శ్రీకర్ పెళ్లి . పెళ్లికూతురు సుందరి శ్రీకర్ సహ ఉద్యోగిని. సుమారు రెండు సంవత్సరాలక్రితం ఆమె శ్రీకర్ పనిచేస్తున్న ఆఫీసులో చేరింది. చేరినప్పటినించి తన పని తాను చేసుకుపోవటం, సహోద్యోగులతో స్నేహభావంతో ఉండటం తప్ప ఏనాడూ సుందరి అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవటంకాని పోసికోలు కబుర్లతో కాలక్షేపం చేయటంకానీ చూడలేదు శ్రీకర్ . ఇలా ఆమెని నిశితంగా పరిశీలించడంలో ఎప్పుడు ఆమెతో ప్రేమలో పడ్డాడో అతనికే తెలియలేదు. కానీ “ఆమె అభిప్రాయం తెలుసుకోవడం ఎలా? సూటిగా అడిగేస్తేనో ?” అనే ఆలోచనలోనే ఏడాది గడిచిపోయింది .
అటు ఇంట్లోనేమో “ఇంకా ఎప్పుడు చేసుకుంటావురా పెళ్లి ? బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా పనికిరావంటారు “ అంటూ తొందర చేస్తున్నారు అమ్మానాన్నా .
“ఇంక ఆలస్యం చేయకూడదు” అనుకుంటూ ఒకనాడు ధైర్యంచేసి సుందరి వద్దకు వెళ్ళి “మీతో కొంచం మాట్లాడాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఇవాళ ఆఫీసు అయిపోయాక నాతో కాఫీ త్రాగటానికి వస్తారా?” అని అడిగాడు. ఆమెని అడుగుతున్నప్పుడే “ఆమె అవునంటే సరే” కానీ “ఆమె కాదంటే” అనే ఆలోచనతోనే గొంతు వణికింది .
ఒకసారి శ్రీకర్ కేసి చూసి ఏమనుకుందో ఏమో “అలాగే తప్పక వస్తాను “ అంది సుందరి. అంతే ఆ మాటే చాలు అన్నట్లుగా ఊహలలో తేలిపోసాగాడు శ్రీకర్.
ఆ సాయంత్రం ఇద్దరు ఆఫీసు దగ్గరగా ఉన్న ”రుచి“ అనే రెస్టారెంటుకి వెళ్ళి ఒక పక్కగా రెండు కుర్చీలే ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. శ్రీకర్ ఇద్దరికీ కాఫీ ఆర్డరు చేసి “ చూడండి సుందరిగారు నేను సూటిగా మిమ్మల్ని ఒక విషయం అడుతాను. మీరు అంతే సూటిగా సమాధానం చెప్పాలి” అని “మీకు అంగీకారమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను” అన్నాడు .
ఈ విషయం ముందే ఊహించిన సుందరి “ మిమ్మల్ని కాదనడానికి నా దగ్గర కారణమేమీ లేదు. నిజానికి మీరంటే నాకు కూడా ఇష్టమే . కానీ ముందుగా మీరు నా గురించి మా కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది “ అంటూ తన గురించి చెప్పసాగింది . అలా చాలా సేపు మాట్లాడి చివరగా “అంతా విన్నారు కదా ! ఇప్పుడు చెప్పండి , ఇప్పటికీ మీ నిర్ణయం ఆదేనా?” అంది సుందరి.
కొంచంసేపు ఆమెవైపే సాలోచనగా చూస్తూ ఉండిపోయిన శ్రీకర్ నెమ్మదిగా “ అవును. మీ గురించి అంతా విన్నతరువాత కూడా నా నిర్ణయమేమి మారలేదు ఇంక ముందు మారదు కూడా !” అన్నాడు.
సుందరి ఆనందానికి అవధిలేదు. “చాలా థ్యాంక్స్” అంటూ సంతోషంగా, అది రెస్టారెంట్ అని కూడా మర్చిపోయి, అతని రెండుచేతులు తన చేతులలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది. తన చర్యకి శ్రీకర్ నవ్వుతూండటం చూసి “ఎందుకా “ అంటూ చుట్టూరా చూసేటప్పటికి అందరూ తననే చూస్తుండటం గమనించి సిగ్గుపడి చటుక్కున అతని చేతులు వదిలేసింది.
కులమతాలకీ అంతస్థులకీ అత్యంత ప్రాధాన్యమిచ్చే కుటుంబం శ్రీకర్ వాళ్లది. శ్రీకర్ కి తమ కులానికి , అంతస్థుకి సరితూగే అమ్మాయినే చూద్దామనుకుంటుండగా “అమ్మా, నాన్నా! నేను మా ఆఫీసులో పనిచేసే నా సహోద్యోగి సుందరి అనే అమ్మాయిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను“ అంటూ శ్రీకర్ చెప్పిన మాటలు ఆశనిపాతంలా తగిలాయి శ్రీకర్ తల్లిదండ్రులైన దామోదరం కౌసల్య లకు .
“సుందరి కులం , అంతస్థు వివరాలు” అడుగుదామని అనుకున్నా అడిగితే కొడుకుకి కోపంవస్తుందేమోనని మౌనంగా ఉండిపోయిన దామోదరం దంపతులకి “సుందరి తండ్రి శరభయ్యగారు పెద్ద పేరుమోసిన వ్యాపారస్తులు ” అని శ్రీకర్ చెప్పగా విని “ మన అంతస్థుకి తగిన సంబంధమే “ అనుకుని అప్పటికి సంతోషించారే కానీ ఆ క్షణంలో “శరభయ్యగారిది ఏ కులమని “ తెలుసుకుందామనే ఆలోచనే తట్టలేదు దామోదరం దంపతులకు.
కట్నకానుకల ప్రసక్తి ఏమి తేవద్దని పెళ్ళిచూపులకి వెళ్ళే ముందే తల్లిదండ్రులకి చెప్పేశాడు శ్రీకర్. కొడుకు మాటలకి కొంత అసంతృప్తికి లోనైనా “కోడలు గుణవంతురాలు, చదువుకున్నది, అందమైనది ముఖ్యంగా కొడుకు ఇష్టపడ్డాడు“ అని సరిపెట్టుకున్నారు దామోదరం దంపతులు . పైగా శరభయ్యగారు తమ కులస్థులే అని తెలిసి ఇంకా సంతోషించారు. దగ్గరలోనే “మంచి ముహూర్తం” ఉండటం, ఇరుపక్షాలు నిశ్చితార్థం అవసరం లేదనుకోవడంతో ఏకంగా పెళ్లికే ముహూర్తం నిశ్చయించబడింది. మరో పదిహేను రోజులలో శ్రీకర్ సుందరిల “పెళ్లి”.
“ కట్నం లేదు కదాని పెళ్ళి తూ – తూ మంత్రంగా చేస్తే కుదరదు మా హోదాకు తగ్గట్లుగా ఘనంగా చేయాలి సుమా! ఎక్కడా ఏ లోపం రాకూడదు “ అంటూ కాబోయే వియ్యంకుడు శరభయ్యగారికి ముందుగానే చెప్పారు దామోదరం దంపతులు.
“ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండవచ్చు . పెళ్లి ఘనంగా చేస్తాము.” అంటూ అంగీకరించారు సుందరి తల్లిదండ్రులైన శరభయ్య సావిత్రమ్మలు .
కుల – మతాలకి పెద్దపీట వేసే తల్లిదండ్రులకు పెళ్ళికి ముందరే సుందరిని గురించిన నిజం చెపితే మంచిదని నిర్ణయించుకుని తోటలో కూర్చుని మాట్లాడుకుంటున్న తల్లిదండ్రుల వద్దకి రాబోయిన శ్రీకర్ అక్కడ వాళ్ళు ఎవరితోనో ఏదో ముఖ్యమైన చర్చలో ఉండటం గమనించి వెనుదిరిగి లోపలికి వెళ్లబోయాడు.
అంతలో “ శ్రీకర్ ఇలారా!” అన్న తండ్రి పిలుపు వినిపించింది. అది పిలుపులా కంటే హుంకరింపులా వినిపించింది శ్రీకర్ కి.
“ఏమై ఉంటుందో ?” అనుకుంటూ అక్కడికి వెళ్ళి “ ఏమైంది నాన్నా?” అని అడిగాడు తండ్రిని.
“నేను విన్నది నిజమేనా? సుందరి శరభయ్యగారి కన్న కూతురు కాదట? నిమ్న జాతికి చెందిన వాళ్ళ డ్రైవర్ కూతురట ?” ప్రశ్నించారు దామోదరంగారు కటువుగా కొడుకుని.
“ ఓహో! అయితే ఇదన్న మాట ఈ పెద్దమనిషి ఇందాకటి నించి తన తల్లిదండ్రులకి చెప్తున్నది!” అనుకున్నాడు శ్రీకర్ ఆ ప్రక్కనే కూర్చున్న పెద్దమనిషిని చూస్తూ .
“ఏం? సమాధానం చెప్పవేం ? నేను విన్నది నిజమేనా? ఈ విషయం నీకు ముందే తెలుసా? ” తిరిగి హుంకరించారు దామోదరంగారు.
“ అవును నాన్నా నాకు తెలుసు “ అన్నాడు శ్రీకర్. అది విని దామోదరం కౌసల్య లతో పాటు , అప్పటిదాకా వాళ్ళిద్దరి చెవులు కొరికిన ఆ పెద్దమనిషి కూడా నిశ్చేష్టుడయ్యాడు. దామోదరంగారికి తన పరువు మంటగలిసినట్లయ్యింది కొడుకు చేసిన పనికి.
“పరువు ప్రతిష్ఠలకి మేము ఎంత ప్రాధాన్యమిస్తామో తెలిసి కూడా ఈ నిజం మా దగ్గర దాచి నువ్వు చాలా తప్పు చేశావు“ అని “రేపు నలుగురూ కులాన్ని భ్రష్టు పట్టించాడు దామోదరం కొడుకు అని ఎత్తిపొడుస్తూ మమ్మల్ని నిందిస్తూ ఉంటే మాకు ఎంత అవమానంగా ఉంటుందో నువ్వేమైనా ఆలోచించావా ?” అన్నారు దామోదరంగారు శ్రీకర్ తో.
“ఇదేదో తండ్రి కొడుకుల మధ్య వివాదానికి దారితీసేలా ఉంది , నేను జారుకుంటే మంచిది “ అనుకున్న పెద్ద మనిషి కూడా ఇది ఎటు దారితీస్తుందో చూద్దామనే కుతూహలంతో మిన్నకుండా కూర్చుండి పోయాడు.
“ సుందరి శరభయ్యగారి కన్న కూతురు కాదనే విషయం వాళ్ళిద్దరూ నాకు ముందే చెప్పారు. శరభయ్యగారి డ్రైవరు విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ సంగతి విని తట్టుకోలేక బాలింతరాలైన అతని భార్య కూడా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అలాంటి సమయంలో శరభయ్యగారు కులము- మతము అంటూ రోజుల పసిగుడ్డుని అనాథని చేయకుండా, తమ ప్రాణాలు కాపాడబోయి తాను బలి అయిపోయిన ఆ త్యాగమూర్తి కుమార్తెను అక్కున చేర్చుకుని, సొంతబిడ్డలా సాకి సుందరి అని పేరుపెట్టి తన ఇంటి పేరు కూడా ఇచ్చి మానవత్వానికే మరో పేరుగా నిలిచారు . అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సుందరి కూడా పరిణామం గురించి భయపడకుండా తన గురించిన నిజం ముందే నాకు చెప్పి ఆయనకి తగిన కూతురని నిరూపించుకుంది. అందుకే సుందరే నాకు సరైన జీవిత భాగస్వామి అని నేను తీసుకున్న నిర్ణయం ఎంతో సరైనదని నాకు నమ్మకం కలిగింది” అని చెప్పి “అది జరిగిన విషయం. ఇప్పుడు చెప్పండి నాన్నా కులం – మతం అంటూ ఈ పెళ్లి ని ఆపాలని చూస్తున్న మనం చేస్తున్న పని సరైనదా లేక నిమ్నజాతి పిల్లని పెంచుకుంటే తమకి కులపు వాళ్ళనించి ప్రతిఘటన ఎదురవుతుందని తెలిసికూడా దేనికీ వెరవకుండా పెద్ద మనసు చేసుకుని ఒక పసిపాపకి జీవితాన్నిచ్చిన శరభయ్యగారి ప్రవర్తన సరైనదా ? “ అని సూటిగా ప్రశ్నించాడు తండ్రిని శ్రీకర్.
శ్రీకర్ మాటలు , కులమతాలే ప్రధానం అని భావించే దామోదరం కౌసల్య లను, వాళ్ళతో పాటుగా అక్కడున్న ఆ పెద్ద మనిషిని కూడా ఆలోచింప చేశాయి. కాసేపు ఎవరు ఏమీ మాట్లాడలేదు. కానీ వాళ్ళ మౌనమే కులం కంటే గుణమే గొప్పదని చెప్పకనే చెప్పింది.
దామోదరంగారు కూడా “అవును శ్రీకర్ చెప్పిన మాటలలో ఎంతో నిజం ఉంది. ఇన్నాళ్ళు నేను కులం – మతం అంటూ సంకుచితంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. శరభయ్యది నిజంగా ఎంతో గొప్పమనసు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సుందరే శ్రీకర్ కి జీవన సహచరిణి కాదగిన వ్యక్తి “ అని మనసులో అనుకుని “ శ్రీకర్ నీ విజ్ఞతకి నిన్ను మనసారా అభినందిస్తున్నాను బాబూ “ అంటూ శ్రీకర్ ని ఆశీర్వదించారు. పరిణామానికి వెరవకుండా ధైర్యంగా గొప్పమనసుతో తన గురించిన నిజం చెప్పిన సుందరినే వివాహం చేసుకుందామని కొడుకు తీసుకున్న నిర్ణయం ఎంతో సరైనదని కౌసల్యా కూడా ఆనందించి కొడుకుని ఆశీర్వదించింది . తల్లిదండ్రుల ఆశీస్సులతో “శ్రీకర్ సుందరి” ల పెళ్లి నిరాటంకంగా ఎంతో వైభవంగా జరిగిపోయింది.