హిందూ ధర్మంలో కర్మకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కర్మ అంటే పని. కేవలం శరీరం కదిలిస్తూ చేసేదే పని కాదు. మనసు చేత, మాట చేత, ప్రవర్తన చేత నిత్యం మనం ఏదోక పని చేస్తూనే ఉంటాము.
నహి కస్చిత్ క్షణమపి - ఒక్క క్షణం కూడా పని చేయకుండా మానవుడు ఉండలేడు అని గీతలో భగవానుడు చెప్పాడు. ఆత్మను పర్మాత్మతో అనుసంధానం చేసికొని తనకంటూ ఉనికి లేకుండా చేసుకున్న జ్ఞాని మాత్రమే ఎట్టి పనీ చేయకుండా ఉండగలడు. అటువంటి వాళ్ళు కోటి మందిలో ఒకరుంటారని వారే సెలవిచ్చారు. ప్రతివారమూ దానికోసమే ప్రయత్నిచాలి కానీ అట్టి స్థితి పొందేవరకు మన జీవితాలు గాడి తప్పిపోకుండా ఉండడానికి మనల్ని మనం సరైన మార్గంలో నడుపుకోవాలి. అందుకేం చేయాలో కూడా మన ఋషులే సూచించారు.
ఉపనిషత్తులో ఇలా చెప్పబడి ఉంది, కర్మ ఉంటే ఫలం ఉంటుంది. ఫలం ఉంటే దానిని అనుభివించేవాడు ఉంటాడు. ఆ ఫలం పూర్తయ్యేవరకు మనిషి తిరిగి తిరిగి జన్మకు వస్తూనే ఉంటాడు. కనుక కర్మ తప్పదు, ఫలానుభవం తప్పదు అని తెలిశాక దానిని ఉత్తమంగా తీర్చుకోవడం మినహా చేయగలిగింది లేదు.
కర్మ చేయడం వెనుక నాలుగు కోణాలు ఉంటాయి.
1. ఉద్దేస్యము - మంచి కావచ్చు, చెడు కావచ్చు
2. ఉపకరణము - మనోవాక్కయములలో దేనితో చేస్తున్నాము?
3. ఫలము - నిచ్చెన ఎక్కించవచ్చు, పాము నోట్లో పడవేయనూ వచ్చు
4. ఫలానుభవము - కేవలము తన ఒక్కడి మీద మాత్రమే ప్రభావం కలిగి ఉంటుందా లేక మరికొంత మంది మీద కూడా ఉంటుందా (కుటుంబం లేక సమాజం)
ఈ కోణాలను అనుసరించి ఋషులు మనం చేసే కర్మలు లేదా పనులన్నిటినీ అతి సూక్ష్మంగా ఒక క్రమంలో విభజించారు. ఏ ఏ పనులను ఎలా చేయాలో కూడా సూచించారు. వారు చెప్పిన ప్రకారం కర్మలు నాలుగు రకాలు.
1. నిత్య కర్మలు
2. నైమిత్తిక కర్మలు
3. కామ్య కర్మలు
4. నిషిద్ధ కర్మలు
నిత్యకర్మలు అంటే ఉదయం లేవగానే నిన్ను, నీ జీవితాన్ని ప్రభావితం చేసేలాగా లక్ష్యంవైపు ఉన్ముఖం చేసే పనులు. ప్రతిరోజూ చేసి తీరవలసిన పనులన్న మాట! యథాలాపంగా చేయటం వేరు, గుర్తుతో చేయటం వేరు. నిత్యమూ చేసే పనులను ఒక పట్టుగా ఎలా చేయాలో చెప్పారు మన ఋషులు.
ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడం నుంచి, ప్రతి పనీ ఎలా చేయాలో చెప్పారు. నిద్ర లేవగానే ఆ రోజు ఎదురయ్యే ప్రతివారిలోనూ భగవంతుని, లేదా నీ గురువును చూసుకుని ప్రవర్తిచేలాగా నిశ్చయించుకుని ప్రార్థించాలి. ఆ తరువాత స్నానం చేసేప్పుడు శరీరం మీద పడుతున్న నీటిబిందువులను గురుపాదోదకంగా భావించాలి. ఆహారం తీసుకునేప్పుడు వారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్టు భావించాలి. అటుపై ఎవరితో వ్యవహరించినా లోపల ఆ గుర్తింపు చెదిరిపోకుండా జాగ్రత్తపడాలి. రాత్రి నిద్రపోయేవరకు ఈ భావాన్నే పునరావృత్తం చేసుకుంటుండాలి. అలా నిత్యం చేయవలసిన పనులను ఒకే ఎరుకతో చేయాలి.
సంధ్యావందనం, జపధ్యానాలు, వైశ్వదేవం, పూజ, పారాయణ లేద సద్గ్రంథ పఠనం, వీటితోపాటు తల్లితండ్రుల పట్ల బాధ్యత, కుటుంబ పోషణ, సంతానాభివృద్ధి వంటివి నిత్యకర్మలుగా చెప్పుకోవచ్చు. ఇవి కచ్చితంగా చేసితీరాలి అని ఋషులు చెప్పారు లేకపోతే అధోగతి పాలౌతారన్నరు. దీనికి కారణం కూడా వివరించారు.
మానవుడు మూడు రకాలైన ఋణాలతో జీవిస్తున్నాడు.
1. పితృ ఋణము
2. ఋషి ఋణము
3. దేవ ఋణము
వీటినుండి విముక్తం కావడానికి నిత్యకర్మలు ఆచరించి తీరాలి.
మనకు జన్మనిచ్చి, పోషించి, పెద్ద చేసిన తల్లితండ్రుల పట్ల బాధ్యతగా ఉండటం ద్వారా పితృ ఋణం నుండి, మన జీవితాలకు మార్గదర్శకులుగా నిలిచి, మంచేదో, చెడేదో చెప్పి దారి చూపిన ఋషుల పట్ల కృతజ్ఞతతో వారిని స్మరించడం ద్వారా ఋషి ఋణము నుండి, ఈ ప్రకృతి రూపంలో మనకు సకలం ప్రసాదింపబడిన వాటి పట్ల జాగ్రత్తగా, వృధా చేయకుండా వినియోగించుకోవడం ద్వారా దేవ ఋణము నుండి విముక్తం కాగలము.
నైమిత్తిక కర్మలంటే ఒక నిమిత్తం కారణంగా ఏర్పడే కర్మలు.
ఉదాహరణకు ఒక పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళి ప్రతిరోజూ ఉండదు. మరి అక్కడ ఎలా వ్యవహరించాలి? ఇప్పుడు పెళ్ళిళ్ళలోలాగా హడావిడిగా పరుగులెత్తి, అందరి మధ్యలోంచి వధూవరుల నెత్తిన అక్షింతలు విసిరేసి, ఫోటోలో వీడియోలో పడ్డామా లేదా అని చూసుకుని, త్వరత్వరగా బఫే అనే పేరుతో క్యూలో నిలబెట్టి చేతిలో పెట్టినదేదో గబగబా తినేసి వచ్చేయడం కాదు చేయవలసింది.
రెండు నిమిషాలైనా మనసు నిలిపి కలిసి నడవాలని నిర్ణయించుకున్న ఆ ఇద్దరూ జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని గురువును లేదా ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. ముహూర్తకాలం అని ప్రత్యేకంగా పెళ్ళి పత్రికలో ఉండే ఆ నాలుగు క్షణాల కాలం ప్రతివారూ స్మరణతో, ప్రార్థనతో పవిత్రం చేయాలనేది ఋషి ఉద్దేస్యం.
అలాగే ఎవరైన మరిణించినపుడు అక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి?
అసలు ఏం జరిగింది? ఎలా పోయారు? అంటూ అసలే ధుఃఖంలో ఉన్న వారిని మళ్ళీ మళ్ళీ అడిగి బాధపెట్టకుండా పోయిన ఆ జీవికి శాంతి చేకూరాలని, మరింత ఉత్తమ జన్మకు వెళ్ళాలని ప్రార్థించాలి.
ఇలా నిత్యమూ కాకుండా ఒకానొక సంధర్భాన్ని పురస్కరించుకుని చేయవలసిన కర్మలే నైమిత్తిక కర్మలు. పితృ దేవతలకు చేయవలసిన తర్పణాది క్రతువులు, బిడ్డలకు చేయవలసిన ఉపనయనం మొదలు వివాహ క్రతువు వరకు ఉన్న పదహారు ఆచారాలు నైమిత్తిక కర్మలే.
తరువాత కామ్యకర్మలు. మన ఇష్టాయిష్టాలకు సంబంధించినవి. అంటే మన కోరికలన్న మాట! వాటి పట్ల ఎలా ఉండాలి?
కోరికలు, ఇష్టాయిష్టాలు లేకుండా బతకమని ఋషులు చెప్పలేదు. అయితే వాటిని ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోమన్నారు. మన లక్ష్యానికి చేరువ చేసేలాగా మలుచుకోమన్నారు. ఒక నవల చదావాలనిపించింది, బదులుగా మహాత్ముల చరిత్ర చదవడం. సినిమా చూడాలనిపించింది, బదులుగా సాయంసంధ్య వేళ సముద్రతీరంలో అలలతో ఆడుకుని రావటం. దిగంతాల ఆవలికి చూపుని ప్రసరించి భగవంతుని సృష్టిలోని విశాలత్వాన్ని అనుభూతి చెందడం. అలా కామ్యకర్మలను అదుపులో ఉంచుకోవాలి.
చివరగా నిషిద్ధకర్మలు. ఏ పనులు చేస్తే, ఎక్కడికి వెళ్తే మనసు పతనమై మనల్ని దిగజారుస్తుందో గుర్తుపట్టి వాటిని నిరోధించడం. అంతర్జాలంలో (ఇంటెర్నెట్) మంచిని వెతుక్కుని చెడుని దూరం చేయడంలాగా. యువత ముఖ్యంగా గమనించుకోవలసిన అంశమిది. అంతర్జాలం (ఇంటెర్నెట్) ఎంతగా మన అభివృద్ధికి దోహదపడగలదో అంతకంటే వేయిరెట్లు అధికంగా మనను తప్పుదోవ పట్టించగలదు. కనుక ప్రతిచోటా మనను దిగజార్చి, లక్ష్యానికి దూరం చేసే విషయాలను, విషంలాగా త్యజించడమే నిషిద్ధకర్మల వెనుక ఉద్దేస్యం.
మన పూర్వీకులు సూచించిన విధంగా మనం కూడా మన జీవితాలను వెలుగుమయం చేసుకుందుముగాక!