కథా భారతి
కొత్త వెలుగు
- తమిరిశ జానకి

జనవరి ఒకటవతేదీ వస్తోంది. కొత్తసంవత్సరం వచ్చేస్తోంది ఈ ఆలోచన భాస్కర్ మనసులో చాలా ఆనందాన్ని కలగజేస్తోంది. దానికి ఋజువు అతని కళ్ళల్లో కనిపిస్తోంది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా చూసేకళ్ళు ఇప్పుడేమో దిగులంటే ఏమిటో మాకు తెలియదన్నట్టు చిద్విలాసంగా నవ్వుతున్నాయి.

డిగ్రీ వరకూ చదువుకున్నాడుగానీ పైచదువుకి ఆసక్తి లేదు పోనీ ఏదన్నా ఉద్యోగం వెతుక్కుని బతుకుతెరువు చూసుకుందామన్న ఆలోచనా లేదు భాస్కర్ కి.

తన భవిష్యత్తు బావుండాలన్న కోరిక మాత్రం ఉంది.

మానవస్వభావమే చిత్రమైనది అందులో భాస్కర్ లాంటి మనుషుల తీరు మరింతవిచిత్రం. కృషి పట్టుదల వెనక్కినెట్టి కోరికని ముందుకినెట్టి గాలిలో దీపం పెట్టే వ్యక్తుల తీరు విచిత్రంకాక మరేమిటి ?

బాధ్యతారాహిత్యంగా నడుచుకునే కొడుకుని చూస్తూ కుమిలిపోయేది కన్నతల్లితండ్రులేగా !

శంకరయ్యకీ సావిత్రికీ కొడుకుని దారిలో పెట్టడం సాధ్యం కావట్లేదు. ఓపికగా చెప్తుంటే చెవిని పెట్టడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు. మరీ గట్టిగా చెప్తే విసుగుచూపిస్తూ చిరాగ్గా ఇంట్లోంచి వెళ్లిపోయి ఊరినపడితిరిగి ఎప్పటికో ఇల్లు చేరతాడు.

దాంతో భయపడి లోపల్లోపల బాధపడుతూ మంచిరోజులకోసం ఎదురుచూస్తున్నారు.

రెండువేలపదహారునించీ నీకు మంచిరోజులొస్తాయని తన చెయ్యిచూసి సోమయాజులుగారు చెప్పినప్పటినించీ కొత్తసంవత్సరం కోసం ఎదురుచూస్తున్నాడు భాస్కర్. అందుకే జనవరి ఒకటవతేదీ వచ్చేస్తోందని ఆనందతాండవం ఆడుతోంది అతగాడి మనసు.

ఆరోజు శంకరయ్య చాలా హడావిడిగా వచ్చాడు ఇంటికి.

అమ్మయ్య నువ్వు ఇంట్లోనే ఉన్నావుకదా ఒక్కసారి చంద్రశేఖర్ గారి దగ్గిరకి వెళ్లివద్దాం పద అన్నాడు కొడుకువంక చూస్తూ.

ఎందుకూ ?

అడిగిన తీరులోనూ ఆ గొంతులోనూ తెలిసిపోతోంది అయిష్టత నిర్లక్ష్యం కూడా.

ఆయన ఆఫీసులో ఖాళీలున్నాయిట. నీకు ఉద్యోగం ఇప్పించమని అడుగుతాను. డిగ్రీ చదివినవాడు కావాలిట. నా స్నేహితుడొకడు చెప్పాడు.

చంద్రశేఖరంగారి ఆఫీసులోనా ఇష్టంలేదు నాకు.

వేళకానివేళ పడుకున్నదేకాక మంచమ్మీద కాస్తకూడా కదల్లేదు భాస్కర్.

పోనీ ఎక్కడైనా ప్రయత్నిస్తున్నావా సంతోషమే అలా అయితే తండ్రిమాటలకి చటుక్కున లేచి కూచున్నాడు మంచమ్మీద.

ఎక్కడా ప్రయత్నించక్కర్లేదు నాన్నా. ఉద్యోగం అదే వస్తుంది.

చిన్నగా నవ్వాడు శంకరయ్య.

అసలు ప్రయత్నమే చెయ్యకపోతే ఎలా వస్తుంది ఉద్యోగం ?

అదే వస్తుంది. కొత్త సంవత్సరంలో నాకు మంచిరోజులొస్తాయని నా చెయ్యి చూసి సోమయాజులుగారు చెప్పారు. ఇంక నేను వాళ్ళచుట్టూ వీళ్ళచుట్టూ తిరగడం ఎందుకూ?

తెల్లబోయి చూశాడు శంకరయ్య.

మంచిరోజులొస్తాయని చెప్పినప్పుడు సంతోషంగా మరింత శ్రద్ధగా మరింత పట్టుదలతో ఏఅవకాశాన్నీ వదిలిపెట్టకుండా ప్రయత్నాలు చెయ్యాలికదా భాస్కర్. నిమ్మకి నీరెత్తినట్టు కూచుంటే ఎలా ? ఆయన చెప్పినమాట నీలో ఉత్సాహాన్ని పుట్టించి మంచిరోజుల్ని మెళకువలతో నీ ముంగిట నిలబెట్టుకునే కృషికి బీజం వెయ్యాలి. అంతేగానీ చేతులు ముడుచుకుని కూర్చోమని కాదు.

అబ్బబ్బా ! నాన్నా నీకు మరీ చాదస్తం ఎక్కువైంది. మంచిరోజులు ముందున్నాయని తెలిసినప్పుడు హాయిగా కాలిమీద కాలేసుకుని కూచోక నేనెందుకు శ్రమపడాలి ? నన్నిలా వొదిలెయ్యి. అప్లికేషన్లకి ఇంటర్వూలకి డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం కూడా లేదు.

నిక్కచ్చిగా చెప్పేశాడు భాస్కర్.

ఆ రోజు భాస్కర్ జ్వరంతో పడకేశాడు. ఏమీ తినలేదు. కాఫీ కూడా నోటికి సయించలేదు. రెండోరోజుకి ఇంకా ఎక్కువైందే తప్ప తగ్గలేదు. డాక్టర్ తో చెప్పి తన తండ్రి మందులు తీసుకొస్తాడేమోనని ఆశతో ఎదురుచూశాడు. ఉహూ ఆప్రయత్నమే కనిపించలేదు. అమ్మకి ఒంట్లో బాగులేనప్పుడు డాక్టర్ దగ్గిరకి తీసికెళ్ళాడు కదా మరి తన సంగతి పట్టించుకోవట్లేదేమిటి డాక్టర్ దగ్గిరకి వెళ్దామా అన్నమాటే ఆయన నోటినించి రాలేదే!

తనే నోరు తెరిచి అడిగేశాడు ఆ మర్నాడు డాక్టర్ దగ్గిరకి వెళ్తానని.

తల అడ్డంగా ఊపాడు శంకరయ్య అవసరం లేదంటూ. వింతగా చూశాడు భాస్కర్. ఇదివరకెప్పుడైనా తనకి కాస్త నలతచేసినా ఎంతో కంగారుపడిపోతూ కూడాఉండి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళేవాడు. అటువంటిది ఇప్పుడిదేమిటి ఇంత జ్వరంగా ఉంటే కూడా నిమ్మకి నీరెత్తినట్టున్నాడు.

తండ్రి మీద బాగా కోపం వచ్చింది బాస్కర్ కి. తల్లికి పిర్యాదు చేశాడు. ఆవిడ సమాధానం చెప్పలేదు భర్త ముఖంలోకి చూసింది.

కొడుకు నోటినించి ఆమాట కోసమే ఎదురు చూస్తున్న శంకరయ్య చాలా మామూలుగా మృదువుగా అన్నాడు
అదికాదు బాస్కర్ నీకు జనవరి ఒకటినించీ మంచిరోజులొచ్చేస్తాయని సోమయాజులు గారు చెప్పారు కదా. ఎల్లుండేగా ఒకటవతేదీ రేపొక్కరోజే మధ్యలో. ఆమాత్రానికి డాక్టరూ మందులూ అంటూ తిరుగుడెందుకు ? డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు చెప్పు.

గబుక్కుని మంచమ్మీదనించి లేచాడు భాస్కర్.

మంచిరోజులొస్తాయని వైద్యం చేయించుకోకుండా కూచుంటారా ఎవరైనా ? తగ్గించుకుందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించరా ?

చిరాకు ధ్వనించింది ఆ గొంతులో.

చిన్నగా నవ్వాడు శంకరయ్య జాలిగా కొడుకు వంక చూస్తూ.

మంచిరోజులొస్తున్నాయని అసలు ఉద్యోగ ప్రయత్నాలే చెయ్యకుండా కూచున్నావుకదా ! ఆనమ్మకం ఉన్నప్పుడు అనారోగ్యానికి మందులెందుకు ? మంచిరోజులు ఎలాగో వస్తున్నాయిగా. తగ్గించుకునే ప్రయత్నం నువ్వెందుకూ చెయ్యడం ?

నోరెళ్ళబెట్టి చూశాడు భాస్కర్. తన తప్పు అర్ధమైంది. తన ఆలోచనా విధానంలో పొరపాటు గ్రహించగలిగాడు.

ప్రేమగా కొడుకు భుజమ్మీద చెయ్యివేశాడు శంకరయ్య.

భవిష్యత్తు బావుందని చెప్పినా లేదా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినా మనం చేయవలసిన ప్రయత్నం చెయ్యకుండా గాలిలో దీపం పెట్టి గాలిని తిట్టుకోవడం హాస్యాస్పదం కాదంటావా ?

నన్ను క్షమించండి నాన్నా!

మనస్ఫూర్తిగా ఆ మాట అనడానికి అరక్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు భాస్కర్.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)