ఎద్దులజత కొందామని పుల్లయ్య, వెంకయ్య పాలకొల్లు సంతకి వెళ్ళారు. మూడుగంటలు బేరం సాగించినా నచ్చ లేదు. రెండు వేలకి మంచి జతలేం రావడంలేదు. లోపులో వున్నవి వారికి నచ్చలేదు. మరోసారి వద్దామని సంతలో కూరలు కొనుక్కుని బయలుదేరారు. బస్సు దొరకడం ఆలస్యమైంది. రేవులోకి వచ్చేసరికి చీకటిపడింది.
పడవవాళ్ళు సమయం చూసి రెట్టింపు అడుగుతున్నారు. తాము చెప్పిన బేరానికి దిగడం లేదు. చీకటిలో రేవులో బాధ పడటమెందుకని చాలామంది ఎక్కువయినా పడవలు చేసుకుని వెళ్ళి పోతున్నారు.
అయిదురూపాయలు పొయ్యడం వెంకయ్యకిష్టంలేదు. "పెద్ద రేవుకి పోదాం."
పుల్లయ్య ఒప్పుకోలేదు. "చీకట్లోనా... గోదారిఒడ్డున పురుగు, పుట్ర వుంటాయి... దారి కనిపించక నీళ్ళలో పడితే..."
ఇద్దరూ గట్టుమీద కూర్చున్నారు. రేవులో రెండే పడవలున్నాయి. చీకటి దట్టంగా వ్యాపిస్తుంది. చలిగాలి రేగుతోంది. దూరంగా లంకల్లో దీపాలు మిణుక్కుమంటున్నాయి. గోదావరి కెరటాలు శబ్దం చేస్తున్నాయి.
వెంకయ్య లోభత్వం పుల్లయ్య ఎరుగున్నదయినా విపరీతంగా కోపం వచ్చింది. వీడికోసం తన పని తగతీసుకుని రావడమే తప్పు.
"రెండ్రుపాయిలిప్పించండి........ నాకూ ఆ రేవులో పనున్నాది... ఎలిపోదాం..." ఓ పడవవాడు నీళ్ళలో నుంచి కేకేశాడు.
అంతకంటే తక్కువలో వెళ్ళడం అసంభవమని వెంకయ్య గుర్తించి పడవ ఎక్కాడు. పుల్లయ్య బ్రతుకుజీవుడా అనుకున్నాడు.
పడవ సాగిపోతోంది...
వెంకయ్య చాపలో కూర్చున్నాడు. పుల్లయ్య బల్లమీద కూర్చున్నాడు. వెంకయ్య సంచీలోంచి పకోడీపొట్లాలు తీసి "రా.." అన్నాడు. పుల్లయ్య కూడ చాపలోకి వచ్చాడు. సంతగురించి కబుర్లు చెప్పుకుంటూ పకోడీలు కానిచ్చారు.
వెంకయ్య నీళ్ళు పడుతున్నాయని ప్రక్కకి జరిగాడు. ఏదో మెత్తగా తగిలింది. గుండె ఝల్లుమంది.
"అగ్గిపుల్ల వెయ్యి పుల్లయ్యా... పామేమో:"
పుల్లయ్య గీశాడు. చిన్న వెలుగులో నల్లటి ప్లాస్టిక్ సంచి, పడవవాడిదేమో ననుకొని, చేత్తో రాశాడు. వెంకయ్య. గరకుగావుంది. తీసిచూశాడు.
"డబ్బురా" పుల్లయ్య అన్నాడు.
"ష్... పడవవాడు వింటాడు."
"ఎవరో మరిచిపోయారు. మన అదృష్టం బాగుంది."
పుల్లయ్యని పిలవడంవల్ల తప్పు జరిగిందని బాధపడ్డాడు. తను కేకవెయ్యకుండా వుంటే డబ్బంతా తనదే అయ్యేది.
పుల్లయ్యకి వాటా ఇవ్వకుండా వుండానికి పథకం వేశాడు.
రేవులోదిగాక సంచిని కూరల్లో దాచేసి కబుర్లు చెప్పుకుంటూ రోడ్డుమీదకి వచ్చారు. "సైకిల్ తెస్తాను ఆగు..." వెంకయ్య చీకట్లోకి వెళ్ళాడు.
మస్తాన్ ని లేపాడు చెప్పవలసిందంతా చెప్పి "నీకు వంద యిస్తాను." ఆని ఆశ పెట్టాడు వెంకయ్య. మస్తాన్ అంగీకరించాడు.
పుల్లయ్య, వెంకయ్య సైకుల్ ఎక్కుతుండగా మస్తాన్ వచ్చి "ముసలయ్య పడవలో మీరేటగావస్త... సంచీ మరిచి పోయాను చూశారా? అందులో ఎర్రకవరు కూడా వుంది:" అన్నాడు ఆందోళనగా.
వెంకయ్య రహస్యంగా నవ్వుకున్నాడు. " ఇచ్చెయ్ పుల్లయ్యా ... యేదీమయినా రేపు విచారించి యిచ్చేద్దామనుకున్నాంకదా:"
పుల్లయ్య అయిష్టంగా సంచీ తీసుకుని చూశాడు. లోపల ఎర్రకవరు వుంది. అది మస్తాన్‍దేనని యిచ్చేశాడు. మస్తాన్ వెళ్ళిపోయాడు.
"అదృష్టం జారిపోయింది వెంకయ్యా: అమ్మాయి పెళ్ళి అయిపోను."
"పొలం అప్పు తీరిపోతుందనికోలేదూ నేను."
ఇంటికి రాగానే వెంకయ్య సైకిల్ తీసుకుని మస్తాన్ దగ్గరికి వెళ్ళాడు. మస్తాన్ వంద తీసి యిచ్చాడు.
వెంకయ్య మండి పడ్డాడు.
"తగ్గవయ్యా.. ఇది నీ కష్టార్జితమా? పుల్లయ్య కి నువ్వు టోపీవేశావు. నేను నీకు వేశాను. గొడవచేస్తే నీకే నష్టం. పడవలో వచ్చింది నువ్వు. అనుమానమోస్తే నీ మీద వస్తుంది. కాని నాకేంరాదు."
వెంకయ్య బిక్కముఖం వేశాడు. ఎత్తు చిత్తయింది.