కొండలు పగలేసినం.. బండలు పగలేసినం..
మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం
సరిగ్గా 60 ఏళ్ళ క్రితం నాగార్జునసాగర్ ప్రాజెక్టు భారత ప్రధాని చేతులు మీదుగా శంకుస్థాపన జరుపుకున్నది. దాదాపు 22 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తికి ధాన్యాగారం ఈ సాగరం. ఏటా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నది. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా సమున్నతంగా జాతికి సేవలను అందిస్తూంది. శ్రమజీవుల సంఘటిత శక్తికి, దేశ సమైక్యతకు, భారతీయ ఇంజనీర్ల ప్రతిభకు, సామూహిక స్ఫూర్తికి నిలువెత్తు రాతికట్టడం నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ప్రపంచంలోనే అత్యధిక మానవ శ్రమను వినియోగించి నిర్మించిన కట్టడమిది. ప్రాజెక్టు నిర్మాణంలో వివిద రాష్ట్రాలకు చెందిన శ్రామికులు కుల, మత, ప్రాంతీయ, బేధభావాలను మరచి, చేతులు కలిపి. భుజం భుజం జోడించి, కొండలు తొలచి, బండలు మలచి, శ్రమైక జీవన సౌదర్యానికి సమానమన్నది లేనేలేదంటు ప్రపంచానికి చాటింది. ఈ మానవ నిర్మిత మహాసాగరం. నవీన కట్టడాలకు ప్రతీక. నాగార్జునసాగర ప్రాజెక్టు జనం భాషలో నందికొండ ప్రాజెక్టు. ఇట్టి మహత్తరమైన ప్రాజెక్టుకు 2015 డిసెంబర్ 10 నాటికి 60 ఏళ్ళు నిండాయి. ఇది 6 దశాబ్దాల సంరంభ సంవత్సరం. పసిడి పంటల సిరులతో, గలగల పరవళ్ళతో ప్రవహించే కృష్ణమ్మ వడిలో జరగనున్న షష్ఠిపూర్తి వైభవం. ఈ బహుళార్థసార్థక ప్రాజెక్టు సాగునీరు, త్రాగునీరు, జల విద్యుత్ కోసమే కాదు, మానవ స్వేదానికి ప్రతీకగా, సామాజిక వికాశానికి స్ఫూర్తిగా మానవ సాంకేతిక నాగరికత పురోగతికి సాక్ష్యంగా సహజ వనరుల సంపదకు చిహ్నంగా, వైజ్ఞానికంగా రూపుదిద్దుకున్న ఈ ఆధునిక దేవాలయ నిర్మాణానికి, భారత తొలి ప్రాధానమంత్రి, స్వర్గీయ పండిత జవహర్‍లాల్ నెహ్రు చేతుల మీదుగా 1955 డిసెంబర్ 10 న ఈ మహత్తరమైన ప్రాజెక్టు నిర్మాణ జలయజ్ఞానికి పైలాన్ వద్ద శంఖుస్థాపన జరుపుకొని 60 ఏళ్ళు అయింది.
ఆ సందర్భంగా పండిత నెహ్రు పలికిన వాక్కులివి:
"నాగార్జున సాగరానికి నేను జరిపే శంఖుస్థాపన పవిత్ర కార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికే శంఖుస్థాపన. ఈ నాడు మనం ఆసేతు హిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయానికి ఇది చిహ్నం".
2005 డిసెంబర్ 10 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి డా||వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకున్నది.
కృష్ణవేణి పుట్టుక - నడక: కృష్ణవేణమ్మ మహారాష్ట్ర కనుమలలో మహబలేశ్వరంలో పుట్టి, పడమర కొండల పర్వత శ్రేణులు దాటి, సహ్యాద్రి పర్వత శ్రేణుల మీదుగా 1336 అడుగుల ఎత్తునుండి ప్రవహించి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్‍లో అడుగుపెట్టి మూడు పాయలుగా చీలి పులిగడ్డ, హంసలదీవి వద్ద కృష్ణవేణి బంగాళాఖాతంలో సంగమిస్తుంది. ఉరుకుల పరుగుల నడకలతో హోయలొలుకుతూ తడారిన లక్షలాది ఎకరాల బీడు భూములకు తన జలాధారలనందిస్తూ పసిడి సిరుల పంటలను పండిస్తున్నది. వాగులు, వంకలు నదీనదాలను తనలో కలుపుకుంటూ ప్రజలకు జీవనాదారాలను అందిస్తున్నది. విశాలమైన ప్రకృతి సౌందర్యానికి సజీవ స్రవంతి ఈ మహానదీమతల్లి. కృష్ణవేణి సిగలో తురుముకున్న సింగారం. నాగార్జునసాగరం రైతుల పాలిటి కల్పవల్లి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల పాలిట అన్నపూర్ణ.
పూర్వ చరిత్ర: విజయాలకు నెలవైన విజయపురి గత చరిత్ర వైభవం నేటికి సజీవం. చారిత్రక నేపథ్యంలో శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ చాళుక్య కాకతీయ, విజయనగర రాజుల పాలనలో ఈ సీమ పాలన వైభవం కొనసాగింది. హిందూ, బౌద్ద, జైనమతాలు ఇచ్చట పరిఢవిల్లాయి. మత సామరస్యానికి ప్రతీకలుగా భాసిల్లాయి. శతాబ్దాల సంసృతి సంప్రదాయ శిల్ప కళలను, ప్రజల జీవన శైలులను తనలో ఇముడ్చుకుంది. బుద్దుని బోధనలతో ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన విశ్వవిద్యాలయ పీఠం ప్రపంచానికి వెదజల్లిన విద్యావిజ్ఞాన తాత్విక కుసుమాలు దేశవిదేశాలలో పరిమళించాయి. రసవాదం, ఆయుర్వేదం, సమస్త శాస్త్రాలకు, చరిత్రకు సాక్షీభూతం.
ప్రాజెక్టు నిర్మాణం - పూర్వరంగం: కృష్ణానదీ జలాలను వినియోగించుకోవాలని, పంటలు పండించాలన్న ఆలోచనలు బ్రిటిష్ పరిపాలనా కాలంలో 200 సంవత్సరాల క్రితమే మొలకెత్తాయి. ఆనాడు 1832 లో వచ్చిన కరువు రక్కసికి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని 2 లక్షల మంది ఆకలి చావులకు గురయ్యారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం నదీజలాల వినియోగంపై దృష్టి పెట్టింది. 1852 లో బ్రిటిష్ ఇంజనీర్ ఓర్ పర్యవేక్షణలో కోటి రూపాయలతో విజయవాడ వద్ద కృష్ణానదిపై తొలి ఆనకట్టను నిర్మించింది. లక్షలాది ఎకరాలకు నీరు అందించింది. 1903 లో పులిచింతల వద్ద ఆనకట్ట కట్టాలని ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తదుపరి కొన్ని అవాంతరాల మధ్య అది కార్యరూపం దాల్చలేదు. ఆనాటి ప్లానింగ్ కమీషన్ బహుళ ప్రయోజనకారి కాదని నిరాకరించింది. 1930 లో నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులకు సేద్యపు నీటి సౌకర్యం కలిగించాలని భావించిన నాటి నైజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ప్రభుత్వంలో భీఫ్ ఇంజనీర్‍గా వున్న ఆలీ నవాబు జంగ్ మొదటిసారిగా నందికొండ ప్రదేశాన్ని సర్వే జరిపి ఆ ప్రదేశంలో ప్రాజెక్టు కట్టడం ద్వారా ప్రజలకు ఉపయోగం జరుగుతుందని నివేదిక ఇచ్చారు. ఆనాడు మద్రాసు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరగా అది విఫలమైంది. తర్వాత తలంగాణా సాయుధ పోరాటం, ప్రభుత్వ సైన్యాల రాక 1948 లో నిజాం ప్రభుత్వం అంతమై భారతదేశంలో విలీనమైయింది. తర్వాత ప్రాజుక్టు నిర్మాణం 1954 లో మరల ప్లానింగ్ కమీషన్ ముందుకు వచ్చింది. 1954 డిసెంబర్‍లో గవర్నర్ సి.యం. చతుర్‍వేది నందికొండ వద్ద ప్రాజెక్టు కట్టడానికి ప్లానింగ కమీషన్ అనుమతించిందని విధాన ప్రకటన చేసారు.
1955 లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యింది. నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం జరిగిన నందికొండ స్థలాన్ని మొదట సర్వేచేసి పథకాన్ని రూపొందించిన ఛీఫ్ ఇంజనీర్ ఆలీన నాబ్‍జంగ్‍కే ప్రతిష్ఠ. ఆయన సూచించిన స్థలంకన్నా 0.9 కి.మీ. ముందుకు జరిపి నిర్మించారు. తదుపరి ప్రాజెక్టు యావత్ రూపకల్పన ప్రముఖ ఇంజనీర్ డా.కె.ఎల్.రావు పర్యవేక్షణలో రూపోందించబడింది. ప్రాజెక్టులో భాగంగా లక్ష 63 వేల కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల జల్ విద్యుత్ కేంద్రం కూడ ఆ పథకంలో ఉంది. రివర్సబుల్ జనరేటింగ్ సిస్టం కూడా దూరదృష్టితో రూపకల్పన చేయడం జరిగింది.
సమైక్య తెలుగు ప్రజల వారధి: ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కృష్ణ - పథకంలో భాగంగా సిద్ధేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాలని కేంద్రంపై వత్తిడి తెచ్చింది. అంతిమ నిర్ణయానికి రాకముందే కృష్ణా జలాల సద్వినియోగ వివరాలను పరీశీలించాల్సిందిగా కేంద్ర పభుత్వం ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. 1953 అక్టోబర్ 1 న బాషాప్రయుక్త రాష్ర్టాల ఆందోళన ఫలితంగా కర్నూలు రాజదానిగా ఆంధ్రరాష్ర్టం ఏర్పడింది. ఈలోగా హైద్రాబాద్ స్టేట్ ప్రభుత్వం 1948 సెప్టెంబరులో ఏర్పడింది. రెండు రాష్ర్టాల మధ్య డ్యామ్ నిర్మాణం జరగాల్సి ఉన్నందున ప్రణాళిక సంఘం కమిటీ ఒక సమన్వయ పథకాన్ని రూపొందించింది. 1953 లో కేంధ్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖోస్లా కమిటీ ఏర్పడింది. ఇందుకు ఆనాడు ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, వావిలాల గోపాలకృష్ణయ్య, రాజావాసిరెడ్డి తదితరుల కృషి ఫలితంగా మద్రాసు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వీగిపోయాయి. నందికొండ ప్రాజెక్టు ప్రణాళిక ముందుకు వచ్చింది.
నిజాం హయాంలో ఏర్పడిన హైద్రాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సర్వే చేయబడిన నందికొండ ప్రదేశాన్ని డ్యామ్ నిర్మాణానికి అనువైనదిగా ఖోస్లా కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ పథకంలో నిర్దేశించిన విధంగా 546 అడుగుల ఎత్తున ఆనకట్ట నిర్మాణం, కుడి - ఎడమ కాలువల నిర్మాణం సూచించబడ్డాయి. ప్రణాళిక సంఘం ఆదేశం మేరకు ఆనాటి ఆంధ్ర, హైద్రాబాద్ రాష్ర్టాలు తగు నివేదిక రూపొందించడం, కార్యరూపం దాల్చడం వెనువెంటనే జరిగిపోయాయి. అనేక అడ్డంకుల మధ్య1954 ప్లానింగ్ కమీషన్ ఆమోదం పొందింది.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఆందోళన ఫలితంగా 1953 అక్టొబర్ 1 న ఆంధ్రరాష్ట్రం అవతరించిన తర్వాత ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు సమైక్య భారత నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నాయి. 1955 డిసెంబరు 10 వ తేదీన కృష్ణవేణి తన సహజ తరంగ సంగీత రాగ ఝుంఝు మారుతాలతో ప్రథమ ప్రధాని నెహ్రుకు స్వాగతం పలికింది. ఆశేష జలప్రవాహం ఆనాడు పరవళ్ళ్ తొక్కింది. రైతుల కళ్ళలో కాంతులు నిండాయి. "బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాడిన త్యాగధనులు కృషి సల్పిన మహానీయుల కలల పంట పండింది. నీవు వెలిగించిన దీపమే" అన్నాడు కాంతులు నిండిన కళ్ళతో ఓ సామాన్య రైతు.
ప్రాజెక్టు నిర్మాణ దశ: శంఖు స్థాపన తర్వాత 1956 ఫిబ్రవరిలో సాగర ఆనకట్ట నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. కాపర్ డ్యామ్ నిర్మాణానికి 1957లో నాటి కేంద్ర నీటి పారుదల విద్యుత్ శాఖల సహాయ మంత్రి ఎస్.కె.పాటిల్ ప్రారంభించారు. కృష్ణానది నీటిని నదిలోకి మళ్ళించేందుకు 27 అడుగుల వ్యాసంతో 290 అడుగుల పొడవుగల సొరంగాన్ని కొండలు తొలచి మార్గం ఏర్పాటు చేశారు. తదుపరి ప్రాజెక్టు పనులు వేగాన్ని అందుకున్నాయి. 1969 నాటికి డ్యామ్ నిర్మాణం పూర్తయ్యింది. సముద్ర మట్టానికి 546 అడుగుల స్పిల్వేపైన రేడియల్ క్రస్ట్‍గ్రేట్స్ అమర్చే పనిని ప్రారంభించారు. 1972 నాటికి 13.71*13.41 మీటర్ల వ్యాసంగల 44*45 అడుగుల 110 టన్నుల బరువుగల 26 గేట్లను అమర్చడం పూర్తి చేశారు. గేట్లు అమర్చటంపై కర్ణాటక మహరాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికపరంగా తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ప్రముఖ ఇంజనీరు కేంద్ర మంత్రి వర్గంలో జల, విద్యుత్ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డా||కె.ఎల్.రావ్ ప్రదర్శించిన అత్యంత సాహసం, వాదనా పటిమ, కృషి ఫలితంగా వీటి నిర్మాణం పూర్తయ్యింది. దీనితో సాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగింది. కేవలం 9 సంవత్సరాలలో 97 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. 9.70 కోట్లను ఇంజనీర్లు పొదుపు చేశారు.
ప్రాజెక్టు నిర్మాణానికి - ప్రాణాలొడ్డిన శామికులు, ఇంజనీర్లు: ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడునా ప్రమాదాలు పొంచి ఉన్నా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రికార్డు సమయంలో డ్యామ్‍ను పూర్తి చేయాలన్న లక్ష్యంతో శ్రామికులు, ఇంజనీర్లు, చేయి చేయి కలిపి ముందుకు సాగారు. ప్రాజెక్టుకు రాళ్ళెత్తిన కూలీలు ఎందరో సాగర్ నిర్మాణంలో కలిసి పోయారు. 1967 లో డ్యామ్ నిర్మాణం కోసం 43 వ బ్లాక్‍లో నిర్మించిన పరంజాలు కూలి ఎందరో కార్మికులు మృతి చెందారు. డ్రైవర్షన్ టన్నల్ ప్రమాదంలో ఇంజనీర్లు, వర్క్‍చార్జిడ్ సిబ్బంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. బోటు బ్రిడ్జి, ట్రాన్స్ పోర్టు, క్వారీ రోడ్డు ప్రమాదాలలో వందల సంఖ్యంలో ప్రాణాలు కోల్పోగా మరెందరో వికలాంగులుగా మిగిలారు. లభ్యమైన రికార్డుల ప్రకారం 250 మందికి పైగా మరణించిన వారి సంఖ్య తేలగా. అంతకు మించి ఎన్నో రేట్లు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన అజ్ఞాత కార్మికుల సంఖ్యే అధికం... నిర్మాణంలో పట్టుదల నీతి, నిజాయితీ కాంట్రాక్టర్లు కూడా లేకపోలేదు. ప్రముఖ కాంట్రాక్టరు కంచె సత్యనారాయణ. టి.చంద్రశేఖరరెడ్డి, కృష్ణంరాజు, యోగయ్యనాయుడు లాంటివారు ఎందరో ఉన్నారు. డ్యాం నిర్మాణంలో మరణించిన వారందరిలో తొలిగా మృతిచెందిన శ్రామిక మహిళ కామ్రేడ్ యం. గురువమ్మ ఇంజనీరు రంగయ్య తదితరులు చిరస్మరణీయంగా మిగిలిపోతారు.
భారతీయ ఇంజనీర్ల ప్రతిభ: పుష్కర కాలంపాటు అహర్నిశలు రాత్రింబవళ్ళు ఇంజనీర్లు, శ్రామికులు కృషి సల్పిన ఫలితంగా డ్యామ్ నిర్మాణం పూర్తయ్యింది. ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం పూర్తిగా భారతీయ ఇంజనీర్లచే రూపొందించబడినది. విదేశీ ఇంజనీర్ల సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధం లేకుండా ఈ మహత్తరమైన ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి చేసిన భారతీయ ఇంజనీర్ల తమ ప్రతిభా పాఠవాలను ప్రపంచానికి చాటారు. ప్రాజెక్టుకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఎదురయ్యే విపత్కర పరిస్థితులను కూడా సాంకేతిక పరిజ్ఞానంలో నిలువరించే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. సాంకేతిక ప్రపంచం అబ్బురపరిచే విధంగా ఈ డ్యామ్ నిర్మాణం సాగింది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం వుండే విధంగా, 110 చదర.పు మైళ్ళు విస్తీర్ణంతో 408 శతకోటి ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగివుంది. ఈ రిజర్వాయరు మానవ నిర్మిత ప్రాజెక్టుగా ప్రపంచంలోనే మూడవ స్థానాన్ని ఆక్రమించింది. 960 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే జనరేటర్లు ఈ ప్రాజెక్టు కలిగి ఉంది. 200 టన్నుల హైడ్రాలిక్ వత్తిడిని తట్టుకునే శక్తి ఈ ప్రాజెక్టు కలిగి ఉంది.
ఆధునిక జలవిద్యుత్ కేంద్రం: ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా డ్యామ్ దిగువ భాగన జలవిద్యుత్ కేంద్రానికి రూపకల్పన జరిగింది. ఎనిమిది జనరేటర్లకు కావలసిన నీటిని పంపేందుకు వీలుగా డ్యామ్ ద్వారా పెన్‍స్టాక్ పైపులను అమర్చారు. 810 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు 170 కోట్ల వ్యయంతో పూర్తయింది. 1954 లో రూపొందించిన ఎస్టిమేట్స్ కన్నా రెండింతలు ఎక్కువగా ఖర్చు అయింది. అంతకు మించిన లాభాలను గరిష్టస్థాయిలో విద్యుత్‍ఉత్పాదన చేసి సాధించింది. ఏటా 1200 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నది.
1975 లో ప్రధాన జల విద్యుత్ కేంద్రం నిర్మాణం ప్రారంభమయ్యింది. 1985 నాటికి ఎనిమిది యూనిట్ల నిర్మాణం పూర్తయింది. భారత్ హెవీ ఎలక్ర్టికల్స్ రూపొందించి అమర్చిన మొదటి యూనిట్ 110 మెగావాట్ల విద్యుత్‍ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ రూపకల్పనకు భారతీయ ఇంజనీర్ల విద్యుత్ కేంద్ర నిర్మాణలలో ప్రవీణులుగా గుర్తించబడ్డారు. మిగిలిన ఏడు రివర్సబుల్ జనరేటింగ్ యూనిట్లు జపాన్‍కు చెందిన ఇటాచి మిట్స్ బిషి కంపెనీ రూపొందించారు. ఒక్కో యూనిట్ 100.8 మెగావాట్ల విద్యుత్‍ను ఏర్పాటు చేయగలవు.
రివర్సబుల్ జనరేటర్స్: భారతదేశంలోనే ప్రథమంగా సాగర్ జలవిద్యుత్ కేంద్రంగా రివర్సబుల్ టైర్బయిన్లు అమర్చబడినాయి. భవిష్యత్ నీటి నిల్వల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సౌదాల పితామహుడు ప్రముఖ ఇంజనీరు నార్ల తాతారావు ఇందుకు ఎంతో కృషి చేశారు. ముందు చూపును అనుసరించారు. రివర్సబుల్ టర్చేన్ల వల్ల విద్యుత్ ఉత్పత్తికి వినియోగించిన నీటిని తిరిగి రిజర్వాయర్లలోనికి రీ పంపింగ్ చేయవచ్చు. ఇందుకు 1.5 టిఎంసిల నీటి నిల్వలను వుంచేందుకు సత్రశాల వద్ద టేల్ పాండ్ నిర్మాణం పూర్తి చేసుకుంటున్నది. ప్రస్తుత నీటి నిల్వలను దృస్టిలో వుంచుకుని ప్రభుత్వం సత్రశాల వద్ద పాండ్ నిర్మాణానికి 2005 లో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 510 ఆడుగుల డ్యామ్ డెడ్ స్టోరేజీ కన్నా నీటిమట్టం తగ్గితే విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. పునాది భూమి మట్టం నుంచి 405 అడుగుల ఎత్తుతో పెన్‍స్టాక్ పైపులను అమర్చారు. ఒక్కో యూనిట్ విద్యుత్ ఉత్పాదనకు 4000 సెక్యుల నీరు అవసరమవుతుంది. టైల్‍పాండ్ ప్రాజెక్టు పూర్తి దశకు 2016 నాటికి చేరుకుంది. సాగర్ నుండి వృధా అయ్యే నీటిని తిరిగి వినియోగించుకోవచ్చు. ఇది ఎన్నో ఏళ్ళ పోరాటం ఫలితంగా వాస్తవ రూపం దాల్చింది. ఇందు కోసం 700 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు.
కుడి - ఎడమ కాల్వలపై విద్యుత్ కేంద్రాలు: జవహర్ లాల్ కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద 90 మెగావాట్ల విద్యుత్‍ను ఉత్పత్తి చేసే మూడు యూనిట్‍లను నెలకొల్పారు. బ్రిటన్‍కు చెందిన బోయింగ్ సంస్థ వీటిని నిర్మాణం చేసింది. లాల్‍బహద్దూర్ ఎడమ కల్వపై 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్స్ నెలకొల్పారు. నేరుగా రిజర్వాయర్ నుండి నీటిని తీసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి తిరిగి కాలువలోనికి నీటిని తరలిస్తుంది.
జవహర్ కెనాల్: ప్రాజెక్టు పనులు ప్రారంభించిన మొదటి సంవత్సరం 1956 అక్టోబర్ 10 వ తేదీన ఆనాటి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కుడి కాలువ త్రవ్వకపు పనులకు శంఖుస్థాపన చేశారు. దీనికి జవహర్ కెనాల్‍గా పేరు పెట్టారు. 50 వేల మంది కూలీలు, 1250 మంది కార్యాలయ సిబ్బంది వేలాది మందికి పైగా వర్కుచార్జ్ డ్ సిబ్బంది త్రవ్వకపు పనిలలో పాల్గొన్నారు. 1969 వరకు ఈ పనులు కొనసాగాయి. కాలువ పూర్తి నిర్మాణ దశ 245 మైళ్ళ గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా ప్రవహించి 178 చిన్న పెద్ద వాగులను దాటుకుంటూ చివరకు సొమశిల వద్ద గల పెన్నానదిలో కలుస్తుంది. ఈ కాలువ ద్వారా 21 వేల క్యుసెక్కుల నీటి ప్రవాహంతో 20 లక్షల 62 ఎకరాల భూమికి సేద్యపు నీరు అందించగల పథంకంగా రూపొందించారు. ప్రాజెక్టు రిజర్వాయర్ హెడ్ రెగులేటర్ వద్ద తొమ్మిది గేట్లను అమర్చారు. దక్షిణ విజయపురి వద్ద ప్రారంభమయి సొరంగమార్గం ద్వారా తన ప్రవాహాన్ని ప్రారంభిస్తుంది. ప్రస్తుతం 200 కి.మి. పొడవున 11 వేల క్యుసెక్కులతో 11.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తుంది. 1967 ఆగష్టు 4న స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందీరాగాంధి చేతులు మీదుగా ఈ కాలువకు నీటిని విడుదల చేసి జాతికి అంకిత మొనర్చారు. దీనికి మన తొలి ప్రధాని జ్ఞాపకార్థం "జవహర్ లాల్" కెనాల్ గా పేరు పెట్టారు. ఒకనాడు నీటి కరువు కొరల్లో చిక్నిన పలనాటి సీమను కృష్ణమ్మ పరవల్లతో పచ్చని పంటలతో తెల్లబంగారం, ఎర్ర బంగారాన్ని పండిస్తున్నారు. నెర్రలుబారిన భూములు నేడు సేధ్యపుసిరులు కురిపిస్తున్నాయి. ఎకరాకు 40 బస్తాల దిగుబడిని సాధిస్తున్నారు.
లాల్ బహద్దూర్ కెనాల్(ఎడమ కాలువ): జై జవాన్, జై కిసాన్ నినాదంతో జాతిని ఉత్తేజితం చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ లాల్‍బహద్దూర్ శాస్త్రీ జ్ఞాపకార్థం ఎడమ కాలువకి ఆయన పేరు పెట్టారు. హెడ్‍రెగులేటరుకు సమీపంలో పొట్టిచెలమ నుంచి, చలకుర్తి వరకు భూగర్భ సొరంగం ద్వారా జలప్రవాహం సాగుతుంది. ఈ సొరంగం 32 అడుగుల వ్యాసం, 8465 అడుగుల నిడివి కలిగి గుర్రపునాడ ఆకారంలో తొలచబడింది. పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ 1959లో చేపట్టింది. ఆనాటి గవర్నర్ భీమ్ సేన సంచార్ ప్రారంభోత్సవం జరిపారు. ఎడమ కాలువ పొడవు 295 కి.మీ. ఇది హాలియా, వైరా తమ్మిలేరు లాంటి 137 చిన్న పెద్ద వాగులు దాటుకుంటూ నల్గొండ, ఖమ్మం, కృష్ణాజిల్లాల మీది నుంచి ప్రవహించి పశ్చిమ గోదావరి జిల్లా ఏడమ కాలువలో చివరికి కలుస్తుంది. 9.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది.
ఈ కాలువ నిర్మాణంలో 30 వేల మందికి పైగా మహబూబ్‍నగర్ జిల్లా కూలీలు, 2500 మంది వర్కుచార్జిడ్ సిబ్బంది, 900 మంది కార్యాలయ సిబ్బంది దాదాపు 10 సంవత్సరముల పాటు త్రవ్వకాల పనులలో నిమగ్నమయ్యారు. ఈ కాలువ హెడ్ రెగులేటర్ మూడు గేట్లను కలిగివుంది. 1967 ఆగష్టు 4న శ్రీమతి ఇందిరాగాంధి నీటిని విడుదల చేశారు. డ్యామ్ గ్యాలరీ దక్షిణ పదం నుంచి నడకవచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు.
నీటి విభజన: కృష్ణా జలాల వివాదాలను పరిష్కరించడానికి 1967 లో బచావత్ ట్రిబునల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ పరిశోదనల ఫలితంగా మా సేద్యపు వనరులకు కృష్ణా నదిలో నికర జలాలు వినియోగించుకునేందుకు 2060 టి.ఎం.సిల నీటిని గుర్తించింది. దీనిని మూడు రాష్ర్టాలు వినియోగించుకోవచ్చని పేర్కొన్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్‍కు 800 టిఎంసిలు, కర్ణాటక 700, మహారాష్ట్ర 560 టిఎంసిలను ఖరారు చేసింది. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ విభజన జరిగిన తరువాత 800 టిఎంసిలను ప్రస్తుత బ్రిజేష్ ట్రిబ్యునల్ ఖరారు చేసింది.
ప్రాజెక్టు నిర్మాణంలో శ్రామికులు సమైక్యత: ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం నలుప్రాంతాలనుంచే కాకుండా, దేశం నలువైపుల నుంచి వేలాది మంది కార్మికులు, కూలీలు, సాంకేతిక పరివారము, సాగరానికి కదిలివచ్చారు. ఈ ప్రాంతం ఒక శ్రామిక నగరంగా మారింది హిల్ కాలనీ, పైలాన్, రైట్‍బ్యాంక్ మూడు కాలనీలు వేలాది మంది జనప్రవాహంతో నిండిపోయాయి. దాదాపు లక్షమంది వరకు నివాసం వున్నట్టు అంచనా, స్ర్తీ పురుష భేదం లేకుండా రాత్రింబగళ్ళు 50 వేల మంది శ్రమించారు. కుల, మత, ప్రాంతీయ భాష బేదాలు లేకుండా సమైక్యత స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు. శ్రమజీవుల స్వేదం ఏరులుగా పారింది. సాగర నిర్మాణ పథంలో ఎందరో అసువుబాసారు.
కా||లక్ష్మిదాస్ నాగార్జునసాగర్ నిర్మాణాన్ని, వర్కుఛార్జ్ డ్ కడగండ్లను ప్రత్యక్షంగా చూశారు. మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 1962 లో ఎంపిగా ఎన్నికయ్యారు. లక్షమంది వర్కుఛార్జ్ డ్ సిబ్బందిని ఏకం చేసి హక్కులకై ఉద్యమాలు నడిపారు. ఇందులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కీలకమైన పాత్ర నిర్వహించింది. ఆయన వర్కుఛార్జ్ డ్ పితామహుడుగా నేటికి చిరస్మరనీయుడు. మోటూరు పరందామయ్య , పిళ్ళే ఆనాటి తరం నాయకులు ఎంతగానో కార్మిక హక్కుల కోసం కృషి చేశారు. ఆయన తదుపరి కా|| కొండ్రగుంట వెంకటేశ్వర్లు అదే పాత్రను నిర్వహించారు.
శ్రామికుల దాతృత్వం: ప్రాజెక్టు నిర్మాణ సమయంలో దాతృత్వములో కూడా శ్రామికులు ముందజలోనే వున్నారు. 1962 లో ప్రధాని నెహ్రు పిలుపు మేరకు ప్రాజెక్టులోని ఉద్యోగులు, కూలీలు ఒకరోజు వేతనం 10001 రూపాయలు దేశ అత్యవసర నిధికి విరాళంగా అందించారు. ప్రాజెక్టు నిర్మాణంలో దేశభక్తిలో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సాంస్కృతిక , సంగీత, నృత్య చిత్రలేఖన వివిధ కళలో కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు. డ్యామ్ నిర్మాణంలో విశేష ప్రతిభ చూపిన 32 మంది వర్కుచార్జ్ డ్ సిబ్బంది వివిధ రంగాలలో గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.
ప్రాజెక్టు పునాదులు(తొలి) ఛీప్ ఇంజనీర్లు: ప్రాజెక్టు పునాదుల బలంగా వుంటేనే ప్రాజెక్టు నిలుస్తుంది. ఆనాడు తొలి ఛీప్ ఇంజనీర్ హైదరాబాద్ నివాసి మీర్ జాఫర్ అలి (1955 - 63) వరకు పనిచేశారు. డ్యామ్ పునాదుల నుంచి 450 అడుగుల ఎత్తు వరకు వీరి పర్యవేక్షణలోనే నిర్మాణం సాగింది. అకుంటిత దీక్షాదక్షతలు, నీతి - నిజాయితీ దేశభక్తితో ఆయన సేవలనందించారు. 1904 లో జన్మించారు. మద్రాసు గిండి యూనివర్సిటీలో పట్టబద్రులయ్యారు. ప్రాజెక్టు ప్రాథమిక పనులలో ఎస్‍ఇగా పాల్గొని తదుపరి చీప్ ఇంజనీర్ అయ్యారు. వీరి హయంలోనే ప్రాజెక్టు పనులు రికార్డు సమయంలో పూర్తి అయ్యాయి. వీరి జ్ఞాపకార్థం 2005 స్వర్ణోత్సవాల సందర్భంగా శిలావిగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందుకు ప్రధానంగా శాసనసభా పక్షనాయకులు నోముల నర్సింహయ్య, జె.రంగారెడ్డి, తమ్మినేని వీరభద్రం ప్రత్యేక కృషి చేశారు. ఆయకట్టు పరిధిలోని అయిదు జిల్లాల శాసన సభ్యులు కూడా ఇందుకు సహకరించారు. డ్యామ్ ఛీప్ ఇంజనీర్ వై. అబ్దుల్ బషీర్ కూడా తమ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ పురుషోత్తమరాజు నేతృత్వంలో 60 సంవత్సరాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ ఎంప్లాయీస్ యూనియన్ శ్రామిక స్మారక స్థూపం నిర్మించాలని, మహనీయుల శిలావిగ్రహాలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మీర్ జాఫర్ అలీ పదవీ విరమన తరువాత 1963-69 వరకు మేజర్ ఎపి రంగనాథ్ స్వామి ఛీప్ ఇంజనీరుగా బాధ్యతలు నిర్వహించారు. స్సిల్‍వే నిర్మాణం పూర్తయ్యే వరకు ఉన్నారు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి 1975 లో ఇరిగేషన్ డెవెలప్‍మెంటు కార్పొరేషన్ ఛైర్మెన్‍గా నియమించింది. ఆ తరువాత ఎ. ఆర్. చలాని, ఎ. ఎ. రహమాన్, వి. సూర్యనారాయణరావు, సి. వి రావు, జి. కె. రెడ్డి, మాటూరి గోపాలరావు వంటి ఎంతోమంది ఇంజనీర్లు ప్రాజెక్టు నిర్మాణంలో తమ సేవలను అందించారు. ఇంజనీరు గోపాలరావు నాగార్జునసాగర్ చరిత్రను పుస్తక రూపంలో పొందుపరిచారు.
ప్రాజెక్టును సందర్శించిన ప్రముఖులు: నాగార్జునసాగర్ ప్రాజెక్టును దేశాధినేతలు వివిధ ప్రముఖులు సందర్శించారు. మానవ నిర్మిత ప్రాజెక్టు నిర్మాణాన్ని చూసి అచ్చెరువు పొందారు. భారతీయ ఇంజనీర్లు ప్రజ్ఞపాఠవాలకు జేజేలు పలికారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో తొలి రాష్ట్రపతి డా||బాబు రాంజేంద్రప్రసాద్, ఇందిరాగాంధి, లాలాబహదూర్ శాస్ర్తి, మురార్జిదేశాయ్, వి. వి. గిరి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, నీలం సంజీవరెడ్డి, పి. వి. నర్శింహరావు లాంటి ప్రముఖులెందరో సందర్శించారు. గవర్నర్లు వివిధ దేశాల ప్రముఖులెందరో సందర్శించారు. గవర్నర్లు వివిధ దేశాల ప్రముఖులు, మంత్రులు, మేధావులు, సంఘసేవకులు కూడా దర్శించారు. విదేశీయులు కూడా డ్యాం నిర్మాణంలో శ్రమదానం చేశారు.
నిర్మాణంలో పాల్గొన్న సిబ్బంది- కార్యాలయాలు: ప్రాజెక్టు నిర్మాణంలో 1956 -72 పాల్గొన్న సిబ్బంది, కార్యాలయాల సంఖ్య ఈ విధంగా ఉంది. ఛీప్ ఇంజనీర్ కార్యాలయం, నాలుగు సర్కిల్స్, 21 డివిజన్లు, 500 మంది ఇంజనీర్లు, 5000 మంది వర్కుఛార్జిడ్ సాంకేతిక సిబ్బంది, 50 వేల మంది శ్రామికులు డ్యామ్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
డ్యామ్ నిర్మాణానికి వినియోగించిన సామాగ్రి: ప్రాజెక్టు పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించబడింది. ఇందుకోసం ఇసుక, సిమెంటు, గ్రానైట్‍రాయి, సుర్కి, స్టీల్ వినియోగించారు. సిమెంట్ 1.2 మిలియన్ టన్నులు, ఇసుక 2.44 మిలియన్ క్యూబిక్ మీటర్లు, గ్రనైట్‍రాయి 5.92 మిలియన్ క్యూబిక్ మీటర్లు, సుర్కి 0.20 మిలియన్ టన్నులు,స్టీల్ 60,000 టన్నులు ఉపయోగించారు.
సాగర సోయగాలు: నాగార్జున సాగర్ పాజెక్టు పర్యాటక విజ్ఞాన, వైజ్ఞానిక యాత్రా స్ఠలము. ఇంజనీరింగ్ నిపుణతను చూసి తెలుసుకోవలసిందే సకాలంలో వరదలు వస్తే గరిష్ట నీటిమట్టం 590 ఆడుగులకు చేరుతుంది. సాగర్ రిజర్వాయర్ కలకలలాడుతుంది. లక్షలాది పర్యాటకులతో కేరింతలు కొడుతుంది. అపుడు సాగర్ హొయలు చూసి తీరవలసిందే, ఇరవై ఆరు రేడియల్ క్రస్ట్ గేట్స్ ద్వారా ఎగిరి దూకే సాగర జలపాతాల శబ్దరవళులు పులకింపజేస్తాయి. సప్తస్వరాలు వినిపిస్తాయి నాగార్జునసాగర్ ఏడు అక్షరాలు, సంగీత సరిగమలు సప్త అక్షరాలు. అందుకే సాగర్ జలపాతం సంగీతం వినిపిస్తుంది.
దర్శనీయ స్థలాలు: సాగర్‍లో దర్శించ తగ్గది పైలాన్ పిల్లర్ పండిత్ నెహ్రు ప్రాజెక్టు శంఖుస్థాపన జరిపిన సూచికగా దీన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ దృశ్యకేంద్రం నుంచి నిర్మాణపు పనులను చూసి పులకించిపోయేవారు. ఇప్పుడు ఆ దృశ్య కేంద్రం అదృశ్యమింది. అపురూప చిత్రాలను తొలగించారు. సాగర్ చరిత్ర రూపురేఖలు లేకుండా పోయాయి. ప్రపంచ పర్యాటకులు సాగర్‍ను సందర్శిస్తే చరిత్ర చెప్పేవారేలేరు. ఇప్పటికైనా 60 సంవత్సరాల సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం దృశ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. నాటి చరిత్రకు సంబందించిన చిత్రాలను ప్రదర్శించాలి. అదేవిదంగా మోడల్ డ్యాంను సందర్శకులకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. పార్కులను అభివృద్ది చేసి పర్యాటకులను ఆకర్షించాలి.
మ్యూజియం: దక్షిన విజయపురి లాంచి స్టేషను నుంచి 23 కి.మీ. దూరంలో వున్న నాగార్జున కొండ మ్యూజియంను చేరుకోవచ్చు. లాంచిలో ప్రయాణం ఒక అద్భుత జ్ఞాపకం. నాగార్జున కొండ అలనాటి బుద్దుని జాతిక కథలు, శిల్పాలు, నిర్మాణాలు, పురాణ ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవచ్చు. ఇది ఒక విజ్ఞాన విహార యాత్రగా చిరకాలం అనుభూతిని మగల్చగలదు. ప్రపంచంలోనే రెండవ ద్వీపకల్ప మ్యూజియం నాగార్జునకొండ. తెలంగాణా టూరిజం హిల్‍కాలనీ దిగువన లాంచ్ స్టేషన్‍ను నిర్మిస్తున్నది. 2016 జనవరి నాటికి ప్రారంభించాలనే ప్రయత్నంలో వుంది.
అనుపు: దక్షిన విజయపురి 7 కి.మీ. దూరంలో అనుపు వున్నది ఇది ఒక సహజ ప్రకృతి లోయ చుట్టూ ఎతైన కొండలు వాటి మధ్య నాగార్జునుడు నెలకొల్పిన ఒపెన్ యూనివర్శిటీ, నాటి నిర్మాణ శాస్త్ర విజ్ఞానానికి సాక్ష్యం. పురావస్తు శాఖవారిచే ఏర్పాటు చేసిన నాగార్జుని స్థూపాలు, ఎకో సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన స్టేడియం ఒక మధురమైన అనుభూతిని మిగిల్చగలవు.
ఎత్తిపోతలు: నాగార్జునసాగర్ మాచర్ల మధ్యలో ఎత్తిపోతల జలపాతం వుంది. దీని పేరు పూర్వకాలంలో యతితపోతల కాలక్రమంలో ఎత్తిపోతలుగా మారింది. ఋషులు తపస్సు చేసిన స్థలమిది. నలమల అడవుల నుంచి నిరంతరంగా ప్రవహించే సెలల ద్వారా చంద్రవంక వాగునుంచి నిరంతరం 75 అడుగుల మీది నుంచి దూకిపడే జలపాతాలు కన్నుల విందు చేస్తాయి. టూరిజం శాఖ అమర్చిన రంగురంగుల విద్యుత్ కాంతులతో రాత్రివేల కనువిందు చేస్తుంది. ఇక్కడ మొసళ్ళ పెంపకం కేంద్రం కూడా వున్నది. ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఉత్సవాలు నిర్వహిస్తారు. వేలాది మంది తరలి వస్తారు.
శ్రీ పర్వతం: నాగార్జుని కాలంనాటి శ్రీ పర్వతం అనే పేరును దాదాపు 275 ఎకరాల స్థలంలో ప్రపంచ పర్యాటక బౌద్ద కేంద్రంగా నిర్మిస్తున్నారు. శ్రీపర్వతం థీమ్ పార్క్ లో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని తెలంగాణ టూరిజం శాఖ గత దశాబ్ద కాలంగా పనులను సాగిస్తున్నది. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ తగినంత అభివృద్దికి నోచుకోవటం లేదని విమర్శ ఉంది. ప్రాజెక్టు నిర్వహణా సిబ్బంది 1991 నుంచి వందలాది మంది పదవీ విరమణ చేసినా కావలసిన సంఖ్యలో తగినంత సాంకేతిక సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నాయి. 4,444 కోట్లతో ప్రాజెక్టు ఆధునీకరణ పనులు ప్రారంభించి 2016 నాటికి ముగించాలని లక్ష్యం. ఆ కలలు ఏనాటికి నెరవేరగలవోనని ఎదురుచూస్తున్నారు. తెలంగాణాలో భారీ ప్రాజెక్టు నాగార్జునసాగర్ పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా తగినంత శ్రద్ద తీసుకోవాలని కోరుతున్నాము.