(గత సంచిక తరువాయి)
మనిషికైన అన్ని గాయాలకీ కాలమే మందు - అంటారు. అది అక్షర సత్యం! రోజులు గడుస్తున్నకొద్దీ నెమ్మదిగా శరీరానికైన గాయాలే కాదు, మనసుకైన గాయాలు కూడా మానుపట్టడం మొదలౌతుంది. కొడుకు మీద కర్తవ్యం ఉంచి రామేశానికి కర్మకాండలన్నీ విశ్వనాధం జరిపించడం వల్ల, కొంత వరకు ఆ కర్మకాండని వెనక్కి పెట్టక తప్పలేదు. ఆయన తన మిత్రునికి తలకొరివిపెట్టి, తత్కాలిక కర్మలు మాత్రం పూర్తిచేసి, ఊరుకున్నాడు. పన్నెండవ రోజున అన్నశాంతి జరపడంకోసం, రామేశం పేరుమీద పేదలకు అన్నదానం జరిపించారు. ఏదో ఒక రోజున కొడుకు వచ్చి బాధ్యతగా తండ్రి అపరకర్మలన్నిటినీ పూర్తి చేస్తాడని, వాటిని వెనక్కి పెట్టడం జరిగింది. కన్నవారు చనిపోయినప్పుడు, వేదవిహితమైన అపరకర్మలన్నీ యధావిధిగా జరిపించి, వారికి సద్గతులు కలిగించడం అన్నది సాంప్రదాయికంగా కొడుకుల బాధ్యత కదా!
పోయిన వాళ్ళతో పోలేరు ఎవరూ! బ్రతికి ఉన్నవాళ్ళకు బ్రతుకు తిప్పలు తప్పవు. రోజులు గడుస్తున్నకొద్దీ దు:ఖాన్ని దిగమింగి, ఎలాగో తల్లీ కూతుళ్ళిద్దరూ, ఎంతో ప్రయత్నం మీద ఒకళ్ళకోసం ఒకళ్ళుగా బ్రతకసాగేరు. ఇన్నాళ్ళూ ఆ ఇంట్లో దినమూ రెండు పొద్దులా మనోరంజకంగా వినిపించే వీణానాదం ఇప్పుడు వినిపించడం లేదు. యామినీ, రమణమ్మా పూనుకుని బలవంతంగా రాజేశ్వరీ, వకుళా ప్రతి పూటా రవంత ఎంగిలిపడేలా చూస్తున్నారు. రోజూ మధ్యాహ్నాలు మాధవి వచ్చి భగవద్గీత చదివివినిపించి, తాత్పర్యం చెప్పి సత్కాలక్షేపమ్ చేసి వెళుతోంది. అది రగిలే గుండెలకు రవంత ఉపశమనం కలిగిస్తోంది.
ఇంటికి కావలసినవన్నీ తెచ్చిపెట్టే పని మురళీ తీసుకున్నాడు. అంతేకాదు, రామేశంగారు బ్యాంకులో దాచిన డబ్బుకి, బ్యాంకు వాళ్ళు ఆయనకు ఇవ్వాల్సిన డబ్బుకి రాజేశ్వరి, వకుళ వారసులని తెలియజేస్తూ బ్యాంకుకి వాళ్ళచేత ఒక అప్లికేషన్ పెట్టించాడు . కాని బ్యాంకు వారు అది చెల్లదన్నారు. అది అసంపూర్ణంగా ఉందిట! దాన్లో కొడుకు సంతకం కూడా ఉండాలి, లేకపోతే అది చెల్లదు - అని చెప్పేశారు బ్యాంకు ఆఫీసర్లు నిష్కర్షగా.
సాధ్యమైనంత తొందరగా అన్నగారికి విషయం తెలియజేస్తూ, ఇంటికి రమ్మని కోరుతూ ఫొటోతోసహా, పత్రికలకి ప్రకటన ఇవ్వమని మురళీ చెప్పిన సలహా మేరకు వకుళ, అన్నగారి ఫొటో కోసం ఇల్లంతా తెగ గాలించడం మొదలుపెట్టింది. చిట్టచివరకు, ఒక పాత డైరీలో అతని పాస్ పోర్టు సైజు ఫొటో ఒకటి , చిన్నప్పుడు ఎప్పుడో హాల్ట్ క్కెట్ కోసం తీయించుకున్నది కనిపించింది. అక్కడకు అదే మహాద్భాగ్యమని, దాన్నే మురళీకి ఇచ్చి, పేపర్లో అడ్వర్టైజుమెంటు వేయించమని కోరింది వకుళ ఇంట్లో జనానికి రోజు గడవడం ఎంత కష్టంగా ఉన్నా కాని, కాలం ఎంత నత్త నడక నడుస్తున్నట్లనిపించినా కూడా రోజులు చూస్తూండగా గడిచిపోతూనే ఉన్నాయి. రామేశం చనిపోయి అప్పుడే పదిహేను రోజులు దాటిపోయాయి. ఇంతవరకూ అందరూ కలిసే వుంటున్నారు. కాని రాజేశ్వరమ్మకు అలా తామిద్దరూ ఇంకొకళ్ళమీద ఆధారపడి ఉండడం అన్నది చాలా మొహమాటంగా అనిపించింది, "ఎన్నాళ్ళిలాగ రవణమ్మగారిచేత వండించుకుని తినడం! ఇక మా ఏర్పాట్లేవో మేము చేసుకోడం బాగుంటుందేమో" అనిపించింది. వెంటనే ఆ విషయం ఆమె కూతురితో చర్చించింది.
వకుళకు తల్లి ఆలొచన నచ్చింది. కాని ఇల్లు గడిచేది ఎలా? బ్యాంకులో డబ్బు తీసుకోడం ఇప్పుడు కుదరదు కదా! ఇంట్లో ఉన్న డబ్బు కాస్తా కర్మకాండలకు, అన్నదానానికి కర్చైపోయింది. ఇప్పడింక ఏం చెయ్యాలి?
వకుళ మెడలో రెండుపేటల బంగారు గొలుసు, చేతిని రెండుజతల బంగారు గాజులు ఉన్నాయి. అలాగే రాజేశ్వరి ఒంటి మీదకూడా కొద్దిపాటి నగలే ఉన్నాయి. విలువైన నగలన్నీ బ్యాంకు లాకర్లో ఉన్నాయి పదిలంగా. ఒంటిమీద ఉన్నవాటిని అమ్మేసి, వేరు కాపురం మొదలు పెడితే బాగుంటుంది - అనుకున్నారు వాళ్ళు.
అంతే కాకుం డా, ఓ నలుగురు పిల్లలకి సంగీతపు పాఠాలు చెప్పుకుంటే చాలు, ఎలాగోవోలాగ రోజులు గడిచి పోతాయి. తమ అదృష్టం పండిననాడు తన అన్నయ్య తిరిగి వస్తాడు, అప్పుడింక ఈ కష్టాలు తొలగిపోతాయి - అనుకుంది వకుళ. కాని ఒంటరిగా బజారుకి వెళ్ళలేకపోయింది.
యామిని దగ్గరకు వెళ్ళి, "బజార్లో పనుంది, నాకు తోడురావా" అని అడిగింది వకుళ.
"ఏమిటా పని? అదేమిటో చెపితేగాని నేను రాను" అంది యామిని చనవుగా.
"పెద్ద విశేషమేం కాదు, ఈ గొలుసు అమ్మాలి" అంది వకుళ గొలుసు చేత్తో పట్టుకుని చూపించి..
"ఇదేమైనా అరిగిందా, విరిగిందా? ఇప్పుడు దీన్ని అమ్మవలసినంత అవసరం ఏమొచ్చింది వకుళా!"
" అమ్మ రేపటినుండి వంట చేస్తానంటోంది. ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బే మీ బ్యాంకులోంచి తియ్యడం కుదరదు కదాని......" అంటూ నసికింది వకుళ.
యామిని బాగా నొచ్చుకుంది. "వద్దు వకుళా! వద్దు" అంటూ ఆక్రోశించింది. "నే నేమైపోయా ననుకుంటున్నావు నువ్వు? ఈ చిల్లర కష్టాలు కలకాలం నిలిచేవి కావు. మీ అన్నయ్య రాగానే ఎలాగా మమ్మల్ని విడిచిపెట్టి మీదారిన మీరు అతనితో వెళ్ళేపోతారు! ఈ కొద్దినాళ్ళే కదా, మాతో మీరు కలిసి ఉండేది! ఇంతోటి దానికోసం నువ్వు బంగారం అమ్మనక్కరలేదు. మీరు వేరు, మేము వేరు అని మేము ఎంతమాత్రం అనుకోటంలేదు. మీరూ అనుకోవద్దు. ఇదేం బాగాలేదు, ఇకనుండైనా - మేమూ, మీరూ అని కాకుండా "మనం" అనుకోవాలి మనమందరం."
"అన్నయ్య ఎప్పుడు వస్తాడో ఏమో, ఎవరికి తెలుసు! నాన్న ఉంటే, అన్నయ్య ఫ్రెండ్సు కందరికీ ఉత్తరాలు రాసి, ఈ సరికి అడ్రస్ కనుక్కుని ఉండేవారు. నాకు ఒకటి రెండు పేర్లు తెలుసు, కాని వాళ్ళు ఏ ఊరివాళ్ళో కూడా తెలియదు" అంటూ దీనంగా నిట్టూర్చింది వకుళ.
వకుళ బుజం చుట్టూ చెయ్యివేసి, "బాధపడకు వకుళా! ఆ టైం వస్తే అన్ని సమస్యలూ వాటంతట అవే తొలగిపోతాయి. పేపర్లో ప్రకటన ఇచ్చాముకదా, ఆ ప్రకటన చూసి మీ అన్నయ్య త్వరలోనే రావచ్చు. ప్రకటన పడ్డ పేపరుని తెచ్చి నీకు ఇస్తానన్నాడు మురళి. చూద్దాం, అదృష్టం ఎలా ఉందో? కాని ఆ ఫొటో చాలా పాతది!"
"యామినీ! మా అన్నయ్యది స్ఫురద్రూపం. కాని నేనిచ్చిన ఫొటో చూస్తే రంగుమాసిపోయి అదోలా ఉంది. మరోటి దొరక్కపోడంతో అది ఇవ్వక తప్పింది కాదు. చూసిన వాళ్ళకు అసలు సరిగా పోలిక తెలుస్తుందో, లేదో! మానాన్నకి ఓ పట్టాన కోపం వచ్చేది కాదు . వచ్చిందంటే మాత్రం అది మహాప్రళయమే! ఎవరో చేసిన తప్పుకి మా అన్నయ్యకు శిక్ష పడింది! వాడి మీద కోపంతో ఇంట్లో వాడి జ్ఞాపకాలేవీ ఉండకూడదంటూ మొత్తం వాడికి సంబంధించినవన్నీ తీసుకెళ్ళి చెత్త కుండీలో పారేశాడు మా నాన్న! కాని వాడి ధ్యాస మాత్రం మనసులోంచి ఎంత మాత్రం తీసెయ్యలేకపోయాడు పాపం! బెంగపడి చూస్తూండగా మనోవ్యాధితో కృంగిపోయారు. చివరికి ఆ బెంగే ఆయన ప్రాణం తీసింది" అంటూ వకుళ పైట కొంగుతో కన్నీరు తుడుచుకుంది.
"ఊరుకో వకుళా! మనరాత వక్రంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ పగపట్టినట్లుగా పతనానికే దారి చూపిస్తాయి! మనం తప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలు కూడా మనకి పూర్తిగా ఎదురొచ్చి, కీడే చేస్తాయి. ఇలాంటివి చూసినప్పుడే - అంతా విధి, మన చేతుల్లో ఏమీ లేదు - అనిపిస్తుంది" అంది యామిని, తానొక పెద్ద ఆరిందా ఐనట్లుగా.
వకుళ మరి మాటాడలేక తలవంచుకుని నిలబడిపోయింది.
మళ్ళీ యామినే మాటాడింది, "నేనిదే చెపుతున్నా. శ్రద్ధగా విని మనసులో ఉంచుకో. ..... , వకుళా! ప్లీజ్! మీరు, మేము - అంటూ ఎప్పుడూ మనసులో, పొరపాటున కూడా, విడదీసి ఆలోచించవద్దు. మనది ఒకే కుటుంబం.మీ అన్నయ్య వచ్చీవరకైనా అది అలాగే సాగనియ్యి. మా నాన్న ఉద్దేశ్యం కూడా అదే! మనమంతా కలిసి ఉందాం, ఉన్నదేదో పంచుకు తిందాం" అంటూ యామిని వకుళ చేతులు రెండూ తనచేతుల్లోకి తీసుకుంది.
వకుళ, ఏం మాటాడడానికీ తోచక కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. తరవాత కళ్ళు తుడుచుకుని, " యామినీ, ప్లీజ్! నువ్వు హైదరాబాదు వెళ్ళగానే నాకొక జాబ్ చూసిపెట్టవూ ......! ఎంత చిన్నదైనా ఫరవా లేదు. ఓ నాలుగు సంగీతంపాఠాలు కూడా చెప్పుకుంటే రోజు గడవకపోదు. నాకున్నది చెప్పుకుంటే రోజు గడవకపోదు. నాకున్నది సంగీతంతో BAడిగ్రీ! అదితప్ప మరే స్పెషల్ క్వాలిఫికేషన్లూ లేవు. పెద్ద పెద్ద ఆశలు పెంచుకోడంలో అర్థం లేదు. ఒక చిన్న క్లర్కుపోష్టు వచ్చినా చాలు, చేరిపోతాను. ఏదైనా చేతినిండా పని ఉంటే, మనసుకి కూడా కాస్త ఓదార్పు ఉంటుంది. పనిధోరణిలోపడి మనల్ని మనమే మరిచిపోవచ్చు" అంది వకుళ నీరసంగా.
"అలాగే! కలిసే వెతుక్కుందాం. నా ఉద్యోగం ఈ సరికి ఊడే ఉం ... !" అర్ధకుసిగా మాట ఆపేసింది యామిని. కాని వకుళకు పరిస్థితి అంతా అర్థమైపోయినట్లనిపించింది. ఐనా బయటపడి యామినిని బాధపెట్టాలనుకోలేదు. ఈ ముసుకులో గుడ్డులాటకన్నా, ఒకసారి హైదరాబాదు వెళ్ళి ముఖాముఖీ తేల్చుకుని వస్తేనే మంచిది - అనుకుంది.
నోరు జారినందుకు కించపడిన యామిని మనసులో అనుకుంది, " గురుడు నా కోసం ఏం నిర్ణయించి ఉంచాడో తెలియదు కదా! సందేహం లేదు, నా జాబ్ ఈ సరికి రద్దయ్యే ఉంటుంది. ఇక ఇద్దరం కలిసి, నిజంగానే వెతుక్కోవాలేమో జాబ్ కోసం! నేను పంపిన లెటర్ అందిందో, లేదో; సెలవు గ్రాంటు అయ్యిందో, లేదో ..... , ఏమీ తెలియదు కదా! ఒక్క కార్డు ముక్కయినా రాలేదు ఆఫీసు నుంది నాకు. జాబ్ విషయంలో నే నిప్పుడు మనుకోవాల.
పైకి గాంభీర్యంనటిస్తున్నా, యామిని మనసంతా భయంతో నిండి ఉంది. తన ఉద్యోగం పోయింది - అన్నభావమే వస్తోంది పదే పదే ఆమె మనసులోకి. కాని తన అలజడిని వకుళముందు వెళ్ళబోసి; అసలే భయంకరదు:ఖంలో ఉన్న ఆమెను తానై మరింతగా దు:ఖపెట్టడం ఇష్టంలేక, తన బాధను తనలోనే దాచుకుంది యామిని. "ఇంకా అది కన్ఫర్ము కాలేదుకదా, అయ్యాక చెప్పక తప్పదులే" అనుకుంది.
మళ్ళీ, "గురు డసలే తిక్కలాడు! నాకు ఉద్యోగం ఊడిందన్నా ఆశ్చర్యపో నక్కర లేదు. కాని ఏమయ్యిందో తెలియాలన్నా వెళ్ళి చూడాల్సిందే కదా! వెళతాను. ఐనా నేను ఈ సంవత్సరంతో ఈ ఉద్యోగం మానెయ్యాలనే అనుకుంటున్నా కదా! ఇంకొద్ది నెలల్లో నేను రాసిన బాండు టైం కూడా పూర్తిగా ముగిసిపోతుంది, నాకు స్వేచ్ఛ వస్తుంది . ఇప్పటినుండీ వేరే ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నంలో ఉండడమే మంచిదేమో" అనుకుంది.
"బాగానే ఉంది వరస! మరి అంతవరకూ ఇల్లు గడవాలి కదా!" అంతరాత్మ ఆమెను నిలదీసింది. అమర్ మాటలవల్ల ఆమె మనసుకైన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆమె ఆ మాటల్ని మరిచిపోలేకపోతోంది. ఆమెకు రకరకాల ఊహాపోహలతో మనసంతా అలజడిగా ఉంది.
తక్షణం ఉద్యోగానికి రాజీనామా చేసెయ్యాలన్నంత కసిగా ఉంది యామినికి. కాని పరిస్థితులు తక్షణ రాజీనామాకి అనుకూలంగా లేవు. తను ప్రతినెలా, నెలాఖర్నజీతం అందుకుంటేనేగాని ఇల్లు సవ్యంగా గడవదు. తన మీదున్న బాధ్యతలు తాను ఇప్పుడు సమర్ధవంతంగా నిర్వహించి, మాట నిలుపుకోవలసి ఉంది. ముందుకాలు స్థిరంగా ఆనినాక కాని, వెనకకాలు ఎత్తకూడదు! ప్రస్థుతపరిస్థితి అటువంటిది మరి " అనుకుంది యామిని..
ఈ మాటు యామిని హైదరాబాదు కట్టుకున్న బట్టలు తప్ప మరేమీ తన వెంట తీసుకెళ్ళాలనుకోలేదు. యామిని ఉద్యోగపు ఊరికి వెళుతోందని ప్రేమగా పిండివంటలు చేసి ఇచ్చీ, పచ్చళ్ళు సద్దిపేట్టీ మనస్థితి ఇప్పుడు ఇంట్లో ఎవరికీ లేదు, వాటిని తీసుకెళ్ళే మూడ్ యామినికీ లేదు.
తండ్రిదగ్గర సెలవు తీసుకుని, అందరికీ వెళ్ళొస్తానని చెప్పి, హేండ్ బేగ్ ఒక్కటీ బుజానికి తగుల్చుకుంది యామిని. వకుళ దగ్గరగా వచ్చి, యామినిని కౌగిలించుకుని కంట తడి పెట్టింది. యామినికి కూడా కన్నీరు ఆగలేదు.
కన్నీళ్ళు తుడుచుకుని గద్గద స్వరంతో, " వకుళా! ధైర్యం తెచ్చుకో! అమ్మ జాగ్రత్త! నిన్ను నువ్వు మరిపించుకుంటూ, అమ్మని ఓదార్చాలి సుమీ! మళ్ళీ వీకెండ్ రాగానే వచ్చేస్తా. ఈ ఐదురోజులూ ఈ ఇంటి భారాన్ని నువ్వొక్కదానివే మొయ్యాలి. నీకు తప్పదు." అంది యామిని.
కన్నీరు వరదలౌతూండగా యామినికి వీడ్కోలు చెప్పింది వకుళ. విడవలేక విడవలేక వకుళను విడిచి వెళ్లింది యామిని.
* * *
హైదరాబాదులో బస్సు దిగగానే యామినికి, తాను పరీక్ష రాయడానికి రామేశం అంకుల్తో కలిసి వచ్చినది గుర్తుకివచ్చింది ......
"అంకుల్ ఎంతమంచివారు! మాకు మేలు చెయ్యడంకోసం ఎన్నో రకాలుగా తాపత్రయపడ్డారు! నాన్న ఈ వేళ ఇలా లేచి తిరుగుతున్నారంటే, దాని వెనకాల ఆయన కృషి ఎంతోఉంది. నాకీ ఉద్యోగం వచ్చిందన్నా, నేను ఇక్కడికి వచ్చేశాక నాన్నకి ఏ లోటూ లేకుండా గడిచిందన్నా - ఈ సౌకర్యాలన్నింటి వెనకాల ఉన్నది అంకుల్ అభయహస్తమే కదా! ఇలా ఎన్నెన్నో విధాలుగా మమ్మల్ని కనిపెట్టి చూసిన ఆ పుణ్యాత్ముడి కుటుంబం ఆపదలో పడినప్పుడు, నేనెలా వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలి, నాపని కాదని దిక్కులు చూస్తూ ఊరుకోగలను? వాళ్ళ కష్టసుఖాలను కనిపెట్టి చూసుకోకుండా ఎలా ఉండగలను? నాకు మనసు నిండా విశ్వాసం ఉంది, వీలైనంత వరకూ వాళ్ళకేలోటూ రానీయను.వాళ్ళ అబ్బాయి వచ్చి, వాళ్ళను ఆదుకునేదాకా ఈ యామిని తన ప్రాణాలు ధారపోసి అయినా వాళ్ళకు ఏ ఇబ్బందీ రాకుండా కాపాడుకుంటుంది. అదే నా నిర్ణయం" అనుకుంది.
ఆమెకు ఇప్పుడు తాను కాపురమున్న ఇంటికి వెళ్ళడానికి చాలినంత సమయం లేదు. అంతే కాదు, అసలే దుఖంతో ఘూర్నిల్లుతున్న ఈ మనసుతో శారదాంబగారికీ, ఆమె భర్త సదాశివం గారికీ ఎదురుగా నిలబడి, రామేశం గారి అకాల మరణవార్త చెప్పగల మనస్థైర్యం తనకు లేదనికూడా భయపడింది యామిని. ఇక తప్పనిసరి కనక, సాయంకాలం ఆఫీసు అవర్సు అయ్యాక ఇంటికి వెల్లొచ్చు లెమ్మని మనసు సరిపెట్టుకునే ప్రయత్నం చేసింది. కాని, అలా వెళ్ళాలన్నా కూడా యామినికి మొహం చెల్లనట్లుగానే అనిపించింది. .
ఆలోచనల్లోపడి అడుగులు నెమ్మదిగా వెయ్యడంతో, ఆమె ఎప్పుడూ అందుకునే సిటీబస్సు, ఆ రోజు ఆమెకు అందలేదు. అది ఆమె కళ్ళకెదురుగానే కదిలి వెళ్ళిపోయింది. పర్సులో డబ్బు మరీ తక్కువగా ఉండడంతో, యామిని ఆటో ఎక్కడానికి భయపడి, తరవాతి బస్సుకోసం ఎడురు చూస్తూ బస్సు స్టాపులో నిలబడిపోయింది.రకరకాల ఆలోచనలు సముద్రపు టలలులా ఒకదాని తరువాత ఒకటిగా వచ్చిఆమె మేధను తాకి, అలజడి సృష్టిస్తున్నాయి. ఎంతో ముఖ్యమైన దానిని దేనినో ఎక్కడో పారేసుకున్నట్లుగా, త్వరలోనే తనకు ఏదో భయంకరమైన ముప్పు ముంచుకుని రాబోతున్నట్లుగా యామినికి మనసంతా ఆందోళనతో నిండి అల్లకల్లోలంగా ఉంది.
ఆఫీసు టైం ఐపోతోందని కంగారు పడుతున్న యామిని, అకస్మాత్తుగా, ఒక ఫియట్ కారు - ప్రీమియర్ పద్మిని - వచ్చి, తన పక్కన ఆగేసరికి, ఉలికిపడి, తలతిప్పి దాన్ని చూసింది. దానిలోంచి దిగి, రెండడుగులు నడిచి యామినికి దగ్గరగా వచ్చాడు సుదర్శనం.
"యామినీ! అలా నిలబడ్డావేమిటి, బస్సు దొరకలేదా? రా, కారెక్కు., నువ్వు వెళ్ళాల్సిన చోటుకి నేను తీసుకెళ్ళి దింపుతాను" అన్నాడు చనువుగా.
"ధాంక్సు! కాని నాకు లిఫ్టు అక్కరలేదు. ఇదినా డైలీ రొటీన్. నాకు ఎవరి సాయం వద్దు. నేను వెళ్ళగలను" అంది యామిని.
"అలా అనకు యామినీ! ప్లీజ్! నే నేమైనా పరాయి వాడినా? రోజూ నువ్వేం అవస్థలు పడుతున్నావో నేను చూడటం లేదు కదా! ఈ రోజు నీ కష్టం నా కళ్ళబడింది కనక, సాయం చెయ్యాలనిపించి కారెక్కమని అడిగా. ఐనా నీలాంటి సుకుమారికి ఇలాంటి కష్టాలు తగవు. పెద్ద ఉద్యోగస్థురాలివన్న పేరేగాని, నీకు సుఖమెక్కడుంది!"
"ఒక్కమాటు మీ కారెక్కినంతమాత్రంలో తీరిపోవు నా కష్టాలు" అంటూ అప్రయత్నంగా నిట్టూర్చింది యామిని.
అది గుర్తించాడు సుదర్శనం. ఆ నిట్టూర్పు అతనికి ఆమె మనస్థితిని పట్టి ఇచ్చింది . వెంటనే అర్థం చేసుకున్నాడు - తన పాచిక పారేందుకు ఇదే తగిన సమయమని.
" నా కారు ఎక్కడానికి భయమెందుకు యామినీ! మనమేమీ ఒకళ్ళకొకళ్ళం బొత్తిగా ఎరుగని వాళ్ళం కాదు కదా! ఒకే ఊరివాళ్ళం. మా మాష్టారమ్మాయివైన నీకు ఈ పాటిగానైనా నేను సాయపడాలన్న సత్సంకల్పంతో అడిగాను. ప్లీజ్, కాదనకు" అంటూ కారు వెనక తలుపు తెరిచి పట్టుకున్నాడ అతడు ఆమెకు ఆహ్వానంగా .
ఇంక బెట్టు చేస్తే బాగుండదనుకుంది యామిని. విధి ప్రేరితయై వచ్చి, కారేక్కి కూర్చుంది. కారు తలుపు మూసి, అటువైపు తిరిగి వచ్చి రెండవతలుపు తెరిచి లోపల, యామిని పక్కన, ఆమెకు ఎడంగా ఒదిగి, ఒద్దికగా కూర్చున్నాడు సుదర్శనం. డ్రైవర్ పక్కనున్న సీట్లో, సుదర్శనానికి నమ్మిన బంటు ఐన గుమాస్తా నరహరి కూర్చుని ఉన్నాడు. కారు కదిలింది. తాను వెళ్ళవలసిన చోటు తాలూకు అడ్రస్సు చెప్పింది యామిని. కాని కారు, సుదర్శనం వాళ్ళు ముందుగా అనుకున్నట్లుగానే, వెళ్లి తాజ్ హోటల్ ముందు ఆగింది.
"కొంచెం తలనొప్పిగా ఉంది. ఒక కప్పు స్టాంగు కాఫీ తాగి వెళదామా" అంటూ, యామిని మాటకోసం ఎదురు చూడకుండానే, కారు దిగి, చురుగ్గా చుట్టుతిరిగి వచ్చి యామిని వైపు తలుపు, స్వయంగా తానే తెరిచాడు సుదర్శనం.
యామినికి కారు దిగాలనిపించలేదు. ఇప్పుడు కనక తను ఆలస్యంచేసిందంటే, ఇంక ఈ పూట ఆఫీసు ఎగ్గొట్టడమే ఔతుంది. కాని సుదర్శనం, "తలనొప్పి" అంటున్నాడు కదా, అలాంటప్పుడు, కాఫీ తాగుతానంటే వద్దని చెప్పడం ఎలాగ - దాంతో తనకూ ఇక కారు దిగక తప్పలేదు.
కారుదిగి సుదర్సనం వెంట నడిచి వెళ్ళింది యామిని. ఇద్దరూ వెళ్ళి హోటల్లోని ప్రైవేట్ రూంలో టేబుల్ ముందు కూర్చున్నారు. వెంటనే అటెండర్ వచ్చి, ఇద్దరికీ మెన్యూకార్డులు ఇచ్చి, కొంచెం ఎడంగా చేతులుకట్టుకుని నిలబడ్డాడు.
కార్డుచూసి, "ఒక ప్లేట్ ఉల్లిదోశ, ఒక స్ట్రాంగ్ కాఫీ" అని చెప్పాడు సుదర్శనం.
గోడనున్న గడియారం "టక్కు, టిక్కు"మంటూ హెచ్చరిస్తో టైమ్ చూపిస్తోంది. చూస్తూండగానే ఆఫీసు వేళ మించిపోతూడడంతో యామినికి చాలా గిజాటుగా, ముళ్ళమీద కూర్చున్నట్లుగా ఇబ్బందిగా ఉంది.
"తిన్నగా బస్సెక్కి ఆఫీసుకి పోక ఇలా చేశానేమిటి" అని బాథపడుతున్న యామినికి, మెన్యూ కార్డుని పట్టించుకునే స్థిమితం లేకపోయింది. మనసులోని చిరాకు పైకి వ్యక్తం కానీయకుండా,"నాకూ అవేతే" అని చెప్పేసింది. అట్టెండర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు.
"అరే! నీదీ, నాదీ ఒకే టేష్టన్నమాట! బలే కుదిరిందే" అన్నాడు సుదర్శనం ఉబలాటపడుతో.
కాని, అన్యమనస్కంగా ఉన్న యామిని అతని మాటలు వినలేదు. నోరుతెరిచి ఏమీ మాటాడకుండా మంచినీళ్ళ గ్లాసు అందుకుని, ఒక్కొక్క గుక్క తాగుతూ, మనసు సంబాళించుకునే ప్రయత్నంలో పడింది. సుదర్శనం కాసేపు కిటికీ లోంచి బయటకు చూసి, ఆ పై యామినివైపు తిరిగి, చెప్పసాగాడు.......
"యామినీ! నాకో గొప్ప చిక్కు వచ్చిపడిందోయ్! మొదట్లో నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని, అసలు అడగకూడదనే అనుకున్నా గాని, చివరకి దారేదీ కనిపించలేదు. అడిగానని ఏమీ తప్పుగా అనుకోవు కదా! తప్పనిసరై నిన్నుఅడగాల్సి వస్తోంది. నాకు గొప్ప అవసరం ఒకటి అనుకోకుండా ఇప్పుడు వచ్చిపడిందోయ్! కొంచెం డబ్బు సద్దగలవా? చాలా అవసరంగా ఉంది, లేకపోతే అడిగీవాడిని కాను" అన్నాడు, ఎదుటి వాళ్ళను మాటల్తో బోల్తాకొట్టించడంలో అతినేర్పరియైన సుదర్శనం.
యామినికి పచ్చివెలక్కాయ గొంతుకులో అడ్డుపడ్డట్లు అనిపించింది. " అయ్యో! అంతా నా తలరాత! దురదృష్టం కాకపోతే, ఇతనికీ అవసరం ఇప్పుడే రావాలా! కాని నేను మాటిచ్చా, అతడు ఎప్పుడు అవసరపడి అడిగినా వెంటనే ఇచ్చేస్తానని! ఇప్పటి పరిస్థితిలో ఆ మాటను ఎలాగ నిలబెట్టుకోడం? అప్పుడు పత్రమైనా రాయించుకోకుండా కేవలం "జంటిల్మాన్సు అగ్రిమెంట్" అంటూ నోటి మాటతో చేబదులులా, అంత డబ్బు ఉదారంగా ఇచ్చేశాడు. ఇప్పుడు పరువు నిలవాలంటే, అతని అప్పుని నేను ఉన్నబడంగా తీర్చవలసి ఉంది. మరి కొద్దినెలలు ఆగి ఉంటే ఇతని అప్పు అవలీలగా తీర్చేసి ఉండే వాళ్ళం. కష్టాలన్నీ కలిసికట్టుగా రావడమంటే ఇదే కదా" అని అనుకుంది బాధగా.
ఆ వెంటనే ఆమె అతణ్ణి అడిగింది, "సుదర్శనంగారూ! నాకు కొంచెం వ్యవధి కావాలి. ప్రస్తుతానికి నా దగ్గర గవ్వ కూడా లేదు. మీరు కనక ఒక్క సంవత్సరం ఆగారంటే వడ్డీతోసహా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. సమయానికి మీరు చేసిన సాయానికి నేను చాలా కృతజ్ఞురాలిని. మీరు మరీ కాదూ - కూడదూ అని, ఇప్పుడే తీర్చాలి అంటే, ఇల్లు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది" అంది మృదువుగా.
సుదర్శనం చిన్నగా నవ్వి అన్నాడు, " నువ్వు మంచి పిల్లవు కనక, నా సాయం నీకు ఇంకా గుర్తుంది. థాంక్సు! నేను ఎప్పుడూ మీకు మేలు జరగాలనే కోరుకుంటాను. చెప్పేది విను, ఆస్తి తాకట్టుపెట్టి అప్ప తీసుకోడం ఎప్పుడూ రిస్కే.! మీ నాన్నగారికి డబ్బు దాచుకోడం అస్సలు తెలియదు. ఆయన, దానమనో, ధర్మమనో చేతిలో నాలుగు రూకలు కనిపిస్తే చాలు, ఎవరికో ఒకరికి ఉదారంగా ఇట్టే ఇచ్చేస్తారు. అందువల్ల ఎన్నాళ్ళు గడిచినా అప్పులు అప్పులుగానే మిగిలిపోయి ఉంటాయిగాని ఎప్పటికీ తీరవు సరికదా, వడ్డీకి వడ్డీ కూడా పెరుగుతోంటుంది! చివరకు ఇక తాకట్టు వాకట్టు కాక తప్పదు. ఆ తరవాత - అప్పిచ్చి, అవసరం గడిపినవాడిని తూర్పారబట్టడం న్యాయమేనా చెప్పు? ఇది అప్పు, ధర్మం కాదు! మీ అవసరాలకి మేము ఎన్నాళ్ళో కష్టించి కూడబెట్టుకున్న డబ్బుని, అడిగారని అప్పుగా ఇస్తున్నాము - అంటే, అవి మళ్ళీ మా అవసరాలకి రెండింతలై వస్తాయన్న ఆశతోనే గాని, పారమార్ధీకానికి కాదు కదా! ఇంతకీ నేను చెప్పేదేమంటే ఇల్లు తాకట్టు పెడితే మీరు నష్టపోతారు. అంతకంటే విలువ కట్టించి అమ్మెయ్యడం మంచి పని. కనీసం వస్తువు విలువకు తగిన డబ్బు మీ చేతిలో పడుతుంది, ఏమంటావు? నా ఎరుకలో ఒక పార్టీ ఉన్నాడు. చక్కగా డబ్బు చేత్తో పట్టుకుని ఇల్లుకోసం వెతుక్కొంటున్నాడు. మీరు కావాలంటే చెపుతా....
" ఇల్లు అమ్మడమా ..... , అసంభవం! మా నాన్న ఎంతమాత్రం ఒప్పుకోడు. అది మా అమ్మ దగ్గరుండి కట్టించింది. తోట విషయంలో ఏమయ్యిందో తెలుసుకదా! ఎలాగో ఓలా నేనే తీరుస్తా మీ బాకీ. ప్లీజ్! కొద్దిపాటి వ్యవధి ఇవ్వండి చాలు."
"బాగానే ఉంది! అవసరం వచ్చి అడిగితే, అప్పటికప్పుడు ఇచ్చేస్తానన్నావు! మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి? ఆ అవసరమేదో రానేవచ్చింది! ఇప్పడికిప్పుడు నాకు డబ్బు కావాలి, ఆ తరవాత నువ్విచ్చినా దానివల్ల నాకు ఏ ప్రయోజనం ఉండదు."
"నెలకింతని తీరుస్తానంటే వద్దన్నారు. ఇప్పుడు ఆకస్మికంగా వచ్చి అంత డబ్బిమ్మంటే, నా దగ్గర ఉండాలి కదా!"
"అందుకే వెంటనే డబ్బు చేతికివచ్చే దారి చూపిస్తున్నది! ఆ పార్టీ డబ్బుతో రెడీగా ఉన్నాడు. ఇల్లు రిజిష్టర్ అవ్వగానే, సొమ్ము మొత్తం ఇచ్చేస్తాడు..మంచి బేరం! ఇప్పుడే మనం వెనక్కివెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడుదాం, పద."
" ఈ మధ్యనే మా రామేశం అంకుల్ పోయారన్న సంగతి మీకు తెలుసు కదా! ఇల్లంతా ఇప్పుడు ..... "
"అయ్యో, తెలియకపోడమేమిటి? ఆ రోజు నేనూ వచ్చా. బహుశ: నువ్వు నన్ను చూసి ఉండవు."
"మరి ఇకనేమి! ఇప్పుడు మేము ఎంత దు:ఖంలో ఉన్నామో తెలుసుకదా! మా నాన్న చూస్తే రోగిష్టివాడైపోయాడు. పైగా, ప్రస్తుతానికి మా రామేశం అంకుల్ ఫామిలీ కూడా మాతోనే ఉంటున్నారు. చూస్తే, ఉద్యోగం చెయ్యక తప్పని పరిస్థితి ఇది నాకు!. ఇలాంటి సమయంలో ఇల్లు అమ్మి, అందర్నీ ఉన్నచోటన ఉండనీకుండా చేసి, అద్దె కొంపలోకి మార్చడం ఎలా! అలాచేసి వాళ్ళ దు:ఖం మరింతగా పెంచలేను. అది జరిగే పని కాదు" అంది యామిని.
ఇంతలో శర్వర్ ఇద్దరికీ దోశలు తీసుకు వచ్చాడు. కమ్మని వాసన నోరు ఊరించేలా ఉంది.
"దోశ తీసుకో యామినీ! చల్లారిపోతుంది. తింటూ మాటాడుకుందాం" అన్నాడు సుదర్శనం దోశ తుంచి నోట్లో పెట్టుకుంటూ.
యామిని కూడా నెమ్మదిగా తినడం మొదలుపెట్టింది. ఉదయం హైదరాబాదుకి ప్రయాణమై బయలుదేరేవేళ, తను ఒక కప్పు కాఫీ మాత్రం తాగింది, అంతే! ఆమెకు బాగా ఆకలిగా ఉంది. వాళ్ళు దోశ తినడం పూర్తిచేసే సరికి, వేడిగా పొగలు కక్కుతున్న కాఫీ వచ్చింది. కాఫీ ఊదుకుంటూ, నెమ్మదిగా తాగుతూ మాటలు మొదలుపెట్టాడు సుదర్శనం .......
"నిన్ను చూస్తూంటే జాలేస్తోంది యామినీ! ఇంత చిన్న వయసులో నువ్వు రెండు కుటుంబాల భారాన్ని మీద వేసుకుని భరిస్తున్నావంటే నాకు చాలా బాధగా ఉంది? అంత బరువు నీ చిన్ని బుజాలమీద ఉంచుకుని మోస్తూ కూడా, ఇలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నావంటే నిన్నెలా మెచ్చుకోవాలో నాకు తెలియడం లేదు. నీ కష్టాలు నీకు ఉన్నాయి. ఐనా ఎదుటివాళ్ళ కష్టాలకు స్పంది స్తావు నువ్వు! నాకూ నీలా ఉండాలని ఉంది. అవకాశం రావాలేగాని! నువ్వు నమ్ము, నమ్మకపో .. , నా మనసులోమాట చెపుతున్నా, ఇకనుండీ నీ భాద్యతలన్నీ నా బుజాలకు ఎత్తుకుని, నీకు విశ్రాంతి నివ్వాలని ఉంది నాకు."
అతడల్లా తనని ఆకాశానికి ఎత్తేస్తూంటే యామినికి ఊపిరాడనట్లు, ఉక్కిరిబిక్కిరిగా ఉండి, ఏమీ మాటాడలేకపోయింది. మళ్ళీ సుదర్శనమే మాటాడాడు ........
"ఏ తండ్రైనా ఎప్పుడూ యుక్తవయసులో ఉన్నతన కూతురు పెళ్ళిచేసుకుని, అత్తారింట్లో చక్కగా పిల్లాపాపలతో సుఖంగా బ్రతుకుతూ ఉండాలని కోరుకుంటాడుగాని, ఎండనక, వాననక ఇలా బస్సు స్టాపుల్లో పడిగాపులు పడుతూ ఆఫీసుకి చేరుకుని, అక్కడ "ఎస్ బాస్!" " ఓ.కె. సర్!" అంటూ, రోజంతా బాసుకి ఒంగి ఒంగి సలాములు చేస్తూ, అగచాట్లమారి ఉద్యోగం చెయ్యాలని మాత్రం ఎప్పుడూ అనుకోడు. ఈ విషయం మీ నాన్నగారు చాలాసార్లు నాతో అన్నారు కూడా! తప్పనిసరై ఒప్పుకున్నారుగాని, నువ్విలా ఉద్యోగం చెయ్యడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఈ సంగతి నీకూ తెలిసే ఉంటుంది! నువ్విలా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు, పెళ్ళి చేసుకోవాలనిపించడం లేదా నీకు? "
అతడలా మరీ వ్యక్తిగత విషయాలు మాటాడడం యామినికి నచ్చలేదు. బాగా కోపం వచ్చింది. కాని తమాయించుకుంది. సాధ్యమైనంత మృదువుగా స్వరం మార్చి, "ముందు నా భాద్యతలు తీరాలి. ఆ తరవాతగాని పెళ్ళిప్రసక్తి లేదు. ఇప్పుడు నేను తొందరగా ఆఫీసుకి వెళ్ళాలి" అంటూ లేచి నిలబడింది. సుదర్శనానికి ఒక బ్రహ్మాండమైన "క్లూ" ఒకటి దొరికింది. " భేష్! చిక్కిందిరా పిట్ట! ఇక అటునుండి ఇటు నరుక్కొద్దాం" అనుకున్నాడు సంతోషంగా తనలో.
"ఆఫీసు ఎక్కడికీ పోదులే, కాస్త ఆగు, నీతో మాటాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కూర్చో యామినీ, ప్లీజ్" అన్నాడు సుదర్శనం.
తగిన సమయంలో తండ్రి వైద్యానికి అతడు సాయపడ్డాడన్న కృతజ్ఞతతో, అతడు కోరగానే మంత్ర ముగ్ధలా, మళ్ళీ కూర్చుండిపోయింది యామిని. అతని మాటకు మాట ఎదురుచెప్పి, అతన్ని చిన్నబుచ్చి, బాధపెట్టడం మంచిపని కాదు - అనుకుంది.
"గాడ్ ప్రోమిస్!" అంటూ మొదలుపెట్టాడు సుదర్శనం. "ఇది ఎప్పటినుండో నా మనసులో స్థిరంగా నాటుకుని ఉన్నమాట! ఇప్పటికి గాని నీతో చెప్పే అవకాశం దొరకలేదు నాకు. మనస్ఫూర్తిగా చెపుతున్నాను, తప్పుగా అనుకోకు! నువ్వంటే నాకు చాలా అభిమానం ఉంది. నిన్ను శీఘ్రం పెళ్ళి చేసుకుని, నీ బాధ్యతలన్నీ నా బాధ్యతలుగా చేసుకుని, నిన్ను పువ్వుల్లోపెట్టి చూసుకోవాలనీ, కళ్ళల్లో ఉంచుకుని కాపాడుకోవాలనీ నా కోరిక! ఇంత చిన్న వయసులో, సుఖపడవలసిన సమయంలో నువ్వు ఇన్నిన్ని బరువులు మొయ్యడం నాకు ఏమాత్రం నచ్చటంలేదు, తెలుసా? నేను ఇన్నాళ్ళూ పెళ్ళి చేసుకోకుండా ఇలా ఉండిపోయింది నీ కోసమే! నన్ను నమ్ము, నేను నిన్నంతగా ప్రేమిస్తున్నాను! నువ్వేం నాకు కట్నకానుకలేమీ ఇవ్వనక్కరలేదు. నువ్వు కావాలంటే నేనే ఇస్తా బోలెడు డబ్బు నీకు ..... " అన్నాడు సుదర్శనం.
యామిని తెల్లబోయి, అవాక్కై చూసింది అతని వైపు. అతనికి అటువంటి ఉద్దేశం ఉందని ఆమెకు చూచాయగానైనా తెలియదు! సుదర్శనానిది కాయశరీరం కావడంతో వయసు కంటే చాలా చిన్నవాడిగా కనిపిస్తాడు. ఎవరికైనా, అతనిని చూసి, అతని నిజమైన వయసు తెలుసుకోడం చాలా కష్టం. అతను తన వయసు ఎంతని చెపితే అంతే ననుకోడం సులభం.
యామిని ఆలోచనలో పడింది. "ఇదెక్కడి విడ్డూరం! ఇతనికి ఇదంతా నా మీద నిజమైన ఇష్టమే ననుకోవాలా? ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఈ విషయం నాన్నతో చర్చించడం మంచిపనేమో! ఇతను చెప్పిన మాటలన్నీ విన్నాక, ఇతన్ని పెళ్ళిచేసుకోడం అన్నది ఉభయతారకంగా ఉంటుందనిపిస్తోంది. ఇంతకీ, ఇప్పుడు అసలు నా ఉద్యోగం ఉందో, ఊడిందో తెలియదు కదా! తీరా నేను ఆఫీసుకి వెళ్ళాక, గురుడు "యు ఆర్ ఊస్టెడ్! సింప్లీ గెట్ ఔట్" అన్నా అనగలడు! అనగలడు ఏమిటి ..... అంటాడనే నా గట్ ఫీలింగ్! అదే నిజమైతే, ఆ తరవాత నాన్న మందులు, ఇంట్లో అందరి పోషణ సవ్యంగా ఉండాలంటే మరోదారి వెతుక్కోక తప్పదు కదా .
ఈ సుడర్శనమ్, నేను కనక తనను పెళ్ళి చేసుకుంటే ,నా బాధ్యతలన్నీ తనమీద వేసుకుంటా నంటున్నాడు. సుదర్శనం లాంటి సంపన్నుడికి అదేమంత కష్టమైన పని కాదు. ఈ ప్రపోజల్ కి ఒప్పుకోడమే మంచిదౌతుందేమో ననిపిస్తోంది. ఇది గాడ్ సెండ్ ఆపర్ట్యూనిటీ లా ఉంది. ఇప్పుడు నేను వేరే ఉద్యోగాన్ని వెతుక్కోడం మొదలుపెడితే, వెంటనే దొరుకుతుందన్న నమ్మకం ఏమిటి? ఉద్యోగాల్లోనూ కాంప్లికేషన్లకు తక్కువేం లేవు కదా! ఈలోగా ఇల్లు సవ్యంగా గడిచేది ఎలా!
ఈ సుదర్శనం కట్నం అడక్కపోవడమే కాక, నా బాధ్యతలను తనే భరిస్తానంటూ తనకు తానుగా ముందుకి వస్తున్నాడు. అంతే కాదు, ఇక్కడ నేను ఇంకొకటి కూడా ఆలోచించడం బాగుంటుందనిపిస్తోంది ....! ఇతడు నన్ను ప్రేమిస్తున్నట్లు చెపుతున్నాడు! అలాంటప్పుడు, ఈ విషయం !ఆలోచించడం మేలేమో! నువ్వు ప్రేమించిన వాడికంటే నిన్నుప్రేమించినవాడివల్ల నువ్వు ఎక్కువ సుఖపడతావు - అని అంటారు కదా! ఎటుచూసినా, ఇదేదో మంచి అవకాశమే అనిపిస్తోంది. ఈ విషయం నాన్నతో చెప్పాలి. నాన్న ఒప్పుకుంటే చాలు, నాకే అభ్యంతరం లేదు. ముక్కూమొహం తెలియని వాడు వచ్చి, ఒక్క అరగంట సేపు కనిపించి వెళ్ళగానే అతనితో పెళ్ళికి అమ్మాయిలు చక్కగా త!యారైపోతారు, అంతకంటే ఇది నయంకాదా! అసలు ఈ రోజుల్లో ఇతడిలా కట్నం అడగకుండా పెళ్ళికి సిద్ధపడుతున్నందుకే నేను ఇతనికి కృతజ్ఞత చూపించాలి " అనుకుంది యామిని మనసులో.
అర్ధాంతరంగా ఇలా ప్రపోజ్ చెసినందుకు యామిని తనను "ఛీ" కొట్టి, ఖాండ్రించి మొహాన ఉమ్మేస్తుందేమో అనుకుని భయపడ్డ సుదర్శనం, ఆమె అలా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోడం చూసి సంతోషంతో లోలోన చాలా చాలా ఉప్పొంగిపోయాడు.
"యామినీ నన్ను తప్పుగా అనుకోకు సుమీ! మనం మేజర్లం. పైగా నీకూ పెళ్ళి కాలేదు, నాకూ ఇంకా పెళ్ళికాలేదు. మనిద్దరికీ ఇష్టమైతే చాలు, మన పెళ్ళి మనమే చేసుకునీ హక్కు లీగల్గా మనకు ఉంది. నువ్వు సరే నంటే చాలు, తక్కిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. అప్పుడిక నువ్వు నా అప్పు తీర్చడం కోసం ఇల్లు అమ్మాల్సిన పనిలేదు. మన పెళ్ళి జరిగితే ఆ తరవాత మనమధ్య నీ - నా అన్న భేదం ఉండదు కదా! నువ్వు కావాలంటే మన పెళ్ళైన మరునాడే మీ తోట, అదే - "సుశీలా నందనం" నీ పేర రాసేస్తా. అదేకదా మీ అమ్మా నాన్నలు కోరుకున్నది. అక్కడితో మీ నాన్నగారి మనసులోఉన్న చీకాకు పోయి, చక్కగా సంతోషం చోటుచేసుకుంటుంది. ఇంకేముంది, ఆయనకు ఎక్కడలేని బలమూ క్షణాలమీద వచ్చేస్తుంది. ఆపై ఆయన కావాలంటే - కావాలంటేనే సుమీ - మనం కొత్త టైపుమిషన్లు కొని, మళ్ళీ ఆయన చేత కేవలం కాలక్షేపం కోసం, స్వరాజ్య "టెక్నికల్ ఇనిస్టిట్యూట్ " ని," రీ - ఓపెన్" చేయిద్దాం. ఆయన మనకి బరువని కాదు, అది ఆయనకి ఒక మంచి కాలక్షేపంగా ఉంటుందని మాత్రమే! మా నాన్న ఎలాగా లేడు. ఇకనుండీ నీకైనా, నాకైనా ఆయనే కదా నాన్న! ఇంకా చెప్పాలంటే - మీ అత్తయ్యగారు, రాజేశ్వరమ్మగారూ, వకుళా కూడా మనతోనే ఉంటారు. కొన్నాళ్ళు చూసి, వాళ్ళ అన్నయ్య అప్పటికీ రాకపోతే, ఒక మంచి సంబంధం వెతికి, మనమే పీటలమీద కూర్చుని కన్యాదానం చేసి, వకుళ పెళ్లి చేసేద్దాం, నువ్వు ఏమంటావు?" అచ్చంగా ఎలక్షన్లో పోటీ చేసిన రాజకీయ నాయకుడిలా సుదర్శనం, ఎడా పెడా అతి ఉదారంగా వాగ్దానాలు చేసేస్తున్నాడు.
అవన్నీ నిజమని అమాయికంగా నమ్మిన యామిని నిర్ఘాంతపోయింది. "అడిగిన కట్నం అణా పైసలతో చెల్లించినా, ఇంకా ఇది చాలలేదు, అది చాలలేదు అంటూ వేధించి, కన్యాదాత దగ్గరనుండి ఇంకా ఇంకా డబ్బు పిండాలని చూసే మగపెళ్ళివారు ఉన్న ఈ రోజుల్లో, మరీ ఇంత ఉదారంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారంటే విడ్డూరంగా ఉంది కదూ" అంది అతనితో.
"ప్రేమమ్మా, ప్రేమ! "ఐ లవ్ యూ" యామినీ! దీన్నిబట్టి నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్ధం చేసుకో! నిజానికి నేనిప్పుడు చాలా డబ్బు అవసరంలో ఉన్నాను. ఐనా ఇప్పుడింక డబ్బు అడిగి నిన్ను కష్టపెట్టను! నువ్వు మన పెళ్ళికి ఒప్పుకుంటే చాలు. నేను మళ్ళీ డబ్బు మాట ఎత్తను. అంతగా డబ్బు అవసరమైతే ఏమాత్రం ఆలోచించకుండా, నా ఇల్లే అమ్ముకుంటా! నీ అభిప్రాయమేమిటో త్వరగా చెప్పు యామినీ! ప్లీజ్!"
సుదర్శనం మాటలు చాలా ఇంపుగా వినిపించడంతో యామిని మళ్ళీ ఆలోచింపసాగింది "నువ్వు ప్రేమించిన వానికంటే, నిన్నుప్రేమించినవాడు నిన్ను బాగా చూసుకుంటాడు"- అన్న మాటలని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకుంది. అసలు ఈ ప్రేమలూ, దోమలూ లాంటివి తనకు ఎప్పుడు కలిసి వచ్చాయి కనక! వాటికీ తనకూ ఎంతమాత్రం సరిపడదు. తనకు ఈ పెళ్ళి కనక జరిగితే, ఇది ఒక ప్రయోజనాన్ని కోరుకుని తాను చేసుకున్న పెళ్ళి ఔతుంది. ఆతను కోరింది అతనికిచ్చి, నాకు కావలసింది నేను పొందడంలో తప్పేమీ లేదు. నలుగురికి మేలుజరిగేటప్పుడు ఒక్కమనిషికి కొంచెం ఇబ్బంది అయినా ఫరవాలేదు, కాస్త మనసు సరిపెట్టుకుని హాయిగా బ్రతకవచ్చు" అనుకుంది.
సుదర్శం పెద్ద అందగాడు కాకపోయినా ఫరవాలేదు, మరీ అంతచేటు డొక్కసుద్ధి లేనివాడూ కాడు, డిగ్రీ వరకూ చదివాడు. ఇకపోతే బోలెడు డబ్బు ఉంది, దేనికీ ఇబ్బంది పడనక్కరలేదు. ఇద్దరి మధ్య నున్న వయసు తేడా కొంచెం ఎక్కువే అయ్యుండొచ్చు. కాని బోలెడు ప్లస్సుల మధ్యలో ఒక్క మైనస్ ఉన్నా ఫరవా లేదు. అది నేను పట్టిం చుకోను. నాకు పెళ్ళైపోతే నాన్నకి, అత్తయ్యకి ఉన్న - నాకు పెళ్ళి చెయ్యాలన్న బెంగ తీరిపోడంతో వాళ్ళ మనసులు కూడా తేలికౌతాయి. ఇది అన్నివిధాలా మమ్చిపనిలా ఉంది.
నిజానికి, మనవాళ్ళు పిల్ల నిస్తామని, మగపిల్లవాడి తల్లితండ్రుల దగ్గరకు వెళ్ళి అడిగితే, వాళ్ళు కోరే గొంతెమ్మ కోరికలు ఇన్నీ అన్నీ కావు. ఇప్పుడు ఇతడు తనకు తనే అడిగాడు కనక, ఇక కట్నకానుకలంటూ ఏ గొడవావుండదు. ఈ సంబంధం నాకు నచ్చింది. మరి నాన్నకో .... ? ఆయనకీ నచ్చాకకే కదా పెళ్లి! " అకస్మాత్తుగా యామిని ఆలొచనలకు బ్రేక్ వచ్చింది .....
అటెండర్ దగ్గరగా వచ్చి అడిగాడు, "మేడం! ఇంకేమన్నా తెమ్మంటారా?" అని.
యామిని ఉలికిపడింది. ఆలోచనల్లోంచి బయటపడ తలెత్తి, "ఏమిటీ"అన్నట్లు చూసింది అతని వైపు. మళ్ళీ అదే మాటను తిరిగి అన్నాడు అటెండర్.
"చాలు. నాకు ఇంకేం వద్దు" అంది యామిని.
"ఐస్క్రీం తెమ్మననా?" అడిగాడు సుదర్శనం.
"నాకు వద్దు!" ముక్తసరిగాజవాబు చెప్పింది యామిని.
"ఇక చాలు, బిల్ పట్రా" అన్నాడు సుదర్శనం. అటెండర్ వెళ్ళిపోయాడు.
యామిని మళ్ళీ తన ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది.
"మనిషి బ్రతుకులో పెళ్ళి చాలా పెద్ద మలుపు! మలుపు తిరిగాకగాని మనకు తెలియదు కదా ఆవల ఏముందన్నది! అలాగే పెళ్ళయ్యాకగాని, మనం అవతలి వ్యక్తినిగురించి పూర్తిగా తెలుసుకోడం అన్నది కుదరదు! చూస్తూంటే సుదర్శనం చాలా వరకూ మంచివాడుగానే కనిపిస్తున్నాడు! ఇతన్ని నమ్మొచ్చునని తోస్తోంది. రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న వరకట్నాలతో, ఆడపిల్లలను కన్నవాళ్ళు హడలిపోతున్న ఈ రోజులలో, ఇతడిలా ఏపాటి కట్నకానుకలూ అడగకుండా ఇంత ఉదారంగా నన్ను పెళ్ళి చేసుకుంటానంటున్నాడు! అది చూస్తే తెలియడంలేదా, అతడు ఎంత మంచివాడో! అంతేకాదు, ఏ తోటైతే అమ్మ నాకు అరణంగా ఇవ్వాలనుకుందో ఆ తోట, తనను పెళ్ళాడితే వెంటనే నా పేర రాసేస్తానని కూడా చెపుతున్నాడు. ఐతే ఇతనిని పెళ్ళాడితే అమ్మ కన్న కలనికూడా నిజం చెయ్యొచ్చు నన్నమాట! అలా జరిగితే నాన్న బెంగ కూడా తీరుతుంది. నాన్నకి మిగిలి ఉన్న ఒక్క ఇల్లూ తాకట్టుపెట్టి, ఇతని అప్పు తీర్చడం కంటే, ఇతన్ని పెళ్ళాడి ఆ అప్పును చక్కగా రద్దు చేయించడమే మంచిది. అలాగైతే, కోరిక తీరడంవల్ల సుదర్శనం, అతనితో పాటుగా, మిగిలినవాళ్ళు అందరూ సుఖంగా ఉంటారు. అందరి సుఖం లోనే నా సుఖమూ ఉంది - అనుకుంటే సరిపోదా! ఇదేదో చాలా బాగుందనే అనిపిస్తోంది నాకు" అనుకుంది.
పరిసరాలను మర్చిపోయి, తన ఆలోచనలలో తాను ఓలలాడుతూ, పూర్తిగా పరధ్యాన్నంగా ఉండిపోయిన యామినివైపు సంతోషంగా చూస్తూ కూర్చున్న సుదర్శనం తనలో అనుకున్నాడు....
" ఆలోచించు, ఆలోచించు! బాగా ఆలోచించు. ఇక్కడనుండి వెళ్ళకముందే తాడో, పేడో తేలిపోడం నాకూ మంచిదే. నేను పెట్టిన ఆశల యెరకి, పిట్ట పడిందనే నాకు అనిపిస్తోంది. పెట్టిన యెర మొత్తం తినేసి, వలతోపాటుగా పిట్టలు ఎగిరి వెళ్ళిపోడానికి ఇదేమైనా పంచతంత్రం కథా ఏమిటి?
ఇంక ఈ పిల్లకు చావైనా, బ్రతుకైనా నాతోనే! ఎంతో ఇదిగా పిల్ల నిమ్మని అడిగితే, ముసిలాడు నన్ను ఎన్నితిట్లు తిట్టాడు! "పురోడాశం తెచ్చి, కుక్కకి పెడతారా ఎవరైనా?" - అంటూ నన్నే ఎదురు ప్రశ్న వేస్తాడా? నన్ను కుక్కతో పోలుస్తాడా? ఈ దెబ్బతో నా సత్తా ఏమిటో తెలిసి వస్తుంది. దిమ్మతిరిగి, ధమ్మున నేలమీద పడాల్సిందే! సుదర్సానమా మజాకానా! నాకు ఈ వాక్చాతుర్యం వారసత్వంగా వచ్చిన విద్య. కుర్రది, దీన్ని పడెయ్యడం ఎంతసేపు" అనుకున్నాడు సుదర్శనం, యామిని ముఖాన్ని చూసి ఆమె ఆలోచనలను పసిగట్టే ప్రయత్నం చేస్తూ.
" నా ఉద్యోగం ఉంటుందన్న నమ్మకం పోబట్టిగాని, లేకపోతే చక్కగా ఈ సరికి ఆఫీసుకివెళ్ళి నా పనేదో నేను చేసుకుంటూ ఉండే దాన్ని. నా జీతం మీద కొంత డబ్బు అడ్వాన్సుగా తీసుకుని, ఇతని బాకీ కూడా తీర్చి, తేలికపడి "హాపీ ఎవ్వర్ ఆఫ్టర్" అన్నట్లు హాయిగా బ్రతికేదాన్ని. నేనసలు అలా తెగింపు చేసి, చందనపు చెక్కలకోసం అడవులకు వెళ్ళకుండా ఉంటే ఎంత బాగుండేదో పరిస్థితి! ఇప్పుడు, నాకు ఉద్యోగం ఉందో లేక ఊడిందో తెలియదు. ఒక వేళ ఉన్నా, నేను వెళ్ళి, కావాలని అడిగితే ఒక పదివేలు గురుడు నాకు ముందుగా ఇవ్వడానికి ఒప్పుకుంటాడో, లేదో అంతకన్నా తెలియదు. ఆ మహానుభావుడు ఇప్పుడు ఏ మూడ్ లో ఉన్నాడో, ఏమో! ఈ పరిస్థితిలో ఉద్యోగాన్ని నమ్మి ఈ ప్రపోజల్ని తోసిరాజనడం, ఎండమావుల్ని నమ్మి, చేతిలోని చెంబులో ఉన్న కాసిని నీళ్ళనూ పారపోసుకోడమే ఔతుందేమో! వన్ బర్డు ఇన్ ది హాండ్ ఈజ్ బెటర్ దేన్ టూ ఇన్ ది బుష్ - అనుకోడం మంచిపనేమో ! ఇతనికి వయసు ఎక్కువ కావచ్చు, కాని అదొక్కటే కదా మైనస్ పాయింటు! అయినా అది కేవలం నాకు సంబంధించిన విషయం. ఐనా, చూపులకు మరీ పెద్దవా డనిపించడంలేదు. ఎలాగైనా ఆడవాళ్ళకే మగవాళ్ళ కంటె తొందరగా వస్తుంది ముదిమి! పదేళ్ళ ఎడమున్నా నాకేం అభ్యంతరం లేదు. అం దరికీ మేలు జరగాలంటే నేను ఆపాటి సద్దుకోడం తప్పదు మరి! ఒకవేళ అవసరమైతే వకుళకు పెళ్ళి కూడా మనమే చేద్దాం - అంటున్నాడు. అంతకంటే ఇంకేం కావాలిట! వయసు విషయం పట్టించుకోకుండా, నే నితన్ని పెళ్ళాడితే, సమర్ధుడు కనక, మా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఇతడు తప్పక సహాయం చేస్తాడు. నాన్నకిక అల్లుడైనా, కొడుకైనా తానే ఔతాడు! నేను చెపితే నాన్న కాదనడు, ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పిస్తా! "
యామిని ఆలోచనలు ఎంతకీ తెగక పోడం చూసి , మరో కొంచెం ఆశ పెట్టాలనుకున్నాడు సుదర్శనం. " ఈ ఒక్క సారికీ నువ్వ "వూం" అను చాలు యామినీ! ఆ తరవాత నేను నా జీవిత కాలం నీ మాటకు " వూం" తప్ప మరో జవాబు చెప్పను, ప్రామిస్ " అన్నాడు ప్రాధేయ పడుతున్నట్లుగా..
యామిని అవాక్కై ఉండిపోయిం ది. ఏమీ మాటాడకపోడంతో, తన మాట ఆమె విందో, లేదో అతనికి ఎంత మాత్రం తెలియలేదు, ఆమె తనకి ఏ జవాబూ చెప్పకపోడంతో, ఇంకా ఆమె తన ఆలోచనా స్రవంతిలో పీకవరకూ మునిగిపోయే ఉందని అర్థం చేసుకున్నాడు సుదర్శనం .
హఠాత్తుగా యామినికి మరో అద్భుతమైన బోనస్ పోయింట్ ఒకటి తలపుకి వచ్చింది. వెంటనే ఆమె ముఖం సంతోషంతో వికసించింది.
"ఈ సుదర్శనాన్ని పెళ్ళాడితే నేను అత్తారింటికని వేరే ఊరు వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఉన్న ఊరిలోనే ఉంటూ, ప్రతిరోజూ వెళ్లి, నాన్నను చూసి రావచ్చు. రెండిళ్ళకూ మధ్య కిలోమీటర్ దూరం కూడా లేదు. పైగా, ప్రతిదానికీ "ఇదేమిటి?", "అదేమిటి?" అని నన్ను నిలదీసి అడిగేందుకు అత్తమామలూ లేరు. ఇంచక్కా ఊళ్ళోనే ఉంటూ, ప్రతిరోజూ పుట్టింటికి వెళ్లి, అక్కడ అందర్నీ పలకరించి, వకుళతో కబుర్లు చెప్పి దీపాలు పెట్టకముందే ఇంటికి తిరిగిరావచ్చు! బాగుందికదూ...
నిజంగా ఈ ప్రపోజల్ నాకు భగవంతుడిచ్చిన అమూల్యవరం. ఇంక ఆఫీసుకి వెళ్ళనక్కరలేదు. ఇప్పుడే ఇంటికి తిరిగి వెళ్ళి, నాన్నతో ఈ సంగతి చెప్పి ఒప్పించి, త్వరలోనే పెళ్ళికి ముహూర్తం పెట్టించమని అడగాలి " అనుకుంది యామిని ఉబలాటంగా.
ఆమె ముఖంలో విరిసిన ప్రసన్నతను చూసి, తన రొట్టె విరిగి నేతిలో పడిందని గ్రహించాడు సుదర్శనం. కాని పైకి బింకంగా, " నీ ఆలోచనలు ఇంకా ఒక కొలిక్కి రాలేదా ఏమిటి! నీకెంత టైం కావాలంటే అంత టైం తీసుకో, మరేం ఫరవాలేదు. నేనేం తొదరపడటంలేదు" అన్నాడు.
"నాకింక ఏ టైమూ అక్కరలేదు. నేనొక నిర్ణయానికి వచ్చేశా. మనమింక ఇంటికి వెళ్లి, మా నాన్నకు చెప్పి, ఆయన ఆశీస్సులతో పెళ్ళికి ముహూర్తం పెట్టించుకుందాము" అంది యామిని.
గతుక్కుమన్నాడు సుదర్శనం. ఈ విషయాన్ని విశ్వనాధం దాకా తీసుకు వెడితే, ఉన్నబడంగా అతని మొహం తగలేసి, తల వాచిపోయీలా ముక్కచివాట్లు పెట్టి దూరంగా పోయీవరకూ
తరిమేస్తాడన్నది, యామినికి తెలియదుగాని, సుదర్శనానికి బాగా తెలుసు. అందుకే ఇక్కడిక్కడే ఎలాగో యామినిని బురిడీ కొట్టించి, పని సానుకూలం చేసుకోడానికి ప్రయత్నించాలి - అనుకున్నాడు.
ఈ కర్మ భూమిలో లంచానికి జరగని పనేమీ లేదు కదా!. యామినిని తన మాటల గారడీతో ఎలాగోవోలా ఒప్పించగల్గితే, ఇప్పటికిప్పుడే, ఇక్కడే రిజిష్ట్రార్ ఆఫీసులో తమ పెళ్ళి జరిగిపోయీలా ఏర్పాటు
చెయ్యాలన్నది సుదర్శనం ప్లాను! "ఒక్కసారి కనక యామినికి, నా భార్య - అన్న ముద్ర పడిపోయిందంటే, ఆ తరవాత విశ్వనాధమైనా, ఆయన తలలోని జేజమ్మైనా సరే, మరి నోరెత్తకుండా, తల వంచుకుని చచ్చినట్లు
పడివుండవలసిందే! నా ప్రయత్నం నేను చేస్తా, ఏం జరుగుతుందో చూద్దాం" అనుకున్నాడు సుదర్శనం.
యామిని మాటల్లో సుదర్శనానికి బాగా అర్థమయ్యింది, ఆమెకు తననుగూర్చి ఏమాత్రం తెలియదన్న విషయం. విశ్వనాధంగారు, తన సంగతి కూతురికేమీ వివరంగా చెప్పలేదన్నమాట - అనుకున్నాడు. ఇక ఈ అమాయకురాలు తన దారికి రావడానికి ఎక్కువసేపు పట్టదన్నది కూడా అతనికి అర్థమై పోయింది.
"యామినీ! నువ్వేమనుకుంటున్నావోగాని, మీ నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం ఉంది. ఆయన మన పెళ్ళికి తప్పకుండా ఒప్పుకుంటారు. నాదే తెలివి తక్కువ! నా ప్రేమ విషయం నేను ఇదివరకే ఆయన చెవిని వేసి ఉండి ఉంటే, మన పెళ్ళి ఎప్పుడో జరిగి ఉండేది. సర్లే! ప్రస్తుతానికి వద్దాం ఇంక ......
ఒక పెళ్లి సాంప్రదాయ బద్ధంగా జరగాలీ - అంటే అర్ధ బలమే కాదు, అంగబలం కూడా ఉండాలి. ఆడపిల్ల పెళ్ళంటే మాటలు కాదు! ఎంతో మంది కూడి పనిచేసినా కూడా ఎంతకీ తెమలని పని ఉంటుంది. శుభలేఖలు అచ్చు వేయించాలి; పెళ్ళిమండపం, మేళాలూ తాళాలు, ఊరేగింపు...... ఇలా ఎన్నో హంగులు ఉండాలి. నేనైతే కట్నకానుకలు వద్దన్నా ననుకో......, కాని అవేనా ఏమిటి! ఆపైన ఇంకా ఎన్ని లాంచనాలు ఉంటాయో! విందు భోజనాలనీ, సారనీ, చీరనీ; ఇచ్సిపుచ్సుకోడాలనీ, బహుమతులనీ - ఇలా ఎన్నో తంతులూ, మరెన్నో ఖర్చులూ ఉంటాయి. ఎంతమందో వచ్చి తిని పోతారు. ఇదంతా సవ్యంగా జరగాలంటే, ఎంతమంది మనుష్యులు పడి పనిచేస్తే అయ్యేను! మీ నాన్నగారు ,ఇప్పుడున్న అనారోగ్య స్థితిలో, ఈ పనులన్నీ అయనవల్ల నౌతాయంటావా?
అంతేకాదు, మీ రామేశం అంకుల్ కి కర్మ చెయ్యడం వల్ల మీ నాన్నగారు ఈ ఏడాదంతా ఏ శుభకార్యం చెయ్యడానికీ పనికిరారు. ఆయనకు ఏటి సూతకం ఉంటుంది. ఇలా ఎన్నెన్నో ఆటంకాలున్నాయి. ఇక ముహూర్తాల విషయం చెప్పాలంటే మరీ ఘోరం, ఏమనుకుంటున్నావో.....! " అంటూ కాసేపు ఆగాడు సుదర్శనం.
విశాలమైన తన కళ్ళు మరింత విశాలంగా చేసుకుని, అతనివైపు ఆశ్చర్యంగా చూసింది యామిని. అతడు తమ శ్రేయస్సు గురుంచి అంతగా ఆలోచిస్తున్నాడంటే, అతన్ని పూర్తిగా నమ్మొచ్చు - అనుకుంది.
అదే అదునుగా, మంచి ముహూర్తం దొరకడం ఎంత కష్టమో వివరించి చెప్పసాగాడు సుదర్శనం.......
" ఈ ముహూర్తాలన్నవి ఉన్నాయి చూశావూ ... ఇవి ఒకపట్టాన కుదిరేవి కావు! మూఢాలు, శూన్యమాసాలూ, అధిక మాసాలూ, కత్తెరలు - ఇలా ఏవేవో పేర్లతో ఉంటాయ అడ్డంకులెన్నో! అదికాక, నీ జాతకం, నా జాతకం చూసి; తిధివారనక్షత్రాలు లెక్కించి, గ్రహ స్థితిని గుణించి - అవి సరిగా కుదిరిన రోజున వర్జం, దుర్ముహూర్తం; రాహుకాలం, యమగండం వగైరాలేమీ లేని సమయాన్ని చూసిమరీ పెళ్ళి ముహూర్తం నిర్ణయిస్తారు. ఇన్ని ఒక్కసారిగా కలిసిరావాలంటే చాలా రోజులు గడిస్తేగాని కుదరదు. అంటే ముహూర్తం కుదరాలంటే, ఎలా లేదన్నా కనీసం మూడునాలుగు నెలలైనా పట్టొచ్చు, లేదా - ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు! ఒక ఆడ, మగ పవిత్రబంధంతో ఒకటి కావాలంటే ఇంత గందరగోళం అవసరమా, చెప్పు?"
"అన్నింటికంటే ముందు మా నాన్న ఒప్పుకోవాలి కదా ......!"
" మీ నాన్న ఎందుకు ఒప్పుకోరు! తప్పకుండా ఒప్పుకుంటారు. ఈ రోజుల్లో కట్నం, కానుకా అడగని నాలాంటి అల్లుడు దొరికితే ఎవరు కాదంటారు చెప్పు! అసలు ఈ సాంప్రదాయికపుపెళ్లి గొడవంతా వదిలేసి, చక్కగా మనం రిజిష్టర్ పెళ్ళి చేసుకుంటే, ఎవరికీ ఇబ్బందీ లేకుండా ఎంతో బాగుంటుంది కదా! అదీ పెళ్ళేగా! అలాచెయ్యడం వల్ల, మనం మీ నాన్నగారికి ఎంతో శ్రమ తప్పించినట్లు ఔతుంది. ఆలోచించు, నీకే అర్థమౌతుంది. అంతా నీ ఇష్టం, నువ్వన్నదే ఖరారు చేస్తా....
నిన్ను పెళ్ళిచేసుకున్నాకే కదా నీ బాధ్యతలు నా బాధ్యతలయ్యేది, విను! మీ నాన్నగారికి జబ్బు చెయ్యకముందు మన పెళ్ళి జరిగి ఉంటే, ఆయనకి వైద్యం చేయించడం నా బాధ్యత అయ్యేది. పిల్లనిచ్చిన మామగారు తండ్రితో సమానం! కాని, అప్పటి కింకా మన పెళ్ళి కాలేదు కనకే, ఆయన వైద్యానికని మీకు నే నిచ్చిన డబ్బుకి "అప్పు" అన్న పేరు వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బు తీర్చడమ్ నీ బాధ్యతయ్యింది. అదే మనపెళ్ళి అప్పటికే జరిగిపోయి ఉంటే, అలా నీ డబ్బు, నా డబ్బు - అన్న భేదం ఉండేది కాదు కదా! ఇప్పుడైనా మనకు శీఘ్రం పెళ్ళి జరిగిపోవాలంటే, రిజిష్టర్ మేరేజ్ ఒక్కటే సరైన దగ్గరదారి! ఆ ఆఫీసర్ నాకు బాగా తెలిసిన వాడే! కావాలంటే ఈవేళే - ఇప్పుడే మన పెళ్ళి జరిగిపోయీలా ఏర్పాటు చెయ్యగలను."
ఈ మధ్య వచ్చిన రకరకాల ఒడిదుడుకుల వల్ల యామిని మానసికంగా చాలా అలిసిపోయి ఉండడం వల్ల, ఆమె మేధ మందకొడిగా తయారయ్యి గట్టిగా అలోచించాలంటే నిరాకరిస్తోంది. కొద్దిసేపటినుండి ఏకబిగిని సుదర్శనం చెపుతున్న మాటలు విన్నాక, ఆమె మనస్థితి మరింత గజిబిజిగా, అయోమయంగా తయారయ్యింది. చూస్తూండగా ఆమె సుదర్శనం మాయలో పడి, అతని మాటల్ని నిజాలనుకుని మనసారా నమ్మేసింది, పాపం!
అనారోగ్యం నుండి ఇంకా పూర్తిగా కోలుకోని తండ్రి , బ్యాంకులో డబ్బు ఉండీ కూడా చేతిలో కానిడబ్బు లేక ఇబ్బంది పడుతున్న రామేశం అంకుల్ కుటుంబం, ఇక ఏ ఇబ్బందీ పడకుండా సుఖంగా ఉండాలంటే, తను ఈ పాటి త్యాగం చెయ్యక తప్పదు! అతనికి భార్యగా తను కావాలి, తనకు దక్షతగా అతని అండ కావాలి! ఈ ప్రపంచమంతా, ఏది కావాలన్నా, కేవలం ఇచ్చి పుచ్చుకోవడమన్న పధ్ధతిని ఆధారంగా చేసుకునే నడుస్తోంది . తనూ ఇప్పుడు ఆ పద్ధతినే పాటించాలనుకుంటోంది. ఐతేనేం, తన ధర్మాన్ని తా నెప్పుడూ మర్చిపోదు. ఆతను బ్రతికి ఉన్నన్నినాళ్ళూ తా నతనికి విధేయురాలిగా ఉంటుంది. ఇక అతను కూడా ఆడినమాట తప్పకుండా మమ్మల్ని ఆడుకుంటాడనే ఆశిద్దాం. రిజిష్టర్ పెళ్ళి మాత్రం పెళ్ళికాదా ఏమిటి! దానివల్ల తన తండ్రి బుజాలమీదనుండి పేద్ద భారం దిగిపోతుంది కదా - అనుకుంది యామిని. కాని దానికి ఆమె మనసు ఒప్పుకోలేదు .
మళ్ళీ సందిగ్ధంగా, "మా నాన్న ఏమంటాడో, ముందుగా మనం ఆయనకు చెప్పొద్దా మరి " అంది సుదర్శనంతో నసికినట్లుగా..
వెంటనే సద్దిచెప్పాడు సుదర్శనం, " మనం రిజిష్టర్ పెళ్ళి చేసుకుని, మెడలో పూలదండలతో వెళ్ళి ఆయన కాళ్ళమీద పడిపోయి, క్షమించమని వేడుకుందాము. మొదట్లో కొంచెం కోప్పడినా, చివరకు ఆయన, మనం తనకు బ్రహ్మాండమైన శ్రమ తప్పించినందుకు గాను బాగా సంతోషిస్తారు, మనల్ని మనసా క్షమించి ఆశీర్వదిస్తారు. పద! కాసేపట్లో నువ్వే చూద్దువుగాని .... !"
" నిజంగా అంతేనంటారా! ఐతే సరే. "
సుదర్శనం తన శ్రేయోభిలాషని మనసారా నమ్మింది యామిని. అతనిపైన అంతులేని విశ్వాసం పెంచుకున్న యామిని, పెళ్ళికి సిద్ధమై, కసాయి వెంట కబేలాకు నడిచి వెళ్ళే మేకపిల్లలా, అతని వెంట రిజిష్ట్రార్ ఆఫీసుకి బయలుదేరి వెళ్ళింది.
* * *
(సశేషం)