కబుర్లు - సత్యమేవ జయతే
ఓ మనిషీ! నీకేం కావాలి?
- సత్యం మందపాటి

ఓ మనిషీ! నీకేం కావాలి?

పధ్నాలుగు బిలియన్ల సంవత్సరాలనించీ వున్న ఈ విశాలవిశ్వంలో, నాలుగు బిలియన్ల వయసున్న ఈ భూగోళం మీద, కేవలం రెండు లక్షల సంవత్సరాలే వున్నది నీ మనుష్య జన్మని పోలిన జీవితం. ఈనాటి నాలాగా, నీలాగా మనుష్యులు వున్నది కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే! అంటే ఈ విశాలవిశ్వంలో నువ్వొక పసిపాపవి. మరి నీకు జన్మనిచ్చిన ఈ భూమిని ఎందుకు విస్మరిస్తున్నావ్?

బంగారం అంటావు, వెండి అంటావు, ఇనుము అంటావు, బొగ్గు అంటావు, పెట్రోలు అంటావు, ఎన్నో, ఎన్నెన్నో అంటావు. భూగోళాన్నంతా తవ్విపారేస్తున్నావు. నీ క్రింద వున్న నేలని డొల్ల చేసుకుంటున్నావు. మళ్ళీ భూమి క్రుంగటాలూ, భూకంపాలు వస్తున్నాయని గోల చేస్తావు.

భవనాలు, బ్రిడ్జీలు కట్టాలంటావు, వంట చెరుకు కావాలంటావు, కాగితాలు తయారు చేయాలంటావు, ఇళ్ళూ, ఎపార్ట్మెంటులూ, రోడ్లూ కట్టాలంటావు. అందుకని కనపడ్డ ప్రతి చెట్టునీ నరికి పారేస్తావు. నీడ లేకుండా చేస్తావు. మళ్ళీ నువ్వే ఎండలు ఎక్కువయాయి అని చాకిరేవు పెడతావు.

సంవత్సరానికి ఎన్నో వానలు కురిపించి నీకు ప్రకృతి ఇచ్చిన నీళ్ళను వాడుకోవటం చేతకాక, లేదా నదులు, చెరువులు, ఆనకట్టలూ కట్టమని ఇచ్చిన ప్రభుత్వం డబ్బులు గుటుక్కున మింగేస్తావు. రోడ్లని నీళ్ళతో ముంచేస్తావు. వరదలు తెప్పించుకుంటావు. వాననీళ్ళని సముద్రం పాలు చేస్తావు. మళ్ళీ త్రాగటానికి నీళ్ళు చాలటం లేదని ఏడుస్తావు.

గుండెలనిండా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటానికి కూడా ఆస్కారం లేకుండా, నింగీ నేలా అంతా విష వాయువులతో నింపేస్తావు. నీ ఫాక్టరీలు, కార్లూ స్వచ్ఛమైన నీలాకాశంలోకి నల్లటి పొగలు చిమ్ముతుంటే నీ చీకటి కళ్ళకి అవి కనిపించవు. నువ్వు మాత్రం నీ స్కూటరుతో, కారుతో నల్లటి పొగని చిమ్ముతుంటావు.

పొలాల్లో, భూమి మీద ఎక్కడ చూసినా, సేద్యం చేయటానికీ, పురుగులని చంపటానికీ విషపూరితమైన రసాయనికి పదార్ధాలని చల్లేసి, నీకు వచ్చే లాభాలు చూసుకుంటున్నావు, కూరగాయల నిండా ప్రమాదకరమైన మందులు చల్లి వాటినిపాడుచేస్తున్నావు, ప్రజల జీవితాలతో, జంతుజాలం జీవితాలతో ఆటలాడుకుంటున్నావు.

భూమి మీదా, నీళ్ళ మీదా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంచులు, సీసాలు, కాగితాలు, పైంటు, భూమిలో కలసిపోలేని చెత్తని విరజల్లేస్తున్నావు. ఈ భూగోళం నీ బాబు సొమ్ము అనుకుంటున్నావా? ఇది మనందరిదీ!

నీకు మనుగడని ఇచ్చిన ఈ భూగోళంతో ఇలా ఎన్నో అటలాడుకుంటున్నావు.

ఒక్కసారి కళ్ళు పైకెత్తి చూడు. నువ్వు చేసే పిచ్చిపనులకి నీ భూగోళం బద్దలయితే, నువ్వెక్కడ వుంటావో తెలుస్తుంది! నీ ఉనికిని నువ్వే ఎందుకు నాశనం చేసుకుంటున్నావు?

ఓ మనిషీ! నీకేం కావాలి?

౦ ౦ ౦

నీ పుట్టుక ఎలా వచ్చిందో తెలుసా? జంతువులలోనించీ! కోతులలో నించీ! నీ కన్నా ఆ కోతులే నయం.
ఆకులూ అలమలూ తిని కలసిమెలసి బ్రతుకుతున్నాయి. ఒకచోట తమ పిల్లలతో పాటుగా ప్రేమించే కుక్కలనీ, పిల్లుల్నీ పెంచుకుని వాటికి మంచి కుటుంబ జీవితం ఇస్తుంటే, ఇంకొక చోట వాటినే చంపి తింటున్నావు. ఒకచోట గోవుల్ని తల్లులుగా ప్రేమిస్తుంటే, ఇంకొక చోట ఆ గోవుల్నే దారుణంగా హత్య చేసి తింటున్నావు. ఏ పాపం ఎరుగని సాధు జంతువు ఏనుగుల దంతాలు పీకి దారుణంగా హింసించి చంపేస్తున్నావు. పక్షుల్నీ, లేగ లేడి దూడల్నీ వేటాడి మరీ చంపేస్తున్నావు. సర్కసులు, జూలు పెట్టి వాటి స్వేచ్ఛా జీవితాన్ని నాశనం చేస్తున్నావు. హింసిస్తున్నావు. ఎందుకు? అవి నీకు ఏం అపకారం చేశాయి? ఈ భూగోళం మీద నీకు జీవించటానికి ఎంత హక్కు వుందో, నీకన్నా ముందే పుట్టిన ఆ జంతువులకి కూడా అంతే హక్కు లేదూ? జంతువులు, చెట్లు, నదులూ లేకుండా నువ్వు బ్రతకగలవా? భూగోళం మనగలదా?

ఓ మనిషీ! అసలు నీకేం కావాలి?

౦ ౦ ౦

నువ్వు జీవించే సమాజంలో కొంత క్రమశిక్షణ అవసరం అని నువ్వొక మతాన్ని సృష్టించుకున్నావ్. ఆ మతం చుట్టూ కొన్ని సిధ్ధాంతాలు పెట్టుకున్నావు. తర్వాత నీకొక దేవుడిని సృష్టించుకున్నావు. ఒక మతంతో ఆగావా, వందల మతాలు సృష్టించుకున్నావు. వాటికితగ్గ ఎన్నో దేవుళ్ళనీ దయ్యాల్నీ ఏర్పాటు చేసుకున్నావు. మరి నీ సమాజానికి అవసరమైన క్రమశిక్షణని నీ మతం ఇవ్వలేదే? మా మతం గొప్పది అంటే మా మతం గొప్పది అనే పోట్లాటలు, మారణహోమాలు! మన సాటి మనుష్యులలోని మానవత్వాన్ని చూడలేని మతం ఎలా సమ్మతమవుతుంది? మిగతా మతాలవారిని చంపేయమనీ, వాళ్ళు నీ మతానికిచెందకపోతే, వారికి జీవించే హక్కు లేదనీ నీ దేవుడు చెప్పాడా? నీ మతం చెప్పిందా? మరెందుకు మతం పేరుతో, ఈ తీవ్రవాదం, ఉగ్రవాదం? సాటి మనుష్యుల్ని, అమాయకులైన పిల్లలతో సహా, అలా చంపి పారేయటానికి నీలో అసలు మానవత్వం అనేది వుందా? అసలు మనిషి మనుగడకి మతం ఎంతవరకూ అవసరం?

మతంతో పాటూ కొన్ని ఏమాత్రం అర్ధంలేని మూఢనమ్మకాలను పెట్టుకున్నావ్. నీ కథలు నమ్మని వారూ, నీ మూఢ నమ్మకాలు పాటించని వారు నీ దృష్టిలో మూఢులు. గురివింద గింజలాటి నువ్వు, నీ క్రిందనే వున్న ఆ నల్లటి మచ్చని చూసుకో ముందు! మూఢనమ్మకాలతో ఇది జరుగుతుందనీ, అది జరుగుతుందనీ, జనంలో భయం పుట్టించి, అలా చెడు జరక్కుండా ఇది చేస్తాననీ, అది చేస్తాననీ జనాలని మోసం చేస్తున్నావు. చెవిలో పువ్వులు పెట్టి, ఆ చెవులే పిండి డబ్బు చేసుకుంటున్నావు. ఓ వేదాంతీ, నువ్వు పోయేటప్పుడు నీవెంట ఆ అక్రమ ధనం తీసుకువెడుతున్నావా మరి?

అందుకే అడుగుతున్నాను. ‘ఓ మనిషీ! ఇంతకీ నీకేం కావాలి?’ అని.

౦ ౦ ౦

అదీకాక, అర్ధంపర్ధంలేని కులాలని సృష్టించుకున్నావు. నీ కులమే నీకు ప్రధానం. మనుష్యులూ కాదు, మట్టీ కాదు. నీ కులం వాడు ఎంత పరమ ఛండాలపు వెధవ అయినా వాడే నీకు కావాలి. నీ కులం కాని వాళ్ళని మంచివాళ్ళయినా సరే, దూరం చేసుకుంటున్నావు. మనిషికీ మనిషికీ మధ్య ఎందుకు ఇలా గీతలు గీస్తున్నావు? ఎవరి కోసం?

రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, ఆటల్లో, పాటల్లో, ఆఖరికి చదువుల్లో, ఉద్యోగాల్లో నిన్ను కులం పేరుతే గుర్తించాలా? మరి అర్హత అనేది ఏమైనట్టు? సోక్రటీసు, థెరేసా, న్యూటన్, ఐన్స్టైన్ మహాశయులది ఏ కులం? రామానుజం, ఆర్యభట్ట, మహాత్మాగాంధీ, పటేల్, కలాం, టాగూర్, త్యాగరాజు, జేసుదాసు, ఘంటసాల, మహ్మద్ రఫీలది ఏ కులం? వారు అంత గొప్పవారు కావటానికి వారి కులమే వారికా నైపుణ్యం ప్రసాదించిందా?

జంతువుల్లోనించి వచ్చి, జంతువులకన్నా తెలివిగలవాడినని చెప్పుకునే నువ్వు, ఆ జంతువుల్లో లేని ఈ దరిద్రపు కులాలని, మతాలని నువ్వెందుకు పాటిస్తున్నావు? నువ్వు వాటికన్నా దేంట్లో గొప్పవాడివి? నీ మెడ మీద వున్న తలలో ఏదన్నా మెదడు అనేది వుంటే, కనీసం ఒక్కసారి అది ఉపయోగించి, ఆలోచించు!

నాకు అర్థం కానిదేమిటంటే, ‘ఓ మనిషీ! ఇంతకీ నీకేం కావాలి?’ అని.

౦ ౦ ౦

నీది ఏమతమైనా పైన స్వర్గం, నరకం అనేవి రెండు వున్నాయనీ, మంచిపనులు చేస్తే స్వర్గానికి వెళ్ళి నీ దేవుడి దగ్గర సుఖంగా వుండవచ్చు అనీ, చెడ్డపనులు చేస్తే నరకానికి వెళ్ళి నానా బాధలూ పడతారనీ మీమీ మత గంధాల్లో వ్రాసుకున్నారు కదా. నువ్వు వ్రాసుకున్న దానిమీద నీకే నమ్మకం లేదా? భలేగా వుందే! లంచాలతో సాటిమనిషిని హింసిస్తున్నావు, రాజకీయనాయకుడివో, మతప్రవక్తవో, ప్రభుత్వోద్యోగివో, అలాటిదేదో అయి, లంచాలు తినటంలో కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి మరీ దోచుకుంటున్నావు. చూశావుగా ఆమధ్య మన తెలుగు ప్రదేశంలోనే చనిపోయిన నాయకులు, నరకానికి పోయటప్పుడు ఎన్ని లారీల్లో ఎన్నెన్ని బస్తాల్లో నోట్ల కట్టలు తీసుకువెళ్ళారో! బంగారం, వజ్రాలూ, వైఢూర్యాలూ తీసుకువెళ్ళారో!

అదీకాక జీవితంలో ప్రతిదీ డబ్బుతోనే ముడి వేస్తావేం? నువ్వు కనిపెట్టిన కరెన్సీ నోటుకి నువ్వే బానిసవి అయిపోయావేం? ఆశ జీవితానికి శ్వాస అన్నారు ఆరుద్రగారు. ఆశ మంచిదే. ప్రగతికి అది చాల మంచిది కూడాను. కానీ ఆ ఆశ దురాశగా మారితేనే, నీ విలువలు, సంస్కారం అటకెక్కుతాయి. నీ మానవత్వం మంట కలుస్తుంది. అలా వసుధైక కుటుంబ నిర్మాణానికి ఎంతో అవసరైన ఆశని (Hope), నీ దురాశతో ఎన్నో కోట్ల ప్రజానీకానికి నిరాశ కలగజేస్తావెందుకు?

నీ చిన్నప్పుడు, ప్రతిరోజూ ఆకలేస్తుందా నాన్నా అని కనుక్కుని తనకి వున్నా లేకపోయినా నీకు అన్నం పెట్టిన మీ అమ్మని, నీకు జ్వరం వస్తే నీకు తగ్గేదాకా తనూ నీ పక్కనే నిద్రపోకుండా కూర్చున్న మీ అమ్మని, ఏమీ చెప్పకుండా బృందావనం రైల్వే స్టేషన్లో దించి వచ్చేస్తావా? తన ఇల్లూ పొలం అమ్మేసుకుని, నీకు ఎన్నో చదువులు చెప్పించిన మీ నాన్నని, ఇవాళ ఏమాత్రం ప్రేమా జాలీ కూడా లేకుండా వృద్ధాశ్రమంలో చేర్పించి, చేతులు కడిగేసుకుంటావా? రేపు నీ పిల్లలు నిన్నెలా చూసుకుంటారో, ఎక్కడ వదిలిపెడతారో ఒక్కసారయినా ఆలోచించావా?

అందుకే మీలాగేనే ఇవన్నీ చూస్తున్న నేను కూడా, ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను.

‘ఓ మనిషీ! ఇంతకీ నీకేం కావాలి?’ అని.

౦ ౦ ౦

(ఈమధ్య టీవీలో ‘Planet Life – Creatures deep under the ocean’ అనే కార్యక్రమం చూస్తున్నప్పుడు ఒక సంఘటన నన్ను ఆకర్షించింది. చిన్న తిమింగలం ఒకటి చనిపోయి, దాని శరీరం సముద్రపు అట్టడుగున ఇసుకలో పడిపోయింది. అంటే ఆ రోజున అక్కడ వున్న ఎన్నో రకాల చిన్నా పెద్దా చేపలకీ, నీటి పాములకీ, ఇతరత్రా ఎన్నో జలచరాలకి పండుగ అన్నమాట. అన్నీ పక్కపక్కనే వుండి, ఎవరికి ఆకలయినంతగా అవి తిని, మళ్ళీ విహారానికి వెళ్ళిపోతున్నాయి. ఏ ఒక్కటీ కూడా ఇంకొక దానితో పోటీగానీ, పోట్లాటగానీ లేకుండా, త్రేన్చుకుంటూ తమ దారిన తాము వెళ్ళిపోతున్నాయి. అంతేకాదు, ఏ ఒక్క చేపా ‘లారీలు’ తెచ్చుకుని, ఆ తిమింగలం శరీరాన్ని మొత్తం ఇంటికి తీసుకువెళ్ళటం లేదు. మరి వాటికన్నా ఎంతో తెలివిగల మనం, కనీసం వాటిలాగా కూడా ఎందుకు వుండటం లేదు? అప్పుడే అనిపించింది, ఓ మనిషీ అసలు నీకేం కావాలి? అని. ఆ ఆలోచనా ఫలితమే ఈ వ్యాసం – సత్యం మందపాటి)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)