడు విభీషణుడు శాంతగంభీరంగా, విస్పష్టంగా, పదిలంగా ''శ్రీరామప్రభూ! అనలుడూ, శరభుడూ,సంపాతీ, ప్రఘనుడూ అనే నా నలుగురు మంత్రులు పక్షులరూపం ధరించి లంకలోకి వెళ్ళి వాళ్ళ యుద్ధవ్యూహౄలన్నీ కనిపెట్టి నాకు తెలియజేశారు. ఏయే ద్వారాల దగ్గర ఎవరెవరు సర్వసన్నద్ధులై గొప్ప సేనలు కూర్చుకొని ఉన్నారో నాకు చెప్పారు. రావణుడేమో స్వయంగా ఉత్తర ద్వారం దగ్గర పర్యవేక్షిస్తున్నాడు. రాక్షస సైన్యమంతా పరమక్రూరులు, ఘోరస్వభావులు. ఎంతకైనా తెగిస్తారు'' అని తన నలుగురు మంత్రులూ తాము చూసి వచ్చి తనకు చెప్పిన విషయాలన్నీ శ్రీరాముడికి వినిపించాడు విభీషణుడు.

శ్రీరాముడి యుద్ధవ్యూహం

అప్పుడు శ్రీరామచంద్రుడు తమ యుద్ధవ్యూహాన్ని కూడా ఈవిధంగా రూపొందించాడు. ''వానరవీరులారా! నీలుడు వానరచమూపతులతో తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుడితో తలపడాలి. అంగదుడు దక్షిణద్వారందగ్గర మహోదరుడితో, మహాపార్శ్వుడితో పోరాడాలి. అప్రమేయపరాక్రముడు హనుమంతుడు పశ్చిమద్వారాన్ని ధ్వంసం చేయాలి. ఇక రావణుడే స్వయంగా యుద్ధాగ్రంలో నిలిచిన ఉత్తరద్వారాన్ని నేనూ, లక్ష్మణుడూ బద్దలు చేస్తాం. ఇంతేకాక సుగ్రీవుడూ, జాంబవంతుడూ, రాక్షసరాజు తమ్ముడు విభీషణుడూ ఆకాశమార్గంలో నిలిచి లంకాపట్టణమధ్యంలోని వ్యూహాన్ని చిందరవందర చేయాలి'' అని రాముడు ఆ పోరాటపు ఏర్పాట్లు అన్నీ రూపొందించాడు.

ఇంకా శ్రీరాముడిట్లా చెప్పాడు. ''ఇప్పుడు వానరులు మానవరూపం ధరించి వచ్చారు ఇక్కడకు. కాని యుద్ధరంగంలో వాళ్ళు తమ సహజరూపంలో వానరులలాగానే ఉండాలి. ఇందువల్ల వీళ్ళు మన వాళ్ళు అని తెలుసుకొనే వీలుంటుంది. నేనూ, నా తమ్ముడు లక్ష్మణుడూ, నీలుడూ, అంగదుడూ, సుగ్రీవుడూ, మనకు ఇష్టసచివుడుగా ఉన్న విభీషణుడూ మాత్రమే మనుష్య రూపంతో యుద్ధం చేస్తాము. మేము ఏడుగురం మాత్రమే మనుష్యరూపంతో ఉంటాము''అని కూడా తన సేనకు రాముడు చెప్పాడు. ఆయన ఆ తర్వాత లంక సమీపాన ఉన్న సువేలపర్వతపు చరియలను చూసి దానిని అధిరోహించా లని కోరాడు. అక్కడకు వెళ్ళి విశదంగా లంకాపట్టణాన్ని చూడవచ్చు అని సుగ్రీవాదులకు చెప్పాడు రామచంద్రుడు.

వానరయూథపతు లందరితో కూడి రాముడివెంట శీఘ్రంగా వాళ్ళు సువేలపర్తం ఎక్కారు. పర్వతశిఖరాన్ని చేరి లంకాపట్టణాన్ని వాళ్ళు ఉత్సుకులై చూశారు. ప్రాకారంపై ఇంకో ప్రాకారంలాగా కాలమేఘరూపులైన రాక్షసులు వాళ్ళక కనపడ్డారు. ఆ రాత్రి అంతా వానరసేనలు అక్కడ విశ్రాంతిగా, ఆనందంగా సుఖావాసం చేశాయి. ఉదయం కాగానే విశదంగా లంకానగరాన్ని వాళ్ళు చూశారు. అది ఒక గొప్ప వనదుర్గంగా, గొప్ప గొప్ప వనాలతోనూ, ఉద్యానవనాలతోనూ వాళ్ళకు కన్పించింది. ఆ వనాలలో గొప్ప ఫలవృక్షాలు, పుష్పవృక్షాలు, లెక్కకు మిక్కిలిగా వాళ్ళకు కన్పించాయి. అది కుబేరుడి చైత్రరథమా, దేవేంద్రుడి నందనోద్యానవనమా అనిపించాయి వాళ్ళకు. అందులో కొందరు యూథపతులకు ఆసక్తి మిక్కుటమై సుగ్రీవుడి అనుజ్ఞతో లంకను దర్శించి రావటానికి వెళ్ళారు. వాళ్ళు అట్లా నేల దద్దరిల్లేట్టు, వాళ్ళ పాదఘట్టనలతో ఆకాశం ధూళిదూసరిత మయ్యట్లు బయలుదేరారు. ఆ మహారావానికి లంకంతా సంచలించింది. పశు పక్షిమృగాదులు అన్ని దిక్కులకూ పరుగులు తీశాయి.

లంకాపట్టణం జల, గిరి, వన దుర్గసంయుతం. క్రతికూట పర్వతశిఖరమే ఆకాశాన్ని స్పృశించినట్లుంటుంది. అది ఒక పూలశిఖరం లాగా భాసిస్తుంటుంది. ఆ శిఖరంమీద ఉన్న లంకాపట్టణవైభవం వర్ణనాతీతం.

ఆ సువేలపర్వతం పైనుంచి శ్రీరాముడు తన వానరచమూపతులతో, సుగ్రీవుడితో, లక్ష్మణుడితో త్రికూటపర్వతశిఖరంపై ఉన్న లంకనూ, అక్కడ ఎత్తైన ప్రదేశంలో ఉన్న రావణుణ్ణీ చూశాడు. ఆ రావణుడు సర్వాలంకరణ భూషితుడై ఛత్రచామరవైభోగంతో, కుందేలు నెత్తురు వంటి ఎర్రటి వస్త్రంతో, బంగారు జరీ ఉత్తరీయంతో, ఆకాశంలో సంధ్యారాగం ఆవరించిన నీలమేఘంలా కన్పించాడు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)