తెలుగు భాషాసాహిత్యాలను ప్రాణసమానంగా భావించే మాబోటి వాళ్ళను ఎన్నో విషయాలలో వెలివేయటం చాలా బాధ కలిగించింది. ఇంకేమీ పనిలేక భాషాసేవ చేస్తున్నారని ఎగతాళి చేసినవారూ ఉన్నారు. ఇలాంటి భావనలు మానుకొని ప్రపంచంలోని తెలుగు వారంతా ఏకం కావాలనే సమగ్ర దృక్పథం ఏర్పడాలి.
2. తెలుగు మాధ్యమం తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలల్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మార్చే దుర్మార్గపు ఆలోచనల్ని ఖండించాలి. తెలుగు మాతృభాషగా కలవారందరికీ తెలుగు తప్పనిసరి. ఆంగ్లాన్ని కూడా చక్కగా నేర్పిస్తే అభ్యంతరం లేదు. కానీ అది ఎప్పటికి ప్రధానం కారాదు.
3. తెలుగు వాళ్లకు సంబంధించిన సకల వ్యవహారాలు తెలుగులోనే సాగాలి. అందుకు తగిన పుస్తకాలు, శిక్షణ, కంప్యూటర్ అవగాహన కలిగించటం ప్రభుత్వ బాధ్యత.
4. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి కొంత శాతం ఉద్యోగాలు కేటాయించాలి. అన్ని విశ్వవిద్యాలయాలలో వ్యవహారాలు తెలుగులోనే జరగాలి. తెలుగు తెలియని వారితో మాత్రమే ఆంగ్లంలో వ్యవహరించాలి.
5. రాష్ట్రంలో ఉద్యోగం కావాలనుకునే వారందరూ తప్పక తెలుగు నేర్చుకోవాలి. రాష్ట్రంలో, దేశంలో అన్ని పరీక్షల్లో తెలుగులో రాసే అవకాశం కల్పించాలి.
6. ప్రపంచంలో ఎవరైనా తెలుగు నేర్చుకోవటానికి తగినట్లు ఆన్ లైన్ శిక్షణను ప్రారంభించాలి.
7. తెలుగును ప్రపంచ భాషగా గౌరవప్రదమైన స్థానం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
అన్నిటికంటే ముఖ్యం: మన మిత్రులు కొంతమంది తెలుగులో మహాప్రాణాలు తీసేయాలని, తెలుగు అక్షరాలను తగ్గించాలని అభిప్రాయపడుతున్నారు. సాధ్యమయినంతవరకు తెలుగు పదాలనే వాడండి. సంస్కృతమోహం, ఆంగ్లవ్యామోహం వదలండి. అంతే కానీ అచ్చ తెలుగు రామాయణాల్ని ప్రచారం చెయ్యకండి. మన భాషని అన్నివిధాలా వాడుకోవటానికి మనకు చరిత్ర అవకాశం కల్పించింది. దాన్ని దూరం చేసుకోవద్దు. మరొక విషయం. ఇతర ప్రపంచ భాషలతో, ప్రాచీన సంస్కృతులతో సంబంధాలు కల్పిస్తూ ఎవరైనా పరిశోధనలు చేస్తే ఎద్దేవా చెయ్యటం మానుకొని శాస్త్రీయమైన పరిశోధనలు చేసి ప్రకటించండి. జన్యుశాస్త్రపరంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వీలయితే అలాంటి వాటికి చేయూతనిచ్చి పరిశోధనలకు వీలు కల్పించండి. అంతే కానీ మనకు నచ్చనివన్నీ పనికి రావని కొట్టెయ్యకండి.
- తాటిపాముల మృత్యుంజయుడు