ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీజవాబులు విద్యుల్లేఖద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపలపంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేటతెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.
ఈ మాసంప్రశ్న:
ఈ క్రింది పద్యాన్ని 'చంపకమాల' ఛందస్సులో తిరిగి వ్రాయాలి.
అక్కఱకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా
నెక్కినఁ బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !
గతమాసం ప్రశ్న:
ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.
నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సి
తొలకరి చినుకులు తాకిన
పులకించును ధరణి మురిసి పొంగుచు నెదలో
తొలిప్రేమ చెలియ పలుకున
కలలం దునతేలు నంట కందర్పు డనన్
వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం
తొలకరి జల్లులు పుడమిని
కులుకుచు కురియగ మురియుచు కొండలు కోనల్
పులకించ ప్రకృతి కాంత యు
కలరవముల పక్షిగణము కలకల లాడున్
చావలి విజయ, సిడ్నీ
చిటపట వర్షమున్ కురిసె చేలను నేల వడిన్ ముదమ్ముతో
చిటికెన తాపమే కలిగి చేరె మనస్సుకు శాంతి సౌఖ్యమున్
కటకటలాడినన్ జనులు గాలికి తొల్కరి వానకున్ మదిన్
ఎటులనొ ఎండగాడ్పులకు వేడిని మర్చి సుఖంబు నొందుగా.
డా. రామినేని రంగారావు యం,బి,బి,యస్, పామూరు, ప్రకాశంజిల్లా.
వడగాలి హోరులో వడలెను ప్రాణులు - తరువులు-లతలును ధరణి జనులు
త్రాగు నీటి కొరత తగ్గిన విద్యుత్తు - బాలల-వృధ్ధుల భంగపాటు
వరుణదేవు కరుణ వర్షించు నేవేళ - పచ్చదనము ధాత్రి పరచు నెపుడొ
అల్లాడు ప్రాణుల ఆశలు చిగురించ - మేఘాలు అటనట మెరిసి వెలిగె
కారుమబ్బుల తునుకలు కనులగట్టి
కూడుకొని-చల్లగాలితో కూటమగుచు
ప్రకృతి యెల్లెడ వింతగా పరవశిల్ల
ధరణి పులకించ తొలకరి అరుగుదెంచె.
గండికోట విశ్వనాధం, హైదరాబాద్
చెలగెడి వేడి గాడ్పులతొ సేమము తగ్గగ డస్సి జీవముల్
సొలసిన వేళ నొక్క పరి చొద్యము గాగ మెలంగు కారు మ
బ్బులు మెరుపుల్ మరిన్ ఉరుము బొబ్బల ధాటితొ దండిగా ధరన్
తొలకరి జల్లులే కురిసె తోయపు ధార విధాన ధారలై.
చావలి శివప్రసాద్, సిడ్నీ
(తొలకరిలో వచ్చే ఏరువాక పున్నమి పండుగ గురించి)
దండిగ ఎండలు మండగ
నెండిన చేనుల కురియగనే కర్షకులున్
దండిగ పండగ, పండుగ
మెండుగ చేయుదురు పున్నమి తిధిన ప్రీతిన్
పుల్లెల శ్యామసుందర్, శాన్హోసే, కాలిఫోర్నియా
నిప్పులు చెరిగెడి ఎండలు
ఎప్పుడు తగ్గునొ యనుచును ఎదురులు చూడన్
తిప్పలు తీర్చగ జనులవి
చప్పున వచ్చెను తొలకరి జల్లుల తోడన్
తడవగ జడిసెడి బుడతలు
గడప కడన తడఁబడుచును కదలక నిలవన్
గడుసరి పిడుగులు జడవక
ధడధడమని పరుగులిడుచు తడవగ వెడలన్
తొలకరి వానలందడవ తుమ్ములు దగ్గులు వచ్చునన్న తా
నలిగిన పిల్లవాని తన యక్కునఁ జేర్చుకు పిచ్చి తండ్రి నీ
తలకొక తుండు చుట్టెదను దానిని తీయక నాడుమన్నఁ; తాఁ
బిలుచుచు మిత్రులందరను వేగమె వానన గెంతులేయుచున్
గిరగిరా తిరుగుతూ కేరింతలను కొట్టి - వల్లప్ప నరసప్ప పాట పాడి;
ధారగా కారేటి చూరునీళ్ళందున - తలనుంచుచును తాను తడిసి, మురిసి;
వానచినుకు నోట పట్టగా తలనెత్తి - నోరు తెరచి నాల్క బార చాపి;
వాన వెలిసి నీరు వాగులై పారగా - పడవలందున వేసి పందెమాడి;
నేల రాలిన కాయల నేరి తెచ్చి
కోసి ఉప్పును కారము రాసి తినుచు
వేడివేసవిని మరచి నాడి పాడి
చేసినల్లరి గూర్చిక చెప్పఁదరమె