"ఒక చిన్న అల లేచింది. క్రమంగా పెద్దదైంది. అలా కదులాడి నెమ్మదిగా అణిగిపోయింది. ఇక దాని జాదే కరిగిపోయింది."
"మొలకెత్తే విత్తనానికి, పుడమి తల్లికి పురిటి నొప్పులొచ్చి చక్కటి మొక్కను ప్రసవించాయి. మొక్కై, చెట్టై, మానై విస్తరించి, పుష్పించి, ఫలించి..."
నీరవ నిశ్శబ్ధ నిశీధి వేళలో, గాఢంగా నిద్రిస్తోన్న పల్లెలో ఒక తల్లి కేక, వెంటనే ఒక పురిటి బిడ్డ ఏడుపు వినిపించాయి.
ఒక తాత్వికుడి మదిలో క్షణంలో కోటి వంతులో ఒక భావన మెరిసింది. కొనసాగింది. ముగిసింది. భావన ప్రారంభమే ఒక జననంలా, కొనసాగింపు జీవనంలా, ముగింపు పూర్వస్థితిలా తోచింది.
మనం కన్నెత్తి చూస్తే ప్రతిదీ జన్మిస్తుంది, వికసిస్తుంది, లయిస్తుంది. సహజం ఈ పరిణామం.
ఒక జీవకణం మరొక జీవకణంతో ఆలంబన వెతుక్కొని రెండు ఒకటైన క్షణంలో సృష్టి ప్రారంభమౌతుంది. ఒకటి, మూడు, ఆరుగా కణాలు పెరుగుతూ నా రూపానికి ప్రాణం పోశాయి.
ఈ భావన ఎంత అద్భుతమో!!!
ఇలా యోచిస్తే ఏమనిపిస్తుందో చెప్పనా!
ఈ అనంత సృష్టికి ఆరంభదినమే మనందరికీ నిజమైన జన్మదినం. దానికి ఆది, అంతం లేవు అనుకుంటే మనకూ అంతేగా!!!
సరే! పుట్టాం. పుట్టాం గనుక పెరుగుతున్నాం. పెరుగుదల సహజం గనుక జీవిస్తున్నాం.
ఎందుకు జీవిస్తున్నాం? అంటే, అంతకంటే ఏం చెయ్యాలో తెలియక. అది తెలియచెప్పేదే జీవితం. అదే దానికి అర్ధము. పరమార్ధమూను.
కనుక జీవితంలో ఆనందం కాదు.
జీవించడమే ఆనందం అని గుర్తించడమే నిజంగా మొదటి జన్మదినం.
ఆనందంలో చేతన ఉంది.
ఆనందంలో జ్ఞానం ఉంది.
ఆనందంలో ఆనందం తప్ప మరోటి లేని స్థితి ఉంది.
అదే జీవితానికి, జన్మదినానికి ప్రారంభం, మధ్యగతం, మళ్ళీ ప్రారంభమే. దానికి అంతం అన్న ప్రశ్నే లేదు.