కబుర్లు - సత్యమేవ జయతే
ఉగ్రవాదమా! నీకేం కావాలి?
- సత్యం మందపాటి

సెప్టెంబర్ 11, 2001: సభ్య ప్రపంచం అంతా ఒక్కసారి దిగ్భ్రాంతితో ఉలిక్కిపడిన సంఘటన.

వేలమంది అమాయక ప్రజానీకాన్ని మారణహోమం చేసిన సంఘటన.

అంతకుముందు ఎన్నోసార్లు భారతదేశంలోనూ, బీరూట్, ఇటలీ, సెనగాగ్, ఇంగ్లాడ్, ఇజ్రాయిల్, అమెరికా, టర్కీ... ఇలా... ప్రతిచోటా ఎన్నో ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు జరిగాయి.

దానికేమాత్రం వెనుకపడకుండా తర్వాత మళ్ళీ ఎన్నోసార్లు ఇండియాలో, ఇజ్రాయిల్లో, యూరప్లో - ప్రపంచమంతటా ఉగ్రవాదం ంకా ఎన్నో వేలమంది అమాయకులని హతమార్చింది.

నవంబర్ 26, 2008లో ఇండియాలో ముంబాయి హోటల్లో జరిగిన హింసాకాండ ఇంకా మనందరి మనస్సులో వుండనే వుంది.

ఈమధ్యనే పారిస్, ఫ్రాన్సులో వరుసగా జరపిన కాల్పులు, బాంబులు.

దాని తర్వాత కూడా ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాద ఉన్మాదం!

ఉగ్రవాదమా! నీకేం కావాలి?

౦ ౦ ౦

ఎంతకీ ఈ ఉగ్రవాదం ఇంత దారుణంగా చేస్తున్నదెవరు?

లష్కర్-ఈ-తలీబా, తాలిబాన్, ఆల్ ఖైడా, ఐసిస్, ఐసిల్, బోకో హరాం, లష్కర్-ఈ-ఝాంగ్వీ, ఆల్ షబాబ్... ఇలా ఎన్నో హమాద్, జిహాద్ గ్రూపులు.

ఎవరు వీళ్ళంతా? ఎక్కడివారు? వీళ్ళ ఉగ్రవాదానికి ఏం కావాలి?

౦ ౦ ౦

ఈ విద్రోహ శక్తులన్నీ ముఖ్యంగా మూడు దేశాలనించీ, ఉగ్రవాద చర్యలు జరుపుతున్నాయని తెలుస్తున్నది. పాకిస్తాన్ ప్రధమ స్థానంలోనూ, తర్వాత రెండవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్, మూడవ స్థానంలో సిరియా దేశాలున్నాయి. ఇంకా అడపాదడపా ఇరాన్, ఇరాఖ్ లాటి కొన్ని పెద్ద దేశాలు, మరి కొన్ని చిన్నచిన్న దేశాలు, ‘మేమూ మీతోపాటే, మేమేం తక్కువ తినలేదు’ అంటూ అప్పుడప్పుడూ యధాశక్తి ప్రపంచమంతటా అమాయక ప్రజానీకాన్ని వూతకోచ కోస్తూనే వున్నారు.

ఎందుకని?

వాళ్లకి ఇస్లామిక్ స్టేట్ కావాలిట.

ఇస్లామిక్ స్టేట్ అంటే ఏమిటి?

ఇస్లాం అంటే ఒక పెద్ద మతం అని మనకందరికీ తెలుసు. మరి స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, కాలిఫోర్నియా లాగా రాష్ట్రాలు కాదు. ఫ్రాన్స్, సింగపూర్ వంటి దేశాలూ కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇస్లాం మతాన్నే పాటించాలని మొదలైనదీ ఉగ్రవాదం అని గూగులమ్మ అంటున్నది.

మరి ఇలాటి ఉగ్రవాదం మిగతా మతాల్లో లేదా?

ఉంది. కానీ అక్కడో ఇక్కడో, కాస్తో కూస్తో, మతం పేరిట కలహాలు అన్ని మతాల్లోనూ వున్నాయి. కానీ ఇంతగా, ప్రపంచ వ్యాప్తంగా, ఇంత ఉధృతంగా ఎక్కడా కనపడవు.

అలా అయితే నిజంగా ఎంతమంది ముస్లిములు
లాటి ఇస్లామిక్ స్టేట్ కావాలని కోరుకుంటున్నారు?
చాల, చాల, చాల తక్కువ మంది మాత్రమే!
మరి ఇది కొందరి మత మౌఢ్యమా?
మతం పేరుతో, ఆ మతం మీద నమ్మకం లేని వాళ్ళ తీవ్రవాదమా?
ఏం చేస్తున్నారో తెలియని ఉగ్రవాద ఉన్మాదమా?
విశ్లేషించి చూద్దాం, అదేమిటో!

౦ ౦ ౦

నా మిత్రుల్లోనూ, నాతో ఆఫీసుల్లో పని చేసే వారిలోనూ, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, బాస్నియా, ఘనా, నైజీరియా, లెబనాన్, టర్కీ మొదలైన దేశాలకు చెందిన ఎంతోమంది మంచి ముస్లిములు వున్నారు. వాళ్ళకీ, మిగతా మతాల వారికీ స్నేహం ఇచ్చి పుచ్చుకోవటంలో నాకు తేడా ఏమీ కనపడలేదు.

నా గాఢ మిత్రుల్లో ఒక ఇరాన్-అమెరికన్ ముస్లిం స్నేహితుడి తనయుడు, అమెరికా తరఫున ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేస్తూ మరణిస్తే, నేను ఆ కుర్రవాడి అంత్యక్రియలకి వెళ్ళినప్పుడు, ఆయన నన్ను కావలించుకుని, “మా అబ్బాయి అమెరికా దేశం కోసం, ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలర్పించాడు” అని గర్వంగా చెబుతూ మరీ విలపించాడు! మిగతా మతాలవారిలో ఎంతమంది మంచివారున్నారో, ఇస్లాం మతంలో కూడా అంతమంది మంచి మనుష్యులు ఉన్నారు.

మంచి మనుష్యులు, చెడ్డ మనుష్యులు అనేది మనుష్యుల స్వభావాలను బట్టి వుంటుంది కానీ, వారి వారి మతాలనుబట్టీ, కులాలనుబట్టీ, దేశాలనుబట్టీ వుండదు.

అత్యధిక ముస్లిములు మతపరంగా చెడ్డవారు కాదు.

అలా అని మీకూ, నాకే కాదు – మానవాళికందరికీ తెలుసు.

ఎవరి మతం మీద వారికి అభిమానం వుండటంలో తప్పులేదు.

కానీ అది దురభిమానంగా మారకూడదు.

పరమత సహనం కావాలి! పరస్పర గౌరవం కావాలి! అలాటిది, ఇలాటి కొంతమందికి ఇతర మతాల మీద అంత ద్వేషం, అసహ్యం, అసహనం ఎందుకు వచ్చింది? అది నిజంగా అవసరమా?

మనిషే కేవలం తనకోసమే తను ఏర్పరుచుకున్న ఈ మతాలలో ఏవీ హింసాకాండ చేయమని ఎక్కడా ప్రభోదించటం లేదే! ప్రోత్సహించటం లేదే!

ఇలా చేయమని ఖురాన్, గీత, బైబిల్ మొదలైన ఏ మత గ్రంధాల లోనూ వ్రాసిలేదే!

ఈ మతాలు తమకు తామే సృష్టించుకున్న దేవుళ్ళు ఎవరూ, సాటి మనుష్యులని చంపేయమని చెప్పటం లేదే!

ఒకవేళ అలా చెప్పివుంటే, వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు?

మరి ఈ మత మౌఢ్య౦ చూపిస్తున్న మూఢులెవరు?

వారు నిజంగా మతం చెప్పినది ఎందుకు పాటించటం లేదు?

ఏమిటీ నిజంగా వారు పాటించే మతం?

ఈ ఉగ్రవాదులని అలా ఉన్మాదులుగా తయారు చేస్తున్నదెవరు? ఎందుకని?

౦ ౦ ౦

ఈ ఉగ్రవాదాన్ని కొంచెం దీర్ఘంగా పరిశీలిస్తే మనం రెండు రకాలుగా ఆలోచించవచ్చు అనిపిస్తుంది.

ఒకటి, ఈ ఉగ్రవాదులే చెబుతున్న మాటల పరిశీలన.

రెండు, తార్కికమైన విశ్లేషణ,

అలా రెండు పక్కలనించీ పరిశీలిద్దాం.

వారికి కావసింది ఇస్లామిక్ స్టేట్ అని వాళ్ళే చెబుతున్నారు. ప్రపంచంలోని ముస్లిములలోనే అధిక సంఖ్యాకులు ఏమాత్రం కోరనిది, చాల కొద్దిమంది మాత్రమే కోరటం, ఈ ఉగ్రవాదుల మాటలు కోటలు దాటుతున్నాయని తెలుస్తూనే వుంది. వారు నిజంగా ముస్లిం మతాన్ని కోరుకోవటం లేదని తేటతెల్లమవు తున్నది. అయితే ఇది మరి ఎవరికోసం? కేవలం కొంతమంది ఉగ్రవాద ఉన్మాదుల కోసమేనా?

అదీ సబబు కాదు. ఎందుకంటే ఈ ఉగ్రవాదాలు రహస్య స్థావరాలలో, కొండల్లో, అడవుల్లో, ఎండా, మంచు, కొంకర్లు పోయే చలిలకు ఓర్చుకుని, ఎప్పుడు తమ జీవితాలు ఎలా సమాప్తమవుతాయో తెలియని పరిస్థితిలో బ్రతుకుతున్నారు. కొందరు ఉగ్రవాదులు, శరీరానికి బాంబులు చుట్టుకుని, ఆత్మహత్య చేసుకుని మరీ, ఈ ఉగ్రవాదం చేస్తున్నారు.

సంసార సుఖాలు, అందమైన జీవితం, పిల్లా పాపలూ, చదువూ సంధ్యా, ఏమీ లేకుండా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మరీ జీవిస్తున్నారు. ఎందుకు?

వారి జీవితాల్లో ఇన్ని త్యాగాలు చేసి, వారు సాధించేదేమిటి? అదే నా బుర్రకి అంతుపట్టటం లేదు. ఎందుకని?

వారు నమ్మిన సిద్దాంతాల కోసమా?

అలా అయితే ఏమిటి ఆ నమ్మిన సిధ్దాంతాలు?

ఆనాటి చరిత్రలో అలెక్జాండర్ దగ్గరనించీ, కేవలం ఏడు దశాబ్దాల క్రితం జరిగిన చరిత్రలో హిట్లర్ దాకా, అదే రకమైన ఉన్మాదంతో ప్రపంచమంతటినీ, వారి చేతి క్రిందకి తీసుకురావాలని ప్రారంభించిన మారణహోమం ఏమయిందో అందరికీ తెలుసు. ఇదీ అలాటిదే. కాకపోతే ఈ ఉగ్రవాదులు పూర్తిగా నశించే లోపల, ఎంతోమంది అమాయక ప్రజలు – ముఖ్యంగా పిల్లలూ, స్త్రీలు తమ ప్రాణాలు కోల్పోవలసి వస్తున్నది. దీనిలో అర్ధం లేదు.

అంతేకాదు. అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీలాటి దేశాలు ఈ కొంతమంది ఉన్మాద చర్యలు చేసే వారి మీద యుధ్ధం చేస్తున్నారని, ఆయా దేశ ప్రజలనీ, ఇతర దేశాల ప్రజలనీ చంపేయటంలో కూడా అర్ధం లేదు. అసలీ ఉగ్రవాదం ఇన్ని సంవత్సరాలుగా వుండటం వల్లే కదా, ఆయా దేశాల మీద ఎన్నో దేశాలు కలిసికట్టుగా యుధ్ధం చేయటం!

ఒకవేళ నిజంగానే కొన్ని ముస్లిం దేశాలకు అన్యాయం జరిగివుంటే, అలాటి దేశాలు అన్నీ చేతులు కలిపి, శాంతియుతంగా దౌత్య పధ్ధతిలో పరిష్కరించుకోవచ్చు కదా!

హిట్లర్ జ్యూయిష్ మతస్థులని భారీ ఎత్తున మిలియన్లలో చంపేసిన తర్వాత, జ్యూయిష్ వారు ప్రపంచవ్యాప్తంగా క్రిష్టియన్లని, జర్మన్ వారినీ ఉగ్రవాదంతో చంపేయలేదే!

“An Eye for an Eye, makes a person totally blind!” అన్నారు మహాత్మా గాంధీ!

ఇలా కొందరు ఉన్మాదులు చేయటం వల్ల, రెండు పక్కలా ప్రాణ నష్టం తప్ప, వేరే ఎవరూ సాధించేది లేదు.

దీని వల్ల ఇంకొక నష్టం కూడా వుంది. ఆఫీసు బిల్డింగులు, రాయబార కార్యాలయాలు, విమానాలు, రైళ్ళు, హోటళ్ళ వినాశనంతో మొదలైన ఈ ఉగ్రవాద చర్యలు, మన చుట్టుపక్కలనే స్కూళ్ళు, ఇళ్ళ దగ్గరికి కూడా వ్యాపించేసరికీ, ఎన్నో దేశాల్లో ముస్లిములని, స్త్రీలు పిల్లలతో సహా, కొంతమంది ముస్లిమేతరులు కొంచెం అనుమానాస్పదంగా చూడటం మొదలుపెట్టారు. పక్క ఇంట్లోనే ఎన్నో సంవత్సరాలుగా వుంటున్న ముస్లిం స్నేహితులను దూరం చేసుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు.

అన్ని మతాలవారూ ఇంతకుముందు లేని ఈ విబేధాలు ఇప్పుడు ఎలా వస్తున్నాయో, చిరకాల స్నేహాలు ఎలా విడిపోతున్నాయో, అమెరికన్ రేడియోలో చెబుతుంటే వింటున్నాను.

ఎన్నో ఏళ్ళుగా లేని సమస్యలు, ఒక్కసారిగా మొదలయాయి.

ఇలాటి తీవ్రవాద చర్యల వల్ల, సాటి ముస్లిముల ప్రశాంత జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ ఉగ్రవాదం, ఇస్లామిక్ స్టేట్ వైపుగా వెళ్ళకుండా, దానికి వ్యతిరేకంగా వెడుతున్నది!

వీటికన్నిటికీ మూల కారణమైన ఈ ఉగ్రవాదాన్ని ఆపేదెలా? ఎవరు చేస్తారా పని?

ఈ వ్యాసం వ్రాస్తున్నప్పటికే, యూరప్ అమెరికాలలోనే కాక, ఇతర దేశాల నుండి కూడా ఈ టెర్రరిష్ట్ ముఠాలని అంతం చేయటం కోసం ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందుకు వస్తున్నాయి.

ఇదేదో కొన్ని మిత్ర దేశాలు చేతులు కలిపి, హిట్లర్ నియంతృత్వాన్ని ఎదిరించినట్టు కాదు. ఎందుకంటే అక్కడ అసలు శతృవు ఎవరో నిశ్చయంగా తెలుసు. కానీ ఈ ఉగ్రవాదులు ఎన్నో దేశాల్లో, ప్రజల మధ్యనే వున్నారు. ఆయా దేశాల మీద యుద్ధాలకు వెళ్ళి, అమాయక ప్రజలకు ప్రాణ నష్టం కలుగకుండా, వారితోపాటే వుంటున్న టెర్రరిష్టులను ఏరి పట్టుకోవటం సాధ్యం కాని పని.

మరి వారిని పట్టుకోవటం సాధ్యం కాదా?

అమెరికా అధ్యక్షుడితో పాటు, చాల మంది నిపుణులు చెప్పే ఒక పరిష్కారం వుంది. కానీ అలా చేయటం ఎంతవరకూ సాధ్యపడుతుందో, అసలు సాధ్యమవుతుందో లేదో కూడా తెలియదు.

వారు చెప్పేది ఒక్కటే. ఇలాటి టెర్రరిష్టులను ఏరి పట్టుకోవాలంటే, ఈ టెర్రరిష్టుల కార్యక్రమాలను చూస్తున్న లేదా అనుమానిస్తున్న ఇతర మంచి ముస్లిముల వల్లనే సాధ్యమవుతుందని.

అంటే ఆయాదేశాలలో వున్నవారు, అనుమానాస్పదమైన సమాచారాన్ని అందిస్తే, ఇది సులభ సాధ్యమవుతుంది అని. సౌడీ అరేబియా, కువాయిత్, టర్కీ, ఈజిప్ట్ లాటి మిత్రదేశాల సహాయంతో, ఈ ఉగ్రవాద చర్యలను ఆపటానికి అవకాశం వుంది అంటున్నారు.

అమాయక ప్రాణ నష్టం లేకుండా ఇలా జరిగితే, అందరికీ మంచిదే!

మరి అలా జరిగే అవకాశం వుందా?

ఏమో.. నాకు తెలీదు!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)