తే.గీ. నేను మాత్రము మేల్కొని నిద్రమాని
ఒక్క కునుకైన తీయక ఓర్మి తోడ
వేచి ఆలయంబున కాలు పెట్టినాడ,
సద్దు మణిగిన పిదప నిశ్శబ్దముగను.
తే.గీ. కొన్ని ప్రమిదల దీపాలు కొండకెక్కి
గర్భగుడిలోన కొంత చీకటిగ నుండె,
నిర్జనంబయి నిశ్శబ్ద నిలయమగుచు
చీమ చిటుకన్న గూడను చెవుల జేరె.
తే.గీ. మెల్లగా విగ్రహముల సమీపమునకు
అడుగులో నడుగిడుచు నే నరిగి చేరి,
వేది దరినున్న ముక్కాలు పీట తెచ్చి,
రాముని ప్రతిమ కడ దాని వ్రాల్చినాడ.
తే.గీ. తలను వంచి రామ హనుమంతులకు మ్రొక్కి,
చిన్న క్రొవ్వొత్తి వెలిగించి చేతబట్టి
బల్లపైకెక్కి రాముని ప్రతిమ సరస
నిలిచి ముఖము శోధించితి నికటముగను.
కం. నిక్కముగ పెద్ద నామం
బొక్కటి రాముని ముఖమున నొద్దికతోడన్
చక్కగ నున్నది కానీ -
అక్కట! అది నల్లవాఱి నట్లుగ తోచెన్.
కం. అబ్బురపడి నే నంతట
దబ్బున పైపంచె కొసను తడపి తిలకమున్
నిబ్బరము గాను తుడిచితి
సుబ్బగ నిజరూపము - మది చోద్యము కాగన్
ఆ.వె. ఒడలు గగుర పొడిచె, తడబడె పదములు,
నల్లరంగు పోయి నామ మపుడు
చూచుచుండ మెఱసె సుందరమౌ రీతి,
పసిడిరంగు తోడ ప్రజ్జ్వలించి.
తే.గీ. స్వర్ణ తిలకము నందున వజ్ర శకల
ములు ధగ ధగ మెఱయుచుండె పూర్వమట్లు -
కాదు కాదది సత్యంబు గాదు - వాటి
మధ్య నైదారు తావుల మసకతోచె.
తే.గీ. జాగరూకత నేనంత సాగి, మెడను
నిక్కజేసి పరీక్షింప నిజము తెలిసె -
సరిగ మెఱయని చోట్ల వజ్రములు లేవు,
బొక్కలే యుండె నెంతయే నక్కజముగ.
తే.గీ. కన్నముల యందు నిసుమంత కాంతిపడిన,
వాటిలో పూర్వ మందున వజ్రములకు
డంగు మెఱుపును కూర్చెడు డాకురేకు
లిపుడు కొంత మెఱయుచుండె హీనముగను.
కం. వెనుకటి దినముల తిలకం
బున గల వజ్రంబు లన్ని పూర్తిగ మెఱసెన్;
గనుక నెవరో ఇపుడు ఱా
ళ్ళను పెకలించిరని యెడద లవలవలాడెన్.
చం. కదలకయుండ శిల్పమున గట్టిగ తాపిన నామమందునన్
పొదిగిన ఱాళ్ళు క్రిందపడి పోవుట సాధ్యముకాదు కావునన్,
విదితము వీటి నెవ్వరొ ప్రవీణుడు తచ్చన తస్కరించె తా
కుదురుగ చెంతజేరి అతిగూఢముగా ననుకొంచు నుండగన్.
తే.గీ. కొంతదూరాననుండి యెక్కింత సూక్ష్మ
రవము వినవచ్చి మంద్రమై మ్రానుపఱచె,
"రామ! శ్రీరామ! నీ నామ మేమి రుచిర!"
అనుచు ప్రణవంబు బోలు వియత్స్వరంబు.
తే.గీ. అంతలోననె కోవెలచెంత జేరె
మసక చీకటిసందున మఱుగుపడుచు
పాట పాడుచునున్న అవ్యక్త మూర్తి -
అర్చకుం డాత డనుచు నే ననుకొనగను.
మ. గణనీయంబుగ నిస్వనం బుదితమై కంపింప కంఠంబు వా
డనియెన్, "అంతయు చూచినాడవు గదా! అత్యంతమౌ నేర మీ
వనుభావంబుగ పట్టినాడవు గదా! ఆ పైన నింకెట్లు దీ
నిని రూపింపగ నిర్ణయించితివొ దానిన్ దెల్పుమా శోధకా!"
తే.గీ. అనుచు నాతండు నావీను లదిరి పోవ
పెద్దగా నవ్వుచు వచింప వినుచు, మున్ను
దోషు లిటులార్చి గట్టిగా దొమ్ములాట
లాడు నైజంబు నెఱిగిన వాడనగుట.
తే.గీ. అతడు చేసిన దౌష్ట్యంబు నతని నోట
నొప్పు కొనునట్లు చేయించు నుద్యమమున,
వరుస నాతని ప్రేరేప వలయు ననుచు
పలికినాడను దోషితో పలుకునట్లు.
తే.గీ. "అవును - గర్భగుడిని చౌర్య మయ్యెననుచు
నే నెఱిగితి, ఎఱిగితిని నీవె స్వర్ణ
తిలకమందున గల వజ్రములను తస్క
రించితివని, ఒక వినూత్న రీతిలోన.
ఉ. చెంతను చేరి రామునికి సేవలు సేయునటుల్ నటించి ఏ
వంతయులేక వజ్రముల వ్యాజముతోడను దొంగిలించి నా
వంతియగాక తస్కరరహస్యము నెవ్వ రెఱుంగరంచు నీ
వెంతయొ ధైర్యమూని అవహేలనతోడ చరించినాడవున్.
కం. ఏ నామములో ఱాళ్ళను
పూనికతో దొంగిలి సుఖముగ బ్రదికితివో,
మానితమౌ శ్రీరాముని
ఆ నామమె కించపరుప నపహాసముతో,
తే.గీ. ’రామ! శ్రీరామ! నీ నామ మేమి రుచిర!"
అనుచు ’నామ’ మందున శ్లేష మొనర జేసి,
ఒక్క వాక్యంబె పాడితి వక్కజముగ,
గర్వివై నీవు చర్విత చర్వణముగ.
కం. ఒక్కొక్క వజ్రమె దొంగిలి,
అక్కరతో దాని నమ్మి ఆకలిదీరన్
తక్కక నీ ఖర్చులకై
చక్కగ వెచ్చించినావు చాతురితోడన్.
తే.గీ. ప్రతిమలకు మ్రొక్క వచ్చెడు భక్తతతులు
రాముని తిలకమందు వజ్రంబులన్ని
పూర్వవిధముగ నున్నట్లు మోసబోవ
మసిని పుసినాడవు నీ వమానుషముగ.
తే.గీ. మంచివాడ వీవని జనులెంచి పొగడ,
ఉన్న సొమ్ములో కొంత నీ వుక్కివమున
శర్కరాన్నమువంటి ప్రసాదములను
భక్తతతికి పెట్టితి వతిరిక్తముగను.
తే.గీ. దొంగతనమున నీ భార్య దొందొ కాదొ!
కాని నేటితో మీ ఆట కెట్టె సుమ్ము -
ఇప్పుడే నిన్ను పోలీసు కప్పగింతు"
ననుచు వాని నే బెదిరించు నంతలోన.
తే.గీ. వచ్చి నిలుచుండె నాతండు ద్వారమందు
రెండు చేతులు నిక్కించి రొండి నిలిపి,
వాకిలంతయు నిండిన భాతి దోప,
కలత రేగంగ వాని విగ్రహము గనగ.
చం. తెలతెలవార జొచ్చె, రవి దీర్ఘమయూఖ నిపాతదీప్తి దే
వళమునుజొచ్చి అర్చకుని వక్త్రముపైబడి శోణకాంతితో
వెలుగగ జేసి వాని కొక విస్తృత నూతన శోభగూర్చెనన్
తలపు కదల్చ డగ్గరి వితర్కణ చూచితి వాని తేజమున్.
(సశేషం)
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)