ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
(దత్తపది) "రెండు, వేల, పదు, నాఱు(నారు)" అన్న పదాలు వాడుతూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ స్వేచ్ఛా ఛందస్సులో పద్యాన్ని వ్రాయాలి.
గతమాసం ప్రశ్న:
(సమస్య) ఒకటి ఒకటి గూడి ఒకటె యగును
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
సూర్యకుమారి వారణాసి, మచిలీపట్టణం
(1)
జబ్బు చేసినపుడు డబ్బు కావలెనంచు
కూడు మాని యొకడు కూడబెట్ట
పెద్ద మూట యొకటి పేరు కొనియె నంత
ఒకటి ఒకటి గూడి యొకటి యగును
(2)
కమల తనకు తెలివి కలదంచు చూపెను
ఒకటి క్రింద గీత నొకటి గీసి
కలిపి గీత చెప్ప గలిగె నొక్కటి చేసి
ఒకటి ఒకటి గూడి యొకటి యగును
రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ
ఇతర సంఖ్య లందు మితిమీరి పెరుగుచు
గుణిత మందు హెచ్చు గొప్ప గాను
ఒకటి ఒకటి గూడి ఒకటె యగునువింత
కలిపి జూచి నంత పలుకు రెండు
జంధ్యాల కుసుమ కుమారి, హైదరాబాదు.
తులసి దళములెన్నొ తుష్టుగా చేకొని
తిరుమలేశు దలచి తిన్న గాను
చిక్క నైన మాల చెన్నొంద కూర్చంగ
ఒకటి ఒకటి గూడి ఒకటె యగును
చావలి శివప్రసాద్,సిడ్నీ
టపటపమని చిటపటచినుకులు మొదలై
వడివడిగ పడి జడివానగ కురి
యంగ వాటమెరిగి యాపై జలధి జేర
ఒకటి యొకటి గూడి యొకటె యగును
సుమలత మాజేటి, క్యూపర్టీనో
సత్వ మెరిగి గాంచ యద్వైత కురువింద
మంద నేక మేక మై పరంగు
రీతి, బింబ మొకటి ప్రతి బింబ మొక్కటి
ఒకటి ఒకటి గూడి ఒకటె యగును
గండికోటవిశ్వనాధం, హైదరాబాద్
వెర్రి కుర్ర డొకడు బర్రె పాలను బోసి
లెక్క కిటుకు తెలిపె ధిక్కరించి
పాలు నీరు కలిపి పాలుగా నమ్ముదు
ఒకటి ఒకటి గూడి ఒకటె యగును.
ఇంద్రగంటి సతీష్ కుమార్, చెన్నై
(1)
పరమమొకటె యగును పరమార్థమెఱుగంగ,
జనుల నుధ్ధరింప జతలు పుట్టె,
శివుడు శక్తి జతయు, శివతత్వమెఱుగంగ
ఒకటి ఒకటి గూడి ఒకటె యగును!
(2)
తగ్గె మార్కులనుచు తల్లి దండ్రులడుగ,
తగిన రీతి జెప్పె తనయ గురువు!
పగటి కలలు గనుచు పాఠములు వినిన,
ఒకటి ఒకటి గూడి ఒకటె యగును!
పుల్లెల శ్యామసుందర్,సాన్ హోసే, కాలిఫోర్నియా
లక్ష లంచమడగ లక్ష రూప్యములివ్వ
ఇంకొలక్షఁ గోరుటేమిటనిన:
"బల్లక్రింద లెక్క బడిలోన నేర్పరోయ్,
ఒకటి ఒకటి గూడి ఒకటె యగును"