ద్రోణాచార్య గ్రామం. ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి కారణాలు కురు పాండవ యుద్ధవిద్యా గురువు ద్రోణుడు, చారిత్రక ఆధారాలు కావు. జనాభా పదివేలకు మించని ఆ గ్రామానికి ఉత్తరాన గోదావరి, దక్షిణాన ఎత్తైన పర్వతాలు, తూరుపు పశ్చిమ దిక్కుల్లో పచ్చటి పొలాలు, పరిశుభ్రమైన గాలి. ఆ గ్రామంలోలేని వసతి లేదు. శుభ్రమైన రోడ్లు, అందమైన ఇళ్ళు, పరిశుభ్రమైన ఉద్యానవనాలు, ప్లేగ్రౌండ్ లు, సెల్ టవర్స్. నలభై ఏళ్ళ క్రితం ఆ గ్రామం ఇలా ఉండేది కాదు. భారతదేశంలోని మిగతా అన్ని గ్రామాల్లాగే, అశుభ్రత తోటి, అనారోగ్యాల తోటి, మూఢ నమ్మకాలతోటి, పేదరికంతోటి విలవిలలాడుతూ ఉండేది. అటువంటి గ్రామంలో ఇటువంటి మార్పు తీసుకు వచ్చి, గ్రామం పేరే తానైన ఆ మహోన్నత వ్యక్తి ఇంటికే మనం ఇప్పుడు వెళుతున్నాం..... గ్రామంలో అంతా పండగ వాతావరణం ఉంది కదూ, అందుకు కారణం ఉంది. ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ద్రోణాచార్య గ్రామంలో చాలా ఘనంగా జరుగుతాయి. ఆ సంబరమే ఇదంతా. అదిగో...
ద్రోణాచార్య నిలయం ఇదేమిటీ ఇంత పెద్దగా ఉంది, మహారాజ భవనంలాగా, ఈయన కూడా అందరిలాగే తను భోగాలనుభవిస్తూ మిగిలినవారినందరినీ పేదరికంలో ముగ్గబెట్టే భూస్వామి సంతతే అనుకుంటున్నారా, అదేం కాదు. ఇది ఆయన ఇల్లే కాదు, ఆ గ్రామానికి స్కూలు, హాస్పటలు కూడా అదే. అర్థమయిందనుకుంటాను. ఇంకొక్క విషయం. ఈయన పుట్టు పూర్వోత్తరాలు ఎవరికీ తెలియవు, శిరిడీ సాయిబాబా గారిలాగ. చైనాలో కొంచెం కాలం ఉన్నాడని, బుద్ధుడి శిష్యుడు, మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పపర్ట్ అయిన భోధిధర్మ శిష్యపరంపరలో ఒకడని అంటారు. ఇక లోపలకి వెళదాం..........
ఇదేమిటి లోపల ఇంత నిశ్శబ్దంగా ఉంది, పండగ రోజు...?
ద్రోణాచార్య నిలయంలో పూజా గది. దాదాపు పదిహేనువందల చదరపు అడుగులుంటుంది. పై కప్పు దాదాపు పన్నెండు అడుగుల ఎత్తు ఉంటుంది. కాళికా అమ్మవారి విగ్రహం ముందర హారతి ఇస్తున్నాడు ద్రోణాచార్యుడు. గుబురుగా పెరిగిన తెల్లటి గడ్డం, ఎర్రటి జరీ అంచు వున్న తెల్లటి పంచె, ఉత్తరీయం. అరవై ఏళ్ళ వయసులోనూ ధృఢంగా కనబడుతున్నశరీరం. ఇంకా ముగ్గురున్నారు ఆ గదిలో. ద్రోణాచార్య నిలయంలో వారికి తెలియకుండా ఏ విషయమూ జరగదు. వాళ్ళ మొహాలు విషణ్ణంగా ఉన్నాయి. చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారంతా. హారతి ఇవ్వడం పూర్తి అయి అందరూ కళ్ళకద్దుకున్నాక, హారతి అక్కడే పెట్టి పూజ గది బయట హాలులోకి నడిచాడు. అక్కడ అందరూ కూర్చున్నారు.
అప్పుడు అడిగాడు ద్రోణాచార్య.
"ఏమయింది? నాయుడు ఎందుకు పలకట్లేదు? శ్రీరామ నవమి ఉత్సవాలు నాయుడు లేకుండా ఎప్పుడైనా జరిగాయా? అందుకే పంపించాను మిమల్ని విశాఖపట్నానికి. ఏమంటాడు నాయుడు?"
ఆ స్వరం గంభీరంగా ఉంది అయినా మెత్తగానూ అనునయంగానూ ఉండి వాళ్ళందరి మీద ఆయనకున్న వాత్సల్యాన్ని ధ్వనింప జేస్తోంది.
ముగ్గురిలో ఎవరూ మాట్లాడలేదు.
ప్రశ్న అడిగిన వెంటనే సమధానం వినే అలవాటున్న ద్రోణాచార్య మొహం కొంచెం అసహనంగా మారింది.
"నాయుడికేమయింది? సుశీలమ్మకేమయింది? సుశీలమ్మ ఫోనెత్తకుండా ఉండదే?" సుశీలమ్మ ,రామానాయుడి భార్య.
అయినా ఇంకా ఎవరూ మాట్లాడలేదు. ద్రోణాచార్య మొహంలో అసహనం విసుగుగా మారింది. గొంతు పెంచాడాయన.
"నాయుడికేమయింది? చచ్చాడా? చెప్పండి. ఏం ఫరవాలేదు? ఈ రోజు కాకపోతే రేపయినా అందరూ చావవలిసిన వాళ్ళమేగా! చెప్పండి ఫరవాలేదు"
అయినా ఇంకా ఎవరూ మాట్లాడలేదు. ద్రోణాచార్య మొహంలో కోపం కనబడింది. కోపంతోనే అన్నాడు
"సరే. నాయుడు, సుశీలమ్మ ఇద్దరూ రాకపోయినా ఫర్వాలేదు. పిల్లల్నిద్దరినీ పంపించమని చెప్పండి. పిల్లల సంగీత, నృత్య రూపకం లేకుండా ఉత్సవం చేయట్లేదుగా మనం. ప్రతీ ఏడాదీ ఏదో ఒక కొత్తదనం తీసుకువస్తారు ఆ పిల్లలు. క్రితం సారి త్యాగరాజ స్వామి వారి కీర్తనకి జాజ్ జోడించారు. ఎంత బావుంది. వచ్చిన విద్వాంసులు కూడా ఎంత మెచ్చుకున్నారు?. వాళ్ళ అంశం లేకుండా ఉత్సవం శోభించదు. శృతి, శ్రావణ్ ఇద్దరినీ పంపించమని, నేను చెప్పానని చెప్పండి."
అదే కోపంతో చటుక్కున కుర్చీలోంచి లేచాడు ద్రోణాచార్య.
అంతే! ముగ్గురూ ఒక్క సారిగా వచ్చి ద్రోణుడి కాళ్ళు పట్టుకుని భోరుమన్నారు. వారి కళ్ళ వెంట నీరు కాల్వలై పారింది.
ద్రోణాచార్య గుండె ఒక్కసారిగా అదిరింది. కళ్ళు పెద్దవయ్యాయి అందోళనతో
"ఏమైంది? ఏమైంది పిల్లలకి?" కంగారుగా చేతులతో కాళ్ళు పట్టుకున్న వారిని పైకి లేపడానికి ప్రయత్నించాడు వాళ్ళు లేవలేదు. కాళ్ళు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు. "శ్రావణ్ ఇంక లేడయ్యా" ఆ మాట వినగానే హుద్ హుద్ తుఫాను గాలికి ఊగి, విరిగి, కూలిపోయిన వృక్షం లాగా, శ్రీరామచంద్రుడ్ని అడవికి పంపించమన్న కైక మాటలు విన్న దశరధుడిలాగా ఎడమచేత్తో గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలాడు ద్రోణాచార్యుడు. ఆయన కాళ్ళు పట్టుకుని రోదిస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా భయపడ్డారు.
"అయ్యా అయ్యా" అంటూ ఆయన భుజాలు పట్టుకుని కదపడానికి ప్రయత్నించారు. ద్రోణాచార్యుడు కళ్ళు తెరవలేదు. చల్లటి మంచినీళ్ళలో తువ్వాలు తడిపి మొహం అంతా అద్దారు. కొద్దిసేపటికి ద్రోణాచార్యుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి తనవంక ఆందోళనగా చూస్తున్న వారివంక చూశాడు ..తిరిగి నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. అతని పెదవులు నెమ్మదిగా కదలడం ప్రారంభించాయి.
న విషాదే మనః కార్యం విషాదో దోషవత్తరః
విషాదో హన్తి పురుషం బాలం క్రుద్ధ ఇవోరగః.
యో విషాదం ప్రసహతే విక్రమే సముపస్థితే,
తేజసా తస్య హీనస్య పురుషార్థో న సిధ్యతి
(కిష్కింధాకాండ. సర్గ. 64.11,12)
శ్లోకం పూర్తవ్వగానే ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు.
"ఏం జరిగింది? వివరంగా చెప్పండి. ఫరవాలేదు. తట్టుకోగలను. ఏం జరిగింది?"
"బస్ ఏక్సిడెంట్ అంట అయ్యా. బాబు స్కూటర్ మీద కాలేజ్ కి వెళుతున్నాడు. వెనకాల శృతమ్మ కూడా కూర్చుని ఉంది"
"ఎవరిది తప్పు?"
"బస్ డ్రైవర్ దే నంటయ్యా. సైడ్ రోడ్డు లోంచి మెయిన్ రోడ్లోకి వస్తూ వెనకాల్నుంచి గుద్దేశాడంట. శృతమ్మ తుప్పల్లో ఎగిరి పడడం వల్ల బతికింది. శ్రావణ్ ని బస్ తోసుకు వెళ్ళి పోయిందంట. శృతమ్మ వెంటనే లేచి బస్ వెంట పరుగెత్తిందంట కూడా"
"పరుగెత్తిందా?"
"అవునయ్యా, ఆ దారుణమైన ఏక్సిడెంట్ కళ్ళారా చూడడం వల్ల షాక్ తింది. ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది"
" డ్రైవర్ ని సస్పెండ్ చేశారా?"
"చేశారయ్యా"
"ఇంకా ఏం చేశారు?"
"నాయుడు కంప్లయింట్ కూడా ఇవ్వలేదు ఇంక పెద్దేం జరగట్లేదయ్యా"
"కాలేజ్ మేనేజ్ మెంట్?"
"ఏంలేదయ్యా. అయ్యయ్యో అన్నారంట అంతే"
ద్రోణుడి కళ్ళు ఎర్రబడ్డాయి.
"ఆ కాలేజ్ వాళ్ళకు చెప్పండి. శ్రావణ్ కట్టిన ఫీజ్ మొత్తంతో శ్రావణ్ పేరున ఒక అవార్డ్ పెట్టమని, ఒక అయిదేళ్ళపాటు. ఆ అవార్డుని ప్రతి ఏటా నాయుడే అందజేస్తాడు. ఆ డ్రైవర్ కు పైనున్న ఇంకో ఇద్దరు అధికారులు కూడా సస్పెండ్ కావాలి. ట్రాన్స్ పోర్టేషన్ మినిస్టర్ కు చెప్పండి. వెంటనే ఒక హైలెవల్ కమిటీని వెయ్యాలని. ఒక నెలరోజుల్లో రిపోర్ట్ రావాలి. మొదటి కాపీ ఇక్కడ రెండవ కాపీ అక్కడ"
"అయ్యా, మినిష్టరు మన మాట వింటాడా?"ముగ్గురిలో ఒకతను సందేహం వెలిబుచ్చాడు.
ద్రోణుడు చిన్నగా నవ్వాడు. వెంటనే కళ్ళు పెద్దవి చేసి గంభీరంగా అన్నాడు. "ఏక్సిడెంట్ లు స్కూటర్లకే కాదు. మినిష్టర్లు ప్రయాణించే కార్లకి కూడా జరుగుతాయి"ద్రోణుడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. "ఇంకొక్క మాట. నాయుడు, సుశీలమ్మ, శృతమ్మ ముగ్గురూ ఇక్కడ రేపటి కల్లా ఉండాలి"
ఇంకొక మాటకి తావివ్వకుండా, చర చర గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. చేయవలసిన పనులు చాలా ఉండడంతో ఆముగ్గురూ కూడా వెంటనే నిష్క్రమించారు.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * *
"గురువు గారికి నమస్కారం చెయ్యమ్మా"
నాయుడు, సుశీలమ్మ, పద్దెనిమిదేళ్ళ వయసున్న శృతి, ద్రోణాచార్యుడు అతను ముగ్గురు అనుచరులు ఉన్నారా గదిలో.
"ఎందుకు చేయాలి? ఆయన అన్నయ్యని తీసుకు రాగలరా?"
"తప్పమ్మా ..అలా మాట్లాడకూడదు.. "అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న నాయుడిని వారించి అన్నాడు ద్రోణుడు.
"శ్రావణ్ ని తీసుకు రాగల శక్తి ఈ భూప్రపంచం మీద ఎవ్వరికీ లేదమ్మా. అది మాకందరికీ తెలుసు. కానీ మా దుఃఖం అందుకు కాదు."
శృతి ప్రశ్నార్థకంగా చూసింది.
"మా దుఃఖం అంతా నీగురించి. ఇప్పటికే కృంగి కృశించి పోయావు. అన్నయ్య నిన్న ఉన్నాడు. ఈ రోజు లేడు. రేపేం జరుగుతుందో తెలియని నిర్భాగ్య జీవులం మనం. అమ్మ చూడు ఎలా క్రుంగిపోతోందో? మన గురించి మనమే విచారించవలసి ఉన్న మనం ఇంకొకరి గురించి విచారించడం హాస్యాస్పదం. సుశీలమ్మా నువ్వే క్రుంగిపోతే ఎలా?శృతికి చెప్పాల్సిన, పెంచాల్సిన భాధ్యత నీదేకదా?. నీకు తెలియంది ఏముంది? ఆంజనేయస్వామి మాటలు గుర్తు తెచ్చుకో `జననం, మరణం అనేవి అనిశ్చితమైన విషయాలు. అందుచేత బుద్ధిమంతుడు ఆ విషయములను గూర్చి విచారించక ఈ లోకములో ఏది శుభమో అట్టి పని చేయాలి'
కంటి వెంట ధారగా కారుతున్న కన్నీళ్ళతో దారుణంగా విలపిస్తున్నసుశీలమ్మ కళ్ళు తుడుచుకుంది. ఏదో చెప్పబోయేంతలో శృతి సడన్ గా అడిగింది చాలా పెద్దదానిలా
"అయితే మనం ఏం చేయలేమా, ఏం చేయకూడదా? మరి ఈ దుఃఖం ఎలా పోతుంది?"
ద్రోణుడి కళ్ళు మెరిసాయ్ ఆ మాటలు వినగానే. వెంటనే శృతి భుజాలు పట్టుకుని ఊపుతూ అన్నాడు ఉద్వేగంగా
"ఆ విషయం పెద్దవాళ్ళకు వదిలిపెట్టు తల్లీ. కాదు కాదు, నాకే వదిలిపెట్టు. నేను చూసుకుంటాను. నీ దుఃఖాన్ని, మన దుఃఖాన్ని తొలగించే భాధ్యత నాది"
అందరూ ఆతృతగా చూస్తున్నారు, శృతి ఏం చేస్తుందా, ఏమంటుందా అని. శృతి సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ అడిగింది
"మీరు చేయగలరా?"
ద్రోణుడి మొహంలో చిరునవ్వు కనబడింది ఆ మాటలు వినగానే. చూస్తుండగానే ఆ చిరునవ్వు పెద్దదైంది. బిగ్గరగా నవ్వుతూ శృతి భుజాలు వదిలి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. శృతి వంక చూస్తూ అన్నాడు. "మహాభారత యుద్ధం గురించి నీకు తెలుసుగా. అణ్వాయుధాలు కూడా వాడారంట, యూట్యూబ్ లో వీడియోలు కూడా పెట్టారు. "శృతి తల ఊపింది.
"ఆ యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసా?"
"దుర్యోధనుడి దుర్మార్గం వల్ల,.దురహంకారం వల్ల"
"కాదు. ద్రోణుడివల్ల"
"ద్రోణుడివల్లా?"
"అవును. కౌరవ పాండవులకు యుద్ధ విద్యా గురువు ద్రోణుడు. పరశురాముడి వద్ద యుద్ధవిద్యలు నేర్చుకున్న ద్రోణుడు, పేదరికం వల్ల, మిత్రుడైన ద్రుపదుడ్నుంచి సహాయం ఆశించి భంగపడి, ఆ అవమానాన్ని తట్టుకోలేక, భీష్ముడ్ని ఆశ్రయించి, కురువంశాన్ని యుద్ధవిద్యా నిష్ణాతులని చేసి, తన పేదరికాన్ని, ద్రుపదుడిమీద తన ప్రతీకారాన్ని తీర్చుకోవడమే కాకుండా, పరమ భయంకరమైన కురుక్షేత్ర యుద్ధానికి మూల కారణం కూడా అయ్యాడు."
నిలయ ఆవరణలో విరివిగా ఉన్న చెట్ల సందుల్లోంచి రివ్వుమంటూ వీస్తున్న గాలి శబ్దం స్పష్టంగా వినబడుతోంది. చుట్టుపక్కల అందరూ నిలబడి నిశ్శబ్దంగా వింటున్నారు
"వ్యక్తి కానీ, వ్యవస్థే కానీ, జరిగిన ఈ దారుణానికి ప్రత్యక్ష కారణాలు, పరోక్ష కారణాలు అన్నీ అన్వేషించి, విశ్లేషించి, మార్పే కానీ. సమూలఛేదనమే కానీ ఏది అవసరమైతే అది చేస్తానని, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని, తండ్రి కోర్కె తీర్చడానికి ద్వాపరయుగంలో భీష్ముడు చేసిన శపధంలాగ, పుత్ర సమానుడైన తన మిత్రుడి కుమారుడి ఆత్మ సంతృప్తి కోసం, పుత్రికా వాత్సల్యార్థం, నేడు, ఈ అభినవ ద్రోణుడు, కలియుగంలో, ద్రోణాచార్య నిలయం అందరి తరపునా, చేస్తున్న శపధం ఇది. కురుక్షేత్ర యుద్ధ ఆరంభాన్ని సూచిస్తూ భగవానుడు శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య గర్జన ఇది. ప్రళయ తాండవ నృత్యంలో మహాదేవుడు పరమశివుడి చేతిలో మ్రోగే ఢమరుక నాదం ఇది"
ద్రోణాచార్యుడు ఆసనంలోంచి లేచాడు. అందరినీ చూస్తూ అందరికీ వినబడేలాగా గట్టిగా చెప్పాడు
"విశ్వామిత్రకి కబురు పెట్టండి"
చెపుతునే చక చక హాలులోంచి బయటకు నడిచాడు. ఆ అడుగుల శబ్దం వినబడడం ఆగాకే, ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వారికి వినబడ్డాయి.