( భాగవతం మూడవ భాగం)
“ధాతవు భారతశ్రుతిత్విధాతవు వేదపదార్థజాత వి
జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్త్వ ని
ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే
కాతరు కైవడి\న్ వగవఁ గారణమేమి పరాశరాత్మజా?”
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, వేదవ్యాసుడు ( “ వేదాన్ వి వ్యాస ఇతి వేదవ్యాసః” ) అని పేరుపొంది, పదునెనిమిది పురాణాలు, అన్నే ఉపపురాణాలు, పదునెనిమిది పర్వాల మహాభారత రచన చేసి, ఋగ్వేదాన్ని-పైలుడికి, సామవేదాన్ని - జైమినికి, యజుర్వేదాన్ని - వైశంపాయనుడికి, అధర్వణవేదాన్ని - సుమంతుడనే వానికి పంచి, పురాణాలను రోమహర్షునికిచ్చి, తన సాహిత్య సంపదని లోకంలో ధర్మాన్ని నిలపడానికి ప్రచారం గావించమని చెప్పిన విష్ణు సముడు వ్యాసుడు. ఇన్ని చేసికూడ మనసులో ఎదో వ్యాకులత కలిగి చింతాక్రాంతుడై ఉన్న వ్యాసుని వద్దకు నారదుడు వచ్చి “ ఎందులకు చింతాక్రాంతుడవై ఉన్నావు.” అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నే భాగవత రచనకి మూలం. అదే పై పద్యం. నారదుడు ఎంత గొప్పగా ప్రశ్నించాడో చూడండి. ---- “ ఓ వ్యాస మహర్షి! నీవు వేదాలను విభజించి బ్రహ్మ సమానుడవైనావు, పంచమ వేదమనే మహాభారత రచన చేసావు, కామ, క్రోధాదు లనే అరిషడ్వర్గాలను ( కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్చార్యలు అనే ఆరు దుర్గుణాలు మనలో ఉన్న శత్రువులు. అరి=అంటే శత్రువు. షట్=ఆరు. అందుకే వీటిని ‘అరిషడ్వర్గం’ అంటారు. వాటిని జయిస్తే మనిషి ‘మహామనీషి’ అవుతాడు.) జయించేవు, బ్రహ్మతత్వము తెలిసిన పరమయోగ నిష్టా గరిష్టుడవు, ఇలా సామాన్యునిలా ఎందుకు? దిగులుతో ఉన్నావు.” అని అన్న నారదునితో వ్యాసుడు ఇలా అంటాడు.--
“నీ కెఱుఁగరాని ధర్మము
లోకములనులేదు బహువిలోకివి నీవున్
నాకొఱఁత యెట్టి దంతయు
నాకున్ వివరింపుమయ్య నారద! కరుణన్.”
“నీకు తెలియని ధర్మం లేదు, అన్నిలోకాలు తిరుగుతూ, అన్ని విషయాలు తెలుసుకొనే నీకు నావిచారానికి కారణం ఏమిటోనీకు తెలియదా!? అది పోయే మార్గం నీవే చెప్పాలి” అని. అపుడు నారదుడు “ అంత గొప్ప భారత రచన చేసావు కాని అందులో కొంచం కూడా విష్ణు కథలను విపులంగా చెప్పలేదు అందుకే నీకు మానసిక శాంతిలభించటం లేదు. కావున భగవంతుని గూర్చి విపులంగా వివరిస్తూ రచన చేయి, తప్పక నీకు శాంతి లభిస్తుంది ”అని ఉపదేశిస్తాడు” అదో అలా ‘భాగవత రచనకు’ శ్రీకారం చుడతాడు వ్యాసుడు. మన అదృష్టం వల్ల పోతన దానిని తెనిగించి మనకందించాడు.
“భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు
శూలికైనఁ దమ్మిచూలికైన
విబుధ జనులవలన విన్నంత కన్నంత
తెలియ వచ్చినంత తేటపఱుతు.”
“భాగవతాన్ని వివరించడం శివుడికైన, బ్రహ్మకైనా సాధ్యంకాదు, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి! పెద్దల నుండి విన్నది, కన్నది, నాకు తెలిసినది మీకు విన్నవిస్తాను” అని వినయంగా విన్నవించి రచన ప్రారంభిస్తాడు పోతన.
అంత గొప్ప భాగవతాన్ని సింధువులో (సముద్రంలో) బిందువంత అంటే కొద్దిగా మనం తెలుసుకొని తరిద్దాం. భగవంతుడు ఎప్పుడెప్పుడు అవతరిస్తాడు అన్నదానికి ఈ క్రింది శ్లోకం ప్రమాణం ---
“ పరిత్రాణాయ సాధూనాం / వినాశాయచ దుష్కృతాం/
ధర్మ సంస్దాప నార్థాయ / సంభవామి యుగేయుగే //
పై శ్లోకానికి భాగవతంలో ఈ క్రింది పద్యం చక్కని వివరణ –
“భగవంతుడగు విష్ణువు
జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్
దగ నవ్వేళ దయతో
యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్.”
అని వివరిస్తాడు పోతన. “ చిలుక కొట్టిన పండు ఎంత తీయగా ఉంటుందో శుఖ మహర్షి నోటినుండి వెలువడిన భాగవత రసాస్వాదన అంత మధురంగా ఉంటుందిట! అని చెప్పే ఈ పద్యం చూడండి----
“వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖసుధాద్రవమున మొనసియున్న
భాగవత పురాణ ఫలరసాస్వాదన
పదవిఁ గనుఁడు రసిక భావవిదులు.”
మధురమైన ఫలం ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది కదా! అట్లే భాగవతంలో ఏ పద్యం చదివినా అద్భుతంగానే ఉంటుంది. కొన్నింటిని మాత్రమే ఇక్కడ రుచి చూసి, మిగతావి భాగవతంలో పూర్తిగా చదివి ఆనందిద్దాం.
“ఘనుఁడా భూసురుఁ డేఁగెనో నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో
విని కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో విచ్చేయునో యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలపఁడో యార్యా మహాదేవియు\న్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో నా భాగ్య మె ట్లున్నదో”
పై పద్యం ‘రుక్మిణీ కళ్యాణ ఘట్టం’ లోనిది. శ్రీకృష్ణుని వచ్చి తనని చేపట్టమని ‘అగ్నిద్యోతనుడు’ అనే భూసురుని ద్వారా శ్రీకృష్ణునికి సందేశం పంపుతుంది రుక్మిణి. రుక్మిణి సోదరుడైన ‘ రుక్మి’ శిశుపాలునికి రుక్మిణినిచ్చి వివాహం చేయాలని సంకల్పించి, పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అపుడు రుక్మిణి మనసులో కలిగిన భావ సంచలనానికి దర్పణమే (అద్దమే) ఈ పద్యం.
“ గొప్పవాడైన ఆ భూసురుడు ( అగ్ని ద్యోతనుడు) తన సందేశం తీసుకొని కృష్ణుని వద్దకు వెళ్ళేడో, లేక అలసిపోయి మార్గమధ్యంలోనే ఉండిపోయాడేమో? లేక నాసందేశం విని కృష్ణుడు తప్పుగా అనుకొన్నాడేమో? అసలు వస్తాడో? రాడో? భగవంతుడు నాకు అనుకూలంగా ఉన్నాడో? లేడో? ఆపార్వాతీ దేవి ‘నన్ను రక్షించాలి’ అని అనుకుందో? లేదో? నా అదృష్టం ఎలా ఉందో ? ఏమో?” అని లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణీదేవి సామాన్య బాల వలే బేల గా చింతించిన విధానం అద్భుతంగా వర్ణించ బడింది. ఇంకో చక్కని పద్యం-
“నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశుల\న్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిసేయుమమ్మ! ని\న్
నమ్మిన వారి కెన్నఁటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”
అగ్ని ద్యోతనుడు వచ్చి “శ్రీకృష్ణుడు వచ్చి, నిన్ను తప్పక గొనిపోయి వివాహం చేసుకొంటాడు” అని చెపుతాడు. అప్పుడు కుదుట పడ్డ మనస్సుతో వివాహ సమయంలో చేసే గౌరీ పూజకై పార్వతీ దేవి ఆలయానికి వెళ్లి, ఆతల్లిని ప్రార్థించుటే పై పద్యం.( “ రుక్మిణీ కళ్యాణ ఘట్టం చదివితే కన్నె పిల్లలకు తప్పక వివాహం జరుగుతుంది.” అని పెద్దలు చెపుతారు. అట్లే “వివాహ సమయంలో పై పద్యం చదివి ఆ తల్లిని ప్రార్థిస్తే మంచి జరుగుతుంది” అని కూడా పెద్దలు అంటారు. పెద్దల మాట మనకి శిరోధార్యం కదా!) ఆదిదంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులను ఎలా వేడుకొంటున్నదో చూడండి---
“ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులనే నా మనస్సులో నమ్ముకోన్నాను. పురాణ దంపతులైన మిమ్ము మనసులో ధ్యానిస్తున్నాను. దయాంబు రాశివి పెద్దమ్మవి, ( ఈ పెద్దమ్మ అనే పదం పోతనకి చాల ఇష్టం. ప్రారంభంలో ఇష్ట దేవతా ప్రార్థనలో కూడా “ అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ” యని స్తుతిస్తాడు.) హరిని పతిగా చేయుమమ్మ, నిన్ను మనసులో నమ్ముకొన్న వారికి కష్టాలు రావుకదా! ఓ ఈశ్వరీ!” ఇలా ‘లహరుల’ వాలే అంటే సముద్ర కేరటాలవలె ఎన్ని పద్యాలనైనా భాగవతం నుంచి ఉదహరించ వచ్చు. ముందుగా చెప్పనట్లు సముద్రమంత సాహిత్యం నుండి నీటిబిందువంత విషయాన్ని మాత్రమే ఈ “కావ్యలహరి” శీర్షిక ద్వారా పరిచయం చేయదలచాను. కనుక భాగవత పరిచయాన్ని “మంగళప్రదమైన అమ్మవారి ప్రార్థనా పద్యంతో ముగిస్తున్నాను. శుభం.
( వచ్చేనెల ఇంకో ఘట్టం )
( సశేషం)