(ఫోన్లో)
"ఏం చేస్తున్నావమ్మా?"
"ఆఫీస్ కి బయలుదేరుతున్నానమ్మా"
“అదేమిటి? బిడ్డకి ఇంకా మూడో నెల వెళ్ళలేదు, అప్పుడే ఆఫీసంటున్నావు? అందుకే నిన్ను ఇక్కడే ఉండమంది. ఉండకుండా పురిటి బిడ్డను తీసుకువెళ్ళిపోయావు. బిడ్డకు పాలివ్వవు. ఇప్పుడేమో ఏకంగా వదిలేసి ఊరేగుతానంటున్నావు".
"అవన్నీ మీ కాలంలో సాగుతాయమ్మా. ఇప్పుడు కుదరవు. ఇది నా ప్రమోషన్ టైం. ఇప్పుడు మిస్సయ్యానంటే అమ్మో! ఇంకేమైనా ఉందా? నా పేకేజి డౌనైపొతుంది. అయినా బోలెడు ఖర్చు పెట్టి ఆయాను పెట్టాను. నా కంటే జాగ్రత్తగా చూసుకుంటుంది. ఐనా బిడ్డతో మరీ అటాచ్ మెంట్ ఉండకూడదులే అమ్మా. అన్నిటికి నేనే ఉండాలని పేచి పెడితే ఎక్కడ కుదురుద్ది? ఆయాకు అన్నీ వివరంగా చెప్పాను. టైంకి అన్నీ చేస్తుంది. నువ్వేమి దిగులుపడకు. నాకు టైం అవుతోంది బై"
మాతృత్వానికి మరో ఒడిని వెతికిపెట్టిన ఆ తల్లి ఈనాటి ఆధునిక మహిళ. అవసరం కోసం కొందరు, అనవసరం అనుకొని మరికొందరు తల్లి ఒడికి బిడ్డలను దూరం చేస్తున్నారు.
అమ్మ - ఈ సృష్టిలో అత్యంత మధురమైన భావన, అనుభూతి, అనుభవం. అమ్మతనంలోనే ఆ సౌకుమార్యం ఉంది. మాతృత్వపు మార్దవం, లాలిత్యం స్త్రీని పరిపూర్ణం చేస్తుంది.
అంతేనా! అమ్మ అవడంతోనే ఆమెలో బాధ్యత మేల్కొంటుంది. శిశూదయం ధ్యానోదయానికి నాంది. తల్లి పాత్రను సమర్ధంగా పోషించే ఏ స్త్రీ ప్రత్యేకించి సాధన చేయనవసరం లేదు. అనుక్షణం బిడ్డ పట్ల పాటించే ధర్మమే దైవమై ఆమెను ఆధ్యాత్మిక సోపానాలు ఎక్కిస్తుంది .
దైవాన్ని అనుక్షణం జ్ఞాపకం పెట్టుకొని జీవించడమే స్మరణ. ఆ దైవాన్ని కన్నబిడ్డలో చూసుకొని, దైవం పట్ల ఎంత మెలుకువగా ఉంటామో, అదే విధంగా బిడ్డ పట్ల వుండటమే సిసలైన మాతృధర్మం. అట్టి ధర్మపాలనలో వ్యామోహ, మమకారాలకు తావుండదు. అంతులేని ప్రేమ మాత్రమే ఉంటుంది.
తనలోంచి వేరుపడి తనకన్యంగా ఉంటున్నా, ఆ బిడ్డను తనలో భాగంగానే భావించి ప్రేమిస్తుంది తల్లి. దేహేతరమైన ప్రపంచాన్ని ఆత్మ స్వరూపంగా భావించగలగడం అక్కడి నుండే మొదలవుతుంది. అదే భావాన్ని మిగతా ప్రపంచానికి కూడా అన్వయించుకోగలిగితే ఇక కావలసిందేముంది?
అనుక్షణం తన బిడ్డకు ఏ అవసరం వస్తుందో, ఏ ఆపద కలుగుతుందో అని నిద్రాహారాలు కూడా పట్టించుకోక, రేయింబవళ్ళు ఏమారక కావలి కాయడంలో ధ్యానం కాక మరేం జరుగుతుంది?
బిడ్డ ఆలనా, పాలనా, పరిశుభ్రత చూడటంలో అసహ్యాన్ని జయిస్తుంది తల్లి. సేవ చేయడానికి సంసిద్దత ఏర్పడుతుంది. వీటన్నిటితో ఆమెలోని తెలియని శుద్ధత్వం ఏర్పడుతుంది. సాత్వికత ఉదయిస్తుంది.
మరి ఇదంతా సాధన కాదా?!!
భగవదనుగ్రహాన్ని చేరవేసేది కాదా?!!
సృష్టికర్తకు స్థూలరూపం అమ్మ.
ఒక కణం మరో కణంతో జతకూడి, అవే కోట్లుగా వృద్ది చెంది, అమ్మ కడుపులో ఊపిరి పోసుకొని, జీవితాన్ని వెతుక్కుంటూ ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ఆ జీవికి ఈ ప్రపంచంతో ఏర్పడే తొలి సంబంధం అమ్మ.
అమ్మే సమస్తాన్నీ పరిచయం చేస్తుంది. తన గుండెల్లో పాల ధారను అమృతపు చినుకులుగా చిలికించి పోషణ నిస్తుంది. ఒడిలో వెచ్చదనాన్ని కవచంలా అందించి, రక్షణనిస్తుంది. పసికందు పెరిగి, పెద్దవుతున్న కొలదీ సూక్ష్మంగా ఆ బిడ్డ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది.
ప్రతి బిడ్డకు తొలి గురువు అమ్మ. అమ్మను చూసే మొదటగా అనుకరించి, అనుసరించి తదనుసారంగా జీవించడం అలవరుచుకుంటుంది బిడ్డ. మరి ఒక ప్రాణి జీవితాన్ని అంతలా ప్రభావితం చేసే తల్లి పాత్రను స్త్రీ ఎంత జాగ్రత్తగా, మెలుకువగా పోషించాలి?!!
ప్రపంచపు అన్ని మూలల్లో, అన్ని కాలాల్లో అసలైన అమ్మతనానికి అద్దంలా నిలచిన స్త్రీ మూర్తులెందరో!!
శుద్దోసి, బుద్దోసి,నిరంజనోసి అని జోల పాడిన మదాలస గురించి చెప్పనా?!!
దైవమే శరణ్యమని ధృవుని పసిమనసులో భక్తి బీజాలునాటి, మహావిష్ణు అంకంపై, ఆసీనుడ్ని చేసి, ధృవతారగా చిరంజీవం చేసిన సునీతిని తలవనా?!!
అమ్మ కావడానికి కడుపునే పుట్టక్కర్లేదని నిరూపించి, వేలమందికి మాతృప్రేమను పంచి, మనోనిగ్రహానికి, మాతృత్వానికి మణిపూసలా నిలిచిన అమ్మ శారదమ్మకు నమస్కరించనా?!!
రాముడే ఆదర్శం అని గోరుముద్దలతో ధైర్య, స్థైర్యాలను నూరిపోసి వీర శివాజీని తీర్చిదిద్దిన జిజియాబాయిని స్మరించనా?!!
ప్రేమించడానికి, ప్రేమను పంచడానికి ఎల్లలే లేవని విశ్వసించి, రుజువు చేసిన థెరిసా కంటే అమ్మ ఎక్కడ?!!
ఋషులు ఏర్పరచిన జాతి మనది. వారు చెప్పినది ఎప్పటికీ నిత్యనూతనమే, తలమానికమే. వారు చెప్పిన మాట ప్రకారం ఏ విషయానికైనా మనకు ప్రమాణాలు నాలుగు. శ్రుతి, స్మృతి, మహాత్మాచరణం, అంతరాత్మ ప్రబోధం.
మాతృదేవోభవ అన్నది వేదభాగమైన తైత్తిరియోపనిషత్తు.
మనో మే తర్పయత్ | వాచమ్మే తర్పయత్ | ప్రాణ్గమే తర్పయత్ | చక్షుర్మే తర్పయత్ | శ్రోతర్మే తర్పయత్| ఆత్మానమ్మే తర్పయత్ | ప్రజామ్మే తర్పయత్ | పశూన్మే తర్పయత్ | గంగామే తర్పయత్ | ఓ పవిత్రమాతృమూర్తులారా! మీరు మా మనసు, వాక్కు, ప్రాణము, ఇంద్రియములను, ఆత్మను, సమాజాన్ని సమస్తాన్నీ శుద్ధత్వంతో నింపివేయండి.
అని తల్లి బాధ్యతను చెప్పకనే చెప్పింది యజుర్వేదం.
అట్టి బృహత్తర బాధ్యతను తల్లియైన ప్రతి స్త్రీ యధాలాపంగా కాక అత్యద్భుతంగా, అత్యంత సమర్ధవంతంగా నిర్వహించగలదని ప్రార్ధిద్దాం.