ధారావాహికలు
సుందరకాండ
- డా. అక్కిరాజు రమాపతిరావు

(గత సంచిక తరువాయి)

సీతాదేవిని చూశాను
హనుమంతుడు సాధించుకొని వచ్చినందుకు వాసర ప్రముఖులు సంతోషంతో కోలాహలంగా కిష్కింధ సమీపించారు. కిలకిలారావాలు చేశారు. అప్పుడు సుగ్రీవుడు తన వాలాన్ని నిటారుగా పైకి ఎత్తి తన ఆనందాన్ని ప్రకటించాడు. ఆ కపిశ్రేష్ఠులంతా అంగదుణ్ణి, హనుమంతుణ్ణి, ముందుంచుకుని శ్రీరాముడికి సాష్టంగ నమస్కారం చేశారు. సీతాదేవిని చూశాను అని శ్రీరాముడికి నివేదించుకున్నాడు హనుమంతుడు.

తత్ర దృష్టా మయాదేవి రావణాంతఃపురే సతి,
సన్న్యస్య త్వయి జీవంతి రామ మనోరథమ్. (సుందర. 65. 11)

"లంకలో రావణాంతఃపురంలో పతివ్రతయైన సీతమ్మను నేను దర్శించాను. ఆమె నీపైనే ఆశపెట్టుకుని జీవిస్తూ ఉన్నది."

ఆ మాట వినగానే రామలక్ష్మణులు పరమానంద భరితులయ్యారు.

హనుమంతుడు తప్పక విజయం సాధిస్తాడని గట్టి విశ్వాసం ఉన్న లక్ష్మణుడు ఎంతో ప్రీతితో గౌరవాదరాలతో సుగ్రీవుణ్ణి వీక్షించాడు. రామకార్యాన్ని తప్పక సాధించుకుని రాగలడని సుగ్రీవుడు రామలక్ష్మణులకు నమ్మకంగా చెప్పినందువల్లా, అది రుజువైనందువల్లా, ఆ అన్నదమ్ములిద్దరూ సుగ్రీవుని పట్ల తమ ఆదరాభిమానాలనూ, స్నేహాతిశయాన్నీ వ్యక్తపరిచారు.

ఆ తర్వాత లంకలో సీతాదేవి ఎటువంటి ఇడుముల పాలైంది, ఎన్ని ఇక్కట్లకు గురి అయిందీ వానరులు తాము తెలుసుకున్న విషయాలు చెప్పారు. అప్పుడు రాముడు ఒక వైపు దుఃఖమూ, ఒక వైపు సంతోషం కలగగా సీతాదేవి సమాచారం సాకల్యంగ తెలుసుకోగోరాడు. అప్పుడు వానరులంతా సీతాదేవిని కంటితో చూసి, సంభాషించి, ఆమెకు ఊరట గొలిపి, లంకనంతా భయానకం గావించి, రాక్షసులను నిర్జించి వచ్చిన హనుమంతుణ్ణి ఆ విషయాలన్నీ రాముడికి సమగ్రంగా చెప్పవలసిందిగా అర్థించారు.

అప్పుడు హనుమంతుడు సీతాదేవిని మొదట తాను కనుగొన్న సంఘటన నుంచి ఆమె దగ్గర సెలవు తీసుకుని రావటం వరకు జరిగిన వృత్తాంతమంతా సవిస్తరంగా రామచంద్రుడికి చెప్పాడు. ఆమె దగ్గర సెలవు తీసుకుని రావటం వరకు జరిగిన వృత్తాంతమంతా సవిస్తరంగా రామచంద్రుడికి చెప్పడు. ఆమె విషాదాన్నీ, రాక్షస స్త్రీలు ఆమెను ఎట్లా క్రూరంగా హింసిస్తున్నదీ, రావణుడు పెట్టిన గడువునూ, సీతాదేవి పరివేదననూ, ఆమె విరక్తితో శరీరత్యాగానికి పూనుకోవడాన్ని కూడా శ్రీరాముడికి చెప్పాడు. తరువాత తాను ఎట్లా ఆమెకు విశ్వాసం కలిగించిందీ వివరించాడు. ఆ తరువాత చిత్రకూటపర్వతంపై సీతారాములు నివసిస్తుండగా ఒకసారు మణిశిలతో తిలకాన్ని నుదుట కాకుండా చెక్కిలిపై దిద్దిన విషయమూ, కాకాసురవృత్తాంతమూ ఆమె శ్రీరాముడికి తెలియజేయవలసిందిగా కోరిందని చెప్పాడు. తరువాత చూడామణిని ఆనవాలుగా ఇస్తూ ఆమె విన్నవించిన తీరు, ఆ సీతాదేవి మాటలలోనే శ్రీరాముడికి తెలిపాడు. ఆ తరువాత లక్ష్మణుడికీ, సుగ్రీవుడికీ ఆమె సందేశం విన్పించాడు. సుగ్రీవుడికి ఆమె అభివాదాలు తెలియజేయమన్నదని చెప్పాడు.

శ్రీరాముడి ఉద్వేగం
అప్పుడు విషాదాక్రాంతుడై, "మారుతీ! నన్నిప్పుడే సీతాదేవి దగ్గరకు తీసుకుని పోవలసింది, ఆమెను విడిచి ఇక క్షణమైనా జీవించలే" నని పరితపించాడు శ్రీరామప్రభువు. ’శ్రీరాముడికి కనికరం లేదా! లక్ష్మణుడు తన పరాక్రమాన్ని ఎందుకు చూపడు?" అని జానకమ్మ దుఃఖించగా తాను ఆమెను ఓదార్చిన విషయం కూడా శ్రీరాముడికి నివేదించాడు హనుమంతుడు. "అమ్మా! నీవు అయోధ్యానగరానికి శ్రీఘ్రంగా చేరనున్నావు" అని ఆమెను ఊరడించిన సంగతి కూడా హనుమంతుడు శ్రీరాముడికి చెప్పాడు. "శ్రీరామా! నీకు నా పట్ల ఎంతో అనుగ్రహం ఉన్న విషయం గ్రహించి, ఆమె ఎంతో చనువుగా నేనక్కడ చూచిన విషయాలన్నీ నీతో చెప్పవలసిందిగా అర్థించిం’దని కూడా శ్రీరాముడికి హనుమంతుడు తెలియజేశాడు. ’నాతో ఇప్పుడు నిన్ను తీసుకుని పోతాను’ అని ఆమెను ప్రార్థించగా ఆమె ఆమోదించలేదనీ, శ్రీరాముడికి అది గౌరవప్రదం కాదనీ, రావణుణ్ణి సంహరించి, తనను రాముడే స్వయంగా తీసుకొనిపోవడమే తనకూ, ఆయనకూ కీర్తికరం అనీ, "ఆయన మహావీరుడు, నేను వీరపత్నని" అనీ సీతాదేవి సహేతుకంగా ప్రతిపాదించిందనీ శ్రీరాముడికి హనుమంతుడు విన్నవించుకున్నాడు. "నేను అప్పుడామెకు భల్లూక వానరసేనల మహాపరాక్రమం నమ్మబలికి, త్వరలో శ్రీర్తాముడు లంకను నిర్మూలించి నిన్ను తీసుకుని పోతాడని చెప్పాను." అని శ్రీరాముడికి తెలిపాడు హనుమంతుడు.

’సింహపరాక్రముడైన శ్రీరాముడు, ఆయన తమ్ముడైన లక్ష్మణుడు ధనుష్పాణులై లంక సింహద్వారం దగ్గర ఉన్నారని నీవు త్వరలోనే వింటావు. త్వరలోనే చూస్తావు కూడా" అని ఆమెను నేను ఊరడించాను. ఆమె ప్రసన్నహృదయురాలైంది అని తన సీతాన్వేషణవృత్తాంతం, చేతులు జోడించుకుని శ్రీరాముడికి సమగ్రంగా విన్నవించుకున్నాడు హనుమంతుడు.

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)