ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
కొట్టినవాడే ఘనుడని కోమలి పలికెన్
గతమాసం ప్రశ్న:
(వాగమూడి లక్ష్మీ రాఘవరావుగారు పంపిన సమస్య)
మంచినంతయు మాటలందున మార్చివేయుచుఁ చంపుచున్
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
వంచనేమరి లోకమందున వాడుకొందురు యెందరో
మంచినంతయు మాటలందున మార్చివేయుచుఁ చంపుచున్
కొంచమై ననుప్రేమ భావముకోరి పంచగ లేరొకో
కంచికేగిన కానరాదట కంచుకాగడ వేసినన్
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
సంచితం బగు సంపదన్ మనసార దానము చేయుటే
మంచి మార్గమ టంచు నెంచిన మానవోత్తమ మూర్తు లన్
మంచి నంతయు మాటలందున మార్చి వేయుచు చంపుచున్
కుంచితం బగు మానవుల్ మరికోరి హేళన చేతురే
మల్లేశ్వరరావు పొలిమేర, కెల్లర్, టెక్సాస్
మంచి భారతదేశమందు సమర్ధ పాలన మేము కాం
క్షించి చూడగ, దుష్ట నేతలు కింపుగా నుడి బల్కెనన్
వంచనం లొనరించె పాపుఁలు స్వార్ధబుద్ధిని చూపుచున్
మంచినంతయు మాటలందున మార్చివేయుచుఁ చంపుచున్
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
మంచినంతయు మాటలందున మాయ జేయుచు చంపుచున్,
ఇంచుకైనను ధర్మ మార్గపు చింతనస్సలు లేదయా!
లంచ మిచ్చినగాని ఏ పనులైన సాగవు నేస్తమా!
కంచె మేసెడి రీతి నుండును కాపు గాండ్రుల ధర్మముల్!
డా. బులుసు వేంకట సత్యనారాయన మూర్తి, రాజమహేంద్రవరము
సంచితమ్మని కూడబెట్టుచు సమ్పదన్ వెనకేయుచున్
కొంచెమైనను దానధర్మము కూడ చేయక దాచినన్
మంచినంతయు మాటలందున మార్చివేయుచు చంపుచున్
వంచనమ్మున వచ్చిచేరెడు బంధుకోటికి చేరుటే
మహీధర రామశాస్త్రి, రాజమహేంద్రవరము
మంచినంతయు మాటలందున మార్చివేయుచు చంపుచున్
కొంచమైనను తెల్విలేకను కుంచితంబగు బుద్ధితోన్
మంచివారలు కూడనింతగ మాయ జారుట చూచినన్
ఎంచిచూడగ కాలమందున ఎన్నిమార్పులు చూతుమో?
చావలి విజయ, సిడ్నీ, ఆస్ట్రేలియా
ఎంచగా కఠినంగ కన్పడు హిట్లరేనని యందురే
పంచగా మమతే తలంపున పల్కు మాట కరుకైనన్
పెంచు తండ్రుల కట్టడే యను ప్రేలు, పుత్రుల చింతనన్
మంచినంతయు మాటలందున మార్చివేయుచు చంపుచున్.
జంధ్యాల కుసుమ కుమారి, హైదరాబాదు
అంచితమ్ముగ వంచనొక్కటె యాత్మ లోపల నెంచుచున్
పంచచేరెడు భక్తులందరి భాగ్యరాశిని దోచుచున్
పొంచియుందురనేక సాములు పోల్చి చూడగ వింతగన్
మంచినంతయు మాటలందున మార్చివేయుచు చంపుచున్
డా.రామినేని రంగారావు, పామూరు, ప్రకాశం జిల్లా
మంచినంతయు మాటలందున మార్చివేయుచు చంపుచున్
వంచనే తమ జీవితానికి వైభవంబుగ మార్చుచున్
కొంచమైనను సందుజిక్కిన కొంచకందర దోచుచున్
పెంచుకొందురు రాక్ష [జ] కీయులు పేర్మిసంపద లెల్లెడన్.
శివప్రసాద్ చావలి, సిడ్నీ, ఆస్ట్రేలియా
(1)
పంచెనంత నక్షత్రకుండను, పంతమున్ నెరవేరవే
ధించగన్ విభునిన్ ఋణంబును దీర్చమంచు మహర్షియున్
ఎంచగన్ మునిపుత్రుడట్లు నటించె నంతట నైజమౌ
మంచినంతయు మాటలందున మార్చి వేయుచుఁ చంపుచున్
(పంచు: ఆజ్ఞాపించు/పంపు; సత్యహరిశ్చంద్ర కథామూలముగ వ్రాయబడినది)
(2)
మంచి మాటలు చెప్పుచున్ తెరమాటు గోతులు త్రవ్వుచున్
వంచనల్ పొదపెట్టునంతటి వారికంటె నుదాత్తులే
మంచి నంతయు మాటలందు మార్చి వేయుచుఁ చంపుచున్
కొంచెమైనను కీడొనర్చని కోవనిన్ మను మిత్రులున్